Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 88


    విశాఖపట్నంలో జరిగిన  వారి షష్టిపూర్తి ఉత్సవమే చాలామందికి తెలుసు కానీ ఫిబ్రవరి నెల ప్రారంభం నుండి మార్చి నెలాఖరులోగా  కర్నూలు నుండి కటకం వరకూ  ఎన్నిచోట్ల సన్మానాలు జరిగాయో తెలియదు.
    ఇంత కొద్దికాలంలో  ఓ వ్యక్తికి  ఇన్ని సన్మానాలు జరగడం, తెలుగుదేశంలో  ఇంతకు పూర్వం  ఎన్నడూ  జరగలేదని అందరూ అనుకున్నారు.  ఎన్నిచోట్ల సన్మానాలు జరిగాయో అన్నిచోట్లా  యువతరం  వారిని చుట్టుముట్టేది. వాళ్ళలో చెలరేగే విప్లవ తరంగాలనూ, ఆవేశాలనూ  చూసి నేను ఆశ్చర్యపోయేదాన్ని. ఆ యువతరంతో  కలిసిపోయి  మాట్లాడే శ్రీశ్రీగారిని జీవితంలో మరిచిపోలేను.
    'శ్రీశ్రీకి ప్రజలే  ప్రాణం, పోరాటమే ప్రాణవాయువు, ఉద్యమం ఊపిరి, విప్లవం  అతని జీవితం, జలపాతం వారి వేగం'_అన్న మాటల్లోని  నిజం కళ్ళకి కొట్టొచ్చినట్టు  కనిపించేది.
    ఒక్కొక్క మీటింగ్ లో ఒక్కొక్క విధమయిన ప్రత్యేకత  కనిపించేది. అందుకే ఈ మహానుభావుడికి  ఇంత పేరని అనుకొనేదాన్ని.
    ఓసారి  కుడిచెయ్యి  పిడికిలి, ఇంకోసారి ఎడమ చెయ్యి పిడికిలి బిగించి, 'ఇంక్విలాబ్ జిందాబాద్' అని అంటూంటే, 'అబ్బ! వీరికింత పెద్ద గొంతుకు వుందా' అనిపించేది.
    ఆవేశంతో మాట్లాడే  ఆ మాటలు  వింటూంటే  ఒళ్ళు  జలదరించేది.
    "ఇక్కడొక  విషయం  రాయాలి. 1970 లోనే  బరంపురంలో  కూడా సన్మానం ఏర్పాటు చేశారు. మా అమ్మగారు (నా పెంపుడుతల్లి  పద్మావతి)అప్పటికే  మరణించింది.
    "వారం రోజులు ముందుగా  బరంపురం వెళ్ళి రెస్టు తీసుకుంటాను సరోజా!" అన్నారు.
    "అంతకన్నానా! తప్పకుండా  వెళదాం" అన్నాను.
    మా నాన్నగారికి (నా పెంపుడుతండ్రి  బచ్చు నరసింహమూర్తిగారు) వైరిచ్చాను. ఇక చూసుకోండి_తన అల్లుడు వస్తున్నాడని మా నాన్నగారు  పెట్టిన  ఖర్చుతో  ఓ పెళ్ళి  చేయొచ్చు. నాకే ఆశ్చర్యం వేసింది. మెయిల్ స్టేషనులో  ఆగేసరికి  స్టూడెంట్స్, పెద్దలు చుట్టుముట్టేశారు. బండి దిగడం కష్టమయింది.
    మా నాన్నగారికి  బరంపురంలో  చాలా  పెద్దపేరు. మా నాన్నగారు, కొంతమంది స్టూడెంట్స్ కలిసి ఒక్క పరుగులో గార్డు దగ్గరికి పరుగెత్తి "శ్రీశ్రీగారు  వచ్చారు. బండి దిగడానికే వీలులేనంత జనం  మూగిపోయారు. మీరు మరో అయిదు నిముషాలసేపు  బండి ఆపక తప్పద"ని పట్టుపట్టి ఆపించేశారు.
    శ్రీశ్రీగారు  ప్లాట్ ఫామ్ మీదకి  దిగేసరికి  పూలమాలలతో, విడి పువ్వులతో వర్షం కురిపించేశారు. పూలదండలతో  మునిగిపోయి శ్రీశ్రీగారి ముఖం కనిపించలేదు. అందులో కొన్ని దండలు తీసేసి  అందరిముందూ నా మెడలో పడేశారు. అంతే చప్పట్లతో  బరంపురం స్టేషన్ దద్దరిల్లిపోయింది.
    
                              *    *    *
                                           జగన్నాథ రథచక్రాల్!


    మా నాన్నగారి  హడావుడి, ఆనందం చెప్పడానికి లేదు.
    మా తమ్ముడంటే  శ్రీశ్రీగారికి  చాలా ఇష్టం.వాడు ఆయనకు బాడీగార్డులా వుండేవాడు. ఎప్పుడూ  ఆయన వెనకాల వుండాల్సిందే. ప్రతీదానికి "అబ్బాయీ, అబ్బాయీ" అని ఒక్కక్షణం కూడా వాడ్ని  వదిలేవారు కారు. వాడు కూడా బావగారూ" అని ఒక్క క్షణంకూడా  ఆయనను వదిలేవాడు కాడు. వాడికి బావగారి మాటంటే  వేదవాక్యం అన్నమాటే.
    "అబ్బాయీ! గ్లాసు కడిగించి వుంచావా" అంటే_
    "అన్నీ రెడీ బావగారూ! కానీ ఇప్పుడు కాదు. మీరు ముందు స్నానం చేసి ఫ్రెష్ గా రెడీ అవండ"ని చెప్పి, ఆయన స్నానం చేసేలోగా తినుబండారాలు కొని తెచ్చేవాడు. సగం బజారు మా ఇంట్లోనే పెట్టేసేవాడు. శ్రీశ్రీగారి రాక ఎప్పుడు తెలిసినా మా నాన్నగారు డజన్ల కొద్ది సిగరెట్ పేకెట్స్ కొని, స్టాక్ చేసేవారు. వారడిగిన  వస్తువేదయినా  సరే 'లేదూ' అనిగానీ, ఇదిగో తెప్పిస్తాన'ని కానీ అనకూడదు.
    వారికేం కావాలో  ఇంట్లో  అందరికీ తెలుసు. పైగా జ్ఞాపకం చెయ్యడానికి  మా సుందరి చెల్లి ఒకర్తి.
    శ్రీశ్రీగారు కానీ బరంపురంలో  వుంటే అది తన ఇల్లు, వాకిల్నీ, భర్తనీ, పిల్లల్నీ అందర్నీ  వదిలేసి, మాతోనే మా నాన్నగారింట్లోనే  వుండిపోయేది.
    ఈనాటికీ  నేను వెళ్ళినా  మా చెల్లి అందర్నీ  వదిలేసి  నాతోనే వుండిపోతుంది.
    శ్రీశ్రీగారికి  ఆమె అంటే చాలా ఇష్టం.
    మా నాన్నగారికి క్షణం తీరిక వుండేదికాదు.
    శ్రీశ్రీగారి కోసం వచ్చిన వాళ్ళందర్నీ ఆహ్వానించడం, వాళ్ళని ఆశీనుల్ని చెయ్యడం, కాఫీలు ఇప్పించడం, బలవంతాన టిఫిన్లు తినిపించడం, కిళ్ళీలివ్వడం ఇదే పని.
    ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించకున్నా, ఆహ్వానించకున్నా మా నాన్నగారికి  చాలా కోపం. మధ్యలో వెళ్ళి "నాన్నగారూ" అని పిలిస్తే "ఉండమ్మా" అనేవారు.
    "అదికాదు నాన్నగారూ" అంటే "అరెరె_ఇప్పుడు నాకేం చెప్పకు" అనేవారు.


                       *    *    *   


    ఆ మర్నాడు 'కల్లికోట కాలేజీ'లో  బ్రహ్మాండమైన సన్మానం. అది అయ్యాక, మర్నాడనుకుంటాను. టౌను హాలులో మీటింగ్. చెరబండ రాజుగారు, జ్వాలాముఖిగారు, భైరవయ్యగారు, నగ్నమునిగారు...అయిదుగురిలో ఒక్కరు మాత్రం రాలేదు. నాకు బాగా జ్ఞాపకం.
    అందర్నీ  మా ఇంటికి భోజనాలకి  ఆహ్వానించారు  మా నాన్నగారు.
    "భోజనాలకి  రాలేంకానీ టిఫిన్లకి  వస్తామ"ని అందరూ  అంగీకరించారు.
    ఉదయం తొమ్మిది గంటలకి అందరూ వచ్చారు. మా ఇల్లు శ్రీశ్రీగారి కోసం వచ్చిన జనంతో ఇంట్లో వున్నవాళ్ళతో  క్రిక్కిరిసి  పోయింది. బరంపురం  మా వాళ్ళ ఇల్లు పెద్ద  అంతఃపురంలా  వుంటుంది.
    "శ్రీశ్రీగారెక్కడ, ఎక్కడ" అని అందరూ అడుగుతూ వుంటే పెద్ద టర్కీ తువ్వాలు కట్టుకొని, జనీనయినా లేకుండా సిగరెట్ తో మేడమీద నుండి కిందకి దిగారు.

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS