వింత జంతువు
నా దగ్గర ఒక వింత జంతువుంది. సగం పిల్లి, సగం
గొర్రె చచ్చిపోతూ మా నాన్న వదిలిన ఆస్తి, అయితే దాని
ప్రస్తుత రూపం నా కాలంలోనే దానికి ఏర్పడింది.
అంతకుపూర్వం అది పిల్లిగాకాక చాలామట్టుకు గొర్రెగానే
ఉండేది. పిల్లిజాతినుండి తలా, గోళ్ళూ-గొర్రెజాతినుండి
ఒడ్డూ, పొడుగూ, ఆకారమూ దానికి సంక్రమించాయ్.
రెండింటినుంచీ కళ్ళు భీకరంగా, ఎప్పటికప్పుడు మారిపోతూ,
బొచ్చు మెత్తగా, చర్మానికి దగ్గరగా గమనం దాట్లు
వెయ్యడం, ప్రాకడం, కిటికీమీద ఎండలో కూర్చుని అది
బంతిలాగ ముడుచుకుపోయి గుర్రుపెడుతుంది. పచ్చిక
బయలులో పిచ్చెత్తినట్లు గంతులువేస్తూ ఒకంతకీ దొరకదు.
పిల్లలను చూస్తే పారిపోతుంది. గొర్రెలమీద తిరగబడు
తుంది. వెన్నెల రాత్రులలో ఇంటి పైకప్పు మీద
సంచరించడం దానికి సరదా, అది మ్యావుమననేలేదు.
ఎలకలంటే అసహ్యం. కోళ్ళ తట్టదగ్గర గంటలకొద్దీ మాటు
వేస్తుంది. కాని యెప్పుడు ఒక్క కోడిని కూడా చంపలేదు.
దానికి నేను పాలుపోస్తూ ఉంటాను. క్రూరమృగంవలె దంతాల సందులనుంచి పెద్ద పెద్ద పీల్పులతో పాలు తాగుతుంది. అదంటే చిన్నపిల్లల కందరికి గొప్ప వేడుక అని వేరే చెప్పనక్కరలేదు. ఆదివారం అందరూ వచ్చే పూట మోకాళ్ళ మీద ఆ జంతువును పెట్టుకొని కూర్చుంటాను. గ్రామంలోని పిల్లలందరూ నాచుట్టూ నిలుచుంటారు. పిల్లలంతా వింతవింత ప్రశ్నలు వేస్తారు. మానవమాత్రులెవ్వరూ వాటికి జవాబులు చెప్పలేరు. ప్రపంచంలో ఇలాంటి జంతువు ఒక్కటే ఎందుకుండాలి? ఇది చచ్చిపోతే ఏమవుతుంది? దీనికి ఒంటరితనం అనిపించదా? పిల్లల్నెందుకు పెట్టలేదు? దీని పేరేమిటి? ఇట్టివే ఎన్నో ప్రశ్నలు-
జవాబులివ్వడానికి నేను ప్రయత్నించను. జంతువును ఒళ్ళో పెట్టుకొని అలాగే కూర్చుంటాను. పిల్ల లొక్కొక్కప్పుడు తమతో పిల్లులను తెస్తారు. ఒకసారి రెండు గొర్రెల్ని కూడా తెచ్చారు. కాని వారనుకున్నదానికి విరుద్ధంగా నా జంతువు బంధువులను గుర్తించలేకపోయింది. జంతువులు తమ మృగాల కళ్ళతో పరస్పరం తేరిపార చూసుకున్నాయి. ఎవరి బతుకు వాళ్ళదే అనుకున్నాయి.
నా వొళ్ళో కూర్చున్నప్పుడు జంతువుకి భయంగాని, వేటాడే ఉత్సాహం గాని ఉండవు. నన్ను అదుముకున్నప్పుడు దానికెక్కడలేని సంతోషమూ వస్తుంది. తాను ఎవరిమధ్య పెరిగిందో ఆ కుటుంబంపట్ల ఎప్పుడూ విశ్వాసంగా ఉంటుంది. ఇందులో పెద్ద విశేషం ఏమీలేదు. లోకంలో తనకు సవతి బంధువులు చాలామంది ఉన్నప్పటికీ రక్తబంధువులెవరూ లేకపోవటంవల్ల ఈ జంతువు మా ఇంటినే కనిపెట్టుకొని ఉంటుంది. ఇక్కడ దానికి దొరికిన ఆశ్రయాన్ని పవిత్రంగా చూసుకొంటుంది.
ఒక్కొక్కప్పుడీ జంతువు నా చుట్టూ చూస్తూ నా కాళ్ళని చుట్టుకుంటూ ఎప్పటికీ నన్ను వదలకపోతే నవ్వక తప్పేదికాదు. గొర్రెగానూ, పిల్లిగానూ ఉన్నది చాలక కుక్కగా కూడా ఉండాలనుకుంటుందది. అందరివలెనే నాకుకూడా అప్పుడప్పుడు వ్యవహారపు చిక్కులు తటస్థపడి, ఏమవుతుందో ఏమిటో అనే ఆందోళనలో నేను పడిపోయి అప్పటికీ తెగించుకొని వాలు కుర్చీలో కూర్చున్న సమయంలో ఈ జంతువు నా వొళ్ళోనే వుంటుంది. దానివైపు చూస్తే పొడుగాటి దాని మీసాలనుంచి కన్నీళ్లు నావా? దానివా? నిజంగా ఈ పిల్లికి గొర్రెల ఆత్మతోపాటు మనుష్యుల ఆశయాలు కూడా ఉన్నాయేమో? మా నాన్న నాకు వదలిపెట్టిన ఆస్తి స్వల్పమే కాని ఈ ఆస్తి అంత కొట్టివేయదగ్గదికాదు.
గొర్రెల్లోనూ, పిల్లుల్లోనూ కనబడే ఆరాటం, వేరువేరు రకాలదే అయినా ఈ జంతువులోనూ ఉంది. అందుచేత దీని చర్మం దీనికి చాలనట్లుంటుంది. ఒక్కొక్కప్పుడీ జంతువు నా పక్కని కుర్చీమీదికురికి, తన ముందుకాళ్ళు నా భుజాలమీద వేసి నా చెవిదగ్గర తన ముట్టె చేర్చుతుంది- అచ్చంగా నాతో ఏవో మాట్లాడదలచుకున్నట్టే నిజంగా ఆ తరువాత తన తలతిప్పి నా మొగం వైపు చూస్తుంది. తాను చెప్పింది నేను బోధపరచుకొన్నానో లేదో చూడడానికి, దాన్ని సంతోషపెట్టడానికిగాను నేనుకూడా అర్ధమయిందన్నట్లుగా నటించి తల ఆడిస్తాను. అప్పుడది నేలమీది కురికి సరదాగా ఇల్లంతా నాట్యం చేస్తుంది.
బహుశా ఈ జంతువుకి కసాయివాడి కత్తివల్ల విముక్తి కలుగుతుందేమో! కాని ఇది నా పూర్వుల ఆస్తి కాబట్టి ఇట్టి పనిచెయ్యకూడదు. అంచేత దానంత అదే ఊపిరి వదలివేసే అదను వచ్చేదాకా వేచుకొని ఉండవలసిందే. అయినా అప్పుడప్పుడీ జంతువు మనుష్య జ్ఞానంతో నావైపు చూసి ఇద్దరం ఒకేసారిగా దేన్ని గురించి ఆలోచిస్తున్నామో యేదీ ఆపని చేసిచూడు అన్నట్టుగా మొగం పెడుతోంది.
* * * *
