వరూధిని ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఏమయిందో తెలుసుకోవాలన్న తహతహ ఆమెను వేధించసాగింది.
"ఆ గుర్నాథంగాడు ఏమన్నాడూ!?"
భర్త ఉలకలేదు. పలకలేదు.
"నిన్నే! పలకవేం?" వరూథినికి వళ్ళు మండిపోతూంది. వెంకటపతి నేరుగా పడక గదిలోకి వెళ్ళాడు. వరూథిని అనుసరించింది.
"ఏమై వుంటుంది?" అదే ప్రశ్న ఆమెను వేధించ సాగింది.
వెంకటపతి బీరువాతెరిచి వెతుకుతున్నాడు. ఎంత ధైర్యం వచ్చింది, ఈ మనిషికి? తన బీరువా తెరిచి చూస్తున్నాడు? పైగా తన ముందే ఆ పని చేస్తున్నాడే? తన వస్తువులను తాకటానికి కూడా జంకే మనిషి ఇంత మొండితనం ఎలా వచ్చింది? అక్కడేదో జరిగే వుంటుంది. లేకపోతే మరీ ఇంత ఇదిగా ప్రవర్తించడు. గుర్నాథంగాడ్ని బాగా తన్నే వచ్చి ఉండాలి. మనిషి పైకి కన్పించకపోయినా లోలోపల ఇంకా రగుల్తూనే వుండి ఉండాలి.
వరూధిని రెండడుగులు వెనక్కు వేసింది. విస్కీ సీసా తీసుకొని వెంకటపతి బీరువా మూశాడు. వరూధిని అక్కడేవున్నా లేనట్లే ప్రవర్తించాడు. సీసా తీసుకొని గదిలోనుంచి బయటకొచ్చాడు.
ఏదో జరిగే వుంటుంది. ఆ మందు పడకపోతే మనిషి ఆగేట్టు లేడు. ఆరాట పడిపోతున్నాడు. అది లోపలకు పోతేగాని మనిషి స్థిమితపడడు.
కన్నార్పకుండా భర్తకేసి చూస్తూ ఆల్కహణలో పడింది వరూథిని.
వెంకటపతి సీసామూత పళ్ళసందున పెట్టి పెటిక్కిన మూత తీశాడు. బాటిల్ పైకెత్తి పెదవుల సందున బిగించాడు!
వరూథినికి గాబరా ఎక్కువయింది. వంటగదిలోకెళ్ళి ఓ గ్లాసూ, చెంబుతో నీళ్ళూ తెచ్చింది.
"అదేమిటి? మీకేమయినా మతిపోయిందా ఏమిటి?" వరూథిని భర్త చేతుల్లో నుంచి సీసా లాక్కుంది.
గ్లాసులో సగానికి తక్కువగా విస్కీపోసి మిగతా ఖాళీ నీళ్ళతో నింపింది.
"అసలేమయిందండీ?" గ్లాసు భర్తకు అందిస్తూ అనునయంగా అడిగింది వరూథిని.
గ్లాసు అందుకొని మూడు నిముషాల్లో ఖాళీచేసి వెంకటపతి విస్కీ సీసాకేసి చూశాడు.
వరూధిని తన అయిష్టాన్ని బలవంతంగా అణచుకొని మళ్ళీ గ్లాసునింపి భర్తకు అందిస్తూ, అతని ముఖంలోకి చూసింది. భర్త ముఖంలో వస్తూన్న మార్పును పసికట్టింది. అతనేదో చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. మళ్ళీ ఏదో సందేహంతో ఆగిపోతున్నాడు.
మొత్తం మీద రాయి కదిలింది. మనిషి కరుగుతున్నాడు. సగానికి పైగా గ్లాసు ఖాళీచేసి కిందపెట్టి భార్యకేసి చూశాడు. ఈసారి వరూధిని కళ్ళతోనే ప్రశ్నించింది.
"కోడిగుడ్లున్నాయా?"
వరూథిని రక్తం చల్లబడినట్టయింది.
"ఉన్నాయిలే! ఇంతకూ ఏమయింది?"
"అట్టు అట్టేయ్ - ఆకలేస్తూంది."
వరూథిని వళ్ళు మంచుగడ్డయిపోయింది.
"మళ్ళీ ఇప్పుడెందుకూ? భోజనం చేసేవేళకూడా అవుతోంది. అన్నంలో కేస్తాన్లే! ఒకేసారి తిందురుగాని."
"అయితే రానియ్ మరి!" గ్లాసు ఖాళీచేసి మళ్ళీ నింపమని భార్య ముందు పెట్టాడు.
వరూధినికి తెలుసు. ఆ గ్లాసు కూడా తాగితే మనిషి అడ్డం పడతాడు. మాటా పలుకూ ఉండదు. ఆమె ఓర్పు అడుగంటింది. భర్త తన సహనానికి ఉన్న ఎల్లలు దాటాడు.
"ఇక చాల్లే! ముదనష్టం! అక్కడేం చేసొచ్చావో చెప్పిచావరాదా?" గొంతు పెద్దది చేసింది వరూథిని. గుడ్లెర్రబడ్డాయి.
"ఎక్కడా?" వెంకటపతి ఎటో చూస్తూ అన్నాడు.
"వల్లకాట్లో!" వరూధిని చెయ్యి ముందుకు విసిరింది.
"ఆ గుర్నాథంగాడి సంగతంటుంటే?" రెట్టించింది.
"లేడు ఇంట్లో లేడనుకొంటా."
వరూధిని అవ్వాయ్ సువ్వాయ్ లా లేచింది.
"అనుకొనేదేమిటి నా శ్రాద్ధం! ఇంతకీ వాడింటికెళ్ళారా? లేదా? ఇంతవరకూ ఏ గోడమూలనో చచ్చి తాగటానికి ఇంటికి చేరావా! ఉండు నీ పని చెప్తా!"
"ఆహా వెళ్ళానంటుంటే? ఏందంత అడ్డగోలుగా మాట్లాడతావ్?" మాటలు వడుపుగానే వచ్చాయి. మనిషికి పురి ఎక్కుతోన్నట్టుంది.
"వెళ్లేం నిర్వాకం చేశావో చెప్పి చావరాదూ? ఆ గుర్నాథంగా డేమన్నాడు?"
"కనకయ్య, గుర్నాథం పెళ్ళామా నా మీద జెయ్యిన లేచారు."
"నీ అక్కుపచ్చి మొఖం చూస్తే...."
"అట్టాగాదులే, చెప్పేది వినకుండానే ఏంటావాగుడు?" వెంకటపతి కసిరాడు.
"తొందరగా చెప్పరాదూ? ఏమన్నారూ?"
"అంతా నీ మీదకే తోస్తున్నారు."
"నా మీదకు తొయ్యడమేమిటీ? పక్కటెముకలు విరగతన్నేవాళ్ళులేక."
"కనకయ్య నన్ను చూడగానే 'భయ్' అని లేచాడు."
"మా ఆల్లుడు రామనాథబాబూ, డి.యస్.పి. లాంటివాడనుకొందేమో మీ ఆవిడ? పరువుగలోడు." అన్నాడు కనకయ్య.
వెంకటపతి ఆగిపోయాడు.
"ముసలినక్క పళ్ళు రాలగొట్టలా నువ్వు?"
"మనమీద అభిమానంతో జాలిపడి ఆ శంకర్రావు సంగతి చెప్పాడంట. నువ్విట్టాంటి మనిషివనుకోలేదంట."
"వాడు వాగిందంతా వింటూ ఊరుకొన్నావా!"
"మధ్యలో కనకయ్యకూతురొకటి! తన మొగుడ్ని నువ్వు మరగేసుకో చూస్తున్నావని ఒకటే గోల. తన మొగుడు మంచివాడు కాబట్టి సరిపోయిందట. వాళ్ళ పిల్లల నోట్లో దుమ్ముపడేదంట!"
"దాన్నోట్లో పురుగులుపడా!"
"నీ దగ్గర డబ్బయిపోయేసరికి ఇట్లా తిరిగావంట. కనకయ్య అంటున్నాడు."
"ఎట్టా తిరిగానంట? ఈసారి కనపడనీయ్? వాడినడ్డి విరగగొట్టకపోతే నా పేరు...."
"డబ్బూ దస్కం లేకుండా ఆయనచేత పనిచేయించుకోటానికి ఈ పన్నాగం పన్నావంట."
"ఎవడా మాటంది? తొత్తుకొడుకు!" వరూధిని ముక్కుపుటాలు అదిరిపోతున్నాయి.
"నువ్వే పిలిచావంటగా?" వెంకటపతి కంఠం కటువుగా పలికింది.
"వెళ్ళి పిలిస్తే? వాడీపని చేస్తాడా?"
"గుర్నాథం ఏమీ ఎరగడంట. నువ్వే...."
"నేను?"
"మరి వాళ్ళట్టా అంటున్నారు."
"నువ్వు చేతగాని ముండవని వాళ్ళకు తెలియదా ఏం?"
నువ్వసలు మగాడివైతే వాళ్ళట్టా మాట్లాడతారా? ఆ గుర్నాథంగాడు ఇంట్లోవుండే పెళ్ళానికీ, మామకీ చెప్పి అట్లా అనిపించాడు.
వెంకటపతి మాట్లాడలేదు.
"ముండ? నీ అలుసు చూసుకొనేకదూ వాడింట్లో జొరబడి ఆ పని చేశాడు? ఈ బతుకు బతక్కపోతే ఏం? పౌరుషమున్న మొగాడయితే ఈపాటికి......"
"నీ మెతకబుద్ది తెలిసే వాళ్ళట్టా మాట్లాడగలిగారు."
వరూధిని పెదవులు కంపించాయి.
"నీ తిరుగుళ్ళు చూస్తే ఆ గుర్నాథంగాడు....."
పెఠీమని గాజు పగిలిన శబ్దం!
రెండు చేతుల్తో ముఖం కప్పుకొని తల వంచేసుకొన్నాడు వెంకటపతి.
వెంకటపతి ముఖంమీద గాజుగ్లాసు బద్దలయింది. కుడిగవద ఎముకమీద గాజుముక్క గుచ్చుకుపోయింది. రక్తం చిమ్మింది. చొక్కామీదా, పంచెమీదా రక్తపుడాగులు, ముఖమూ, చేతుల మీదా చిందిన రక్తం తొలకలుగా గడ్డ కట్టుకు పోతూంది.

