Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 87


    నా మనస్సు  విశాలమైన  మౌంట్ రోడ్డని  ఒక  ఉత్తరంలోనూ, నీకివాళ మాట రేపు పరగడుపు అని ఇంకోదాంట్లోనూ, పేడకుప్పలా ఎక్కడుంటే అక్కడ పాతుకుపోతావని మరొకదాంట్లోనూ, రైల్వేవాళ్ళని పోషించడానికే  నువ్వున్నావని మరో ఉత్తరంలోనూ  రాసేవారు.
    పొట్టీ, పట్టూ, ముసలీ, మైడియర్ రోజా, బంగారు పిచికా...ఒక్కటేమిటి  ఇలా ఎన్నో సంబోధనలతో  ఎంత తియ్యగా రాసేవారో, అంత గట్టిగానూ మొహం వాచేటట్టు  చివాట్లతో కూడా  రాసేవారు.
    1970 జూన్ 28వ తేదీన  'లెటర్ ఫాలోస్_స్టార్ట్ ఇమీడియట్లీ' అని టెలిగ్రాం ఇచ్చారు. మర్నాడు ఉత్తరం అందింది.
    "జూలై నాలుగవ  తేదీన  హైదరాబాదులో  సన్మానం జరుగుతోంది. నువ్వు నాగపూర్ నుండి తిన్నగా  హైదరాబాద్ కి మూడవ తేదీ ఉదయానికే వచ్చేసెయ్. ద్వారకలో  పంతొమ్మిదవ  నెంబరు  రూమ్ బుక్ చేశాను. అక్కడికి వచ్చి నువ్వుండు. నేను అదే తేదీ ఉదయం వచ్చి నిన్ను కలుసుకుంటాన"ని  ఆ ఉత్తరంలో రాశారు.
    పిల్లల పరీక్షలింకా  కాలేదు. జూలై నెలాఖరుకి  అని తెలిసింది. ఆ రాత్రే అక్కడ నుండి (నాగపూర్ యింట్లో కూడా ఫోనుండేది) మద్రాసులో మా యింట్లో  వున్న 73733 నెంబరుకి  ఫోన్ చేశాను.
    ఇద్దరం అన్ని విషయాలూ  మాట్లాడుకొని, ఏం చేయాలో ఎలా  చేయాలో ప్రోగ్రాము వేసుకున్నాం.
    మాట్లాడినంతసేపు  మాట్లాడేసి, "ఎంతసేపైంది  ఫోనులో మాట్లాడుతూ?" అని అడిగారు.
    "దగ్గర దగ్గర అరగంట" అన్నాను.
    "మన ఫోను  బిల్లు కిందటి నేల పదిహేను వందలు కట్టాను. తెలుసుగా" అన్నారు.
    "తెలుసు" అన్నాను.
    "రాసిన ఉత్తరం అందిందా లేదా" అని అడిగారు.
    "అందింది కనకే ఇక్కడ్నుండి  ఫోన్ చేస్తున్నానండీ" అన్నాను.
    "అది మాత్రం మన డబ్బు కాదా? నీ ఇళ్ళ అద్దెలన్నీ  అక్కడికే తెప్పించుకుంటున్నావు?ఎందుకిలా ఫోన్ లకి, రైలుబళ్ళకి డబ్బులు తగలేస్తావు సరోజా! అన్ని విషయాలతో  ఉత్తరం రాసి పారేస్తే  పోలేదూ? సరే...అయిందేదో  అయిపోయింది. బైజుని తీసుకుని  రావాలి సుమా" అన్నారు.
    "వాడికి పరీక్షలండీ. ఈ సంవత్సరం ఒడ్డెక్కితే, వచ్చే ఏడు ఎన్ని పాట్లయినా పది పిల్లలకి సీట్లు సంపాదించి అక్కడే చదివించుకుందాం" అన్నాను.
    "నాకు టెలిగ్రామిచ్చి మరీ బయలుదేరు" అన్నారు.
    "అదంతా  నాకు తెలీదు. నా టెలిగ్రాం కోసం  ఎదురుచూడకండి. మూడవ తేదీ ఉదయానికల్లా  నేను హోటల్ ద్వారకలో వుంటాను" అన్నాను.
    "వెరీగుడ్. ఐ లవ్ యూ సరోజా!" అన్నారు.
    "ఐ టూ" అన్నాను.
    "నిజంగానే!" అన్నారు.
    నవ్వుతూ ఫోన్ పెట్టేశాను.


                      *    *    *   


    జూలై రెండవ తేదీన నాగపూర్ నుండి బయలుదేరితిన్నగా  హైదరాబాద్ కి చేరుకున్నాను. మద్రాసు నుండి మావారు కూడా  రెండవ తేదీన బయలుదేరి  మూడవ తేదీ పొద్దుటే హైదరాబాద్ చేరారు.
    ఇద్దరం ఇంటి విషయాలూ, అన్నీ ముచ్చటించుకున్నాం.
    మా తమ్ముడు కృష్ణారావు, మా మరదలు ప్లస్ కూతురు (నా పెద్ద అప్ప చెల్లెలు కూతుర్నే మా తమ్ముడికి ఇచ్చామన్నమాట. అందుకే ఒకవైపు  వరస కూతురు, మా తమ్ముడి భార్య కనుక ఇంకో వైపు వరస మరదలు అవుతుంది నాకు) వచ్చి మమ్మల్ని  చూసి ఇంటికి ఆహ్వానించారు.
    నేనూ మావారూ మాట్లాడుకున్న మాటల మీద సన్మాన విషయంలో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నట్టు నాకు తోచింది. అందువల్ల నేను వారిని వదిలి ఈ ట్రిప్పులో రాలేనని, మా తమ్ముడిని నాతోనే ఉండమని చెప్పాను. అలాగేనని, ఇంటికి వెళ్ళి మళ్ళీ  వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు.
    మేమున్న చోటికి ముఖ్యులంతా  చేరుకున్నారు. సన్మానం స్వీకరించడానికి వీల్లేదని, గది లోపలా బయటా కూడా ఒత్తిడి తీవ్రంగానే ప్రారంభమయ్యింది. ప్రోగ్రామ్ ఏ విధంగా వెయ్యాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న మాట మీద డిస్కషన్ ప్రారంభమయ్యింది.
    నన్ను నోరు తెరవవద్దని, జరుగుతున్నదంతా  చూస్తూ తన ఎదుట అలా కూర్చోమని ముందుగానే శ్రీశ్రీగారు నాకు ఇన్ స్ట్రక్షన్స్  ఇచ్చేశారు.
    ఎవరో  చెప్పడంవల్ల  వారు సన్మానాన్ని  నిరాకరించలేదు. స్వీకరించినందువల్ల  వచ్చే తిరుగుబాటు, రాబోయే చెడు తెలుసుకుని వారు తీసుకున్న నిర్ణయమే అది.
    దానికితోడు, ఆఫ్ట్రాల్ వెయ్యి నూటపదహార్ల  కోసం  తనకున్న కీర్తిని పోగొట్టుకోవద్దని నేను వెనకాల చెపుతూనే వున్నాను. ఈ విషయం చాలం మందికి తెలియదు. తెలిసిన కొద్దిమందయినా, ఒప్పుకుంటారని  నేను అనుకోను.
    తరువాత చాలా విషయాలు జరిగాయి. వాటి వివరాలు  ఇక్కడ  అనవసరం. కారణం_ఇది 'సంసారంలో శ్రీశ్రీ' చరిత్ర కనుక. ఇప్పటివరకూ నేను రాసిన విషయాలు నా సమక్షంలో  జరిగాయి కనుక, లేక అవి జరిగినప్పుడు  నేను వున్నాను కనుక వాటి గురించి మేమిద్దరం మాట్లాడుకున్నాం కనుక  అవి అక్కడక్కడా  కొన్ని మాత్రమే రాయడం జరిగింది. జరుగుతోంది కూడా.
    ఏమయితేనేం_1970వ సంవత్సరంలో జూలై నాలుగవ తేదీన అర్దరాత్రి విరసం (విప్లవ రచయితల సంఘం) ఆవిర్భవించినందుకు  మేమిద్దరం చాలా సంతోషించాం. నాకేమీ అర్ధం కాకపోయినా, ఆనాడు ఆ అర్ధరాత్రి కార్యక్రమంలో శ్రీశ్రీగారి ఎదుట అందరితోపాటూ  నేనూ వున్నందుకు నిజంగానే చాలా పొంగిపోయాను.
    "నువ్వు డబ్బుకోసం  నసపెట్టకపోవడం  సరికదా ఎంతో ఉత్సాహం చూపించినందుకు నేనెంతో గర్విస్తున్నాను సరోజా!" అన్నారు.
    "నా జీవితానికి ఆ మాటొక్కటే  చాలండి" అన్నాను.
    మర్నాడు మేమిద్దరం  మద్రాసు చేరుకున్నాం. ఆ సంవత్సరం  వారికి ఎన్ని సన్మానాలు  జరిగాయో చెప్పడానికి లేదు. పట్టుమని  పది రోజులపాటు  ఇంటివద్ద లేము.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS