అలవాటు బలిమి
వంటింట్లో పీట, కొళాయిలోంచి చల్లని నీరు, స్వచ్చమైన
నీరు, గోరువెచ్చని నీరు, సువాసనల నీరు ప్రవహిస్తోంది.
ఈ మంచం ఒకరికి వలెనే ఇద్దరికి చాలు. మొగ్గ తర్వాత
రేకు, రేకు తర్వాత పువ్వు, వాన తర్వాత ఎండ, వేళయింది
కాబట్టి కళ్లు విడివడుతాయి. శరీరం నిలబడుతుంది. చెయ్యి
బారచాచుకుంటుంది. నిప్పు రాజుకుంటుంది. కడచిన రాత్రి
ముడతలతో నాటి అమాయకపు వంపుకోసం చిరునవ్వు
పెనగులాడుతుంది. అవిగో తెరచుకుంటూన్న గడియారపు
ముళ్లు. అవీ నిలబడతాయి. ఒళ్లు విరుచుకుంటాయి.
తమ్ము తాము వెలిగించుకుంటాయి. చిరునవ్వు వచ్చేవేళ
సూచిస్తాయి. తెల్లరవిక తొడుక్కుని సూర్యకిరణం ఇంట్లో
తిరుగాడుతుంది. మళ్ళీ మంచుకురవవచ్చు. సుమారు
అయిదు గంటలకి మళ్ళీ కొద్దిగా నెత్తురుబొట్లు వర్షిస్తాయి.
సరే దానికేం లే! హో! నాకు భయంవేసింది. హఠాత్తుగా
హఠాత్తుగా అనుకున్నాను కిటికీ అవతల వీధి లేదని,
కాని ఇంతట్లోకే మిల్లు దగ్గర కంటె చక్రం దగ్గరే
ఎక్కువజనం పోగవుతారు. కూలిపనులు సానబెట్టి, సమ్మెట
కొట్టి, సన్నం చేసి, సరఫరా అవుతాయి. పరిచితమైన
పనిముట్టులో ప్రశాంతమైన నిద్రాసౌఖ్యం అనుభవిస్తూ
మానవహస్తం ఇంకోసారి మహదానందం పొందుతుంది.
చిరకాలం ఈ మురిపెం సాగితే మాట-అద్దం అద్భుతమైన సాక్ష్యం-అనుక్షణం మారిపోతూ శాంతంగా, పటిష్ఠంగా సాక్ష్యం ఇస్తుంది. అయితే అది వాజ్మూలం ఇవ్వడం ముగించేసరికి మళ్ళీ మొదటికే వచ్చిందని గ్రహించగలవు ఈనాటి వాస్తవికతకు అది ప్రతినిధి.
భయంకరమైన మలుపు తిరిగే బాటమీద, ఇవాళలాగే రేపునికూడా ఉల్లాకు వేసే వాడి కాళ్ళకి గట్టిగా కట్టబడి, నిర్లక్ష్యపు తేలిక రెక్కలమీద దినదినం ఒక వెయ్యి పదచిహ్నాలు నిరీక్షిస్తుంటాయి. ఇంతకుముందు వచ్చినవే అవి. ఇక మీద కూడా వస్తాయి పిలుపు అక్కర్లేకుండా. ఆ దారినే అందరూ వెళ్ళారు తమ సుఖంనించి తమ దుఃఖందాకా. ఒక పెద్ద కాగడా వున్న ఒక చిన్న ఆశ్రమం అది. ఒక కాలుదీసి ఇంకొకటి వేస్తావు. తర్వాత మాయమైపోతావు.
గోడలు బొమ్మలతో అలంకరించుకుంటాయి. పుష్పస్తబకాలతో ఆటవిడుపు రోజులు కేటాయించుకుంటాయి. ఆవిరితో తన్ను కప్పుకుంటుంది అద్దం. సెలయేటి మీద దీపగృహాలెన్నో నదీ కలశంలోది సెలయేరు. రెండు కళ్ళూ ఒక మాదిరివే. నీ ఒకే ఒక ముఖానికోసం రెండు కళ్ళనీ ఒకేమాదిరి చీమలు కప్పుతాయి. చెట్లన్నీ పసుపు రాసుకున్నాయి. పిట్టల్ని వెంటబెడుతోంది గాలి. రాళ్ళు చస్తే ఎవరూ ఏడవరు. ఫలితం బద్దలయిన జంతువు కాదు. జంతువుల్ని మచ్చికచేసే నియంత. అబ్బా అప్పుడే ఉత్సవం ప్రారంభమయిందా? మొత్తంమీద వైభవంగానే వున్నది. ఆగకుండా పేలే ఈ పిస్తోలు వల్లనే పూలకుండీల్లో పువ్వులూ, నోట్లో పొగా బయలుదేరతాయి.
ప్రేమ, ఆఖరికి, రాత్రిని స్పష్టంగా చూడటంతో సంతృప్తి చెందుతుంది.
నువ్వు వెళ్ళిపోయినచోట నన్ను వెదుక్కుంటూ నిలుస్తుంది. నీ పరిమళం. నీ దౌర్బల్య సందేశం. పునఃప్రతిగ్రహణ పొందాలని వెనక్కి తిరిగి వస్తాను. నీ చేతిలో నా చెయ్యిలాగ లేదేం నా చేతిలో నీ చెయ్యి! దుర్భర దుఃఖం కూడా బోధపడ్డ మీద లాభిస్తుంది. నా అదృష్టం నీకు పంచిపెడతాను. అక్కడ నువ్వు లేకపోవడం లేదు. నా అస్తిత్వానికి నువ్వు తార్కాణ. నిన్ను నిలబెట్టుకోవాలని నేనే జీవితాన్ని ప్రోది చేసుకున్నానో దానికే అన్నీ అన్వయిస్తాయి.
ఏమిటాలోచిస్తున్నావు?
ఏమీ లేదు.
* * * *
