Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 86


    వరూధిని హృదయం పొగలూ సెగలూ చిమ్మి బద్దలైంది. ముఖాన చేతులు పెట్టుకొని ఏడ్చింది. ఇంట్లో వంటరిగా వున్న ఆమెకు తన ఏడుపే వింతగా విన్పించింది. కళ్ళు తుడుచుకుంది. బయట తలుపు కొట్టిన చప్పుడు వినబడింది. లేచి వెళ్ళింది. తలుపు తీసింది.
    "ఏం చేస్తున్నావ్? నిద్రపోతున్నావా? ఎంతసేపట్నుండి నేను తలుపు కొడ్తుంది?" వెంకటపతి భార్య ముఖంలోకి చూసి ఖంగారుపడ్డాడు.
    "ఏమయిందీ? అట్టా వున్నావూ?"
    "ఏమయిందా? నా దెవసమయింది" గిర్రున వెనక్కు తిరిగి ఇంట్లోకి నడిచింది వరూధిని.
    మబ్బులు లేకుండా మెరుపులూ ఉరుములూ రావడం వెంకటపతికి కొత్తేమీ కాదు. కాని ఈ సారి పిడుగు నెత్తినే పడ్డట్టయింది.
    "ఏమైందబ్బా?" ఆలోచన సాగలేదు. సాగిన ఆలోచనకు ఏమీ తట్టలేదు.
    భార్య వెనకే అడుగులు తేలవేస్తూ ఇంట్లోకి నడిచాడు వెంకటపతి.
    "నువ్వసలు మగాడివేనా?"
    కూర్చోబోతున్న వెంకటపతి వంచిన మోకాళ్ళమీద అలాగే ఉండిపోయి భార్యకేసి చూశాడు.
    "ఏంటీ నీ గొడవ మళ్ళీ? సంగతేంటో చెప్పకుండా!"
    "ఆ గుర్నాథంగాడు లేడూ?"
    "ఏ గుర్నాథమంటా?" అదేదో చిన్న సంగతేనని నిర్ధారణ కొచ్చి సోఫాలో కూర్చున్నాడు వెంకటపతి.
    "ఆ కనకయ్యగాడి అల్లుడు లేడూ?"
    "ఏదీ! మన కనకయ్యగాడి అల్లుడు గుర్నాథమా??"
    వరూథినికి ఏడుపు గొంతులో కొచ్చింది. గుటకలు మింగి అన్నది.
    "నువ్వు ఇట్టాంటి అక్కుపచ్చివి కాబట్టే వాడట్టా చేశాడు."
    "మన వ్యాజ్యంలో కనకయ్య అల్లుడికేం సంబంధమబ్బా!" యుగయుగాలుగా దేవుడి ఉనికికోసం వెతుకుతున్న వేదాంతిలా ముఖం పెట్టాడు వెంకటపతి.
    "ఏం సంబంధమా? నువ్వు అంటవెధవ్వని తెలిసి నీ పెళ్ళాం చెయ్యి పట్టుకొని లాగాడు."
    "ఎవరా మాట్లాడేదీ? వరూథినే? తన భార్య వరూథినే?"
    వెంకటపతి చివాల్న లేచి నిలబడ్డాడు.
    "మగదిక్కులేని ముండను కాబట్టి సరిపోయింది. మరొక ఆడదాని మొగుడయితే గుర్నాథంగాడ్ని ఈపాటికి రోడ్డుమీదకు లాగి చావచితక తన్నడూ?"
    "ఆ గుర్నాథం గాడికేం పనంటా ఇక్కడా? అసలెందుకొచ్చాడు?" వెంకటపతి రుద్రుడయిపోయాడు. అతనికి ఏం మాట్లాడాలో తెలియడం లేదు. నోటికొచ్చింది ఏదో అంటున్నాడు.
    "ఛీ! ఈ పాడు బతుకు బతికేకంటే ఏ నుయ్యో, గొయ్యో చూసుకుంటే మంచిది ఈ నీచపు బతుకు బతక్కపోతేనేం?" కొంగు ముఖాన వేసుకొని భోరున ఏడ్చింది వరూధిని.
    వెంకటపతి భార్య మొదటిసారిగా నిస్సహాయురాలిగా కన్పించింది. ఊళ్ళో చావిట్లో గుంజకు చుట్టుకొని ఇంటిమీదకు పాకిన గుమ్మడి తీగ వెంకటపతి అంతరాంతరాల్లో మెదిలింది.
    "నువ్వూరుకోమంటే! ఊరుకో! వాడెమ్మ! నాకొడుకు! ఆ గుర్నాథంగాడు అంతటివాడయ్యాడా? వాడంతేదో తేలుస్తా?" వెంకటపతి పైపంచను అక్కడే వదిలేసి, నేలను గతగతా తన్నుకొంటూ గుమ్మం దాటి వీధిలోకొచ్చాడు.
    "ఏవండీ?" అని ఇంకేదో చెప్పబోతూ వెనకే వచ్చిన వరూథిన్ని కసిరాడు వెంకటపతి.
    "నువ్వు ముందు లోపలకు చావ్? తలుపేసుకో! ఫో!"
    ఉగ్రుడై వున్న వెంకటపతిని చూస్తూంటే వరూథినికి శరీరం వణికింది. గుండెలు దడదడలాడాయి. కుక్కిన పేనులా కిక్కురుమనకుండా భర్త ఆజ్ఞను అమలు జరిపింది ఆ క్షణంలో వరూధిని.
    
                           40
    
    వెంకటపతి వెళ్ళేసరికి గుర్నాథం టేబుల్ ముందు కూర్చొని తను చేసిన పనిని తల్చుకుంటున్నాడు. వెంకటపతిని చూడగానే తత్తరపోయి గుర్నాథం లేచి నిలబడ్డాడు. వెంకటపతి గుర్నాథం జుట్టు పట్టుకొని బరబరా బయటి కీడ్చుకొచ్చాడు.
    "గాడ్దికొడకా? మా ఇళ్ళముందు ఎంగిలాకులు గతికి నోడివి. నీకెంత మదం దిగిందిరా?" వెంకటపతి గుర్నాథంగాడ్ని వంగదీసి 'దభీదభీ' జబురుతున్నాడు. గుర్నాథం పెళ్ళాం సుబ్బలక్ష్మి అడ్డం వచ్చింది, దాన్ని ఒక్కతోపు తోశాడు. అడ్డంవచ్చిన కనకయ్యకు రెండు తగిలించాడు.
    "తొత్తుకొడకా? ఎవరను కొన్నావురా?" ఎగిరెగిరి గుర్నాథం పొత్తి కడుపులో తంతున్నాడు వెంకటపతి. గుర్నాథం నోట్లోనుంచి 'బొళుక్కు' 'బొళుక్కు' మని రక్తం కక్కుతున్నాడు.
    "అయ్యో నా మొగుడ్ని వరూధిని మొగుడు చంపేస్తున్నాడర్రోయ్!" చప్పిడి ముక్కు సుబ్బలక్ష్మి నెత్తిబాదుకొంటూ ఏడుస్తోంది.
    "అయ్యో! నా అల్లుడ్ని బలరామయ్యగారి అల్లుడు చంపేస్తున్నాడండోయ్!"
    "బాబోయ్! మీ కాళ్ళుపట్టుకొంటా! వదలండి! బుద్దితక్కువైంది!"
    "నా కాళ్ళమీద కాదు. నువ్వు కాదు. ఈ లంజాకొడుకును వెళ్ళి వరూధిని కాళ్ళమీద పడమను!"
    "ఏరా! పడ్తావాలేదా?" అంటూ వెంకటపతి గుర్నాథం ముఖం మీద 'ఫెడీ ఫెడీ' తంతున్నాడు. గుర్నాథం ముందు రెండు పళ్ళూ విరిగిపోయి కింద పడినై. నాలుక తెగి రక్తం కారుతోంది. మనిషి స్పృహ తప్పి పోతున్నాడు. నేల కొరిగి లేవడానికి ప్రయత్నం కూడా చెయ్యడంలేదు. అయినా వెంకటపతి కోపం తీరలేదు. కాలెత్తి గుర్నాథం మెడమీద పెట్టి అంటున్నాడు వెంకటపతి.
    "ఎవరనుకున్నావురా వరూధిని?"
    "అబ్బ! ఇహ చాల్లెండి! చచ్చేట్టున్నాడూ?"
    "నువ్వవతలకు ఫో!" భర్త అరుస్తున్నాడు.
    "వాడు ఛస్తే మన పీకలమీద కొస్తుంది. మీ మోటుతనమూ మీరూ సరే! చచ్చేదీ బతికేదీ కానరు!" వెంకటపతి రెక్క పట్టుకొని బలంగా లాగింది వరూధిని. వెంకటపతి కోపంగా వరూథిన్ని తోసేశాడు.
    పందిరిమంచం మీద కళ్ళుమూసుకొని పడుకొని వున్న వరూధిని ఉలిక్కిపడింది. కళ్ళు తెరిచింది. ఊహాచిత్రం చెదిరిపోయింది. నెత్తిమీద నుంచి బండ దించి నట్టయింది. కసి తీరింది. మనసు తేలిక పడింది.
    అన్నట్టు తన భర్త అంత మొరటు మనిషె! అంతపనీ చేస్తాడు. పుటిక్కిన తగలరాని చోట తగిలి ఆ గుర్నాథంగాడు చస్తే! పోలీసులొచ్చి ఆయన్ను పట్టుకుపోతాడు. అసలు ఈపాటికి అంతపనీ జరిగిందేమో? తను ఎంత తెలివితక్కువ పనిచేసిందీ? అసలు ఆయన్ను పంపించటమేమిటి? అసలు ఆయనకీసంగతి చెప్పడం ఎందుకు? ఈపాటికి ఎంత అల్లరి అయిందో? ఆ విధంగా తన పేరు మోగిపోతూ ఉంటుంది.
    అసలే ఆయన తెలివి తక్కువ మనిషి మా ఆవిడ్ని ఈ గుర్నాథం గాడు పట్టుకొన్నాడని అక్కడ చేరిన వాళ్ళందరికీ చెప్పే ఉంటాడు. ఛీ! ఛీ! ఎంత అభాసు పాలయింది తన బతుకు? తను తల ఎత్తుకొని ఇంకెలా తిరుగుతుంది? పైగా ఆ గుర్నాథం గాడు లాయరు. వెంకటపతి తనను కొట్టాడని కేసు పెడ్తాడు.
    "ధన్! ధన్!"
    ఎవరో తలుపు కొడ్తున్నారు. వాళ్ళంతా ఇంటిమీదకు దాడికొచ్చారా? రౌడీల్ను పెట్టి ఆయన్నే కొట్టించాడేమో గుర్నాథం. తల పగిలిన ఆయన్ను.....స్పృహలోలేని తన భర్తను ఇంటికి మోసుకొచ్చారా?
    వరూధిని పక్కమీద నుంచి లేచి పరుగెత్తింది. వీధివాకిలి దగ్గిర కొస్తుంటే కాళ్ళు వణికాయి. తలుపు గడియ తీస్తుంటే చేతులు వణికాయి.
    "ఏమైంది?" తల వేలాడేసుకొని ఎదురుగా నిలబడిన భర్తను చూసి అడిగింది వరూధిని.
    వెంకటపతి తలదించుకొని మాట్లాడకుండా లోపలకొచ్చాడు.
    వరూథినికి తన భర్తలో మళ్ళీ మామూలు వెంకటపతి కన్పించాడు.
    ఓ గంట క్రితం గుర్నాథాన్ని తన్నడానికి వెళ్ళిన వెంకటపతి ఏమయ్యాడు? ఆ రౌద్రమూర్తి త్రోవలోనే చచ్చివుండాలి. నిప్పులు చెరుగుతూ వెళ్ళిన వెంకటపతి నీళ్ళు కార్చుకుంటూ తిరిగొచ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS