Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 86


    ఆ ఫంక్షన్ కి వెళ్ళమని కొందరూ, వెళ్లొద్దని  కొందరూ కుప్పలు కుప్పలుగా ఉత్తరాలతో, టెలిగ్రాములతో  దండయాత్ర ప్రారంభించారు.
    ఈ విషయంలో ఏం చేయాలో తోచక  శ్రీశ్రీగారు తీవ్రంగా  ఆలోచించడం 'ఏంచేద్దాం సరోజా' అని నన్ను అడగడంతో  "మీరింతగా  ఆలోచించడానికి  కారణం ఏమిటో  నాకు వివరంగా  చెప్తే  నా అభిప్రాయం చెప్తానండి" అన్నాను.
    "నాకు సన్మానం  చేస్తారు. ప్రధాన అతిథిగా  బ్రహ్మానందరెడ్డిగారు  వస్తున్నారు. వారే నాకు వెయ్యినూట పదహార్లు ఇచ్చి సత్కరిస్తారు. ఆ సభకి వెళ్ళి సన్మానాన్ని స్వీకరించడమా,మానెయ్యడమా? ఆర్ధికంగా మన పరిస్థితులు బాగులేవని నాకుతెలుసు. నీ ఉద్దేశం ఏమిటి?" అని అడిగారు.
    "మనం వెళ్ళినందువల్ల  నష్టం ఏమైనా వుందా" అని అడిగాను.
    "వెళ్ళినందువల్ల వుండదు. ఆ డబ్బు స్వీకరించడం వల్ల వుంటుంది" అన్నారు.
    "మన వాళ్ళంతా  ఏమంటున్నార"ని  అడిగాను. (వాళ్ళ పేర్లు అనవసరం)
    "మనవాళ్ళు  మాత్రమేకాదు. చాలా మంది ఆ సన్మానానికి  వెళ్ళడానికి వీల్లేదని అంటున్నారు" అన్నారు.
    "వెళ్ళి ఆ డబ్బు  తీసుకుంటే మీకు అపకీర్తి వస్తుందా" _ అని అడిగాను.
    "ఆఁ  ఒక విధంగా  వస్తుంది" అన్నారు.
    'అయినప్పుడు  దానికింత ఆలోచన ఎందుకండీ. మన దరిద్రం ఈ ఒక్కదానితోనో, ఈ ఒక్కనాటితోనో తీరేదికాదు. మా కోసం మీరు మీ కీర్తికి అప్రతిష్టతెచ్చే  పని చెయ్యవద్దు. నేను రాకముందు మీరు సంపాదించుకున్న  కీర్తిని చెడగొట్టుకోవద్దు.
    మనకేమీ  ఫరవాలేదు. డబ్బు కష్టపడి ఎలా గయినా  సంపాదించుకుంటాం. కీర్తిమాత్రం  అలా వచ్చేదికాదు. ఇప్పటికే  మిమ్మల్ని  మార్చేశానని  చాలామంది  ఏడుస్తున్నారు.
    'పెళ్ళాం పిల్లల కోసం  శ్రీశ్రీ  ఇలాంటి  పనిచేసి  అప్రతిష్ట  పొందాన్న  మాట నాకూ, పిల్లలకి రానివ్వకండి. మీకు సంబంధించినంతవరకూ  ఏ పనయినా  (అది కూడా  ముఖ్యంగా  డబ్బు విషయంలో)మా కోసం పెట్టుకోకండి. మీ కీర్తికి  భంగం కలగడానికి నేను ఒప్పుకోను. అందుకు మేము కారకులం కాకూడదు.
    ఒక్కపాట  రాస్తే  పదిహేను  వందలు తెచ్చుకుంటారు. ఇది ఆఫ్ట్రాల్. వెయ్యి నూటపదహార్లు. దాని విలువ ఎక్కువైతే కావచ్చు.కాదనను. మీరు మాకు మాత్రమే పరిమితంకాదు. ఎలా చెప్పాలో. నాకు సరిగ్గా చెప్పడానికి చేతకావడంలేదు. మీ నిర్ణయంతో, మీ అభిప్రాయంతో ఏకీభవిస్తానే కానీ ఎప్పుడూ ఎదురుతిరగను. నేను డబ్బుకి ఆశపడే మనిషినికానని మీకు బాగా తెలుసు" అని నేను అంటూ వుంటే_
    "అబ్బబ్బో! పొట్టిగాడు" అని మాత్రమే అన్నారు.
    "ఇంతకూ  ఏం చెయ్యదలచుకున్నార"ని  మళ్ళీ అడిగాను.
    నా బాధ నాది. వారి నిర్ణయం  తెలుసుకోవాలన్న  ఉబలాటమే తప్ప మరేంకాదు.
    "ఏవండీ_మిమ్మల్నే" అన్నాను.
    "ఇది అంత తొందరపడి  తేల్చాల్సిన  విషయం కాదు  సరోజా! ఇందుకు నాలుగు మార్గాలున్నాయి. ఒకటి_గైరుహాజరు కావడం, రెండు_అభ్యుదయ సదస్సులో పాల్గొని  సన్మానాన్ని నిరాకరించడం, మూడు_సన్మానాన్ని మాత్రమే స్వీకరించడం, నాలుగు_అన్ని సభలకూ  హాజరు కావడం.
    ఈనాడు నేనొక వ్యక్తిమాత్రుడ్ని  కాను. ఒక మహోద్యమానికి ప్రతినిధిని. నేను గైరుహాజరు  కావడం అంటే ఉద్యమానికి ద్రోహం చేయడమే అవుతుంది. అంతేకాదు. ఉద్యమ విరోధులంతా  నాకు పిరికితనాన్ని అంటగట్టవచ్చు.
    సన్మానాన్ని మాత్రమే  స్వీకరిస్తే 'శ్రీశ్రీ స్వార్ధపరుడురా' అంటారు. ఒకరు అంటారని కాదు సరోజా! అది ముమ్మాటికీ  స్వార్ధపరత్వమే  అవుతుంది. వెళ్ళకుండా మానెయ్యడం మంచిదే. కానీ, వెళ్ళి సన్మానాన్ని స్వీకరించకుంటే  బ్రహ్మానందరెడ్డిగారిని అవమానించినట్టు అవుతుంది. ఇప్పుడైనా అర్ధమైందా?" అన్నారు.
    ఈ తికమకల సన్మానాన్ని  గురించి  విని నాకు పిచ్చిపట్టినంతపనయ్యింది. చివరికి వారితో, "చూడండి ఇన్ని గొడవలేకాక, ఇంతమందిని  ఎదిరించామన్న పేరూ_విరోధంతో కూడిన ఈ సన్మానం మనకొద్దండీ. నేను రాను. మిమ్మల్ని వెళ్ళనివ్వను" అన్నాను.
    "అదే తప్పు సరోజా! వెళ్ళాలి. వెళ్ళి  అభ్యుదయ సదస్సులోనూ, ఆ సందర్భంలో జరిగే కవి సమ్మేళనంలోనూ  పాల్గొనాలి. ఈ మధ్య నేను రాసిన కొన్ని రచనలు చదవాలి" అని అన్నారు.
    అలా చాలాసేపు  చాలా విషయాలు మాట్లాడుకున్నాం.
    ఆయన ఏ విషయమైనా  నాతో చెప్పకుండా  వుండేవారు కారు. ఏ పనైనా నన్ను అడగకుండా  చేసేవారు కారు. అలాగని నేనొద్దంటే  మానేస్తారని కాదు. వారు చెయ్యదలచుకున్న  పనికి నేను అడ్డు తగలనని, తనమాట కాదననని వారికి బాగా తెలుసు. అందుకే  ప్రతీ విషయం నాతో చెప్పేవారు నేను ప్రతీదానికీ  వాదించేదాన్ని.
    వారికి కావాల్సింది కూడా ఆ వాదనే. విన్నంత వరకూ విని, విసుగెత్తితే, "నీకేమీ తెలియదు. నోరు మూసుకో" అని ఒక్కోసారి అనేసేవారు.
    'శ్రీశ్రీగారు  తన పెళ్ళాంతో  ఇటువంటి  విషయాలు కూడా  చర్చించేవారా' అని చాలామంది అనుకోవచ్చు. 'నిజం' అని చెప్పినా నమ్మకపోవచ్చు. నమ్మినా నమ్మకపోయినా ఇవి నిజాలు. మా జీవితంలో జరిగిన విషయాలు, మర్చిపోయినవి  పోగా  జ్ఞాపకం వున్నంతవరకూ దాపూ మూపూ లేకుండా రాయదలచుకున్నవి రాసేస్తున్నాను.
     మా పిల్లల చదువులు నిరాఘాటంగా  సాగిపోతున్నాయి. నాకు కావలసిందీ అదే! అదే నా జీవిత లక్ష్యం కూడా.
    నాకు ఇంగ్లీషు  అప్పట్లో అసలురాదు. పెద్ద చదువులేదు. ఎండాకాలం చదువైనా, మా నాన్నగారు నాకు తెలుగుభాష మాత్రం బాగానే నేర్పించారు. ఇంగ్లీషు మాట ఎత్తడానికి వీలులేదు. కారణం_ఆడపిల్లలు కాలేజీలకి  వెళ్ళి ఇంగ్లీషు చదువులు  చదివితే చెడిపోతారన్న  ఒక అభిప్రాయం.
    అందుకే  నాలో కసి బాగా పెంచుకున్నాను. నా పిల్లలు పెద్ద చదువు చదివి, పెద్ద ఉద్యోగాలు చేసి, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడేయాలి. అదొక్కటే నాకు పట్టిన  పిచ్చితోపాటు  కోరిక కూడా.
    నా అభిప్రాయానికి ఏనాడూ  ఆయన ఎదురు తిరగలేదు. పోతే చదువు విషయంలో  పిల్లల్ని ఎక్కువ బాధపెట్టేస్తున్నానని, కాల్చుతింటున్నానని అప్పుడప్పుడూ నన్ను తిట్టేవారు.
    "పిల్లలేమైనా  బిఏలూ యమ్మేలూ  చదివేస్తున్నారా? ఒక్కరోజయినా వాళ్ళు స్కూలుకి వెళ్ళకుంటే  ఊరుకోవు. నీతో ఛస్తున్నాం నాయనా" అని విసుక్కునేవారు.
    "ఇప్పుడిలా కష్టపడి మనం చదివిస్తేనే రేపు వాళ్ళు బిఏలకి యమ్మేలకి వెళ్ళగలుగుతారు. లేకుంటే ఇంతే సంగతులు"_అనేదాన్ని.
    
    
                      *    *    *


                             అర్ధరాత్రి ఆవిర్భవించిన విరసం


    నేను శ్రీశ్రీగారి దగ్గరలేని పదిరోజుల్లో  మా ఇద్దరిమధ్య  ఉత్తరప్రత్యుత్తరాలు  జరుగుతూవుండేవి. తను ఏ రోజు ఏ పూట ఎన్ని గంటలకి ఏం చేశోవారో ప్రతీఒక్క  విషయమూ  తన మూడునిబట్టి, అతి ప్రేమగానో, లేకుంటే అతి సున్నితంగా చివాట్లు పెడుతూనో రాసేవారు.
    ఆ ఉత్తరాలన్నీ  ప్రాణప్రదంగా  దాచుకున్నాను. అందులో ఒక ఉత్తరం ఈ దిగువ రాస్తున్నాను.
    మైడియర్ లవ్వింగ్ వైఫ్,
    నీ కొక్కిరి బిక్కిరి ఉత్తరం అందింది. అది నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాసినట్టులేదు. ఆ ఉత్తరం పదవ తేదీన రాశావు. నేను పదకొండో తేదీన టెలిగ్రామ్ ఇచ్చాను. నిన్నరాత్రి రెండున్నర గంటలకు మీ అన్నయ్యగారు ట్రంకాల్ మాట్లాడారు. నువ్వూ పిల్లలూ సినిమాకి వెళ్ళారని చెప్పారు. నాగపూర్ లో రాత్రి రెండున్నరదాకా  కూడా సినిమాలు ఆడతాయేమిటి?
    నువ్వు పిల్లల్ని ఒక్క క్షణం కూడా  వదలవద్దు. దీపావళికి నేను వస్తాను.
    మన శత్రువులు పన్నిన వలలో  మీ అన్నయ్యగారు కూడా పడుతున్నారేమోనని  నా అనుమానం.
    నాకు అబద్దాలన్నా, అబద్దపు బ్రతుకన్నా అయిష్టం. మన డబ్బు మనకి చాలు. మన బ్రతుకులు మనకిచాలి. పోతే_మద్రాసులో  పిల్లలకి సీట్లు దొరకనందున వాళ్ళ చదువుల కోసం అక్కడ నువ్వు పాతుకుపోవడం  నాకు చాలా కష్టంగావుంది. 'ఒక్క సంవత్సరం చదువుపోయినా  ఫరవాలేదు బాబూ!' అన్నా నువ్వు వినవు.
    రోజుకో ఉత్తరం  రాస్తానన్నావు. నాలుగురోజుల కొకటైనా  రాస్తున్నందుకు సంతోషం.
    చైనా అనిగానీ, నక్సలైట్ అనిగానీ, ఆఖరికి కమ్యూనిస్టు అనిగానీ ఏ ఉత్తరంలోనూ  రాయకు.
    ఇవేవీ నీకు అర్ధంకావు. నాకు మాత్రం  ఇవన్నీ అర్ధం  అయితే కదూ!
    అర్ధం చేసుకోటానికి  ప్రయత్నిస్తున్నాను_అంతే. ఎన్ని పనులున్నా రోజుకో తీయని లవ్ లెటర్ రాసి పడేస్తూ వుండు. అదే నాకు ఎక్కడలేని బలమూ ఇస్తుంది.
                                                                                       విత్ లవ్ అండ్ కిసెస్
                                                                                  యువర్ డియర్ హజ్ బెండ్ శ్రీశ్రీ  

     __ఈ విధంగా వారు రాసే ఉత్తరాలు చాలా గమ్మత్తుగా వుండేవి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS