Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 85


    కాని అప్పటికీ నేనేమీ చెయ్యకుండా నిశ్శబ్దంగా ఉన్నాను. గట్టిగా ఊపిరయినా తియ్యలేదు. కదల్చకుండా లాంతరును పట్టుకున్నాను. ఆ కంటిమీద ఎంత నిశ్చలంగా కిరణాన్ని నిలపగలనో చూద్దామనుకున్నాను. ఈలోగా గుండెల్లోని నరకఘోష హెచ్చిపోయింది. క్షణక్షణానికీ మరీ జోరుగా, మరీ గట్టిగా హోరెత్తసాగింది. ముసిలాడి భీతి అపరిమితమై ఉండాలి. చప్పుడు హెచ్చిపోతోంది. క్షణక్షణం హెచ్చుతోంది. విన్నారా? అనుక్షణం. నేనసలే భయస్తుణ్ని. ఈ నడిరాత్రివేళ, ఈ పాత ఇంటిలోని భయంకర నిశ్శబ్దం మధ్య ఆ వింత చప్పుడు నాలో పట్టపగ్గాలు లేని భయాన్ని రేకెత్తించింది. అయినా మరికొన్ని నిమిషాలపాటు ఏమీ చెయ్యకుండా నిశ్శబ్దంగా ఉన్నాను. కాని ఆ గుండెలు కొట్టుకుంటున్న చప్పుడు మరీ మరీ హెచ్చిపోతోంది. గుండె పటాలున బద్దలయిపోతుందనిపించింది. ఇంతట్లో ఇంకో కొత్త బెంగ పట్టుకుంది నన్ను! ఇరుగుపొరుగువారెవరైనా ఈ శబ్దాన్ని వింటే? ముసిలాడికి అవసానకాలం ఆసన్నమయింది. గట్టిగా ఒక కేకవేసి, లాంతరును కప్పిన కప్పు లాగిపారేసి, గదిలోకి లంఘించాను. ముసిలాడు ఒక్కసారి అరిచాడు - ఒక్కసారి మాత్రం! రెప్పపాటులో అతణ్ణి నేలమీదకు లాగి బరువైన మంచాన్ని అతనిమీదకు తిరగదోశాను. అంతవరకు జరిగిన పనికి హాయిగా ఒక నవ్వు నవ్వాను. కాని చాలా నిమిషాలదాకా ఆ గుండెలు నూతిలోని చప్పుడువంటి చప్పుడు చేస్తూనే ఉన్నాయి. ఇంతట్లో అదీ ఆగిపోయింది. ముసిలాడు మరణించాడు. మంచం తొలగించి శవాన్ని పరిశీలించాను. నిజమే. ముసిలాడు శిలాప్రాయంగా చచ్చిపోయి ఉన్నాడు. గుండెలమీద చెయ్యివేసి కొన్ని నిమిషాలపాటు అలాగే ఉంచాను. గుండెలు కొట్టుకోలేదు.ముసిలాడు చచ్చాడు. వాడి కన్ను నన్నింక బాధించదు.
    అయినా మీరింకా నన్ను పిచ్చివాడిననే భావిస్తే మృతశరీరాన్ని దాచడానికి నేను తీసుకున్న జాగ్రత్తలన్నీ వివరించడంతో మీ దురభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. రాత్రి గడచిపోతోంది. త్వరత్వరగా నేను నాపని సాగించాను. కాని ఏమాత్రం చప్పుడు చెయ్యకుండా అన్నిటికన్నా ముందు శవాన్ని ముక్కలు ముక్కలు చేశాను. తల, చేతులు, కాళ్ళు నరికివేశాను.
    తర్వాత గది నేలమీది బల్లచెక్కలలో మూడింటిని తొలగించాను. వాటికింద ఈ ముక్కలన్నీ జాగ్రత్తగా ఉంచాను. తర్వాత బల్లచెక్కలను యధారీతిగా అమర్చివేశాను. ఎంత తెలివితేటలతో, పనివాడితనంతో ఎంత మజాగా చేశానని ఈపని! మానవనేత్రం ఏదీ, ఆఖరికి ఆ ముసలాడి నేత్రంకూడా, పోల్చుకోవడానికి వీలులేనట్లు చేశాను. కడగవలసిందేమీ లేదు. ఒక్క నెత్తురు మరకకూడా లేదు. అబ్బో, నేను చాలా జాగ్రత్తపడ్డాను. నెత్తురంతా ఒక డబ్బాలోకి తోడివేశాను.
    ఈ పనులన్నీ ముగించినసరికి నాలుగు గంటలయింది. చీకటి మాత్రం అర్దరాత్రిలాగే ఉంది. నాలుగోగంట కొడుతూ ఉండగా వీధితలుపు ఎవరో తట్టిన చప్పుడైంది. నిర్భయంగా వెళ్ళి తలుపు తీశాను. ఇక నాకు భయపడవలసిన అవసరమేముంది? ముగ్గురు మనుష్యులు లోనికి ప్రవేశించారు. తాము పోలీసు ఉద్యోగులమని నెమ్మదిగా, మర్యాదగా తెలియబరచుకున్నారు. పొరుగింటివాళ్లు అర్ధరాత్రప్పుడేదో అరుపు విన్నారట. కొట్లాట జరిగినట్లు అనుమానమయిందట. పోలీసు కార్యాలయానికి భోగట్టా అందింది. ఈ యిల్లు సోదా చెయ్యడానికి వీరు వచ్చారు.
    ఒక నవ్వు నవ్వాను. నాకెందుకూ భయం? ఆ పెద్దమనుష్యుల్ని దయచెయ్యండన్నాను. ఆ అరుపు నాదే అన్నాను. కలలో అరిచానన్నాను. ముసిలాయన గ్రామాంతరం వెళ్ళాడని చెప్పాను. వారికి ఇల్లంతా చూపించాను. వెదకండి - బాగా వెదకండన్నాను. ఆఖరికి ముసిలాయన గదిలోకి తీసుకువెళ్ళాను. నా ఉత్సాహం మితిమీరి గదిలోకి కుర్చీలు తెచ్చి వారిని కూర్చోమనీ, యిక్కడే శ్రమ తీర్చుకోమనీ ప్రార్థించాను. నా మట్టుకు నేను పొంగిపొరలుతున్న విజయావేశంతో ముసిలాణ్ణి దాచినచోటనే కుర్చీ వేసుకొని కూర్చున్నాను.
    ఉద్యోగులకు సంతృప్తి కలిగించి నా ప్రవర్తన వారికి నమ్మకం కలిగించింది. నేను ధారాళంగా వర్ణించాను. అడిగిన ప్రశ్నలకు కులాసాగా జవాబులిచ్చాను. ఆమాటా ఈమాటా ముచ్చటించుకున్నాము. ఇంతట్లో నా మొగం పాలిపోతున్నట్లు అనిపించింది. వారు వెళ్ళిపోతే బాగుండుననిపించింది. తలనొప్పిగా ఉంది. చెవులలో గింగురు శబ్దమవుతోంది. అయినా వాళ్లు కూర్చునే ఉన్నారు. కబుర్లు చెపుతూనే ఉన్నారు. గింగురు శబ్దం మరింత స్పష్టమవుతోంది. ఇంకా సాగుతూ, మరీ స్పష్టమవుతోంది. ఆ దురవస్థను తప్పించుకోడానికి నేను యధేచ్చగా మాట్లాడుతున్నాను. కాని ఆ చప్పుడు మాత్రం ఆగలేదు. మరింత స్ఫుటమవుతుంది. ఆఖరికి నాకు బోధపడింది. అది నా చెవిలోని చప్పుడు కాదని.
    నా మొగం మరీ పాలిపోయిందనడానికి సందేహం లేదు. కాని మరీ జోరుగా మాట్లాడడం మొదలుపెట్టాను గొంతు హెచ్చింది. ఆ చప్పుడు ఇంకా హెచ్చింది. ఇక నేనేం జెయ్యాలి? ఆ చప్పుడు అదే! ఒక సన్నని దడదడ! దూదిలో చుట్టిన వాచీ చేసే చప్పుడు. ఆవురుమన్నాను. ఉద్యోగులు మాత్రం అది వినలేదు. జోరుగా, అలజడిగా మాట్లాడాను. చప్పుడు కూడా అలాగే హెచ్చింది. దిగ్గునలేచి అనవసరమైన అల్పవిషయాలను గురించి బిగ్గరగా చేతులు విసురుతూ వాదించాను. చప్పుడు మాత్రం హెచ్చుతూనే ఉంది. అయ్యో! దేవుడా! ఇక నేనేం చేదును? అరిచాను. మొత్తుకున్నాను. తిట్లు దిమ్మెత్తిపోశాను. నేను కూర్చున్న కుర్చీని అమాంతంగా ఎత్తిపట్టుకుని బల్ల చెక్కలమీద వేసి బాదడం మొదలుపెట్టాను. కాని అన్ని ధ్వనులనూ మించి ఆ చప్పుడు హెచ్చిపోతోంది. మరీమరీమరీ తీవ్రంగా! ఆ ముగ్గురూ చల్లగా నవ్వుతూ సరదాగా మాట్లాడుతూనే ఉన్నారు. బహుశా వాళ్ళకేమీ వినబడలేదు కాబోలు! ఓయీ భగవంతుడా, లేదు-లేదు! వాళ్లు విన్నారు. అనుమానం పడ్డారు. తెలిసిపోయింది వాళ్ళకి. నా అవస్థ చూసి ఎగతాళి చేస్తున్నారు. అంతే! అలాగే అనుకుంటున్నాను అప్పుడూ ఇప్పుడూ కూడా! కాని ఈ యమయాతన కంటే ఇంకేదైనా నయమే. ఈ హేళన కంటే ఇంకేదైనా భరించవచ్చు. వాళ్ళ కపటపు నవ్వులు మరి సహించలేను. గట్టిగా అరవనైనా అరవాలి. లేదా చావనైనా చావాలనిపించింది. ఇంతట్లో మళ్ళీ! అదుగో! గట్టిగా, గట్టిగా, ఇంకా గట్టిగా!
    "వినండి వెధవల్లారా! నిజం చెప్పేస్తున్నాను! ఈ బల్లచెక్కలు ఎత్తండి. ఇక్కడే! ఇక్కడే! ఆ వెధవ గుండెలు అరుస్తున్నాయి" అని గొంతు చించుకొని కేకలు వేశాను.

                                        * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS