Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 85


    "ఏం కనకయ్యా! ఈ కుర్రాడేనా నీ అల్లుడు? ఏదో చదువుకొన్నాడన్నావ్?" బలరామయ్య ఫేముకుర్చీ చెక్కలమీద కాళ్ళాడిస్తూ అడిగాడు.
    "అవును బాబుగారు! మెట్రిక్యులేషన్ పాసయ్యాడు" చేతులు నలుపుతూ చెప్పాడు కనకయ్య.
    "కట్నం ఏ మాత్రం ఇచ్చావేమిటి?" పొగాకు కాడ ఈనెతీస్తూ అడిగాడు బలరామయ్య.
    "కట్నాలూ కానుకలూ నేనెక్కడ ఇవ్వగలనండీ? మీకు తెలియందే ముంది" బలరామయ్య అందించిన పొగాకు కాడ అందుకొంటూ అన్నాడు కనకయ్య.
    "అయితే మంచి ఛాన్సే కొట్టావన్నమాట! మెట్రిక్యులేషన్ చదివినోడుగా? ఏదో ఆఫీసులో గుమాస్తాగా చేరి నాలుగు రాళ్ళు తెచ్చుకుంటాడు. ఇంకేం?" చుట్ట గుప్పు గుప్పున వెలిగించాడు బలరామయ్య.
    "ఆ మాట నిజమే అనుకోండి!" బలరామయ్యగారిచ్చిన పొగాకు కాడ మడత పెట్టి బనీను జేబులో సర్దుకొని అన్నాడు కనకయ్య.
    "మా అల్లుడికి యఫ్.ఏ, బి.ఏ. చదవాలని ఉంది. నిజం చెప్పొద్దూ ఆ కండీషన్ మీదే పెళ్ళికి ఒప్పుకున్నారు అతని తల్లిదండ్రులు. బి.ఏ. దాకా నేను చదివిస్తానని నేనూ ఒప్పుకున్నాను. వాళ్ళకేమీ లేదు. మెట్రిక్యులేషన్ దాకా వారాలు తిని, చందాలెత్తుకుని చదివాడు. ఇక అతని చదువు బరువంతా నా మీదే మరి!"
    "ఎట్టెట్టా వారాలు తిని చదువుకొన్నాడా? చదువుమీద శ్రద్ద వున్నవాడేనన్న మాట? చదివించు! వృద్దిలోకి వస్తాడు" మేడ పంచపాళీలో గుంజకు ఆనుకొని తలవంచుకొని కిందనాపరాళ్ళ కేసి చూస్తూ నిలబడ్డ గుర్నాథంకేసి పరిశీలనగా చూసి అన్నాడు బలరామయ్య.
    "మీ ఆశీర్వాదం! మీ ఆశీర్వాదంతో పాటు, మీ ఆర్ధిక సహాయం అండదండలూ కూడా ఉంటే మా అల్లుడు బి.ఏ.కు ఆనర్సు పెట్టి ఎం.ఏ.బి.యల్.ఐపోడూ?" కనకయ్య ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు.
    గుర్నాథం వంట్లో కితకితలు పెట్టినట్టయింది. తలెత్తి ఎన్నో ఆశలు నింపుకొన్న కళ్ళతో బలరామయ్యగారికేసి చూశాడు.
    "నాన్నా? ఎంతసేపు నాన్నా?" మండిగం  గడప మీద కాలుపెట్టి దర్వాజా కానుకొని నిలబడిన వరూధిని మెరుపుతీగలా కన్పించింది.
    గుర్నాథం కళ్ళు జిగేల్ మన్నాయి. తలవంచుకొని ఊపిరి బిగబట్టి నిలబడ్డాడు.
    "అయిపోయింది! వస్తా చిట్టితల్లీ!" బలరామయ్యగారు కాళ్ళు నేలమీదకు దించి, చుట్ట అవతలపారేసి లేవడానికి ఉద్యుక్తుడయ్యాడు.
    "ఏమిటి కనకయ్యా ముంతదాపరికాలెందుకు. తేల్చిచెప్పు!"
    "అల్లుడు వచ్చే సోమవారంనాడు కాలేజీలో చేరాలి. ఓ ఐదొందలు సర్దండి. ఈ ఏడాదికి మళ్ళీ మిమ్మల్ని అడగను" కనకయ్య చేతులు నలుపుకొన్నాడు.
    "అడిగేప్పుడు అప్పు. కాని నువ్వు తిరిగిచ్చిందెప్పుడూ? దాని కిందా దీనికిందా చెల్లు పెట్టడం, మిగిలింది ఎగనాం బెట్టి పిల్లలు గలోన్నని తల గోక్కోవటమేగా నువ్వు చేస్తోంది?"
    "తమరన్నది కాదన్నానా? మీ దయ. మిమ్మల్ని నమ్ముకొన్నవాడ్ని. మీ రాదుకోకపోతే మరెవరాదుకొంటారు చెప్పండి?"
    బలరామయ్య ముఖం చాటంత అయింది.
    "అప్పు లేదూ గిప్పు లేదూ! నువ్వు తిరిగిచ్చేదా పెట్టేదా?"
    కనకయ్య మెడ జారిపోయింది.
    "ఇదిగో! కనకయ్యా! రెండొందలిస్తా! మీ అల్లుడి చదువుకే సహాయం చేస్తున్నా. ఈ ఏడాదికి మళ్ళీ నన్నడగొద్దు."
    కనకయ్య బలరామయ్యగారి కాళ్ళమీద పడేట్టుగా అయిపోయాడు. ఆనంద బాష్పాలు రాల్చాడు.
    "ఇదిగో ఏమోయ్! నీ పేరేంటి?"
    "గుర్నాథం"
    "ఓ గుర్నాథం! మీ మామ ఎంత అవస్థపడి నీకు చదువు చెప్పిస్తున్నాడో చూస్తున్నావుగా? ఏరుదాటి తెప్పతగలేసేవ్? బుద్దిగా చదువుకొని పైకొచ్చి మీ మామకు ఓ చేయి అందించు. ఇంకా చిన్నా చితకా పిల్లలున్నారు!"
    "గుర్నాథం! బలరామయ్యగారు చెప్పింది విన్నావుగా? ఆఁ గుర్తుంచుకో. పెద్దవారు చెప్పారు గుర్తుంచుకో?"
    గుర్తే వుంది గుర్నాథానికి మర్చిపోలేదు.
    బలరామయ్యగారి కూతురి పడకగదిలో పందిరి మంచంమీద దొర్లుతూ గుర్నాథం గుర్తుచేసుకొన్నాడు.
    ఆరోజు ద్వారబంధం పట్టుకొని మండిగం మీద సుతారంగా కాలుపెట్టి నిల్చొని తనకేసి ఓ కొత్తగా జంతువునో, పురుగునో చూస్తున్నట్టుగా చూసిన వరూధిని ఇంకా గుర్తే వుంది.
    అప్పుడప్పుడే పొటమరించే యవ్వనం ఎటునుంచి బయటకు రావాలా అని వెతుక్కుంటూంది. ఆమె శరీరపు పొందికా, వంపులూ ఇంద్ర ధనుస్సులోని రంగుల్లా ఏది ఎక్కడ మొదలై ఎక్కడ అంతమయిందీ తెలియడంలేదు.
    "వారాలు తినటమేమిటి నాన్నా?"
    బలరామయ్యగారి నవ్వు గుర్నాథం గుండెల్లో దూరదూరాల్నుంచి వినిపించసాగింది.
    "మీ అత్త మా జీతగాడితో ఉంది. నీ పెళ్ళాం వాడికి పుట్టిందే!"
    "లంజను లంజా అంటే నువ్వు లంజ, నీ అమ్మ లంజ అంటుంది."
    వరూథినికి కళ్ళు చీకట్లు కమ్మాయి!
    "గొర్రె కసాయివాడ్నే నమ్ముద్ధి. రామనాథబాబు అవసరం తీరాక ఐదు లక్షల ఆస్తి కాజేశాడు. ఆ పోలీసోడేమో అన్నీ గడుపుకొని ఆ శంకర్రావుగాడిని తగిలించి తప్పుకొన్నాడు. నీకు అలాంటి వాళ్ళే కావాలి!" సోఫామీద వదిలేసినా నల్లకోటు తీసి భుజాన వేసుకొన్నాడు గుర్నాథం.
    "ఎంగిలి మెతుకులు ఏరుకొని బతికినవాడివి  నువ్వు! వాళ్ళతో నీకు పోలికేమిటి? చెడి బతికిన రకం! మళ్ళీ గడప తొక్కావా పరువు దక్కదు. జాగ్రత్త!"
    వెళ్తున్న గుర్నాథం ద్వారం దగ్గిర ఆగిపోయాడు.
    "పరువు? బరితెగించిన దానిని నీకు పరువుకూడానా? మాటలు జాగ్రత్తగా రానియ్. నీ గడప తొక్కాల్సిన అవసరం నాకేమిటి? నువ్వు రమ్మని ఏడిస్తేనే నీ ఇంటికొచ్చాను. అసలు పరువు మర్యాదా వున్నవాడెవడూ నీ గడప తొక్కడు."
    గుర్నాథం గడపదాటి రోడ్డెక్కాడు.
    వరూధిని థడేల్న తలుపులు మూసింది. గుర్నాథం కూర్చున్న సోఫాకేసి చూస్తేనే అసహ్యంగా వుంది. పడక గదిలో వున్న మంచంమీద కిరసనాయిల్ పోసి ముట్టించాలనిపించింది.
    తెల్లదుప్పటీ, దిండుగలీబూ తీసి స్నానాలగదిలో బాయిలర్ పక్కన పడేసింది. వేరే ఇస్త్రీ దుప్పటితీసి పరచింది. మంచంమీద వాలిపోయింది. గుర్నాథం అంటుకొన్న శరీరం మండిపోతోంది.
    మెదడులో పోటు.....గుర్నాథం......గుర్నాథం......గుండెలు విచ్చిపోతున్నాయి. అవమానం, కసీ నరనరాన్నీ పట్టి గుంజుతున్నాయ్!
    వాడికెంత ధైర్యం? తను ఎవరనుకొన్నాడు? వాడి బతుకేమిటి?  వాడు.....తన చెయ్యి......బలరామయ్యగారి కూతురి చెయ్యి పట్టుకొంటాడా? నాన్నే వుంటే వాడ్ని నరికి ఉప్పుపాతర్లో వేయించేవాడు. మామ......సాంబయ్యవింటే గుర్నాథం గాడ్ని నరికి కాకులకూ గద్దలకూ వెయ్యడూ? తన మామగారంటే మహా మహా వాళ్ళకే వణుకు! తను షావుకారు బలరామయ్యగారి కూతురు..... తను మోతుబరి భూస్వామి కోడలు. తనను అంటుకోవడానికి వాడికి ఎన్ని గుండెలు? డి.యస్.పి. గారుంటే వాడి రక్తం కళ్ళ చూడరూ? ఈ పాటికి గుర్నాథంగాడ్ని బొక్కలో తోయించేవాడు కాదూ? రామనాథబాబయితే మాత్రం ఊరుకొంటాడా? రౌడీల్ని పెట్టయినా తన్నించేవాడు కాదూ?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS