"నా మనసు మనసులో లేదు. చదవలేనండి" అన్నాను. "మరేం ఫర్వాలేదు. చదువు" అన్నారు. అందులో_
'అబద్ధం బద్దలైంది
రోదసీ రోదించింది
షెల్లీ మళ్ళీ మరణించాడు
వసంతం వాడిపోయింది'
అని రాసి వుంది. మరోసారి ఆ లైన్లను చదువుకుని, జర్నలిస్టులకు ఇచ్చేశారు. అంతే. తర్వాత చాలామంది వచ్చేశారు. కృష్ణశాస్త్రిగారి గురించి అందరూ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
"టైము అవుతోంది. శ్రీశ్రీగారు స్నానం చెయ్యాలి. భోజనం చేసి రెస్టు తీసుకుంటారు. వెళ్ళిరండయ్యా" అని ఆ ఇంటి యజమానిగారు అందర్నీ పంపించేశారు.
* * *
రేపటి చరిత్రకు ఈ రోజే స్వాగతం
సాయంకాలం నిరీశ్వరాశ్రమం వార్షికోత్సవానికి వెళ్ళాం. చిన్న ఊరు అయినా ఎక్కడ్నుండి వచ్చారో ఆ జనం తెలియదు. సభలో కృష్ణశాస్త్రి గారి మరణవార్త చెప్పి, వారి ఆత్మశాంతికి అందరం శ్రద్ధాంజలి చేశాం. తరువాత_అందరి ఉపన్యాసాలు అయ్యాక శ్రీశ్రీగారు తన ఉపన్యాసం ప్రారంభించారు.
"నేడు ఈ నిర్వీశ్వరాశ్రమం వార్షికోత్సవంలో పాల్గొనడం నాకు చాలా ఆనందదాయకంగా వుంది. కులమత భేదాలు, దేవుడి భక్తి, జ్యోతిషం వంటివిషయాల్లో నమ్మకం వుండేవాళ్ళకి ఈ నిరీశ్వరాశ్రమ వార్షికోత్సవంలాంటి వేడుకలూ, మా నాస్తికత్వం కష్టంగా వుంటుందని నాకు తెలుసు.
రేపటి చరిత్రకు ఈ రోజే స్వాగతమిచ్చే అవకాశాన్ని జారవిడువకూడదు.
'ఈ బూడిద తీసుకో. ఇది మీ జబ్బులన్నిటినీ వదలగొడుతుంద'ని అంటే ఆ బూడిదను కళ్ళు కద్దుకొని స్వీకరించే అస్తికోత్తములున్న దేశం మనది.
అంతెందుకు? మా ఆవిడ సరోజ కూడా ఆ కోవకు చెందిందే. అయితే_చిన్నమార్పు ఏమిట్రా అంటే ఆవిడ ఈ బూడిదల్ని, జాతకాలని నమ్మడం, కనబడ్డ ప్రతీరాయికీ మొక్కడంలాంటి పన్లు చెయ్యదు.
లేని ఆ దేవుడి కోసం తన ఇంట్లోనే ఓ గది కేటాయించేసింది. తెల్లవారకుండానే దీపాలతో, పువ్వులతో, ఊదొత్తులతో, కర్పూరపు సువాసనలతో ఆ గది కళకళలాడిపోతూ వుంటుంది. ఆమెను కూడా మార్చగలననే నమ్మకం నాకుంది.
దేవుడంటూ ప్రాకులాడుతున్నా, కళ్ళముందు కనిపించే సత్యాన్ని అర్ధం చేసుకొనే తెలివి ఆమెకి వుంది. తన ఇంట్లో వున్న దేవుడి వరకే తనపరిమితి. అయినా_ పేరుపడ్డ దేవాలయాలంటే ఒళ్ళూపై తెలియదామెకి. మేము బెజవాడలో అడుగుపెడితే స్వాతి బలరామ్ గారింట్లోనే బసచేస్తాం. నన్ను బలరామ్ దంపతులకి వదిలేసి, తాను కనకదుర్గమ్మ దర్శనం చేసుకోడానికి వెళ్ళిపోతుంది.
'ఎందుకు సరోజా! ఈ గుళ్ళకీ, అమ్మవార్లకీ, పూజలకీ అంటూ కాలాన్నీ డబ్బునీ కూడా తగలేస్తావ'ని తిడతాను. "ఏదో నా పిచ్చి నాది" అని నవ్వేస్తుంది.
తర్వాత అరగంటకి సభ ముగిసిపోయింది. ఆటో గ్రాఫులివ్వడం మొదలైన కార్యక్రమాలతో, మేము ఇంటికి చేరుకొనేసరికి రాత్రి పది గంటలయ్యింది.
ఇంటికి చేరాక మాకు నిద్రపట్టలేదు. మేమిద్దరం మౌనంగా కొంతసేపూ, మాట్లాడుతూ కొంతసేపూ అర్ధరాత్రి దాటేవరకూ కాలక్షేపం చేసి, మర్నాడు ఉదయం మద్రాసుకి బయలుదేరిపోయాం.
తర్వాత నేను మా బైజుకూడా వారితోపాటు అన్ని మీటింగులకి వెళ్ళాం. చిత్తూరు నేను వెళ్ళలేదు. మా బైజుమాత్రం వెళ్ళాడు. మదనపల్లి నేను వెళ్ళాను. నాకు బాగా జ్ఞాపకం_నేనూ, మావారూ మార్చి ఒకటో తేదీన నెల్లూరువెళ్ళి శ్రీ అనంతరామయ్యగారి ఇంట్లో వేదిగాం. అదీ షష్టిపూర్తికి సంబంధించిన సభమాత్రం కాదు. అనంతరామయ్యగారు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా ఆదరించారు.
ఆ రోజు సభలో శ్రీశ్రీగారు ఓ గంటసేపు అద్భుతంగా మాట్లాడారు. వారు మాట్లాడుతూ మధ్య మధ్య నా ముఖం చూసేవారు.ఆ రోజు మీటింగ్ లోనే కాదు. నేను వారితో కలసి వెళ్ళిన ఏ మీటింగ్ కయినా సరే!
ఆరోజు సభ ముగిసి ఇంటికి చేరుకున్నాం. భోజనాలయ్యాక మేమిద్దరం కూర్చున్నాం. రాత్రి ఒంటిగంట కావస్తోంది.
నేను వారిని ఓ ప్రశ్నవేశాను. "ఏవండీ ఈరోజు చాలా బాగా మాట్లాడారు. అదిసరే కానీ మీరు సాధారణంగా ఎక్కడైనాసరే సభలో ఏ మాట తోస్తే ఆమాట అనేస్తారు. అలాగే రాయదలచుకున్నది రాసేస్తారు. ఇలా చేస్తే విన్నవాళ్ళకీ, చదివిన వాళ్ళకి ఒళ్ళు మండదుటండీ" అని అడిగాను.
"అలా మాట్లాడటం, ఇలా రాయడం ఒళ్ళు మండించడానికే సరోజా!" అన్నారు.
* * *
సన్మానంలో తికమకలు
"జీవితం ఒక జూదంగా పరిణమించింది. ఇష్టంవున్నా లేకున్నా అందరం ఇందులో పాల్గొనవలసిందే. ఈరోజు సభలో సాహిత్యం గురించే ఎక్కువగా మాట్లాడవలసి వచ్చింది. నేనెవరి గురించి మాట్లాడానో తెలుసా?" అని అడిగారు శ్రీశ్రీగారు.
"భలేవారండీ. అంత మొద్దుని చేసెయ్యకండి. తిక్కన్నగారి గురించి" అన్నాను.
"ఎలా మాట్లాడాను?" అని అడిగారు.
"చాలా బాగా మాట్లాడారు. అయినా మీకీమధ్య నోరు హెచ్చయిపోయిందిలెండి. మొదట్లో వేదికమీదకి వస్తే శ్రీశ్రీ నోరువిప్పితే బాగుండుననిపించేవారు. ముక్తసరిగా మాట్లాడేవారు. ఇప్పుడు తెగ మాట్లాడేస్తున్నారు. మధ్యమధ్యలో జంప్ లు వేరే" అన్నాను.
"అంటే?" అన్నారు.
"ఒక సబ్జెక్టులోంచి మరో దానిలోకి ఠక్కున జంప్ చేసేస్తారు"అన్నాను.
ఆయన ఏం మాట్లాడలేదు. సిగరెట్ పెట్టె తెమ్మన్నారు.
చేతికందిస్తూ "ఏవండీ బైజు చదువు పాడైపోతోందండీ. వాడ్ని తీసుకువెళ్ళి పిల్లలదగ్గర వదిలేసి వచ్చేస్తాను" అన్నాను.
"ముందు నా జేబులో డబ్బుతీసి జాగ్రత్తగా వుంచు" అన్నారు.
"ఎక్కడికి పోతుందిలెండి" అన్నాను.
"చూశావా పోతుంది అంటే జ్ఞాపకం వచ్చింది. నీతో చెప్పడం మరచిపోయాను. నేనూ బైజూ కలిసి చిత్తూరునుండి ఎక్స్ ప్రెస్ లో కదా ఇంటికి వచ్చాం. నేను చిత్తూరు నుండి బయలుదేరినప్పుడు రెండు వందల రూపాయలు జేబులో పెట్టుకున్నాను. స్టేషన్ లో దిగి చూసుకునేసరికి లేవు" అన్నారు.
"ఎలా పోయాయండీ" అని అడిగాను.
"అవి పోవడానికి ఓ పోలీసువాడు కారణం అనిమాత్రం నాకు తెలుసు. డిటెయిల్స్ అనవసరం. నీతో చెప్తే తిడతావని చెప్పలేదు" అన్నారు. "దేనికి? డబ్బు పోయినందుకా? లేక పసివాడు పక్కనున్నా, రాత్రి ప్రయాణమైనా పెగ్గులు బిగించినందుకా?" అని అడిగాను.
"నీతో సాల్లేము సరోజా! నువ్వు రాక్షసివి" అన్నారు.
"అయినా మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నాను. ఎంత రాక్షసినయితే మాత్రం ఏం లాభం? మీచేత తాగుడు మాన్పించలేకపోతున్నాను" అన్నాను.
"తాగుడు నాచేత పూర్తిగా మాన్పించలేకపోయినా ఆ అలవాటుని బాగా తగ్గించేశావని మాత్రం ఒప్పుకో. దెయ్యంలా పట్టుకున్నావు. తాగడం విషయం నా యిష్టానికి వదిలెయ్యి బాబూ అన్నా వినవుకదా" అన్నారు. "మరైతే నన్నెందుకు వెంటబెట్టుకొని ఈ మీటింగులకి వస్తారు? నేను లేకుంటే మీరు ఫ్రీగా ఉండొచ్చుగా" అనడిగాను.
"అలా అంటావేకానీ నన్ను కంట్రోల్ చెయ్యడానికైనా నువ్వు కావాలి. ఐ లవ్ యూ సరోజా!" అన్నారు.
"అర్ధరాత్రి లవ్ బాగానేవుంది కానీ బైజు చదువుమాట మరచిపోతున్నారు" అన్నాను.
"అంటే ఇప్పుడు వాడ్ని తీసుకొని నాగపూర్ వెళ్ళాలంటావు" అన్నారు.
"మరెలాగండి. ఈ సంవత్సరం ఎలాగయినా ప్రయత్నించి ఇక్కడే స్కూల్ లో జాయిన్ చేసేద్దాం" అన్నాను.
"అయితే ఎప్పుడు బయలుదేరదామను కుంటున్నావు?" అని అడిగారు.
'ఇంటికి వెళ్ళి ఆలోచిద్దాం" అన్నాను.
* * *
అనుకున్న ప్రకారం బైజుని మళ్ళీ నాగపూర్ తీసుకువెళ్ళి పిల్లల దగ్గర వదిలేసి వచ్చేశాను. పిల్లల్ని వదిలి వుండడం చాలా కష్టం అనిపించేది మాకు.
ముఖ్యంగా నా పరిస్థితే మరీ దారుణంగా వుండేది. ఇటు వీరు... అటు పిల్లలు!
నా పనివాళ్ళనంతా నా పిల్లల రక్షణకి వదిలినా, దాకట్లో వెలంకాయలా కొట్టుకుపోయేదాన్ని. ఫోనులో పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవడం వల్ల టెలిఫోన్ బిల్లులువచ్చి జడిపించేవి. చచ్చేటట్టు కట్టుకొనేవాళ్ళం.
ఇంతలో_హైదరాబాద్ నుండి జూలై నాలుగోతేదీన అభ్యుదయ రచయితల సదస్సు, ఆ మర్నాడు అదే ఊర్లో శ్రీశ్రీగారికి సన్మానమూ చేస్తున్నామని ఉత్తరం వచ్చింది. తర్వాత ఫోనుల వర్షం కురవడం ప్రారంభించింది.
