Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 84


                                 ఆ గుండెల చప్పుడు

    నిజం! భయపడ్డాను. భయపడుతున్నాను. ప్రచండమైన
    భయంతో వొణికిపోతున్నాను నిజమే. కాని నాకు పిచ్చి
    అంటారేం మీరందరూ? ఈ జబ్బు నా ఇంద్రియాలను
    పదనుపెట్టింది. అంతేగాని నాశనం చెయ్యలేదు. అన్నిటికన్నా
    నా శ్రవణశక్తి తీవ్రతరమయింది. భూమ్యాకాశాలలో ఎక్కడ
    ఏపాటి చప్పుడైనా వినబడుతోంది. నరకంలో ధ్వనులెన్నో
    విన్నాను. మరి నాకు పిచ్చి అంటారేం? వినండి. ఎంత
    ఆరోగ్యంగా, ఎంత ప్రశాంతంగా మీకు నా కథంతా
    చెబుతానో.
    నా మెదడులో మొదటిసారి ఈ ఊహ ఎలా ప్రవేశించిందో చెప్పలేను. కాని ప్రవేశించిన నాటినుండి రేయింబవళ్ళు నన్ను వేధించడం మొదలుపెట్టింది. ఉద్దేశం లేదు. కోపం లేదు. ఆ ముసలాయనంటే పైగా నాకెంతో ప్రేమ. అతడెప్పుడూ నాకు ఏ అన్యాయం చెయ్యలేదు. ఎన్నడూ అవమానం చెయ్యలేదు. అతని బంగారం మీద నాకు ఆశ ఉన్నదా అంటే అదీ లేదు. నేననుకుంటాను. దీనికంతకీ కారణం అతని కన్ను! ఆ పాపిష్టి దిష్టి కన్ను! అదే. అదే అంతటికీ కారణం. రాబందు కన్నువంటి దున్నాది అతనికొక కన్ను. పాలిపోయిన నీలిరంగు కన్ను నీరుకారుతూ, ఆ కన్ను నామీద ఎప్పుడు పడ్డా నా రక్తం చల్లబడిపోయేది. అంచేత ఈ ముసలి వాడిని చంపివేసి దిష్టికన్నుబాధ ఎప్పటికీ లేకుండా చేసుకోవాలన్న బుద్ధి పుట్టింది. హఠాత్తుగా కాదు. క్రమంగా, మెల్లమెల్లగా.
    చూశారా, ఇదీ అసలు సంగతి. మీరేమో నేను పిచ్చివాడిననుకుంటారు. పిచ్చివాళ్ళకేమీ తెలియదు. కాని మీరు నన్ను చూడవలసింది. ఎంత కుశాగ్రబుద్ధితో, ఎంత జాగరూకతగా ఎట్టి ముందుచూపుతో వ్యవహరించానో చూడవలసింది మీరు. చంపడానికి ముందు వారం రోజులు ముసిలాడి అడుగులకు మడుగులొత్తుతూ ఎంతో ఆపేక్ష కనబరిచాను. ప్రతి రాత్రీ-రమారమి అర్థరాత్రిసరికి అతని తలుపు గడియ తొలగించి మెల్లిగా ఓహో, కడునింపాదిగా తలుపు తీసేవాణ్ణి. నా తల దూర్చడానికి వీలయినంతగా తలుపు ఓసరిల్లిన తర్వాత ముందుగా ఒక లాంతరును వెలుతురు ప్రసరించకుండా పూర్తిగా కప్పివేసి కట్టుకొని ఆ పిమ్మట తలదూర్చేవాడిని. అప్పటి నా జిత్తులమారి. నేర్పు మీరు చూస్తే విరగబడి నవ్వుకొని ఉందురు. తల మెల్లగా, ఓహో కడుమెల్లగా, మెలమెల్లగా ముసిలాడికి నిద్రాభంగం కలగకుండా కదల్చేవాడిని. మంచంమీద పడుకున్న మనిషిని చూడగలిగేటట్లు తలంతా దూర్చడానికి కనీసం నాకొక గంటసేపు పట్టేది. హ్హ! పిచ్చివాడెవడైనా ఇంత తెలివితేటలు ప్రదర్శిస్తాడా? తర్వాత నా తల పూర్తిగా దూరడంతో లాంతరును జాగ్రత్తగా, జాగ్రత్తగా, చప్పుడు కాకుండా విప్పి ఒక్కటే కిరణం ముసిలాడి కంటిమీదకి ప్రసరించేటట్టు పట్టుకునేవాడిని. ఇలా రెండు దీర్ఘరాత్రులు చేశాను. సరీగా అర్దరాత్రి వేళప్పుడు కాని ఎప్పుడూ ఆ కన్ను మూసుకునే వుండేది. అంచేత నాపని సాధ్యమయ్యేది కాదు. చెప్పాను కాదూ. ముసిలాడిమీద నాకేమీ కోపం లేదని, అంతా ఆ దిష్టికన్ను మహిమ! మళ్ళీ ప్రతి ఉదయం, తెల్లవారేసరికి ధైర్యంగా గదిలోకి వెళ్ళి మనసారా ముసిలాణ్ణి పేరుపెట్టి పిలిచి ఆప్యాయంగా అడిగేవాణ్ణి హాయిగా రాత్రి నిద్రపోయారా అని! చూశారా ప్రతి రాత్రీ పన్నెండు గంటలకి నేను చూస్తానని ముసిలాడు తెలుసుకుంటే అతడు మరీ దేవాంతకుడయి ఉండాలన్నమాట కాదూ!  
    ఎనిమిదో రాత్రి మామూలుకన్నా జాగ్రత్తగా తలుపు తెరిచాను. గడియారపు నిమిషాల ముల్లు నా చేతికన్నా జోరుగా తిరుగుతుందని చెప్పవచ్చు. ఆ రాత్రికి ముందు ఎప్పుడూ నేననుకోలేదు. నాకింత శక్తి ఉందని. ఇంత తెలివైనవాడినని! నాలో పొంగి పొరలుతూన్న విజయోత్సాహాన్ని అరికట్టలేకపోయాను. మెల్లిమెల్లిగా అలా నేను తలుపు తెరుస్తూండడం. ఆ ముసిలాడికి నా రహస్యం కలలోనైనా అంతుపట్టకపోవడం. శభాష్! ఈ ఊహకి నాకే నవ్వొచ్చింది. ఏమో, నా నవ్వు వాడికి వినిపించి ఉండినా ఉండవచ్చును. ఎందువల్లనంటే ఎప్పుడూ లేనిది ముసిలాడు తుళ్ళిపడ్డట్టు అటునించి ఇటు మంచంమీద ఒత్తిగిల్లాడు. నేను వెనక్కి తగ్గిపోయాననుకుంటారు కదూ మీరు? అబ్బే! లేదు. దొంగల భయంచేత కిటికీలన్నీ మూసుకున్నాడేమో గది అంతా గాఢాంధకార బంధురంగా ఉంది. కాబట్టి తలుపు తెరుచుకోవడం అతనికి తెలియదని నాకు నిశ్చయమే. అందుచేత నిబ్బరంగా నాపని కానిచ్చాను.
    తలదూర్చి, లాంతరు మూత తియ్యబోయేసరికి మూతమీదకి వేలు జారి చప్పుడయింది. ముసిలాడు దిగ్గుమని లేచి "ఎవరక్కడ" అని అరిచాడు.
    నేనేమీ కదలలేదు. మెదలలేదు. ఒక్కమాటైనా ఆడలేదు. ఒక గంటంటే గంటసేపు కరచరణాలు కదల్చకుండా విగ్రహంలాగు నిలుచుండిపోయాను. ముసిలాడు సద్దుకుని పడుకున్న చప్పుడేదీ నాకు వినబడలేదు. అలా వింటూ మంచంమీద కూర్చునే ఉన్నాడు. నాలాగే, ప్రతి రాత్రీ నేను మృత్యు నిశ్శబ్దాన్ని విన్నట్లే.
    ఇంతట్లో నాకొక అరుపు వినిపించింది. విపరీతమైన భయం పుట్టినప్పుడు అరిచే అరుపు. నొప్పివల్లగాని, దుఃఖం వల్ల గాని అరిచే అరుపు కాదది. అబ్బే! లోతు లోతులనుంచి ఉబికే భయంవల్ల మానవుడు చేసే ఆక్రోశం. అలాంటి చప్పుడు నాకు బాగా తెలుసు. ఎన్నో రాత్రులు సరీగా అర్థరాత్రప్పుడు అందరూ నిద్రించే సమయంలో నా గుండెలలో నుంచే ఇలాంటి చప్పుడు నన్ను కలవరపెడుతూ తన ప్రతిధ్వనులతో నా భయాన్ని మరింత రెచ్చగొడుతూ ఉండేది. నేను చెబుతున్నానుగా, అది నాకు బాగా తెలుసు. అందుకు నాకతనిమీద జాలివేసింది. కాని లోలోపల నవ్వుకున్నాను. మొదటిసారి చప్పుడుకి మేలుకున్నప్పటినుంచీ అలాగే కూర్చున్నాడని నాకు తెలుసు. అప్పటినించీ అతని భయం అలా అలా హెచ్చయిందనీ ఎరుగుదును. తన భయానికి కారణమేమీ లేదని నిబ్బరం చేసుకోబోయినప్పటికీ అది సాధ్యపడలేదు. నాకు తెలుసు, అతడు తనలో తాను- "అబ్బే అది ఈదర గాలిచప్పుడు అదేదో ఎలక కదలిన చప్పుడు, అంతే చిమ్మట కాబోలు ఒక్కమారు చప్పుడు చేసి ఊరుకుంది" అని అనుకుని ఉంటాడు. ఇలా అనుకొని ధైర్యం చెప్పుకొని ఉండాలి ఆ ముసిలాడు. కాని లాభంలేదు. ఏమీ లాభంలేకపోయింది. మృత్యువతనికి ఆసన్నమయింది. నల్లటి నీడతో ఎదురుగుండా నిలబడింది. పూర్తిగా అతణ్ణి ఆవరించింది. ఆ కనబడని నీడవల్లనే అతడు గ్రహించి ఉంటాడు. తలుపు సందులోంచి నేను తలదూర్చినట్టు. అంతేగాని నా తల అతనికి కనబడలేదు. ఏ చప్పుడూ వినబడలేదు.  
    ఎంతో ఓర్పుగా చాలాసేపు అలాగే ఆగిపోయిన పిమ్మట ఆ ముసిలాడు పడుకున్నట్టు చప్పుడేమీ వినపడక ఆఖరికి దీపంలో చిన్న సందు చెయ్యాలని సంకల్పం కలిగింది. అందుకని లాంతరు మూత తీశాను. ఎంత మెల్లిగా, ఎంత దొంగతనంగా, ఎంత నేర్పుగా తీశానో మీరూహించలేరు. ఒకే ఒక కిరణం. సాలీడు దారంకన్నా సన్ననిది అతని రాబందు కంటిమీద పడింది.
    ఆ కన్ను తెరుచుకొని ఉంది. విశాలంగా విప్పారుకొని ఉంది. దాన్ని చూస్తూ ఉంటే నాకు రౌద్రం రెచ్చిపోయింది. ఎంత స్పష్టంగా కనబడింది. ఆ కన్ను! ఆ మాసిన నీలిరంగుతో, పలచని తెరలాంటి నీటిపొరతో! అది నా ఎముకల మూలుగులను దొలిచేస్తోంది. ముసిలాడి ముఖంగాని, శరీరంగాని మరేదీ కనబడనే లేదు. ఎందువల్లనంటే ఎవరో చెప్పి చేయించినట్టు సరిగా ఆ కంటిమీదకే లాంతరు వేశాను.
    నేను చెప్పలేదూ మీకు? ఏదైతే పిచ్చి అని మీరనుకుంటారో అది నా ఇంద్రియాల తీవ్రశక్తి అని. మామూలుగా ఎవరికీ వినబడని చప్పుళ్ళు నాకు వినబడతాయి. అలాగే ఒక సన్నని దడదడ. దూదితో చుట్టిన వాచీ చేసే చప్పుడు విన్నాను. ఆ చప్పుడు కూడా ఇదివరలో నాకుబాగా పరిచితమైనదే. అది ముసిలాడి గుండెలు కొట్టుకుంటున్న చప్పుడు. దానితో నా ఆగ్రహం మరీ అధికమైంది. యుద్ధరంగంలోనికి వెళుతూన్న సైనికునికి బాజా చప్పుడు వల్ల ధైర్యం హెచ్చినట్లు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS