వెంకటపతి గురించిన ఆలోచనలతో వరూధిని ముఖం కందిపోయింది. ముక్కుపుటాలు అదిరిపోసాగినై.
వాకిటికేసి చూసిన వరూధిని ముఖకవళికలు హఠాత్తుగా మారిపోయినై. కళ్ళు మెరిశాయి. ముఖం వికసించింది. శరీరం గాల్లో తేలిపోయినట్టయింది.
"వెంకటపతి గారున్నారా?"
"లేరు కూర్చోండి. నాలుగ్గంటల్నుంచీ మీకోసమే ఎదురు చూస్తున్నాను."
"కోర్టులో నుంచి బయటపడే సరికే నాలుగున్నర అయింది. క్లయింట్సును వదిలించుకొని వచ్చేసరికి తలప్రాణం తోకకొచ్చింది" అంటూ గుర్నాథం కోటు తీసి సోఫామీద పడేశాడు.
టై వాదులు చేసుకొని సోఫాలో జారపడి వళ్ళు విరుచుకొన్నాడు.
వరూధిని ప్లేట్లో స్వీటూ, మరో ప్లేటులో హాటూ తెచ్చి గుర్నాథం ముందు పెట్టింది.
"ఇవ్వాళ మా పనిపిల్లకూడా లేదు. వంటమనిషి మూడు నెలలుగా రాలేదు"
"అయ్యో! అంటే ఒంటరిగా మీరు పనంతా చేసుకోవాలన్నమాట?"
"ఇంతకు ముందే లెండి పనిపిల్ల వెళ్ళింది. రేపొస్తుంది. తీసుకోండి" అంటూ వరూధిని లోపలకు వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి టీపాయ్ మీద పెట్టింది.
"ఎందుకండీ ఇవన్నీ? కాఫీ ఇవ్వండి చాలు. వళ్ళంతా విరగ్గొట్టినట్టుంది" గుర్నాథం వళ్ళు విరుచుకొని తనలో తనే నవ్వుకొన్నాడు.
"అనాసిస్ ఉంది ఇంట్లో ఇవ్వమంటారా?"
"అబ్బే ఏం అవసరం లేదండీ! మీరు అలానే నిలబడ్డారేం? కూర్చోండి" అంటూ గుర్నాథం హల్వా ప్యాకెట్ విప్పి స్పూన్ తో లాగి నోట్లో పెట్టుకున్నాడు.
"ఇంతకీ ఏమంటాడు శంకర్రావు?"
"ఉదయం వెళ్తే సరిగా మాట్లాడనుకూడా లేదు. ఏదో కుంభకోణం చేస్తున్నట్టుగా వుంది"
"అవతల రామనాథబాబు దగ్గర బాగా పట్టినట్టున్నాడు" బాదం హల్వా గీకిగీకి నోటికి రాచుకొంటూ అన్నాడు గుర్నాథం.
"జడ్జీగారు లంచం తీసుకొంటారనీ, ఆయనకు చుట్టమనీ అదనంగా ఏడువేలు గుంజాడు నా దగ్గర్నుంచి, మొత్తం పాతికవేలు దాటింది."
"త్రాష్టుడు! ఎట్టెట్టా?" ముక్కుమీద వేలేసుకొని నొసలు విరిచాడు గుర్నాథం.
"జడ్జీగారు ఆయనకు బంధువు కాదా?"
"అవటానికి ఏదో దూరపు బంధువే. కాని ఆయన లంచాలు తీసుకొనే మనిషికాదు. నిప్పులాంటివాడు. ఆయనగారు ఈ కోర్టుకు వచ్చినప్పటినుంచి ఈ శంకర్రావు. ఈ నాటకమే ఆడి రెండు వైపులనుంచీ గుంజుతున్నాడు. మీకేసులో అవతలనుంచి బాగా ముట్టినట్టుంది. జడ్జీగారు ఎంత లీడింగ్ క్వశ్చన్ వేసినా వీడు కేసంతా పెడమార్గాన పట్టిస్తున్నాడు. ఇదుగో ఒక్కమాట చెప్తా! మీ మనసులోనే వుంచుకోవాలి" అంటూ గుర్నాథం వరూధిని మీదకు వంగాడు.
వరూధిని వెనక్కు జరగలేకా, ముందుకు వంగలేకా గాలి బిగపట్టుకొని కూర్చుంది.
"శ్యామలాంబగారి లాయరు చంద్రశేఖరంలేడూ ఆయనేమన్నాడో తెలుసా? శంకర్రావా? నేనా శ్యామలంబ తరపున వాదించేది? అన్నాడు. పెద్ద జోక్ వేశాడనుకో!" అంటూ వరూధిని ముఖంలోకి చూశాడు గుర్నాథం.
"ఇంతకీ ఏం చెయ్యాలో చెప్పండి."
"అదే ఆలోచిస్తున్నా!" నీళ్ళు గుటకలు మింగి అన్నాడు.
"ఇందులో ఆలోచించటానికేముంది? మాకేసు మీరు తీసుకొని నడపండి"
"అట్లా వీలుపడదు. బార్ ఎథిక్స్ కు వ్యతిరేకం"
"అంటే?"
"ఒకళ్ళు చేస్తున్న కేసు మరొకళ్ళు తీసుకోవడం లాయరు వృత్తి ఒప్పుకోదు అది ధర్మవిరుద్దంగా భావిస్తారు."
"అవతలివాడు లంచాలుతిని కేసులు పాడుచేసి జనం నెత్తిన చేతులు పెడ్తుంటే, రెండో లాయరు చూస్తూ ఊరుకోవడం ఏం న్యాయమండీ? అనేం ఎథిక్స్ అండీ?" వరూధిని కంఠం తీవ్రంగా ఉంది.
"అలా తీసుకోకూడదని రూల్ లేదనుకోండి. కాని మాకు తోటి వాళ్ళతో చాలా సాధకబాధకాలుంటాయి. జనరల్ గా ఒప్పుకోరు"
"మీరు ఒప్పుకుంటారనే ఇంత ఆశపెట్టుకొన్నాను. నాకు చెయ్యకపోతే ఎవరికి చేస్తారు? ఇదే, మీ స్వంత వాళ్ళకేసయితే చూస్తూ గాలికి వదిలేస్తారా? మా నాన్నగారి దగ్గర మీ మామగారు.....కనకయ్యగార్ని అడగండి. అంతా ఆయనే చెప్తారు" వరూధిని కళ్ళలో నీరు తిరిగింది.
"శంకర్రావు మీరిచ్చిన వకాల్తా వదులుకొంటాడా?"
"ఎవడికోసం? నిముషాలమీద చేయిస్తా ఆ పని. వాడు కొట్టేయ్యాల్సిందేదో ఇదివరకే కొట్టేశాడు. నా దగ్గర ఇక ఏమీ లేదనీ రాదనీ వాడికి తెలుసు. పొద్దుట ఆమాటకూడా అన్నాడు. నీ ఇష్టమొచ్చిన లాయర్ ని పెట్టుకోండి అన్నాడు"
"ఆ మాట అన్నాడా?" గుర్నాథం ఆలోచనలో పడి అడిగాడు.
"ఆహా! ఆ మాట నలుగురైదుగురుండగానే అన్నాడు. అయ్యో మర్చిపోయా మాటల్లోపడి. కాఫీ తెస్తా ఉండండి?" అని వరూధిని లేచి వెళ్ళింది.
వంటగదిలో కాఫీ కలుపుతున్న వరూథినికి గుర్నాథం మీద అమిత విశ్వాసమూ, గురి కలిగాయి.
"ముందే ఈయన్ని లాయరుగా పెట్టుకొని వుంటే ఈ పాటికి తను కేసు గెలిచి ఉండేది. ఇప్పటికైనా తన అదృష్టం బాగుండబట్టి కనకయ్య దేవుడిలా వచ్చి చెప్పాడు. లేకపోతే తనేంకాను? గుర్నాథం నమ్మదగిన మనిషిగానే వున్నాడు. అవతల పార్టీ లాయరు చంద్రశేఖరం ఈయనకు స్నేహితుడుకూడానేమో? అతను తప్పకుండా తనకేసు గెలిపిస్తాడు. ఈ కేసు గెలిచాక ఆ శంకర్రావుగాడి పనిపట్టించాలి. ఇలా మోసం చేసినందుకు శంకర్రావుమీద ఫోర్ ట్వంటీకేసు పెట్టిస్తేనో? వాడి అంతు తేల్చుకోకుండా తను వదుల్తుందా? ఏదీ కాకపోతే హాలు దగ్గర పనిచేసే వాళ్ళచేత నాలుగు తగలనిస్తే వాడి రోగం కుదిరిపోతుంది. అంత అబగానే వుంది."
కాని....కాని.....ఆ గుర్నాథం చూపేమిటి? మాట్లాడే ధోరణికూడా అదోలా వుంది! అతని ధోరణే అంతేమో? ఏమైనా తను సహించక తప్పదు. ఎవరికోసం?
కాఫీకప్పు తీసుకొని వరూధిని వంటగదిలో నుంచి వచ్చింది. సోఫాలో గుర్నాథం లేడు. ఇంతలోకే ఎటు వెళ్ళాడు? రెండునిముషాలు అక్కడే నిలబడి చూసింది. పక్కగదిలోనుంచి సన్నగా దగ్గినట్టు వినిపించింది. తిరిగి చూసింది. గుర్నాథం పడక గదిలో మంచంమీద కూర్చొని వున్నాడు. ఓ చేత్తో తలనొక్కుకొంటూ, రెండో చేత్తో దిండు ఒళ్ళో వేసుకొని వత్తుకున్నాడు. వరూధిని స్తంభించిపోయింది!
కొద్దిక్షణాలు మాట రాలేదు. శరీరంలో అసహ్యం పారుకాడింది.
"తల తిప్పుతోంది....." తర్వాత మాటమింగి వరూధిని కేసి చూశాడు గుర్నాథం.
"కాఫీ తీసుకోండి. సర్దుకొంటుంది"
గుర్నాథం మంచంమీద కూర్చునే తెమ్మన్నట్టు చెయ్యి ముందుకు చాపాడు.
వరూధిని గదిలోకి వెళ్ళి మంచం పక్కగా నిలబడింది. కాఫీకప్పు పెట్టటానికి అక్కడ ఏమీ లేదు. గుర్నాథం చెయ్యి ముందుకు చాపాడు. వరూధిని కప్పు చివర పట్టుకొని అందించింది. గుర్నాథం కప్పు అందుకొంటూ వరూధిని కళ్ళలో కళ్ళు కలిపి చూశాడు.
"బాగా తలనొప్పిగా వుందా? బిళ్ళ ఇవ్వ,మంటారా?" వరూధిని అతని చూపులు తప్పించుకొంటూ అంది.
"ఏం బిళ్ళా?" గుర్నాథం గొంతు బొంగురుపోయింది.
"అనాసిస్, సారిడాన్ రెండూ వున్నాయి."
"వాటికి తగ్గే నొప్పికాదు" ఆగి మళ్ళీ అన్నాడు. "సరే! తే! ట్రై చేస్తా" వరూధిని గదిలోనుంచి గబగబా బయటికొచ్చింది. డ్రస్సింగ్ రూంలోఅలమారు తెరిచి "అనాసిన్"కోసం వెతకసాగింది. బ్రాందీ బాటిల్ చేతికి తగిలింది. తాగాలన్న కోర్కెను బలంగా నిగ్రహించుకొంది. నరాలు లాగుతున్నాయి. మెదడంతా కుతకుతలాడిపోతూంది.
వీడు.....ఆ కనకయ్య అల్లుడు.....అక్కుపక్షి ఆ సుబ్బలక్ష్మి మొగుడు... వీడేగా? ఆ చీమిడి ముక్కుదాని మొగుడికి ఎంత ధైర్యం? తన పడకమంచం మీద కూర్చుంటాడా? వీడి పెళ్ళాం, తల్లి, తన యింట్లో కారాలుకొట్టీ, పచ్చళ్ళు పట్టీ బ్రతికినవాళ్ళు. అక్కయ్యకు చాలని లంగాలూ, వోణీలూ ఇస్తే కళ్ళకద్దుకొని తీసుకెళ్ళి కట్టుకున్నదేగా వీడి పెళ్ళాం? గుర్నాథానికి పెళ్ళయిన కొత్తలో కనకయ్య వెంటబెట్టుకొని తమ యింటికి తీసుకొచ్చాడు. అప్పుడు ఈ గుర్నాథంగాడు గిలకలపైకి లాగు వేసుకొని, మోకాళ్ళు దిగే చొక్కా వేసుకొని మెట్లమీదే నిలబడ్డాడు. కనకయ్య చేతులు కట్టుకొని తన తండ్రి ముందెలా నిలబడ్డాడు? ఇప్పటికీ గుర్తుంది.

