'ఎవరు కదిలినా మీపాట అయితేకాని నేను మాత్రం కదలనని' రాశాను.
'వెరీ గుడ్. మంచిపిల్లవి. అందుకే నువ్వంటే నాకిష్టం' అని రాసి ఆ కాగితం కృష్ణశాస్త్రిగారు నాచేతికిచ్చారు.
రెండుపాటలు పూర్తయి మేం బయటపడేసరికి దగ్గర దగ్గర మూడుగంటలయింది. అందరం శాస్త్రిగారి కారుదగ్గరికి చేరుకున్నాం.
కృష్ణశాస్త్రిగారు నన్ను చూసి 'ఆకలేస్తుందా' అని కాగితంమీద రాసేరు. నేను వెంటనే వారి చేతిలోవున్న కాగితంమీద 'ఆకలి వేయడానికి నేనేమైనా చిన్నపిల్లనా' అని రాశాను.
'మీ ఉభయుల్ని మా ఇంటికి రమ్మని ఎన్నాళ్ళుగానో పిలుస్తున్నాను. వస్తానని నన్ను మోసగిస్తున్నావు. ఈసారి తప్పకుండా రావాలి. లేకుంటే నాకు కోపం వస్తుంది' అని రాసి నాకు చూపించేరు. అలాగే అని తలూపాను.
'శ్రీశ్రీ! అమ్మాయిని తీసుకుని మా ఇంటికి రాకూడదా. పదండి. ఇప్పుడే వెళదాం' అని రాసి కాగితం శ్రీశ్రీగారికి ఇచ్చారు.
కృష్ణశాస్త్రిగారి చేతిలో ఓ చిన్నసైజు కాగితాల పుస్తకం, పెన్నూ ఉన్నాయి.
'ఇంకోసారి తప్పకుండా వస్తాం. ఇప్పుడుకాదు క్షమించం'డని రాయడం ఈసారి నా వంతయింది.
శాస్త్రిగారిని ముందు కారులో పంపించి తర్వాత మేం బయల్దేరాం.
"కృష్ణశాస్త్రిగారు మంచి కవి కదండీ" అన్నాను.
నాకు కృష్ణశాస్త్రిగారి పుస్తకాలతో అట్టే పరిచయంలేదు, పేరు వినడమే. శ్రీశ్రీగారి దగ్గరకు వచ్చాకే నాకు పుస్తకాలతో పరిచయం ఏర్పడింది. "ఆయన మంచి కవి అని నువ్వెలా చెప్పగలుగుతున్నావు" అని అడిగారు.
"మల్లీశ్వరిలో పాటలు ఎంతబాగా రాసేరండీ" అన్నాను.
"ఓహో సినిమాపాటలు విని అంటున్నావా" అని అడిగారు.
"మరి వారి రచనలతో నాకు పరిచయం లేదండీ" అన్నాను.
నా సిన్సియారిటీకి మావారు నన్ను ఆ క్షణంలో నన్ను మెచ్చుకోకుండా వుండలేకపోయారు.
శ్రీశ్రీగారు ఎప్పుడూ మల్లీశ్వరిలో రెండు పాటలు పాడమనేవారు నన్ను. 'ఎవరే పిలిచేరల్లన మెల్లన_పిల్లల గ్రోవిని_ప్రియా ప్రియా' అనేది ఒకటి. ఆపాట వారికి చాలా ఇష్టం. కూనిరాగాలతో తరచుగా ఆపాటే పాడేవారు. రెండవది నా ఫేవరేటు పాట. 'ఎందుకే నీకింత తొందరా' అన్నదొకటి. 'పిల్లనగ్రోవి ప్రియా ప్రియా' అని నేను పాడుతూవుంటే శ్రీశ్రీగారు 'పిల్లనగ్రోవితో అని పాడు సరోజా' అని ప్రతిసారీ చెప్పేవారు. మల్లీశ్వరి పాటల ద్వారానే కృష్ణశాస్త్రిగారి పేరు నాకు బాగా జ్ఞాపకం వుండిపోయింది.
(కృష్ణశాస్త్రిగారి ప్రసక్తి వచ్చింది కనుక వారి ఆఖరి విషయం కూడా ఇక్కడే చెబుతున్నాను)
కృష్ణశాస్త్రిగారు చనిపోయిన రోజున నేను, శ్రీశ్రీగారు, మా అబ్బాయి బైజు_వెంకటరమణ జిన్నూరులో వున్నాం. అక్కడ నిరీశ్వరాశ్రమం వార్షికోత్సవ సభలో పాల్గొనడానికి వెళ్ళాం అన్నమాట. (మేం ప్రయాణంలో వుండగానే శాస్త్రిగారు చనిపోయారు.)
అక్కడ మమ్మల్ని ఆదరించిన మిత్రుల పేర్లు జ్ఞాపకం లేకపోయినందుకు విచారిస్తున్నాను.
పేర్లయితే మరిచిపోయాను కాని మంచిది మారు పేరనుకొనే ఆ భార్యాభర్తలిద్దరూ తలుచుకున్నప్పుడల్లా నా కళ్ళముందు మెదులుతూ వుంటారు. వారి రూపాలు మరిచిపోలేదు. ప్రాణం పెట్టేరు. నేను ఎన్నో ఊళ్ళు తిరిగాను కానీ వాళ్ళని మాత్రం మరిచిపోలేదు.
శ్రీశ్రీగారు అలవాటు ప్రకారం పెద్ద టర్కీ టవల్ కట్టుకుని వరండాలో వున్న వాలుకుర్చీలో నడుం వాల్చారు. నేను లోపల వున్నాను.
"సరోజా" అని కేకవేశారు.
"ఏమిటండీ" అంటూ వచ్చాను.
"సిగరెట్ పెట్టె తీసుకురా" అన్నారు.
ఇచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళబోయాను.
"కూర్చో సరోజా" అన్నారు.
ఇంతలో ఒక కుర్రవాడు వారిని చూడటానికి వచ్చాడు. నేను లేవబోయాను. "ఫరవాలేదు కూర్చో" అన్నారు. ఆ కుర్రవాడు నాకు కూడా నమస్కారం చేశాడు. నేను ప్రతి నమస్కారం చేశాను.
అతను శ్రీశ్రీగారిని చూసి "ఉదయం ప్రాంతీయ వార్తలు విన్నారా" అని అడిగాడు.
శ్రీశ్రీగారు వెంటనే అనుమానంగా చూస్తూ_"లేదు ఏమిటీ సంగతి" అని అడిగారు.
"కృష్ణశాస్త్రిగారు హైదరాబాదులో చనిపోయారండీ" అన్నాడు.
అంతే ఒక్కక్షణం ఏమీ మాట్లాడలేకపోయారు. తేరుకుని "శాస్త్రిగారు హైదరాబాదులో మరణించడం ఏమిటి? ఆయన మద్రాసులో కదా వున్నార"ని అడిగారు.
పాపం ఆ కుర్రాడు తొట్రుపాటుతో "హైదరాబాదు వార్తల్లో విన్నాను" అన్నాడు.
శ్రీశ్రీగారు ఈసారి ఓ అయిదు నిముషాలదాకా మాట్లాడలేదు. వారు ఏమైనా చేబుతారనుకున్న ఆ కుర్రవాడు వారి మౌనం చూసి నిరుత్సాహంతో వెళ్ళిపోయాడు.
హఠాత్తుగా విన్న కృష్ణశాస్త్రిగారి మరణవార్త నన్ను ఎంతో బాధపెట్టిందో అంతగానూ భయపెట్టింది. అసలే వేదాంతం పుట్టని, ఎంత గొప్ప వాళ్ళయినా అంతేకదా అనుకుంటూ కళ్ళవెంట నీళ్ళు పెట్టుకుని నిర్ఘాంతపోయి కూర్చున్నాను.
శ్రీశ్రీగారు రెండు, మూడుసార్లు పిలిచినట్లున్నారు. నా బుర్రకేమీ ఎక్కలేదు. బాగా పరిచయం వున్న వారి మరణవార్త నన్ను బాగా కృంగదీసింది.
పిచ్చి పిచ్చి ఆలోచనతో నేను మునిగిపోయి వుండటంతో ఇక నన్ను పిలిచి లాభం లేదనుకున్నారో ఏమో"సరోజా" అంటూ వీపుమీద ఒక్క చరుపు చరిచేరు.
"ఏమిటండీ" అన్నాను తృళ్ళిపడి.
"వెళ్ళి కాగితం ,పెన్నూ పట్టుకురా" అన్నారు.
వెంటనే వెళ్ళి తీసుకు వచ్చాను.
అయిదు నిముషాలైనా సమయం తీసుకోలేదు. నాలుగే నాలుగు పాదాలు రాసి నా చేతికి ఇచ్చి "చదువు సరోజా" అన్నారు.
