Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 83


    "తర్వాత వారు మాటల్లో పడ్డారు. ప్రతి సాయంత్రం అక్కడకుపోయి ఆమెతో కాలం గడపడం అలవాటయిపోయిందతనికి. ఆమె జాణతనంగా, నవ్వులతో అతని చేత ఎక్కువగా తాగించి వ్యాపారం వృద్ధిచేసేది. కాని నానాటికీ ఇతడు మాత్రం ఆమె ఎవరో తెలియకపోయినా, ఆమె జీవితమేమిటో ఎరుగకపోయినా, ఆమె మాత్రమే తాను చూచిన ఆడది కావడంవల్ల దృఢానుబంధం వహించాడు.
    "ఇట్టి అమాయకుణ్ని లోబరుచుకుంటే చాలా లాభాలుంటాయని ఆ మనిషి కూడా గ్రహించింది. ఏం చేస్తే వీడు మనచేతిలో పడతాడా అని ఆలోచించింది. పెళ్ళి చేసుకోవడమే సులువయిన మార్గమని నిశ్చయించింది.
    "సునాయాసంగా ఈ పని నెరవేర్పిందామె.
    "ఇక నేను వేరే చెప్పనక్కరలేదు. పెళ్ళి అయిన దగ్గరనుండీ ఈమె విచ్చలవిడిగా సిగ్గులజ్జలు వదలి ప్రవర్తించింది.
    "స్త్రీ సహజమైన మాయదారితనంతో ఈమె మర్యాదగల భర్తను మోసగిస్తూనే ఆనందించేది. అతని తోడి గుమాస్తా లందరితోనూ పోయింది నమ్మండి. అందరితోనూ! సాక్ష్యంగా ఉత్తరాలున్నాయి. అచిరకాలంలో ఊరంతా గుప్పుమన్నది. ఇట్టి విషయాలకు మామూలేగా. భర్తకు మాత్రం ఈ సంగతి తెలియలేదు.
    "తుట్టతుదకీ కులట ధనాశచేత కావచ్చును. భర్త యజమానియొక్క కొడుకును వశపరుచుకుంది. ఆ కుర్రాడికి పందొమ్మిదేళ్ళ వయస్సు. ఈమె మాయలలో పూర్తిగా పడిపోయాడు. ఇన్నాళ్ళూ అదేపోయిందని కళ్ళు మూసుకున్న లాంగ్లే తన కొడుకు పాడయిపోతూండడం కనిపెట్టి నొచ్చుకున్నాడు.
    "కాని ఒక తప్పు చేశాడతడు. వెంటనే జీన్-నికొలాస్ ని పిలిపించి కోపమంతా అతనిముందు వెలిగ్రక్కేడు. "ఇక మరేమీలేదు. చనిపోతున్న బాంగ్లే నోటినుండి వెలువడ్డవీ, పోలీసు వుద్యోగి రికార్డు చేసినవీ నాలుగు మాటలు చదువుతున్నాను.
    "నా కొడుకు నిన్ననే పదివేల ఫ్రాంకులు దానికిచ్చినట్లు తెలిసి కోపం పట్టలేకపోయాను. జీస్-నికొలాస్ అంటే నాకెప్పుడూ గౌరవమే. అయినా అతని గుడ్డితనమే ప్రమాదించింది.
    అతనికి కబురు పెట్టించాను. రాగానే, నీ వుద్యోగం తీసివెయ్యవలసి వచ్చిందని చెప్పాను.
    "ఎదురుగుండా కలవరపాటుతో నిలబడ్డాడు. అతనికేమీ అర్థం కాలేడు. కారణం చెప్పమని తీవ్రంగా అడిగాడు.
    "నీకే అవమానం కాబట్టి నేను చెప్పనన్నాను. అంటే అతనిలోని ఏవో లోపాలు నేను చెప్పడం మానుకున్నాననుకొని ప్రార్థించాడు. గద్దించి కూడా అడిగాడు.
    "అప్పటికీ నేను మాట్లాడలేదు. శ్రుతిమించిపోయింది. నన్ను అవమానిస్తూ మాట్లాడాడు. తన్నుకోవడందాకా వస్తుందేమో అనిపించింది.
    "ఇంతలో ఒకమాట కష్టం కలిగించింది నాకు. ఇక సహించలేక నిజం అతని మొగం మీదకి విసిరివేశాను.
    "కొన్ని క్షణాలదాకా చిత్రంగా చూసి నిలబడిపోయాడు. పిదప నా డెస్కు మీద రిజిస్టర్లు కత్తిరించే పొడుగాటి కత్తెర తియ్యడం చూశాను. ఎత్తిన చేతితో నామీద విరుచుకుపడ్డాడు. నా గొంతుకలో రొమ్ముకు మీదుగా ఏదో దూరినట్లయింది. ఏమాత్రం బాధనిపించకుండా.
    "న్యాయమూర్తులకు నేనేమీ ఇక చెప్పనక్కరలేదు. ఈ కేసులోని సంగతి సందర్భాలన్నీ యింతే. ఇవే యితణ్ని రక్షించగలవు. ప్రధమ భార్యను న్యాయంగా ఎట్టి భక్తితో విశ్వసించాడో అదే భక్తితో రెండో పెళ్ళాన్ని కూడా గుడ్డిగా నమ్మాడు"
    కొంత చర్చ సాగిన తర్వాత ముద్దాయిని విడుదల చేశారు.

                                     * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS