ఇంటికి వస్తోన్న రిక్షాను మళ్లించింది వరూధిని. లాయరు గుర్నాధం ఇంటి ముందు రిక్షా దిగింది.
కార్లో కూర్చొని కోర్టుకు వెళ్ళబోతున్న గుర్నాధం వరూథిన్ని ఓ క్షణం సాలోచనగా చూశాడు. సాగిన కారాపించి గుర్నాధం దిగినిలబడ్డాడు.
వరూధిని గుర్నాథాన్ని చూస్తూ ఏం మాట్లాడాలో తోచక అలాగే నిలబడి పోయింది.
"ఏవండీ? మామయ్యగారు లేరే! పొద్దుటే ఊరేళ్ళారు." గౌరవాన్ని వలకబోస్తూ చెప్పాడు.
"కాదు మీ కోసమే వచ్చాను."
"నా కోసమా! ఏమిటి విశేషం?" చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు నొసలు విరిచి.
"మా వ్యాజ్యం సంగతి మాట్లాడాలి."
"మా మామగారు కలిశారా?" ఏదో పొరపాటు జరిగినట్టుగా అన్నాడు.
"అవును! ఆ విషయంలో మీ సలహా తీసుకొందామని వచ్చాను."
"అదెలాగమ్మా! ఒకళ్ళ కేసులో మరొకళ్ళు తలదూర్చటం....."
"అయినా మీకు తప్పదు, కనకయ్యగారితో మాకున్న సంబంధాన్ని పట్టి మీకు తప్పదు." చొరవ తీసుకొని అన్నది వరూధిని.
గుర్నాధం నవ్వుకొని తల ఎగరేశాడు.
వాచీ చూసుకొని "టైం అయిపోయింది. ఇప్పటికే అర్ధగంట ఆలస్యం అయిపోయింది. సాయంకాలం కోర్టునుంచి రాగానే చూద్దాం." అన్నాడు.
"ఐదుగంటలకు రమ్మంటారా?"
"మీరిక్కడికి వద్దులెండి. ఆ శంకర్రావు వట్టి దరిద్రుడు. నేనే వస్తా మీ ఇంటికి."
"తప్పకుండా వస్తారుగదూ?"
గుర్నాధం తలెగరేసి కారెక్కాడు.
39
ఆ రోజు సాయంకాలం నాలుగ్గంటలనుంచీ వరూధిని గుర్నాథంకోసం ఎదురు చూడసాగింది.
"అమ్మగారూ నే వెళ్ళొస్తా!" అంటూ పనిపిల్ల కమల సంచిపట్టుకొని వరూధిని ముందుకొచ్చింది.
"అదేవిటే? ఎక్కడికి?"
"నిన్న చెప్పానుగదమ్మా మనువులోరొస్తున్నారని?" సిగ్గుపడింది కమల.
"అదేమిటే? ఇప్పుడెల్తే ఎలా? లాయరుగారొస్తారే! కాఫీ టిఫిన్ చెయ్యాలి. నువ్వెల్తే ఎలాగే మరి?"
"మా అమ్మ రమ్మంది. రేపొద్ధున్నే పెళ్ళి చూపులు కొస్తారంట." తలవంచుకొని చెప్పింది కమల.
"ఆముసల్ది బుచ్చమ్మ మనమడి పెళ్ళికని వెళ్ళి మూన్నెల్లయింది. ఇంతవరకూ అయిపూ అజాలేదు. ఇంతకాలం తిని బాగా కొవ్వెక్కింది. కాస్త తిండి తక్కువయేసరికి ఉడాయించింది. దొంగముండ! ఈసారి రానియ్! కాళ్ళిరగ్గొట్టి బజార్లోకి నెట్టిస్తా. నువ్వుకూడా వెళ్తే ఎలాగే!"
"రేపు సాయంకాలానికి వస్తాగదమ్మా!"
"అదీ ఇట్టాగే చెప్పేపోయింది. అసలు మీ జాతినే నమ్మకూడదే. నాలుగ్ డబ్బులాడకపోతే మీ పుట్టంతా మునిగినట్టు ఏడ్చుకుంటారు. ఏవేఁ ? అసలు ఇదెన్నో సారే? నువ్వు మనువులని నాగాలు పెట్టటం?"
"ఏం చెయ్యమంటారమ్మా? రెండు సంబంధాలు నాకునచ్చలేదు. రెండేమో......ఆ పెళ్ళి కొడుకులు సైకిళ్ళూ వాచీలూ కావాలన్నారు. మా అయ్య దగ్గిరేముందమ్మా ఇయ్యటానికి?"
"రెండు సంబంధాలు నీకు నచ్చలేదా? ఎందుకే? కుంటోళ్ళా? గుడ్డోళ్ళా?"
"ఆఁ వట్టి పల్లెటూరి మనుషులమ్మా. వంటిమీద గుడ్డకట్టుకోవడం కూడా రాని అడవిమనుషుల్లా ఉంటే ఎవరిష్టపడతారమ్మా?" కళ్ళు, తిప్పుకొంటూ చెప్పింది కమల.
వరూధిని పనిపిల్లకేసి చురచురా చూసింది. దీనికెంత నాగరికత బలిసిపోయింది? ఎంత అహంకారం?
"నీకు బస్తీనీళ్ళు వంటబట్టినయ్యే! పొగరుకూతలు కూయకుండా ఇంత తిండి పెట్టేవాడ్ని చూసి చేసుకో."
"ఒహళ్ళు నాకు పెట్టేదేంటమ్మా? నా కష్టం నేనే తింటాను. అట్టాంటి ఎద్దు మొద్దోళ్ళను ఛస్తే చేసుకోను. నాకు పెళ్ళి కాకపోయినా సరే!"
వరూథినికి దాని ధోరణిచూస్తే వళ్ళు మండిపోయింది. ఇది బాగా షోకులు మరిగింది. ఇక మొగుడితి కాపరం ఏం చేస్తుందీ? కూటికిలేక అల్లాడుతున్నదాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొంది. ఎనిమిదేళ్ళ క్రితం చిరిగిన బట్టల్తో ఎముకలగూడులా, నల్లగా మురికిదారంలా వున్న దాన్ని తీసుకొచ్చి, దాని అమ్మా, అయ్యా కాళ్ళా వేళ్ళా పడితే తనింట్లో పెట్టుకొంది. బాబునైనా ఎత్తుకు తిప్పుతుందని దాన్ని ఇంట్లో పెట్టుకోడానికి తను ఒప్పుకొంది. ఇప్పుడది ఏపుగా అరటిచెట్టులా పెరిగింది. పిల్ల వళ్ళుచేసి నవనవలాడుతూంది. తన ఇంట్లో తన కళ్ళముందు పెరిగి పెద్దదయిన పిల్ల అలా మాట్లాడుతుంటే ఆశ్చర్యం వేసింది వరూధినికి.
"అయితే ఇలా రావే. హోటలు కెళ్ళి స్వీటూ హాటూ పట్టుకురా. కాఫీ నేనే చేసుకొంటాలే. ఆయనగారొచ్చే వేళయింది." అని వరూధిని డబ్బు తెచ్చియిచ్చింది.
"రేపు సాయంకాలానికి వస్తావుగదే? అన్నది వరూధిని పదిరూపాయలనోటు పనిపిల్ల చేతిలో పెడ్తూ."
"తప్పకుండా వస్తానమ్మా!" సంతోషంగా అంది కమల.
"ఇంకేమొస్తావే నీ బొంద! ఆ మూడుముళ్ళూ పడగానే ఆకట్టుకొన్న వాడి వెంటపడిపోతావ్!" నవ్వుతూ అంది వరూధిని.
ఆ నవ్వు వెనకాల నుంచి విచారం తొంగి చూసింది.
"అదేంటమ్మగారూ, మిమ్మల్నొదులుకొని నేనెక్కడికి పోతానమ్మా? ఆడ్ని కూడా ఈడకే తీసుకురానూ! వాడ్ని కూడా మనహాలు దగ్గిర గేట్లోనో, సినిమాహాలు బండితోలడానికో పెట్టేయండమ్మా!"
వరూథిని హృదయం ఆర్ద్రమైంది.
"నీకున్న విశ్వాసం ఆ ముసలిముండకు లేదే! ముఫ్ఫై ఏళ్ళగా మాఇంట్లో తిని బతికింది. ఇప్పుడు చూడవే అంతు లేకుండా పోయింది."
"మీరేమన్నా అనండమ్మా ఆ బుచ్చమ్మంటే నాకు మొదటినుంచీ ఇష్టం లేదు. మీమీదే ఎన్నెన్నో చెప్పేది."
"ఏం చెప్పేదే?" రోషంగా అడిగింది వరూధిని.
"అదేనమ్మా! ఆ రామనాథబాబు, డి.యస్.పి. గారూ వచ్చేరోజుల్లో ఎదురింటివాళ్ళతో పక్కింటివాళ్ళతో గుసగుసలు చేసేదమ్మా!"
"ఇన్నాళ్ళనుంచీ నాకెందుకు చెప్పలేదే? దాని చెమడా లొలిపించేదాన్ని రానియ్ చెప్తా దాని పని?"
"ఆవిడంటే మీకు పంచప్రాణాలు గదమ్మా? ఆవిడ నన్నెక్కడ నిలవనిచ్చేదమ్మా?"
"ఏడ్చావులే నువ్వుకూడా దాంతోనే చేరివుంటావు. ఎవరు చూశారు?"
"అట్టా ఒక్కనాటికీ అనుకోవద్దమ్మగారూ? నే వెళ్ళొస్తా!"
"సరే ఫో! త్వరగా టిఫెన్ పట్టుకొచ్చేయ్. రేపు సాయంకాలానికన్నా తప్పకుండా రా!"
"అట్నే అమ్మగారూ?" పనిపిల్ల వెళ్ళిపోయింది.
వరూధిని స్నానంచేసి వెంకటగిరి తెల్లజరీ చీర కట్టుకొంది. జడ వదులుగా అల్లుకొంది. వాకిట్లోకి రెండు'సార్లు వచ్చి తొంగిచూసి వెళ్ళింది. ఆరు దాటింది. అయినా గుర్నాధం రాలేదు.
అసలు రాడేమో? మొహమాటంతో అలా చెప్పాడేమో? ఈయనా లాయరేగా వాళ్ళకూ వాళ్ళకూ ఏవేవో సంబంధాలు ఉండనే ఉంటాయి. తను ఇంటికి వస్తానంటేనే భయపడ్డవాడు రేపు కేసు ఎలా చేస్తాడు? ఇప్పుడు కాకపోతే రేపు తెలియదా శంకర్రావుకు? అయినా గుర్నాథంతో తనకున్న పరిచయం ఎంత? కనకయ్య చెప్పిన వెంటనే తను గుర్నాథంతో మాట్లాడితే బాగుండేదేమో? మామ మాట అల్లుడు తోసేయలేక పోయేవాడు. తను చాలా పొరపాటు చేసింది. కనకయ్య ఊర్నిం'చి వచ్చాడేమో? కబురుచేస్తే? అన్నట్టు ఈ మనిషేడీ? ఎక్కడ చచ్చినట్టు? తిని పోయినవాడు మళ్ళీ తిండికేనా ఇంటికి చేరడేం? ఛీ!ఛీ! ఏం మనిషీ? తానింత అవస్తపడ్తూంటే ఆబోతులా తిని ఊరిమీద బలాదూరు తిరుగుతాడా?

