Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 83

                                   

                 


    "దీనికి  అంతం ఎక్కడ సరోజా! చెప్పుకుంటూ  పోతే ఏళ్ళూ  వూళ్ళూ  చాలవు. నీకు ఎంత చెప్పి ఏం ప్రయోజనం? చెవిటివాడి చెవిలో  శంఖం వూదినట్టే! నువ్వు దేవుడ్ని  నమ్ముతావు. నేను మనిషిని నమ్ముతాను. మనిషిలో అంతర్గమైన  మంచితనాన్ని  నమ్ముతాను.
    మన హక్కుల్ని  నాశనం  చేస్తామంటే  నేను  సహించను. వాటిని రక్షించుకోడానికి  నేను పోరాడతాను" అని శ్రీశ్రీగారు చెప్తూ వుంటే...
    "ఏమిటండీ మీ ఆవేశం? మీరు పోరాటాల్లో  పాల్గొంటారా?" అని అడిగాను.
    "అంటే నీ ఉద్దేశం ఏమిటి? నేను కత్తులూ, కటార్లూ పట్టుకోలేను సరోజా! నేను కవిని. నా ఆయుధం కలం. దానితోనే పోరాటం సాగిస్తాను" అన్నారు.
    ఏవండీ! నేను మీ జీవితంలో  ప్రవేశించిన  తర్వాత మీ కవిత్వానికి  నావల్ల  ఏదైనా అంతరాయం  కల్గిందేమోనని  అప్పుడప్పుడు  బాధపడుతూ వుంటానండి. నా వల్లే మీరు ఈ సినీప్రపంచంలో  కూరుకుపోయారని, సినిమాకి అమ్ముడుపోయారని  కూడా కొంతమంది  అభిప్రాయపడుతున్నట్టు విన్నాను_" అని చెప్పాను. నా మాటకు ఆయన. "నీకెన్నిసార్లు  చెప్పాలి సరోజా! లోకులు  కాకులు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు  అనుకుంటారు. మనమేం చెయ్యలేం. నువ్వు బాధపడితే వాళ్ళు అనడం మానేస్తారా? అంతెందుకు? నువ్వీ ఫీల్డుకిచ్చిన కొత్తలో  మనల్ని  ఎంతమంది ఎన్ని అనలేదు?
    నువ్వు రాకముందే నేను ఈ ఊబిలో  ఇరుక్కుపోయాను. బ్రతకడానికి ఏదో ఒక పని చేయాలి. ఏదైతే ఏమిటి? ఇది మాత్రం  పని కాదా? ఇందులో వుండి  మన లక్ష్యాన్ని  సాధించలేమా? పైగా సినీ ప్రపంచానికి అమ్ముడుపోవడం అన్నమాట  నేను ఒప్పుకోను. ఎవరూ  ఏ ఉద్యోగానికీ అమ్ముడుపోలేదు.
    అమ్ముడుపోవడం, కొన్నుక్కోవడం  అన్నది సినిమాలకే పరిమితంకాలేదు. సినిమాను తిట్టి ప్రయోజనంలేదు. దాన్ని ఆయుధంగా  వాడుకోవాలి.
    అదీగాక, నా కవిత్వానికీ, సినిమాకీ ఏమిటి సంబంధం ? నేను ఇందులో వుంటూ మానేశానా? ఆ ఆరోపణ ఆధారరహితం. నేను అంగీకరించను. కొత్త రచనలు  చేస్తూనే వున్నాను.
    నిజమైన లక్ష్యవాది  ఏ వృత్తిలో వున్నా  అతడనుకున్నదానికి, చెయ్యదలచుకున్నదానికి, చెప్పదలచుకున్నదానికి  ఆ వృత్తి  ఎంతమాత్రం అడ్డుకాదని  నేను ఘంటాపధంగా  చెప్పగలను.
    రచయిత  తన రచనలమీద  బ్రతికే పరిస్థితి  ఇంకా  రాలేదు సరోజా! రచయితయినా, కళాకారుడయినా  ఎవడి కాళ్ళమీద వాడు నిలబడగల  గాలి. ఆర్ధిక ఇబ్బందులు  లేకుండా  బ్రతకగలగాలి.
    నా గ్రంథాలమీద  నేను  బ్రతకలేకపోతున్నాను. నేను ఈ మాత్రం అయినా పాటలు రాయకుంటే  మన పొయ్యిలో పిల్లులు  కాపురం  పెడతాయి. ఈ ఊబిలో  నుండి బయట పడాలనే  ఆవేదన నాకూ వుంది.
    అయినా_సినిమా  మీద చిన్న చూపుగలవాళ్ళను  నేను సమర్ధించను. సినిమా అనేది కళలయొక్క  సముదాయం. అందులో  కూడా చాలా వరకు నా దృక్పథం నుంచే రాస్తున్నాను.
    అనే వాళ్ళ నోళ్ళని అరికట్టలేం.
    నేను మహాప్రస్థానం  రాసిన రోజుల్లో అది 'కవిత్వం కాదు, నినాదం' అన్నారు. ఇరవై సంవత్సరాల తర్వాత దానిని  కవిత్వంగా  అంగీకరించారు. కల్లోలం పెరిగిన కొద్దీ దూరం తగ్గిపోతుంది. ఇది ఈనాటి వాస్తవికత.
    నాలాగే  ఆవేదన  పడుతున్న వాళ్ళూ  ఇంకా కొద్దిమంది వున్నారని కూడా నాలు తెలుసు. ఈ వ్యవస్థ ఇలాగే వుండిపోదనీ, దీన్ని  మార్చగలం అని, నేనూ, వాళ్ళూ కూడా నమ్ముతుండడం  వల్లనే  ఇంకా ఈ ఫీల్డులో వున్నాను.
    అది కూడా చూసేస్తాను. తర్వాత మనం విశాఖపట్నం వెళ్ళిపోదా అక్కడ సముద్రపుటొడ్డున  ఒక చిన్న  స్థలం కొంటాను. అందులో చిన్న కుటీరం కట్టుకుందాం. దానికె_'నిరీశ్వశ్రమం' అని పేరు పెడతాను.
    మన పిల్లల్ని అక్కడే చదివించుదాం. విశాఖలో  స్థలం  దొరికితే  సంతోషం. లేక విశాఖకి  కొద్ది దూరంలో  దొరికినా  కారు కొని, వాళ్ళని కార్లోనే స్కూలుకి పంపుదాం.
    మన రిటైర్డ్ లైఫ్ ని నేను పుట్టిన  విశాఖలోనే  హాయిగా  గడుపుదాం. మనకెందుకీ అరవదేశం? ఉన్నంత కాలం ఉన్నాం చాలు. చలసాని ప్రసాద్ నాకు సముద్రపు ఒడ్డున  స్థలం చూస్తానని, తీసుకుందామని చెప్పాడు. మనం అక్కడికి పోదాం.
    నేను హాయిగా  నీ రక్షణలో వుండి, రాయదలచుకున్నవి రాస్తాను. నేను రాయవలసినవి చాలా వున్నాయి.
    నా జీవితంలో చివరి  కోరికకూడా అదే. విశాఖలోనే  సెటిల్ అవ్వాలి. ఈ విశాల విశ్వంలోని  విశాఖపట్నంలో  నేను పుట్టాను. విశాఖపట్నాన్ని  కౌగిలించుకోవడం అంటే విశాఖ విశ్వాసాన్ని  నా అక్కున చేర్చుకోవడమనే  నా భావన.
    విశాఖపట్నం  ఎప్పుడు  పుట్టిందో  నాకు తెలియదు. కానీ, నేను మాత్రం 1910 లో  విశాఖలో  పుట్టాను. అప్పటినుండి  నేనూ, విశాఖపట్నం కలిసే పెరుగుతూ వచ్చాం. నేనే విశాఖని  దూరం చేసుకున్నాను. అయినా విశాఖ జ్ఞాపకాలని మాత్రం నేను మరచిపోలేదు.
    నువ్వు కూడా విజయనగరం  పిల్లవేగా?" అని అడిగారు.
    అంతవరకూ  వారి మాటలలో  మునిగిపోయిన  నేను ఉలకలేదు, పలకలేదు.
    "ఏమిటాలోచిస్తున్నావు  సరోజా?" అని అడిగారు.
    "ఏం లేదు_కానీ ఎక్కడి నుండి వచ్చారు? 70 నుండి 60 కి అక్కడి నుండి 10కి...మళ్ళీ అలా అలా వాయువేగ మనోవేగాలతో  పయనిస్తున్నారే! షష్టిపూర్తితో  ఆవరించిన ఆవేశం  ఇంకా తగ్గలేదా?
    విశేషాలు  చెప్పమంటే  మీ లోకంలో  మీరు రౌండ్ కొట్టేసి  వచ్చేశారు. అయ్యబాబోయ్_ఏమిటండి  మీ ఆవేశం? ఒళ్ళంతా  గగుర్పొడుస్తోంది" అన్నాను.
    "సరేకానీ_నేనడిగిన  దానికి  సమాధానం చెప్పు. విశాఖపట్నానికి మకాం మార్చేదాం, వస్తారా?" అని అడిగారు.
    "ఏమిటా అర్ధంలేని ప్రశ్న ? మీరు లేకుండా ఇక్కడ నాకు మాత్రం ఏమిటి పని? మీరెక్కడ వుంటే  మీతోపాటు నేనూ అక్కడే  వుంటాను. కానీ విశాఖ సన్మానం విషయాలు చెబుదురూ" అన్నాను.
    చాలా  విషయాలు చెప్పారు. ఆశ్చర్యపోయాను.
    ఇంతలో వీధి తలుపు  చప్పుడయింది. 'ఎవరా' అని వెళ్ళి చూశాను.

 

                          *    *    *


                               కృష్ణశాస్త్రి గురించి శ్రీశ్రీ


    కంపెనీ  కారు వచ్చింది.
    "రేపు ఉదయం దీపక్ గారు డైరెక్టు చేస్తున్న  పిక్చర్ కి  గోల్డెన్ స్టూడియోలో  పూజ జరుగుతుంది. మిమ్మల్ని తప్పకుండా రమ్మన్నారు. కృష్ణశాస్త్రిగారు  కూడా  వస్తున్నా"రని చెప్పి  మేనేజర్ వెళ్ళిపోయాడు.
    "వెళదామా" అన్నారు శ్రీశ్రీగారు.
    కృష్ణశాస్త్రిగారిని  చాలాసార్లు చూశాను. వారితో బాగా పరిచయం  కూడా వుంది. "మనం పూజకి ఎందుకండి. మీరు పాటరాయలేదుగా" అన్నాను. "రాయకపోవటం  ఏమిటి సరోజా. ఎప్పుడో రాసేశాను. కృష్ణశాస్త్రిగారు వస్తున్నారంటే  వారు కూడా రాసివుండాలి. ఏపాట  రికార్డింగో  తెలీదు" అన్నారు.
    "అయితే నేనూ వస్తాను. కృష్ణశాస్త్రిగారిని  మరోసారి  చూడొచ్చు" అన్నాను.
    మర్నాడు  తొమ్మిదిన్నరకి మేమిద్దరం  మా అబ్బాయీ బైజుని  మా పెద్దావిడ దగ్గర వదిలేసి స్టూడియోకి వెళ్ళాం. మేం వెళ్ళేసరికి  అందరూ వచ్చేశారు. నేను తిన్నగా కృష్ణశాస్త్రిగారి దగ్గరికివెళ్ళి  నమస్కారం  చేశాను. 'బాగున్నారా' అన్నట్లు సౌంజ్ఞచేస్తూ కుర్చీ చూపించేరు.
    శాస్త్రిగారికి ఇరువైపులా  నేనూ శ్రీశ్రీగారు కూర్చున్నాం.
    పూజ  అయిపోయింది.
    రికార్డింగ్ ప్రారంభమైంది. ఎవరిపాట ముందు తియ్యాలనే సమస్య.
    "నీపాట  ముందని శాస్త్రిగారంటే  మీపాట ముందు కానివ్వండని  మావారు" చివరికి ఎవరిపాట  ముందయినా రెండోవారి  పాట  అయితే  కాని వున్న చోటనుండి  కదలడానికి  వీలులేదని  శాస్త్రిగారు కాగితంమీద రాసి శ్రీశ్రీగారికిచ్చేరు. అది చదవమని మావారు  నాచేతికిచ్చారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS