Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 82


                                    హంతకుడు

    ముద్దాయి పక్షాన వాదిస్తున్న వకీలు వయస్సులో
    చిన్నవాడు. అదే అతని మొదటి కేసుకూడా. అతడీ
    విధంగా మాట్లాడాడు.
    "న్యాయమూర్తులకు నేను విన్నవించేదేమేంటే-ఈ కేసులోని సంగతులన్నీ నిజమని ఒప్పుకోవాలి. ముద్దాయి మర్యాదగల మనిషి.  చేస్తున్న ఉద్యోగంలో వేలెత్తి చూపించుకోకుండా నడుచుకున్నవాడు. నెమ్మదీ, దయ, శాంతం కలవాడు. అటువంటి వాడు తాత్కాలిక కోపోద్రేకం వల్ల తన యజమానిని హత్యచేశాడు. అగమ్యగోచరంగా తోస్తుంది మనకీ విచిత్రం! ఇందులోని 'సైకాలజీ' నన్ను బోధపరచనిస్తారా? దేన్నీ దాచకుండా, దేన్నీ క్షమించకుండా బయలుపరుస్తాను. ఆ పిమ్మట మీరే తీర్పు చెప్పండి.
    "జీన్-నికోలాస్ మర్యాదగల కుటుంబంలో పుట్టినవాడు. అతని తల్లిదండ్రులు మప్పితంగా, భయభక్తులతో అతన్ని పెంచారు.
    "అక్కడే ఉన్నది అతని నేరం...భయభక్తులలో! ఇవి మనలో నశించాయి. ఈ మాటలు మాత్రం మిగిలి వాటిలోని అర్థం హరించుకుపోయింది. నిజమైన భయభక్తులు కనుక్కోవాలంటే పల్లెటూళ్ళలోని కొన్ని కుటుంబాలలో చూడాలి. అది మూఢవిశ్వాసమే అనండి. కాని ఆ భక్తికి తిరుగులేదు. దేన్నైనా నమ్మితే అందులో ఏమైనా దగా ఉంటుందేమో అనే అనుమానం కూడా లేదు.
    "ఈ భయభక్తులు లేనివాడు పెద్దమనిషే. అన్నిరకాల భయభక్తులున్నవాడు కళ్లు మూసుకుని సంచరిస్తాడు. అంటే అన్నీ నమ్ముతాడు. మనం మాత్రం కళ్లు వెడల్పుగా విప్పుకొని తిరుగుతాము. ఈ కోర్టు భవనం చూడండి. సంఘపు కుళ్లు కాలువ కాదా యిది? సంఘంలోని చెత్త అంతా ఇక్కడే చేరుతుంది. అన్నిరకాల కథలూ మన చెవుల్లో పడక తప్పదు. అవినీతి, అత్యాచారం, క్రౌర్యం, ఒకటేమిటి-మనుష్యులలో పొడచూపే అన్ని దుర్గుణాలూ ఇక్కడ చర్చకు వస్తాయి దుర్మార్గులందరినీ. మహారాజులు మొదలు పాత దొంగల వరకూ - మేము సమర్థించాలి. ప్రతి దోషినీ మీ యెదుట నిలిపి జాలితో, చిరునవ్వులతో, బూకరింపులతో వారి పక్షం వాదించాలి. కళ్ళారా వీటన్నిటినీ చూస్తున్నప్పుడు మన మనస్సులలో భయభక్తులకు స్థానం మిగులుతుందా? సంఘంలో అత్యున్నతుల మనుకున్న వారి నుండి అడుగున పడిగిన నీచాతి నీచులదాకా ఈ అవినీతి ప్రవహిస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలుసును. అన్నీ కుళ్లిపోతాయనీ, అన్నీ అమ్మకమై పోతాయనీ మనకు తెలుసును. ఉద్యోగాలు, పదవులు, గౌరవాలు అన్నింటినీ ధనం కొంటుంది. కాదా అని బిరుదులకో, ఇతర ఆశలకో వశ్యమౌతాయి.  ఇంకా సూక్ష్మంగా పోతే స్త్రీలకు వినిమయమౌతాయి. నిజం. వీటిని కాదనలేము. కళ్లు మూసుకోలేము. అందరూ దొంగలే. అందరినీ అనుమానించాలి. కాని ప్రస్తుతపు ముద్దాయివలె ప్రపంచము తెలియని భయభక్తులకు బలికావడానికి సిద్ధపడిన వారిని చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.
    "న్యాయమూర్తులారా! మనమంతా గౌరవపరులమే కావచ్చును. ఎందువల్లనంటే మురికిని దగ్గరకు చేరనియ్యం. మంచి దుస్తులు ధరిస్తాం. దుష్కార్యాలంటే అసహ్యించుకుంటాం. మనకొక దర్పం, గర్వం ఉంటుంది. ఇదీ 'గౌరవం' అంటే మనకు తోచే అర్థం కాని ఇతనికి వలె మనలో గౌరవం పట్ల ప్రచండమైన, అభిజాత్య పూర్వకమైన విశ్వాసం వుండదనుకుంటాను.
    "ఇక యితని జీవిత కథ చెప్పుతున్నాను."
    "అందరి పిల్లల వలెనే ఇతడూ పెరిగాడు. అంటే మనుష్యులు చేసే కార్యాలన్నీ మంచీ, చెడ్డా అనే రెండు తరగతులుగా భాగించవచ్చునని ఇతడూ నమ్ముకున్నాడు. పగలూ రాత్రీలాగే మంచీ, చెడ్డా స్పష్టంగా కనబడతాయి.
    ఈ విధంగా పెరిగాడు యితను. భక్తితో విశ్వాసంతో ఇరుకు మనస్సుతో.
    "ఇరవై రెండోయేట పెళ్ళయింది. ఇతనిలాగే పెరిగింది ఇతని భార్య కూడా. అవే నమ్మకాలూ. అంతే పవిత్ర మనస్సు. వీరి దాంపత్యం ఆదర్శప్రాయంగా ఉండేది. వైమనస్యాలకేమీ తావులేదు. ఇతడు తల్లిని ఒక దేవతలాగ చూచుకొనేవాడు. అట్టి మాతృప్రేమలోని ఒక భాగం ఇప్పుడు భార్యపట్ల కనబరచేవాడు. ఎట్టి మోసాన్నే ఎరగని ప్రశాంత జీవితం ఆమెతో అనుభవించాడు. ఎవరినీ తాను మోసగించలేదు గనుక తన్నెవ్వరూ మోసం చెయ్యరని విశ్వసించాడు.
    "వివాహానికి కొంతకాలం క్రితం లాంగ్లేగారి కంపెనీలో షరాబుగా ప్రవేశించాడితడు. ఇటీవల యితడు చంపినదీ లాంగ్లేనే.
    "న్యాయమూర్తులు సాక్ష్యం బాగా పరిశీలించండి. ముద్దాయి సౌమ్య స్వభావం అందరూ ఒప్పుకున్నారు. చనిపోయిన వాని తమ్ముడూ, అతని వాటాదారుడూ, కంపెనీలోని ఇతర ఉద్యోగులూ అందరూ! నమ్మకం, అడకువ, మర్యాద, పనిలో శ్రద్ధ, పని తప్పకపోవడం. అన్నీ ఇతని సుగుణాలు."
    "ఇతని స్వభావాన్నిబట్టి అందరూ ఇతన్ని గౌరవించేవారు. అట్లే ఇతని భార్యను కూడా. అందరూ ఈ దంపతులను ఎన్నికచేసేవారు. ఇట్టి గౌరవం ఇతని కలవాటుగానూ, హక్కుగానూ మారిపోయింది.
    "కొన్నాళ్ళకితని భార్య టైఫాయిడ్ జ్వరం వచ్చి మరణించింది. అప్పుడతడు అగాధమైన విషాదం అనుభవించాడనడానికేమీ సందేహం లేదు. కాని అంతా లోలోపలనే. గుండెలు బాదుకొని ఉద్రేకం ప్రకటించడమతనికి తెలియదు. ముఖంలోని వైవర్ణ్యమూ, దృష్టిలోని మార్పు, గాయం ఎంత లోతుకి పోయిందో చూపించాయి.
    "పిమ్మట, అతి స్వాభావికమైన సంఘటన ఒకటి జరిగింది. పది సంవత్సరాలు ఇతడు వివాహిత జీవితం అనుభవించాడు. పది సంవత్సరాలు నిరంతరం ఆడదాని సాన్నిధ్యానికి అలవాటుపడ్డాడు. ఆమెచేసే ఉపచారాలూ. యింటికా రాగానే ఆమె పరిచితమైన కంఠధ్వనీ, ఆమె దుస్తులు చేసే మృదువైన చప్పుడూ, జీవిత వేదన ఉపసంహరించే ఆమె ప్రేమ ప్రదర్శనలూ అన్నిటికీ అలవాటుపడ్డాడు. అన్నీ తప్పనిసరి అయినవి. అందువల్ల ఏకాకితనం దుర్భరమయిందతనికి. అంతులేని సాయంత్రాలు గడవడానికా దగ్గరనున్న మద్యశాలకు పోయేవాడు. ఒక్కగ్లాసు బీరుత్రాగి నిశ్చలంగా కూర్చుని ఒకదాని నొకటి వెంటాడే బిల్లియర్డు బంతులను తదేక దృష్టితో చూస్తూ, ఆటగాళ్ళ వాదనలు వింటూ, పొరుగు వ్యక్తుల సంభాషణలూ, ప్రక్కగదిలో అప్పుడప్పుడు నవ్వులు వింటూ కూర్చునేవాడు. తరుచు కేవలం విసుగు వల్లా చిరాకువల్లా నిద్ర కూడా పోయేవాడు. కాని తనకు హృదయానికి హృదయమై శరీరానికి శరీరమైన స్త్రీ హృదయమూ, స్త్రీ శరీరమూ ఆవశ్యకమైనాయి. అందువల్ల తనకే తెలియకుండా గల్లాపెట్టె దగ్గర కూర్చున్న యువతికి కొంచెం కొంచెం సమీపంగా కూర్చోడం మొదలుపెట్టాడు. ఆడది మాత్రమే అన్న కారణంవల్ల ఆకర్షితుడయిపోయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS