Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 82


    "ఎక్కడమ్మా! తీరిక లేదు. ఇది వరకటి మాదిరిగా లేదుగా? అటు ఊళ్ళో పొలం పనులూ, ఇక్కడ మిల్లుపనులూ, తీరక చస్తున్నా ఏమిటలా వ్యాజ్యం శంకర్రావు కొదిలేసి మీపాటికి మీరు కూర్చున్నారు?"
    వరూధిని తనలో తను నవ్వుకొంది.
    "అంతకంటే మనం చెయ్యగలిగిందేముంది? లాయర్లు చూసుకోవాల్సిందేగా?" ధీమాగా అన్నది వరూధిని.
    కనకయ్య తలెత్తి వరూధినికేసి చూశాడు.
    "ఏం చూస్తున్నాడో ఏమో? నిన్న మా అల్లుడు కోర్టులోనే వున్నాడట మీ కేసు విచారణ జరిగేప్పుడు."
    వరూధిని కళ్ళు ఆత్రంగా కనకయ్య కేసి చూశాయి.
    "ఆ శంకర్రావుగాడేదో ముంచేట్టుగా వున్నాడన్నాడే"
    వరూధిని మాట్లాడలేదు.
    "దొంగ ముందాకొడుకు వాడెక్కడ దొరికాడమ్మా నీకు? ఏదీ... ఆ పోలీసాయనే తీసుకెళ్ళి శంకర్రావు చేతిలో పెట్టించాడు గదూ?"
    "మీ అల్లుడేమన్నాడూ?" వరూధిని గాభరాపడిపోయింది.
    "ఆ శంకర్రావుగాడు వట్టి దగుల్భాజీగాడమ్మా! ఎక్స్ పార్టీ దగ్గిర బాగా కతికాడో ఏమో? కేసంతా నాశనం చేస్తున్నాడట. జడ్జీగా రేమడిగినా తల గోక్కుంటూ దిక్కులు చూస్తున్నాడట."
    బావుటా బీడీకట్టా, దాంతోపాటు పుగాకూ బయటకు తీసి ఏది కాల్చాలా అన్న మీమాంసలో పడ్డాడు కనకయ్య.
    వరూధిని కాళ్ళకింద భూమి జరిగింది! ముడిలో పువ్వు జారి కిందకు రాలింది.
    "అలా జరగటానికి వీల్లేదే? నా దగ్గర వేరే ఏడువేలదాకా తీసుకొన్నాడు జడ్జీగారు ఆయనకు బంధువని!" మిగతా సంగతి మింగేసింది కనకయ్యను నమ్మలేక.
    "అమ్మాయ్! నీకంత నమ్మకం ఉంటే కాదనను. మా అల్లుడు రాత్రి భోజనాల దగ్గిర అంటుంటే విన్నాను. అది నీ చెవిని వేసి పోదామని వచ్చాను.
    ఆహాఁ! అసలు ఎందుకొచ్చానంటే?" రెట్టించాడు కనకయ్య.
    ఎటూ చెప్పలేక వరూధిని కనకయ్యకేసి నిస్సహాయంగా చూసింది.
    "సాంబయ్యగారి కష్టార్జితం. ఎనభై ఎకరాల మాగాణీ, దొడ్డీ దోవలూ....ఎంత ఆస్తి? ఎంత్ఘ ఆస్తి? యాగాణి వదలకుండా తెగనమ్మి హాలుహాలని దానికింద పెట్టారా? అటు చూడబోతే రామనాథబాబు ఎంత కుచ్చితం మనిషో? ఇటు చూస్తే మన వెంకటపతి వట్టి అమాయకుడయిపోయా? నోరు వాయీలేని మనిషి, ఏమిటో అమ్మాయ్! అనకూడదుగానీ.....నువ్వు ఆడకూతురివి. ఆ కోర్టులో వ్యాజ్యాలూ.....ఆ తంతులూ నీకు మాత్రం ఏం తెలుసు? చేతులు కాలాక ఆకులు పట్టుకొంటే ఏం లాభమమ్మా? దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి మరి?"
    "అది కాదు కనకయ్యగారూ?......"
    "ఏదవునో ఏదికాదో నాకేం బోధపడటం లేదమ్మా మా అల్లుడు అంటే విన్నా ఉండబట్టలేక వచ్చి పడ్డా. నే విన్నదేదో నీచెవిన పడేశా. ఆ తర్వాత నీ ఇష్టం. నే వస్తా?"
    కనకయ్య లేచాడు వంగి వంకె కర్ర తీసుకొన్నాడు.
    "ఇంకా ఏమన్నాడు మీ అల్లుడు సంగతి చెప్పకుండానే పోతారేం?"
    రెండడుగులు ముందుకేసి అడిగింది వరూధిని.
    "మా గుర్నాధం మాత్రం పూర్తిగా చెప్పాడా నాకు? అక్కడికీ తరిచి తరిచి అడిగా వాళ్ళు లాయర్లమ్మా కోర్టులో జరిగే లోపాయకారి వ్యవహారాలన్నీ మనకు చెప్తారా? అక్కడికీ మీరంటే ఆయనకున్న అభిమానంకొద్దీ ఆ మాత్రం మాటైనా జారవిడిచాడు. ఉండబట్టలేక నీ చెవినివేసి పోదామని వచ్చా వెంకటపతి వస్తే చెప్పూ, నేను వచ్చి వెళ్ళానని? వస్తా!"
    కనకయ్య వంకె కర్ర ఆడించుకొంటూ వెళ్ళిపోయాడు.
    వరూథినికి చెమటలు పట్టాయి. కిటికీ తలుపులు మూసి పొగ పెట్టినట్టయింది. ఏమీలేకపోతే కనకయ్య ఎందుకొస్తాడూ? నిప్పులేంది పొగరాదు. కనకయ్య చెప్పింది తోసి పారెయ్యడానికి వీల్లేదు.
    వరూధిని టైం చూసుకొంది. ఇంకా తొమ్మిదిన్నర కాలేదు. గబ గబా చీర మార్చుకొని బయలుదేరింది.
    శంకర్రావు తెల్లలాగూ, తెల్లచొక్కా, నల్లకోటూ, నల్లటై వేసుకొని కోర్టు కెళ్ళటానికి సిద్దంగా ఉన్నాడు. ఆ రోజు ఫైల్ చెయ్యాల్సిన కాగితాలు వెతుక్కుంటూ హడావిడిగా ఉన్నాడు. వరూధినివచ్చి టేబుల్ పక్కగా నిలబడిందికూడా చూడలేదు.
    "శంకర్రావుగారూ?"
    శంకర్రావు కాగితాల్లోనుంచి తల ఎత్తకుండానే గుమాస్తాను కేకవేశాడు.
    "ఎక్జిబిట్ ఆరూ..... తొమ్మిదీ ఏవీ?"
    "టైపు చేస్తున్నా అయిపోయినై."
    "ఇంకా ఎంతసేపు? టైం అయిపోయింది. నీకేమయినా సెన్సుందా? అవి రాత్రే టైపు చేసుకొని పెట్టుకోమని చెప్పలేదూ?"
    "అయిపోయింది సార్! మీరు పదండి ఐదు నిముషాల్లో నేను తీసుకొస్తా. ఓయ్! ఇవన్నీ కార్లోసర్దు. చూస్తూ నిలబడతావేం?" గుమాస్తా గుడ్డలో ఫైల్స్ అన్నీ మూటకట్టి అందిస్తూ కుర్రాడిమీద కసురుకున్నారు.
    టేబులు ముందు నిలబడి కలర్ సర్దుకొని టైబిగించుకొంటున్న శంకర్రావుకు వరూథిన్ని చూడగానే గొంతు పిసికినట్టయిపోయింది! ఆమె కళ్ళు జ్యోతుల్లా మండిపోతున్నాయి.
    "ఏమిటమ్మా? పొద్దుకూకులు మన కేసు మన కేసు అంటూ? బాగానే నడుస్తోందని చెప్పానుగా?" ముఖం పక్కకు తిప్పుకొని చిరాగ్గా అన్నాడు శంకర్రావు.
    "మీకు అలాగే ఉండొచ్చుగాని చూసేవాళ్ళకు అలాలేదు." వరూధిని కంఠం కటువుగా ధ్వనించింది.
    "ఓహో!"
    కణతమీద రాయి తగిలినట్టుంది శంకర్రావుకు.
    "అయితే కేసు చేస్తున్నది మీరా నేనా?"
    "నేనయితే మీదగ్గిర కెందుకొస్తాను?"
    "అయితే మధ్య నేనెందుకూ? మీరే వాదించుకోండి." అంటూ గదిలోనుంచి బయటికి నడిచాడు శంకర్రావు.
    వరూధిని వెనకే నడుస్తూ "జడ్జీగా రేమంటున్నారూ?" అన్నది.
    "ఇదేమన్నా తెరమీద బొమ్మలాటనుకొన్నావా? కేతిగా డేమంటుందీ బంగారక్క ఏమంటుందీ చెప్పటానికి? కోర్టు కోర్టు! అక్కడ 'లా' మాట్లాడుతుంది."
    వరూధిని ముఖం ముడుచుకుపోయింది. అంత తిరస్కారంగా ఇంతవరకూ, తనముందు ఎవరూ - మాట్లాడలేదు.
    "మీరేం దయాదాక్షిణ్యాలకు కేసు చేయడంలేదు! మీరు అడిగినంతా డబ్బిచ్చాను. పైగా పదివేలు అదనంగా తీసుకొన్నారు, కేసు గెలిపిస్తానని. సమాధానం చెప్పడానికి మీకు కష్టమౌతున్నట్టుంది."
    "అసలిలాంటి కేసులు ఒప్పుకోవడం నాదేతప్పు. ఆ డి.యస్.పి. చెప్తే ఒప్పుకొన్నా."
    "ఒహళ్ళు చెప్తే కేసు తీసుకోవడం ఏమిటి? మీకు చేతకాకపోతే వదిలేయండి అంతేగాని కేసు,మాత్రం పాడు చెయ్యొద్దు!"
    కారెక్క పోతున్న శంకర్రావు దిమ్మెరపోయి చూశాడు.
    కారు పక్కనే నిలబడ్డా క్లయింట్స్ వరూధినికేసి శంకర్రావుకేసి మార్చి మార్చి చూశారు.
    శంకర్రావు కోపాన్నంతా కారుడోరు మీద చూపించాడు.
    వరూథినికి తన ముఖం మీదే ఆ తలుపు బాదినట్లనిపించింది.
    వెళ్తూన్న కారుకేసి దిగాలుపడి చూసింది.
    లాయరు గుమాస్తా వరూథినికేసి ఎగాదిగా చూసి లోపలకెళ్ళాడు.    
    వరూథినికి కనకయ్య చెప్పినదానికి రుజువు దొరికింది. శంకర్రావు ధోరణి అలాగేవుంది. ఏదో వంకతో తనతో పేచీ పెట్టుకోవాలన్నట్టున్నాడు.
    ఏమీ తోచక రిక్షా ఎక్కి కూర్చుంది.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS