నా రెండోసారి ప్రయాణంలో కూడా రష్యాలో నాకు కెమెరా బహూకరించారు. అది నువ్వు దానం చేసేశావు. కెమెరా గురించి అడిగితే 'ఉంది తెస్తాన'ని అంటావేకానీ దాని గురించి మాత్రం ఇప్పటికీ చెప్పవు కదా" అన్నారు.
నేనేమీ మాట్లాడలేదు. "నిన్నేమీ అనడంలేదు సరోజా!" అని అన్నారు.
"సరేకానీ మీ దృష్టి రష్యామీదకి వెళ్ళింది. ఏమిటి ప్లాన్?" అని అడిగాను.
"ప్లానేమీలేదు సరోజా! అనుకోవడం వరకే. మాస్కో రెండుసార్లు, స్టాక్ హోమ్, తాష్కెంట్, ప్యారిస్, జెనీవా, కెయిరో, స్వీడన్, రోమ్ చాలావరకూ అన్నీ చూశాను. లండన్ అమెరికాలు మిగిలిపోయాయి. అవికూడా చూడాలని వుంది" అన్నారు.
"మీరు తప్పకుండా వెళతారండి. డోంట్ వర్రీ" అన్నాను.
"మీరు అనకు సరోజా! మనం అను. నిన్ను కూడా తీసుకువెళతాన"ని అన్నారు.
"అంతకన్నానా? సంతోషం. కానీ అస్తమానమూ నేను దానం చేసిన కెమెరా గురించే దెప్పుతారు కానీ మొదటి మారు మీకిచ్చిన కెమెరా ఎలా పోయిందీ? అది చెప్పరేం?" అని అడిగాను.
"ఎన్నిసార్లు చెప్పాలి సరోజా! నాకెప్పటికప్పుడే పరగడుపు" అన్నారు.
"కాకినాడలోనే కదండీ పోయింది. మరొక్కసారి చెబుదురూ" అన్నాను.
"నేనూ, నా మిత్రుడు ఒకాయన ఆరోజు తగు మాత్రం మద్యం సేవించాం సరోజా! తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి. అవి ఇప్పుడనవసరం. దానికి మూడ్ వచ్చినప్పుడు చెపుతానులే. ఆ సంఘటనలతో మా ఇద్దరిమీద కొందరు కక్ష కట్టారు.
నేనూ నా మిత్రుడూ కూడా కళ్ళజోళ్ళవాళ్ళమే. అంతేకాదు__మా ఇద్దరి కళ్ళజోళ్ళూ ఒక రకమైనవే. పది పన్నెండు మంది వచ్చారు. అందులో ఒకడు నా దగ్గరకొచ్చి నన్ను చూసి న మిత్రుడనుకొని, నన్ను కొట్టి 'ఇప్పుడు నిన్ను చంపేస్తే నీకు దిక్కెవ్వరు?' అన్నాడు. నేను వెంటనే, 'నీకు ఒంటిమీద తెలివుందా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?' అని అడిగాను.
ఇంతలో ఇద్దరు ముగ్గురు నన్ను గుర్తించారు. బలవంతంగా నన్ను గదిలో తోసేసి తలుపు గడియ వేసి వెళ్ళిపోయారు. నేను ఏమీ పట్టించుకోకుండా నిద్రపోయాను.
నేను నిద్రపోయిన కొంతసేపటికి తలుపు తెరుచుకొని ఓ వ్యక్తి గదిలోకి వచ్చాడు.
'మీరు లోపల గడియ పెట్టుకోలేదా?' అని అడిగాడు.
"లేదు నాకు అలవాటులేదు. అటువంటి జాగ్రత్తలు అవసరమని కూడా నాకు అనిపించలేదు' అన్నాను.
అతడు ఆ కబురూ ఈ కబురూ చెప్పి, 'ఈ రోజు మీరు డ్రింక్ తీసుకున్నట్టులేరు. కింద పెద్ద పార్టీ జరుగుతోంది రండి. మీరేవార్ మాకు తెలుసు. మీరంటే మాకు మంచి గౌరవం' అని పిలిచాడు.
నాకేమీ వద్దని చెప్పి అతన్ని పంపించేసి ఈసారి తలుపు గడియ పెట్టుకున్నాను.
గమ్మత్తు ఏమిటంటే తెల్లవారిలేచి చూసుకుంటే టేబిల్ మీద నేను పెట్టిన నా రిస్ట్ వాచీ, కెమెరా కూడా లేవు. కక్షకొద్దీ ఈ దొంగతనం చేయించి, కెమెరాలెన్స్ ను గీకివేసి, ఆ కెమెరాతోపాటు వాచీనికూడా నీళ్ళలో పారేశారు.
మర్నాడు నెత్తురు మరకలున్న నా షర్ట్ చూసి, దొంగతనం జరిగిన సంగతిని కూడా జోడించి నా మిత్రుడు నాచేత పోలీస్ రిపోర్ట్ ఇప్పించి నన్ను మద్రాసు పంపించేశాడు.
తర్వాత ఆ రెండు వస్తువులూ నాకు అందాయి. వాచీని రిపేర్ చేయించాను కానీ రష్యన్ కెమెరా మాత్రం చెడిపోయింది" అని చెప్పారు.
"ఆ సంగతి నాకు చెప్పలేదే" అన్నాను.
"ఎందుకు చెప్పలేదు? ఇద్దరం కలిసే కదా పి. ఆర్. అండ్ సన్స్ కి వెళ్ళి వాచీ రిపేర్ కి ఇచ్చాం" అన్నారు.
వెంటనే నేను "అది మాత్రమే కాదు. ఆ రష్యన్ కెమెరాని ఎవరో మిత్రుడికి దానం చేశానని కూడా చెప్పారు. ఆ విషయాలన్నీ మరోసారి మీ నోటంట వినాలని అడిగాను. కానీ నాకన్నీ జ్ఞాపకం వున్నాయి. అయినా నన్నంటారు గానీ మీరేం చేశారు? కెమెరా చెడిపోయినా దాచుకోవచ్చుగా" అని అడిగాను.
"దాచుకోవడం గురించి నువ్వు నాకు చెప్తున్నావా? నీ చేయి చింకి జల్లెడ. నువ్వు పెట్టే ఖర్చు కొళాయి తిప్పితే నీళ్ళు పోయినట్టే. అందుకనేనీకెప్పుడో 'మందపల్లి మహారాణి' అని పేరు పెట్టాను" అన్నారు.
"ఛాన్స్ దొరికితే చాలండీ...నన్ను సాధించడానికే చూస్తారు" అన్నాను.
"సాధించడం కాదు సరోజా! ఉన్న మాట అంటున్నాను. నీ స్వభావం అది. చేతితో పదిరూపాయలుంటే నూర్రూపాయల ఖర్చుకి ప్లాన్ చేసి రెడీగా వుంటావు నువ్వు. పది రూపాయకుంటే ఒక్క రూపాయైనా వెనకేసి తొమ్మిదిరూపాయల ఖర్చు చెయ్యమంటాను. నేను. నువ్వో వైట్ ఎలిఫెంట్ ని. నిన్నెవరూ భరించలేరు నీకెందుకు చెప్పు. ఈ దానాలూ ధర్మాలూ. ఎంతమందిని ఉద్దరిస్తావు? దాంతో వాళ్ళ దరిద్రం తీరిపోతుందా?" అని ప్రారంభించారు.
"నేరుకపోయి అన్నానురా దేవుడా!" అన్నాను.
"ఎవరా దేవుడు? దేవుడనే మాట అనకు, నకు అసహ్యం వేస్తుంది. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని అవస్థలు పడుతున్నా వాడిమీద నీకున్న భక్తి మాత్రం చెక్కు చెదరలేదు. ఎన్నిసార్లు బోధపరచినా నీ మట్టి బుర్రకెక్కదు" అంటూ సిగరెట్ ఇమ్మన్నారు.
ఇచ్చి అక్కడి నుండి లేవబోయాను.
"ఎక్కడి కెళ్తావు? కూర్చో" అన్నారు.
ఇంకా ఏం చెప్తారో విందామని కూర్చున్నాను.
కాసేపు ఆగి నెమ్మదిగా ప్రారంభించారు... "నాకు ఈ బూర్జువా సంస్కృతి గిట్టదు. తేనెపూత నాలుకల కాపట్యమూ గిట్టదు. మానవుని అపారశక్తిని తవ్వి తలకెత్తుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. భవిష్యత్తు కష్టజీవులది. ఈ భువికి వారసులూ, అధినేతలూ వారే.
శ్రమజీవులంతా ఏకం కావాలి. మానవుడే తన భువినిర్ణేత. సమానత్వం మనసులు సమానమైనప్పుడు వస్తుంది. మనసులో ఇప్పుడు బూజుపట్టిన భావాలెన్నో వున్నాయి. ఆ బూజుని తొలగించి నూతన భావాలు ప్రవేశపెట్టాలి. ఈ కులమత భేదాలు పోవాలి.
మనదేశం పురోగమించాలంటే అందుకు సామ్యవాడ మార్గమొక్కటే శరణ్యం.
బలవంతులదీ ధనవంతులదీ ఆడింది ఆటగా పాడింది పాటగా వుంది. ప్రజలలో ఈ వ్యవస్థ మీద ద్వేషం వుంది. పీడింపబడే వర్గం యదార్ధస్థితిని తెలుసుకొని, తిరుగుబాటు జరిపితే_అప్పుడు ఈ సమాజానికి విముక్తి లభిస్తుంది. ప్రజాపోరాటం ఉన్నత స్థాయిలో సాగించాలి.
యువకరక్తంలో ఉన్నది సజీవశక్తి. దానికి భవిష్యత్తుపై నమ్మకం వుంది. భవిష్యత్తుమీద విశ్వాసం, నిఘావున్న యువతరానిదీ, జనతదే అంతిమ విజయం.
మనం_తెలుగువాళ్ళం__తెలుగు దేశంలో వుండవలసినవాళ్ళం. మనం తెలుగు దేశానికీ, పుట్టిన స్వస్థలానికి దూరమై ఈ మద్రాసులో వుండిపోయాం. ఇక్కడ వున్న భాష మన భాష కాదు. ఎంత వేగం ఇక్కడి నుండి స్వస్థలానికి వెళ్ళి సెటిల్ అయిపోతానా అనిపిస్తోంది.
ఈ అరవదేశంలో వుండి, అందరికీ అన్నింటికీ దూరమై పోయాం. కావలసిన తెలుగు పత్రికలు మనకి చదవడానికి కుదరడంలేదు. ఏదో ఆ విశాలాంధ్ర వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి, ఆ మాత్రమైనా తెలుగుదేశంలో జరుగుతున్న విషయాలు కొన్నయినా తెలుసుకోగలుగుతున్నాం. ఈ దేశంలో వుండి అన్ని తెలుగు పత్రికలూ చదవడం అసాధ్యం. కారణం_దొరకవు కనుక" అని అంటూ వుంటే...
"మీరు ఒక దానిలో నుండి మరోదానికి అట్టే జంప్ చేసేస్తారండి. ఏదో మాట్లాడుతూ సడన్ గా మీ ప్లేటు జన్మస్థలం వైపు తిప్పేశారు. అబ్బ ఆ సబ్జక్టు గురించే మాట్లాడుదురూ" అన్నాను.
* * *
