"పెళ్ళి ఖర్చు అంతా వాళ్ళదే, కాకపోతే అమ్మాయికి మంగళసూత్రం, ఒకజత గాజులు మనం చేయించాలి" చెప్పింది దాక్షాయణి.
"ఎంతవుతుంది?" అడిగింది జయంతి.
"ఎంతలేదన్నా పదివేలు అవుతుంది...." చెప్పింది శివపార్వతి.
జయంతి మౌనంగా వుండిపోయింది.
"ఏంటి జయంతీ! ఆ పదివేలు కూడా నువ్వే ఇవ్వాలనుకుంటున్నావా?" నవ్వుతూ అడిగాడు మాధవరావు.
జయంతి నిశ్శబ్దంగా నవ్వింది.
"నువ్వేం ఖర్చు చేయకు....ఆ కట్నం డబ్బుల్లో నుంచే పదివేలు బంగారానికి, పదివేలు ఇక్కడ మన బంతి భోజనాలకి ఖర్చు పెట్టి, మిగిలిన మొత్తం వాళ్ళమ్మాయి పేర బ్యాంకులో వేద్దాం" అన్నాడు మాధవరావు సీరియస్ గా.
"వాళ్ళు మీకా కట్నం డబ్బులు మీ చేతికిస్తే కదా.....వాళ్ళే బ్యాంకులో వాళ్ళమ్మాయి పేర వేస్తే అప్పుడేం చేస్తారు....?" అడిగింది జయంతి.
ఆమె ప్రశ్నకు అందరూ ఖంగుతిన్నారు.
"నువ్వు అడగకూడదటరా, కట్నం డబ్బు పెళ్ళికి ముందు తాంబూలాలు పుచ్చుకునే ముందు ఇవ్వాలని" కోప్పడింది కస్తూరి.
"నేను ఆ విషయం ఆలోచించలేదమ్మా...." అన్నాడు.
"ఎవరయినా సగం కట్నం డబ్బులు తాంబూలాలు పుచ్చుకునే ముందే ఇస్తారు" అందులోనుంచి మనం వాడుకోవచ్చులే ఖర్చులకు" అన్నాడు సుందరం.
"ఎందుకు బాబాయ్ ఆ అమ్మాయి డబ్బులు మనకి? ఏం. మనం ఆ మాత్రం ఖర్చు పెట్టలేమా? వాడి పెళ్ళికి ఇరవై వేలు ఖర్చుపెట్టలేమా? రేపు ఆ అమ్మాయి విడ్ని దెప్పిపొడిస్తే....నేనిచ్చిన కట్నం డబ్బుతోనే నాకు బంగారం పెట్టారు, పెళ్ళికి ఖర్చు పెట్టారు, అని వాళ్ళు గొడవపడటానికా" అంది జయంతి.
"బాగుండే నివరస.....అది మనవాడి కట్నం, మనం మన ఇష్టం వచ్చినట్లు ఖర్చుచేసుకుంటాం" అన్నాడు సుందరం సీరియస్ గా.
"అంతేగానీ మనం మన డబ్బుతో అ అమ్మాయికి బంగారం కొనివ్వలెం అంటారు" అంది జయంతి.
"అదికాదు జయంతీ! మీ బాబాయ్ అనేది ఎవరైనా కట్నం డబ్బులు మొత్తం అమ్మాయి పేరు మీద వేయరు. సగం పెళ్ళిఖర్చులకు వాడతారు" అంది శివపార్వతి.
"ఎందుకు మీరిలా అనవసరంగా ఇప్పుడు గొడవపడతారు! తాళి బొట్టుకు అయ్యే ఖర్చు పదివేలు నా దగ్గర వున్నాయి. నా బ్యాంకు బేలెన్స్ వుంది. నా పెళ్ళాం తాళి నేనే కొనుక్కుంటాను. అక్క చెప్పినట్లు ఆ డబ్బు విషయం మనం ఇప్పుడే వాళ్ళని అడిగితే చులకన అయిపోతాం" అన్నాడు శేఖర్.
జయంతి తమ్ముడ్ని ప్రశంశాపూర్వకంగా చూసింది.
"మరికేం , పిట్టపోరు, పిట్టపోరు పిల్లి తీర్చిందని, మనం ఎలాగా అని తలలు పట్టుకుంటుంటే , వాడే పరిష్కారం చెప్పాడు...." అంది పార్వతి.
అందరూ తేలిగ్గా ఉపిరి పీల్చుకున్నారు.
"పెళ్ళిబంతికి ఇక్కడయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాలే బాబాయ్! మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. రేపు వాళ్ళకి కావాలి. నా దగ్గర ఆ డబ్బు వుంది. మీరు దగ్గిర వుండి పెళ్ళి ఘనంగా జరిపించండి చాలు. డబ్బులు ఎవరూ ఖర్చుచేయనవసరంలేదు నేను పెళ్ళి చేసుకోకుండా ఉన్నదే వీళ్ళ కోసం. వాళ్ళకోసం నేను ఆ మాత్రం ఖర్చు చేయకపోతే, నేనిలా వుండటంలో అర్ధం లేదు" అంది జయంతి.
కస్తూరి లోపలినుంచే కూతుర్ని చూస్తూ రెండు చేతుల్తో దణ్ణం పెట్టింది. ఆమె ఇంతకమునుపు జరిగిన సంభాషణ విని కంగారుపడింది. ఎవరూ డబ్బులు ఇచ్చేటట్లులేరు, పెళ్ళి ఖర్చు ఎలాగా అని అందోళన చెందుతోంది. కూతురి దగ్గర అంత డబ్బు వుందని ఆమె వుహించలేకపోయింది.
తల్లి దైన్యంగా రెండు చేతులతో దణ్ణం పెట్టడం చూసిన జయంతి కళ్ళలో నీళ్ళు చిమ్మాయి, చాలు....నాకీ అదృష్టం చాలు.
నా వాళ్ళ పెళ్ళిళ్ళు నేను ఎవరి దగ్గరా ముష్టేత్తుకోకుండా జరిపించగలుగుతున్నాను. ఈ క్షణంలో తల్లి ముఖంలో కనిపించిన ఆనందాన్ని నా జీవితకాలం పదిలపర్చుకుంటాను.
"ఎందుకమ్మా అంత కంగారుపడతావు? నేనున్నానుకదా' అనుకుంది మనసులో జయంతి.
జయంతి మాటలతో అందరి మనసులు తెలికపడ్డాయి.
ఒక్క దాక్షాయణి మాత్రం బాధపడింది. మాటవరసకయినా నేను ఆ ఖర్చు పెట్టుకుంటాలేమ్మా అని అయన అన్నట్లయితే బాగుండేది. జయంతి ఖర్చుపెట్టనియదు. ఏంటో.....డబ్బు దగ్గరకు వచ్చేసరికి అందరు మనసులు కఠినంగా మారిపోతాయి అనుకుంది దాక్షాయణి.
* * * *
ఈ పాతికేళ్ళ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, విమర్శలు, హేళనలను ఎదుర్కున్నాను. నేనేం చిన్నపిల్లను కానుకదా! చిన్నపిల్లగా పద్దెనిమి ఏళ్ళ వయసులోనే ఇక్కడ ఉద్యోగంలో చేరాను, అప్పుడే తట్టుకుని నిలవగలిగాను, రేపటినుంచి కొత్త ప్రాంగణం, కొత్త వాతావరణం.....ఎందుకో కాస్త టెన్షన్ గా వుంది.
"జయంతిగారూ" అన్న పిలుపుతో ఆలోచనలకు బ్రేక్ పడింది. నా సీట్లో కూర్చుని పేపర్ చదువుతూ ఆలోచిస్తున్న నాకు ఆ స్వరం పరిచయస్తునిదిలాగానే అనిపించి తలెత్తి చూశాను.
ఎదురుగా ఇంగ్లీషు లెక్చరర్ ఉమామహేశ్వరరావు నవ్వుతూ నిల్చుని వున్నారు.
"ఎంటండి ఇలా వచ్చారు? ఏమైనా బుక్స్ కావాలా?" అన్నాను కంగారుగా.
"లేదండి! మీతో కాస్త మాట్లాడాలి. సాయంత్రం మీరు వెళ్ళేటప్పుడు వస్తాను" అన్నాడు.
"నాతో మాట్లాడాలా? ఏ విషయం?!" అన్నాను ఆశ్చర్యంగా.
"ఈవినింగ్ చెపుతాను. అన్నట్లు.....ఈరోజేగా మీరు రిలీవ్ అయ్యేది?" అన్నాడు.
