"చిన్నపిన్ని ప్లీజ్! ఇక ఆ విషయం మర్చిపోండి. నేను రావటం లేదు. ఇంతమంది పెళ్ళి పెద్దలు వుంటే నేనెందుకు చెప్పండి?! బయల్దేరండి. మళ్ళీ వర్జ్యం వస్తుంది" అంది జయంతి సీరియస్ గా.
శేఖర్ సీరియస్ గా వెళ్ళిపోయాడు.
"పెద్దపిన్ని! వాడికి నువ్వే సర్దిచెప్పాలి......కోపంగా వెళ్ళిపోయాడు. అక్కమీద ప్రేమ వుండొచ్చు కాదనటం లేదు. కానీ ఆ ప్రేమ వాళ్ళ జీవితాలకు అడ్డురాకూడదు" అంది జయంతి.
"అసలు నీకేం తక్కువే! వాడికి ఉద్యోగం వచ్చింది. తులసి డాక్టరీ చదువుతుంది.....చిన్నాడు డిగ్రీ చదువుతున్నాడు. ఇక నువ్వు పెళ్ళి చేసుకోవచ్చు కదా. ఎవరికి ఈ ఇబ్బందులు వుండవు" అంది కస్తూరి.
"తులసి మెడిసన్ పుర్తవ్వాలంటే ఇంకా నాలుగు సంవత్సరాలు పడుతుంది. ఈ నాలుగు సంవత్సరాలలో ఎంత ఖర్చవుతుందో తెలుసా అమ్మా?! నేను పెళ్ళి చేసుకుంటే! ఆ వచ్చేవాడు తులసి కాలేజి ఫీజు కట్టాలంటే ఒప్పుకుంటాడా? మా మధ్య గొడవలు రావటం తప్ప మరేం లేదు" అంది జయంతి.
"అందుకని దాని చదువు పూర్తయ్యేవరకు నువ్విలాగే వుంటావా?" అంది కస్తూరి.
"ఇప్పుడవన్నీ ఎందుకమ్మా.....వెళ్ళేది శుభకార్యానికి. అందరూ తెలికయినా మనస్సులతో వెళ్ళాలి. అలా బరువైన మనస్సులతో కాదు" అంది జయంతి.
"ఏమోనే నీ పంతం నీదే! మా మాట ఎప్పుడువిన్నావు గనుక?" అంది కస్తూరి.
జయంతి దాక్షాయన్నీ చూసి నవ్వింది.
దాక్షాయణి ఇబ్బందిగా చూసింది.
"ఎలా వెళుతున్నారిప్పుడు?" అడిగింది జయంతి.
"మీ బాబాయ్ చినకారు తెప్పిస్తున్నారు" అంది దాక్షాయణి.
"వెరిగుడ్ ఇంకేం! ఇలా వెళ్ళి అలా రావొచ్చు, బయల్దేరండి మరి" అంది జయంతి.
"ఏది కారు రానియి తల్లీ" అంది శివపార్వతి నవ్వుతూ.
"చిన్నపిన్ని! నువ్వేంటే ఆ చీర కట్టుకున్నావు?" అంది జయంతి వాతావరణాన్ని తేలిక పర్చాలని.
"ఏం బాలేదా!" అంది కంగారుగా.
"కనకాంబరం రంగు పట్టుచీర కట్టుకో, నీకు బాగా నప్పుతుంది. దానిమీద నల్లజాకేట్ వేసుకుంటే, అక్కడ పెళ్ళికూతురు నిన్ను గుడ్లప్పగించి చూస్తుంది" అంది జయంతి.
దాక్షాయణి, శివపార్వతి ఇద్దరూ నవ్వారు.
"నిజం పిన్నీ! ఆ చీర తెచ్చుకోలేదా!" అంది జయంతి.
"తెచ్చుకున్నాను" అంది పార్వతి.
"మరి ఇంకేం....ఇలారా చీర మార్చుకో" అంది జయంతి.
"ఎందుకులే జయంతీ! ఇప్పుడు నన్నెవరు చూడొచ్చారు?" అంది కంగారుగా.
"అదేం కుదరదు.....పెళ్ళికొడుకుతో పాటు పెళ్ళి పెద్దలు కూడా హుందాగా, అందంగా వుండాలి" అంది జయంతి.
"చెపితే వినిపించుకోవు కదా?" అంటూ తనతో పాటు లోపలికి వెళ్ళింది.
మాధవరావు హడావుడిగా లోపలికి వచ్చాడు.
"బయలుదేరదామా? కారోచ్చింది" అన్నాడు.
"అయిపోయింది బాబాయ్! అయిదు నిమిషాలు" అంది జయంతి శివపార్వతి చీరె కుచ్చిళ్ళు కింద కూర్చుని సరిచేస్తూ.
"రండి రండి త్వరగా! మళ్ళీ ఎండ ఎక్కితే కష్టం. సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి" అన్నాడు మాధవరావు.
"ఇదిగో కాఫీ తీసుకోండి అందరూ.....కాఫీ తాగి బయలుదేరదాం" అంటూ కస్తూరి కాఫీ కప్పులతో వచ్చింది.
"గిరిజక్క కూడా బయలుదేరితే బావుండేది" అంది జయంతి.
"గిరిజ ఎలా వస్తుంది? ఇప్పుడు ఏడో నెల....ప్రయాణం కష్టం" అంది దాక్షాయణి.
"అందుకే వుండిపోయాను.....లేకపోతే ఎంచక్కా నేను వచ్చేదాన్ని. ఈ కడుపు ఇప్పుడే రావాలా? ఏడేళ్ళనుంచి రాలేదు. ఇప్పుడు వచ్చింది చూడు" అంది గిరిజ.
ఆమె మాటలకు అందరూ నవ్వారు.
"భాలేదానివేనే.....రాకముందేమో రాలేదో.....రాలేదో....అంటూ ఏడ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడేమో ఇలా ఏడుస్తుంది" అంది దాక్షాయణి.
గిరిజ ఆ మాటలకు సిగ్గుపడింది.
* * *
"అమ్మాయి బావుంది జయంతీ! నీరంగు, నీ అంత ఎత్తుకాదు.....చక్కని ముఖకవళికలు, పదవతరగతి పాసయిందట, సంగీతం రాదు గానీ, వంట బాగా చేస్తుందట" చెప్పింది దాక్షాయణి.
"శేఖర్ కు నచ్చిందా?" అడిగింది ఆసక్తిగా జయంతి.
"నచ్చింది.....చేసుకుంటానంటున్నాడు" చెప్పింది పార్వతి.
"మరి కట్నం గూర్చి అడగవే?" అంది దాక్షాయణి.
"ఆ విషయం నాకనవసరం! అది వాడికే చెందుతుంది. వాడికి పిల్ల నచ్చితే పెళ్ళి చేయటంవరకే నా బాధ్యత" అంది జయంతి.
ఆమె మాటలకు అందరు ఆశ్చర్యపోయారు.....చిన్నప్పటి నుంచి చదివించి, కొన్ని వేలు ఖర్చు పెట్టింది. న్యాయంగా అయితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే లక్షరూపాయల కట్నం డబ్బు సగం జయంతే తీసుకోవాలి. అది ధర్మం.....కానీ అసలు ఏమాత్రం ఆసక్తి చూపకుండా, అవన్నీ వాడి పైసలే అంటుంది.....జయంతీ రియల్లీ యువార్ గ్రేట్ అనుకుంది దాక్షాయణి.
"పోనీ ఎంత అని అడుగు?' అంది శివపార్వతి.
"ఎంత?" అంది నవ్వుతూ నిర్లిప్తంగా.
'లక్షరూపాయలు....." అంది శివపార్వతి గొప్పగా చెపుతూ.
"ఉహు...." అంది జయంతి ముక్తసరిగా.
