Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 84

   

    నేను ఆశ్చర్యపోతూ అవునన్నట్లు తలూపాను.

    "ఈవినింగ్ నాకు మీరో పదినిమిషాలు టైం ఇస్తే మాట్లాడతాను. ప్లీజ్ స్పేర్ మి టెన్ మినిట్స్ ఫర్ మై సేడ్" అన్నాడు అర్దింపుగా.

    నాకు ఏం చెప్పాలో అర్ధంకాలేదు. అలాగే ఆశ్చర్యంగా చూస్తూ వున్నాను.

    "ఏంటి మాట్లాడరు?" అన్నాడు.

    వెంటనే స్పృహలోకి వచ్చి......

    "ఓ.కే...." అన్నాను నెమ్మదిగా.

    "థాంక్స్" చెప్పి వెళ్ళిపోయాడు.

    ఈయనేంటి టెన్ మినిట్స్ స్పేర్ చేయమంటాడు? ఏ విషయం మాట్లాడతాడు? ఇప్పటికే రేపు కొత్త ఉద్యోగంలో ఎలా చేరాలా అని టెన్షన్ తో కంగారుపడుతుంటే, ఇప్పుడు ఈయన మళ్ళీ కొత్త సమస్య అయికూర్చున్నారు.

    ఈ అయిదేళ్ళ పరిచయంలో హలో అనటం తప్పించి మరో మాట లేదు, ఈరోజే ఇంతసేపు మాట్లాడాడు. నాతో ఏం పనుంటుంది? ఎంత ఆలోచించిన సమాధానం దొరకటంలేదు. ఆలోచించి ఆలోచించి తలనొప్పి పెడుతోంది.

    "రామయ్యా! కాస్త టీ పట్టుకురా" అన్నాను.

    వాడు హడావుడిగా ప్లాస్క్ తీసుకుని బయలుదేరాడు.

    ఎప్పుడూ తనే పలకరిస్తాడు. ఆ చూపుల్లో ఎంతో ఆసక్తి....ఆరాధన కనిపిస్తుంటుంది. ఎందుకు నన్ను ప్రత్యేకించి పలకరిస్తాడో అర్ధమయ్యేది కాదు.

    ఈరోజు తెలుస్తుంది. రేపటి నుంచి నేను ఇక్కడకు రానుకదా....అందుకనే ఏదో సీరియస్ విషయమే డిస కస్ చేయటానికే వస్తుండోచ్చు. అయన పెళ్ళయి వుంటుందా?

    కాకుండా ఎలా వుంటుంది? దాదాపు ముప్పయి రెండు, ముప్పైఅయిదు సంవత్సరాలు వుండొచ్చు. అక్కడక్కడా తెల్లజుత్తు కూడా కనిపిస్తుంది.

    ఆయనకు పెళ్ళయితే ఏంటి, కాకపోతే ఏంటి?

    అసలు అయన విషయం నాకెందుకు?

    ఎందుకంటే, ఇప్పుడు వచ్చి మాట్లాడారు కనుక!

    లేకపోతే అసలు ఆయన్ని పట్టించుకునేదాన్నేకాదు. ఎందుకు వస్తానన్నాడు?

    రామయ్య టీ కప్పు టేబుల్ మీద పెట్టాడు.

    మెల్లగా టీ తాగుతూ ఆలోచిస్తోంది జయంతి.

                                       *    *    *    *

    కరెక్టుగా నేను లైబ్రరీ హాల్లోనుంచి బయటకు వస్తున్నప్పుడు వచ్చాడు ఉమామహేశ్వరరావు.

    "హలో! బయట ఎక్కడయినా కాఫీ తాగుతూ కాసేపు మాట్లాడుకుందాం....జస్ట్ టెన్ మినిట్స్ ప్లీజ్" అన్నాడు.

    ఇదేం ఖర్మరా బాబు ఇలా తగులుకున్నాడనుకుంటు, "సరే పదండి" అన్నాను.

    "మీరు గేటు దగ్గర వెయిట్ చేస్తుండండి నేను స్కూటర్ తెస్తాను ఈలోపు" అన్నాడు ఆనందంగా.

    స్కుటారా! మళ్ళీ ఇదొకటా.....తనిప్పుడు ఆ స్కూటరెక్కాలా? ఇదేంటి ఈ పెద్దమనిషి నన్నిలా ఇబ్బంది పెడుతున్నాడు. సీరియస్ గా అనుకుంది జయంతి. గేటు దగ్గరకొచ్చి, నిలబడి వెనక్కి తిరిగి చూసింది. అతను స్కూటర్ మీద వస్తున్నాడు.

    పక్కనే వచ్చి ఆపి - "ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎక్కండి" అన్నాడు వినయంగా.

    జయంతి సంకోచిస్తూనే తప్పనిసరి పరిస్థితుల్లో స్కూటర్ మీద కూర్చుంది.

    లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం స్కూటర్ ఎక్కటం.

    కళ్ళు తిరిగుతున్నట్లనిపించింది.

                                              *    *    *    *
    బస్ స్టాండ్ సమీపంలోనే ఉన్న ఒక పెద్ద హోటల్లోకి తీసుకెళ్ళాడు. ఎవరయినా తెల్సినవాళ్ళు చూస్తే ఎలారా భగవంతుడా. లేనిపోని అభాండాలు వేస్తారనుకుంటు అతను వెనుకనే అడుగులు వేస్తూ వెళుతోంది జయంతి.

    ఛ....నాకసలు బుద్దిలేదు. అతను పదినిమిషాలు మాట్లాడాలన్నప్పుడు అక్కడే లైబ్రరీలోనే కూర్చోండి...అంటే సరిపోయేది కదా.....ఇప్పుడింత ఇబ్బంది పడాల్సివచ్చేది కాదుకదా అనుకుంది జయంతి.

    ఉమామహేశ్వరరావు ఓ టేబుల్ దగ్గిరకు వెళ్ళి అక్కడ ముందు జయంతిని చెయిర్ ముందుకు లాగి కూర్చోమన్నాడు. ఆమె ఇబ్బందిగా అటూ ఇటూ చూసింది. అంతా మసకచీకటిగా వుంది. ఒకవిధంగా ఇది బెటరే అనుకుంది.
    అసలు నేను ఇతను పిలవగానే ఎందుకోచ్చాను?

    నాకు కూడా ఇతన్తో కలిసి కాఫీ తాగాలని వుందా అంతర్లినంగా?' ఛ....అలాంటి ఆలోచన ఎందుకుంటుంది? మరెందుకు గంగిరెద్దులాగా తలుపుకుంటూ ఇంతదూరం వచ్చాను?

    "ఏం తీసుకుంటారు జయంతిగారూ! కూల్ డ్రింకా, కాఫియా?" అన్నాడు.

    "కాఫీ" అంది ఠక్కున జయంతి.

    "కాఫీ ఎందుకండి.....దాహం వేయటంలా" అని చెప్పి "బేరార్.....రెండు గోల్డ్ స్పాట్" అన్నాడు.

    అతన్ని ఆశ్చర్యంగా చూసింది జయంతి.

    అతను జయంతిని ఆరాధనగా చూశాడు.

    ఆమె తలదించుకుంది.

    అతను నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు.

    బేరార్ డ్రింక్స్ తెచ్చాడు....చేరొకటి స్ట్రా పెట్టి అందించాడు.

    జయంతి బాటిల్ అందుకుని.

    "చెప్పండి....నన్నెందుకు పిలిచారు? ఏం మాట్లాడాలి?' అంది స్థిరంగా.

    అతను కంగారు పడ్డాడు. ఆమె అంత సడన్ గా అడుగుతుందనుకోలేదు.

    గొంతు సవరించుకున్నాడు.

    జయంతి అతనేమడుగుతాడని ఆసక్తిగా, ఆశ్చర్యంగా అతన్నే చూస్తోంది.

                                           46

    "ఏరా శేఖర్! ఎప్పుడు మ్యారేజీ . డేట్ ఫిక్స్ చేశారా?" అడిగాడు ఆనంద్.

    "ఆ....నెక్ట్స్ మంత్ సిక్త్స్ న....." చెప్పాడు క్యాష్ లెక్కపెడుతూ.

    స్నేహితులు ఇద్దరికీ బ్యాంక్ జాబ్స్ వచ్చాయి. లక్ ఎంటంటే ఇద్దరికీ ఒకే బ్రాంచ్ కావటం.

    "మ్యారేజ్ ఎక్కడ?" అడిగాడు ఆనంద్.

    "మచిలీపట్నం" చెప్పాడు శేఖర్ లేడ్జర్ లో క్యాష్ బ్యాలెన్స్ చూస్తూ.

    "మరి పార్టీ ఎప్పుడిస్తున్నావ్?"

    "ఏంకావాలి?" అడిగాడు శేఖర్.

    "బీరు పార్టీ..."నవ్వుతూ చెప్పాడు ఆనంద్.

    "అదయితే నేనివ్వను.....హోటల్ కి తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టిస్తాను. లీలామహల్ లో గానీ, నవరంగ్ లోగాని ఇంగ్లీష్ సినిమా చూపిస్తా" అన్నాడు శేఖర్ సీరియస్ గా.

    "ప్చ్....ఏంటోరా! ఎప్పుడు ఎదుగుతావో నువ్వు...." అన్నాడు ఆనంద్ విచారంగా.

    "బీరు తాగటమే ఎదుగుదల అనుకుంటే ఆ ఎదుగుదల నాకొద్దులేరా" అన్నాడు శేఖర్ నవ్వుతూ.

    "మొత్తానికి మీ అక్కగారి పెంపకం భలే వుందిరా.....ఆమెలాంటి అక్క నాకు కూడా వుంటే నేనూ నీలాగా బాగుపడేవాడిని....! నిజంగా అలాంటి అక్క లభించటం నీ అదృష్టం" అన్నాడు ఆనంద్.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS