"ఈ సాయంత్రం పొగమంచు ఉపద్రవంగా క్రమ్మింది. నదీ తీరాన్నంతా ఆవరించింది. అచ్చటి వీధి దీపాలు మసకగా పొగచూరిన కొవ్విత్తుల్లాగా ఉన్నవి. మామూలు కంటే అధికపు బరువేదో నన్ను క్రుంగదీస్తుంది. ఒకవేళ నా జీర్ణశక్తి మందగించిందేమో?
"ఏమంటే బ్రతుకంతటికీ మంచి జీర్ణశక్తి ముఖ్యం. అదే కళాశాలురకు ఉద్బోధ కలిగించేదీ, యువజనులకు ప్రేమభావాలు మప్పేదీ, ఊహాపరులకు స్పష్టభావాలు ప్రసాదించేదీ, ఎల్లరికీ జీవితానందం సమకూర్చేదీ. అదే బాగా భోజనం చెయ్యడానికిన్నీ అనుకూలత కలిగిస్తుంది. (నిజానికిదే బ్రతుకంతకూ గొప్ప సుఖం.) అజీర్ణ గర్భులకు నాస్తిక భావాలూ, విశ్వాసవిహీనతా, దుస్వప్నభ్రాంతీ, మృత్యువాంఛా కలుగుతూ ఉంటవి. ఈ సంగతి నేను చాలాసార్లు కనిపెట్టేను. నిజంగా ఈ సాయంత్రం నా అజీర్ణశక్తే బాగుంటే నాకీ ఆత్మహత్య బుద్ధిపుట్టుక పోయేదేమో!"
"ముప్పై ఏళ్ళబట్టీ నేను కూర్చుంటూ ఉన్న కుర్చీలో కూర్చుని చుట్టూ చూస్తున్నాను. అంతలో నన్నొక భయంకరమైన నిర్వేదం ఆవేశించి పిచ్చెత్తిపోక తప్పదన్నట్లనిపించింది."
"ఏం చేస్తే నన్ను నేను తప్పించుకొని పారిపోగలనా అని చింతించబోయాను. ఏం చేద్దామంటే అదే ఏమీ చెయ్యకపోవడం కంటే కష్టంగా కనబడ్డది. అప్పుడు నా కాగితాలన్నీ తీసి సర్దుకుందామనుకున్నాను."
"చాలాకాలంనుండీ నా డ్రాయర్లు సరిచేద్దామనుకునేవాడిని. ఏమంటే గతించిన ముప్పై సంవత్సరాలబట్టీ ఉత్తరాలూ, బిల్లులూ అన్నీ కలగాపులంగా అదేచోట పడవేస్తూ వచ్చాను. ఈ చిందరవందర చూస్తే నాకు కష్టంగానే తోచేది. కాని ఎప్పటికప్పుడే ఇవి సర్దుదామని ఊహ పుట్టిన మాత్రాన ఏదో నైతికంగా, శారీరకంగా ఒక అశ్రద్ధ పుట్టి మొదలు నెట్టడానికే ధైర్యం కలిగేది కాదు."
"కావున ఇప్పుడు డ్రాయరు తెరిచి పాత కాగితాలన్నీ ఏర్చిపెట్టుకొని చాలామట్టుకు చెత్తంతా నిర్మూలం చేద్దామని కూర్చున్నాను."
"ఇంత చెదారం, వయసుతో దూసరితములైన కాగితాలను చూస్తే విభ్రాంతీ కలిగింది. వాటిలోంచి ఒకటి ఎంచి తీశాను."
"ఓహో! మీకు జీవితంమీద ఆశంటూ వుంటే పాత ఉత్తరాలను వాడు సమాధిస్థలం నుంచి ఎన్నడూ కదపబోకండి."
"లేక వొకవేళ కదిపినా గుప్పెటితో తీసి ఒక్కక్షణమేనా చదవడానికి వీల్లేనట్లుగా, అనేక స్మృతుల కెరటాలు పొంగే సముద్రంలోనికి మిమ్ము ఆకస్మికంగా కూలద్రోసే ఏమరచిన దస్తూరినో మళ్ళీ పోల్చుకొనడానికి వీల్లేనట్లుగా కళ్లుమూసుకుని వాటికి నిప్పంటించెయ్యండి. అవి బూడిద కాగానే కనబడని గుండకింద నలగగొట్టండి. వినకపోతే మీపని సరి. గంటక్రింద నాగతిలాగే అవుతుంది."
"మొదట చదివిన ఉత్తరాలలో నాకేమీ విశేషం గోచరించలేదు. ఎందుకంటే అవి ఇటీవల వచ్చినవి. వ్రాసినవారింకా బతికున్నవాళ్లు. తరుచు వాళ్లను కలుసుకుంటూనే ఉంటాను. కనబడినా వాళ్ళంతగా నన్ను కదపలేరు. ఇంతట్లో హఠాత్తుగా ఒక కవరు చూచి ఉలికిపడ్డాను. నిబ్బరమైన పెద్ద అక్షరాలతో నా పైవిలాసం (పేరు) లిఖింపబడి ఉన్నది. ఒక్కమాటుగా కళ్ళనీళ్లు క్రమ్మినవి. ఆ ఉత్తరం నా ప్రాణస్నేహితుని దగ్గరనుండి వచ్చినది.
అతడు నా యౌవనకాలమునాటి సహచరుడు. నా ఆశలకు గుప్తపీటిక. అతడు నా కళ్ళయెదుట సిరిస్ఫటంగా కనిపించాడు. ఆ హాయి కూర్చే మందహాసంతో, చాచుకున్న చేతులతో! నా వెన్నుపూస నుండి శీతలంగా ఒక కంపం ప్రాకింది. ఔను ఔను చచ్చినవాళ్ళు తిరిగివస్తారు. ఏమనగా నేనతన్ని చూచాను. భౌతిక ప్రపంచంకంటే తధ్యమైనది మన స్మృతి జగత్తు. గతించిపోయినవాళ్లకు తిరిగి ప్రాణప్రతిష్ఠ చేస్తుంది."
"వడకుచున్న చేతులతో మసకక్రమ్మిన కళ్లతో స్నేహితులు వ్రాసిన ప్రతి ముచ్చటా పఠించాను. రోదించే నా హృదయంలో తీవ్రమైన ఘాతం తగులుతోంది. అది భరించలేక, మెల్లగా ఎముకలు చిదగొట్టుతూ ఉంటే మానవుడెలా మొర్రపెట్టుతాడో అలా ఆక్రోశించాను.
"పిమ్మట నా గతించిన జీవితమంతా యాత్ర చేశాను. నదిమీద ప్రయాణం చేసినట్టు. ఎన్నాళ్ళకిందటనో మరిచిపోయి పేరులు కూడా జ్ఞాపకంలేని మనుష్యుల్ని పొత్తిపట్టేను. వారి ముఖాలు మాత్రమే సజీవంగా నాలో తోచినవి. మా అమ్మ ఉత్తరాలలో మళ్ళీ మా పాత్రనౌకర్లనీ. మా ఇంటి ఆకారాలన్నీ, మనస్సుకు విడువక అంటిపెట్టుకునే ఎన్నో ఇందుకూ కాని చిల్లర సంగతులన్నీ దర్శించాను."
"ఔను. అకస్మాత్తుగా మా తల్లిగారి పాత చీరలన్నీ కానవచ్చాయి. రకరకాల చీరలు. ఆవిడ ఎన్ని పద్దతులుగా దువ్వుకొన్నదో అన్నీ కనబడ్డాయి. ముఖ్యంగా నేను అల్లిన పట్టుదుకూలం ఎంతో ఆమె దృష్టి నావేశించింది. అది ధరించి ఒకనాడావిడ అన్నమాటలు కూడా నాకు జ్ఞాపకం వచ్చాయి. బాబూ! నువ్వు నిటారుగా నిల్చోలేకపోతే నీకు బతికున్నంతకాలమూ గూని భుజాలవుతాయి సుమా!" అన్నది.
"తర్వాత మరో అర తెరచి ముఖాముఖంగా నిల్చున్నాను. ఏవేవో మృదువైన ప్రమోద్వేగాలు సంస్కృతులతో. ఒక చిరిగిపోయిన చేతిరుమాలూ, ఎండిపోయిన పువ్వులూ, కొన్ని తలవెంట్రుకలూ ఒక రవిక కూడా కనపడ్డవి. పిమ్మట నా జీవితంలోని మధురప్రేమ కథలు జ్ఞాపకం వచ్చాయి. ఇంకా జీవించివున్న నాయికలకు జుట్టు ఊడిపోయింది. ఇవి తలచుకుంటూ వస్తువులన్నిటినీ ఆదరించే బాధ విషాదంలో మునిగిపోయాను. ఓహో! ఉంగరాలు తిరుగుతున్న ముంగురులు ముసురుకునే జవ్వనుల భాగాలు, వస్త్రాల లాలనలు, భాషించే వాలుచూపులు, కొట్టుకునే హృదయాలు, పెదవులిస్తామనే చిరునవ్వు, కౌగిలి ఇస్తాననే పెదవులు! మరి ఆ ప్రథమ చుంబనమో? అంతంలేని తొలిముద్దులో నీ కళ్లు మూసుకు పోతవి. రాబోయే గణనాతీమైన సాంగత్య సుఖంలో నీ తలుపులన్నీ ముంచుకు పోతవి."
"వెనుక దినాల ప్రేమకు నిదర్శనాలైన ఈ వస్తువులన్నింటి రెండు చేతుల్లో తీసుకొని మహోగ్రపు లాలనలతో నింపివేశాను. వాటి స్మృతులతో చీల్చుకుపోతున్న నా ఆత్మలో అవి ఈయబడిన సమయాలలో మళ్ళీ వాటినొక్కటే సందర్శించాను. అంతటితో నరకాన్ని వరించడానికి కల్పించబడ్డ బాధలన్నిటినీ మించిన క్రూరయాతన అనుభవించాను."
"ఒక్కతుది ఉత్తరం మిగిలిపోయింది. మా మాష్టరు గారు చెబుతూవుంటే దాన్ని యాభైఏళ్ళక్రింద వ్రాశాను."
"ఇదిగో అది"
"ప్రియమైన తల్లిగారికి,-
"ఈదినం నాకేదో సంవత్సరం వస్తుంది. ఇది జ్ఞానం వికసించే వయస్సు. ఈ అవకాశం తీసుకుని భూమిమీదికి నేను రావడానికి కారణభూతురాలవయిన నీకు కృతజ్ఞతా పూర్వక వందనములు సమర్పిస్తున్నాను.
నిన్ను ప్రేమిస్తున్న నీ చిన్నకుమారుడు
బాబు
"అంతా అయిపోయింది. మళ్ళీ ప్రారంభానికి వెళ్ళిపోయాను! ఒక్కమారుగా దృష్టి మరల్చాను, ఇక నాకు బ్రతుకులో మిగిలిందేమిటా అని! వికృతమైన ఏకాంతమైన వార్ధక్యం కానవచ్చింది. సమీపిస్తున్న అంగవైకల్యములు కనబడ్డవి. అంతా అయిపోయినట్లూ వెళ్ళిపోయినట్లూ తలపించింది. మరి దగ్గరగా నాకెవ్వరూ లేరు!"
"అదిగో బల్లమీదనున్నది రివాల్వరు. మందు కూరుతున్నాను...ఎన్నడూ మీ పాత ఉత్తరాలు మళ్ళీ పఠించవద్దు."
ఈవిధంగా అనేక మనుష్యులు ఆత్మహత్య చేసుకోవడం తటస్థించింది. మనమేమో వ్యర్ధంగా వెదకబోతున్నాము వారి జీవితాలలో ఏదో గొప్ప విషాదం కనిపెట్టాలని."
* * * *
