"దానికి మీరెప్పుడు సిద్దమయితే అప్పుడే" అన్నాడు శంకర్రావు.
వరూధిని వ్యానిటీ బ్యాగ్ లోనుంచి నోట్లకట్టలు తీసి శంకర్రావు ముందు పెట్టింది.
"అహా! అన్నీ సిద్దం చేసుకొనే వచ్చారే? ఎంతా?" అన్నాడు శంకర్రావు నోట్లు లెక్కపెట్టుకోబోతూ.
"మూడువేలు" అన్నది వరూధిని.
శంకర్రావు నోట్ల కట్టలు టేబుల్ మీద వదిలేశాడు!
"పదివేలకు తక్కువయితే ముట్టే పనేలేదు. చిల్లర మల్లర మనుషులా? ఏమన్నానా? మూటికీ రెంటికీ కక్కుర్తి పడటానికి? పెద్దవాళ్ళతో పని?" అన్నాడు శంకర్రావు.
"నా సంగతి మీకు తెలియంది కాదు. వున్నదంతా మీకే ఇచ్చాను!"
"నా కివ్వటమేమిటి?" తీవ్రంగా వుంది శంకర్రావు కంఠం.
"మీ కంటే మీకని కాదు. ఈ వ్యాజ్యం మీదే పెట్టాను. మిగిలిందేదో ఊడ్చి తెచ్చాను. మరింతకంటే నేనేం ఇవ్వగలను? మీరే ఆలోచించండి" వరూధిని కంఠం వణికింది.
"అవునమ్మా నువ్వు చెప్పింది నేను గాదంటున్నావా? కాని మనం అవతలి వాళ్ళ అంతస్తూ అదీ కూడా చూడాలిగా? అవసరం మనది. ఆయనేమన్నా మనల్ని కావాలని అడిగాడా? ఆయన తీసుకో దలిస్తే అవతల పార్టీ శ్యామలాంబ ఇప్పటికిప్పుడు ఏభైవేలయినా ఇవ్వదానికి సిద్దంగా ఉంది."
"ఏభైవేలా?"
"ఏమిటమ్మా! అందులో అంత ఆశ్చర్యపడాల్సిందేముంది? సినిమాహాలు తాలూకు ఆదాయం మీరు ఏడాదిలో కోర్టులో కట్టిందే ఏభైవేలదాకా వుంది. ఐదారు లక్షల ఆస్తీ! మాటలా! రేపు గెలిచినా వాళ్ళకు ఆ క్యాష్ యాభైవేలూ ఊరికినే వచ్చి నట్టేగా? అదే అవతల పారేస్తారు! వాళ్ళ సొమ్మేమయినా ఇస్తున్నారా?"
"ఏభై కాదు, ఎనభై అయినా నేనివ్వడానికి సిద్దమే! కేసు గెలిచి ఆ డబ్బంతా మీరే తీసుకోండి. థియేటరు మాత్రం నా కప్పగించండి."
"అమ్మాయ్! నువ్వు మాట్లాడేది వ్యవహార పద్దతికాదు! అనుభవం ఉన్న వాళ్ళెవరూ ఇలా మాట్లాడరు. మీ కేసు గెలిచి థియేటరుతోసహా యాభైవేలూ...లేక అప్పటికి ఏ లక్షో అయితే అదీ...అంతా మీకు స్వాధీనం చెయ్యాలన్నదే నా అభిలాష, అది నా బాధ్యత కూడా." అన్నాడు శంకర్రావు.
"అయితే ఆ శ్యామలాంబే ఇచ్చేందుకు సిద్దమయితే ఇక మనం గెలిచేదేమిటి?" సాలోచనగా అన్నది వరూధిని.
"ఆయన వాళ్ళదగ్గిర్నుంచి తీసుకొనేవాడయితే ఈ పాటికి థియేటరు వాళ్ళ స్వాధీనం అయే వుండేది. ఇవతల ఉందెవరూ? నన్ను కాదని డబ్బు కతికి అవతల పార్టీ వాళ్ళకు అనుకూలంగా తీర్పు ఇస్తాడా? ఆయనెవరు? మా బంధువుని చెప్పలేదూ? పైగా మేమిద్దరం ఒక ఊళ్ళోనే చదువుకున్నాం. అట్టాంటి భయాలు మీరేమీ పెట్టుకోవద్దు. నేను కూడా ఇంతకాలం మీకెందుకు చెప్పలేదంటారూ? ఇట్లాంటి విషయాలు గోప్యంగా ఉంచాలి."
శంకర్రావు చెప్తుండగా బయట కారు ఆగిన శబ్దం, తర్వాత డోరు తెరచి మళ్ళీ వేసిన చప్పుడూ అయింది. శంకర్రావు కిటికీలో నుంచి బయటకు చూసి ముఖం అదోలా పెట్టుకొని గబగబా నోట్లకట్టలు తీసి డ్రాయర్ లో కుక్కాడు.
లోపల కొచ్చిన రామనాధబాబు వరూథిన్ని చూసి నిలబడి పోయాడు!
వరూధిని నివ్వెరపోయింది!!
"హల్లో వరూథినీ! కులాసా?" ఎంతో అభిమానంతో చిరునవ్వులు విసురుతూ పలకరించాడు రామనాథబాబు.
ఆమెకు ఎదురుపడి దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఒక సంవత్సరకాలంలో ఎంత మార్పొచ్చింది. ఆ విశాలమైన కళ్ళకింద నల్లని నీడలు, వెలుగుల్ని విరజిమ్మే ఆమె కనుపాపలు జాలిగా వున్నాయి. రామనాథబాబు గుండెలు కలకబారినై.
మాటా పలుకూ లేకుండా ఓ క్షణం రామనాథబాబు ముఖంలోకి చూసి తలదించుకొని వరూధిని.
రామనాథబాబు పెద్దగా నిట్టూర్చి వరూధిని పక్కగా వున్న కుర్చీని ఎడంగా లాక్కొని కూర్చొన్నాడు.
"ఏమండీ శంకర్రావుగారూ? వీళ్ళకేసేం చేశారు? ఏదో విధంగా వీళ్ళిద్దరికీ రాజీ కుదర్చకూడదూ?" అడిగాడు రామనాథబాబు.
"రాజీ చేయవలసివాళ్ళు మీరు"
"న ఆమాట వినేవాళ్ళయితే ఇలా కోర్టుకెందు కెక్కుతారు?"
"ఏమైనా ఇప్పటికి మించి పోయిందేమీ లేదు. ఇద్దరికీ కావాల్సిన వాళ్ళు మీరు ఏదో రకంగా రాజీ కుదర్చండి"
"నాకు వాళ్ళిద్దరూ కావాల్సినవాళ్ళే కాని వాళ్ళకు నేనేమీ కానట్టుగా వుంది వాళ్ళ ధోరణి. ఆగవమ్మా అంటే నా భార్య వినలేదు. ఈమె మట్టుకు ఈమె ఏం చేసింది? రౌడీలను పెట్టి థియేటరు స్వాధీనం చేసుకొంది. ఆవిడేమో కోర్టుకెక్కింది."
"పెళ్ళాన్ని వెనకేసుకొని పెద్దమనిషిలా మాట్లాడగానే సరికాదు. అసలు ఈ కుట్రంతా నువ్వెనకుండి చేయించిందికాదూ?"
"ఇదీ వరస, చూస్తున్నారుగా శంకర్రావుగారూ? శ్యామలకూడా ఈమెకు తీసిపోయిందేమీ కాడు, ఇదే ధోరణి అనుకోండి."
"ఆడవాళ్ళు! అందులోనూ ఆస్తి వ్యవహారాలు మరి!" ఎవర్ని సమర్ధిస్తున్నాడో అర్ధం కాని ధోరణిలో అన్నాడు శంకర్రావు.
"తన్నుకు చావనియ్యండి. మధ్యలో నాకెందుకు? మరి నా డ్రాఫ్ట్ డీడ్ ఏం చేశారు? పూర్తయిందా?" రామనాధబాబు లేచి నిలబడ్డాడు.
అతనితోపాటు శంకర్రావూ లేచి "ఏదీ! తీరికే లేదు. ఎల్లుండి తప్పకుండా" అన్నాడు.
"మళ్ళీ ఎల్లుండి దాకా గడువు పెట్టారేం? రేపు సాయంత్రానికన్నా ఇవ్వలేరా?"
"సరే! రేపు రాత్రి ఎనిమిది గంటలకు ఒకసారి రండి!"
"వస్తా! వరూ......వరూథినీ!" అంటూ రామనాథబాబు వెళ్ళిపోయాడు.
"శంకరరావు ఆయన్ని సాగనంపి వచ్చి కూర్చున్నాడు."
"చూశావమ్మా! రామనాధబాబు?" కళ్ళెగరేస్తూ అన్నాడు శంకర్రావు.
"అందుకే వచ్చాడంటారా?"
"ఇంకెందుకంటా! నువ్వున్నావనీ....."
"ఏదో డీడూ డ్రాఫ్టూ అంటున్నాడేం?"
"అంటాడమ్మా అంటాడు. మళ్ళీ రేపొస్తానన్నాడు వినలా!"
వరూధిని మాట్లాడలేదు.
"మరి ఆ సంగతేదో తేల్చి చెప్పాలి. నానిస్తే మనకే నష్టం. నేను కాదంటే రామనాథబాబు నేరుగా ఆయనతోనే సంబంధం పెట్టుకుంటాడు. రామనాథబాబు సంగతి నేను వేరే మీకు చెప్పాలా?"
వరూధిని లేచి నిలబడింది.
"మీరు రేపు కోర్టుకెళ్ళే ముందొకసారి వస్తారా?"
"అది మళ్ళీ నా దగ్గిరెందుకూ? రేపు సాయంకాలం ఏడూ ఏడున్నర కొస్తాను. అటునుంచి అటే వెళ్ళొచ్చు."
వరూధిని కళ్ళు తుడుచుకున్నది.
"మీరేమీ ఇది కావద్దు. అంతా నే చూసుకుంటా. రెండు నెలల్లోనే మీ బాధలన్నీ తీరిపోతయ్!"
లాయరు శంకర్రావు వరూథిన్ని తన కారులో పంపించారు.
38
రోజులు గడిచిపోతున్నాయ్.
వరూధిని తన ఆశలన్నీ లాయరు శంకర్రావుమీద పెట్టుకొని బతుకుతోంది. ఆమె కష్టాలకు ఒక ఒడ్డంటూ కన్పిస్తోంది. శంకర్రావు మాట ఇచ్చిన ప్రకారమే "వరూథినీ పిక్చర్ ప్యాలెస్ వ్యాజ్యం" విచారణ కొచ్చింది.
అంతా వారం పదిరోజుల్లో తేలిపోతుంది. శంకర్రావు మధ్య మధ్య కన్పించి చాలా నమ్మకంగా చెప్తున్నాడు.
ఓ రోజు కనకయ్య గాలివాటుగా వచ్చిపడ్డాడు.
"అమ్మాయ్! ఎక్కడమ్మా వెంకటపతీ?" నోట్లో చుట్ట అవతల పడేసి ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు కనకయ్య.
"ఇప్పుడే బయటికెళ్ళారు? ఇప్పటికి కన్పించామా ఏం?" ముడిలో పిన్ను పెట్టుకొని కనకయ్య ముందుకొచ్చింది వరూధిని.

