"ఆగండి" అంది జయంతి.
ఇద్దరూ ఠక్కున ఆగిపోయారు.
"కబుర్లు చెప్పుకోవటానికి బయట గార్డెన్ వుంది. ఇది లైబ్రరీ ఇక్కడ చదువుకోవాలి గానీ ఆ ముసుగులో ముచ్చట్లు చెప్పుకోకూడదు. పరిక్షలు దగ్గరపడుతున్నాయి బుద్ది వాటిపైన పెట్టండి....వెళ్ళండి...." అంది తీవ్రంగా.
"ఓకే మేడం.....సారీ మేడం...." అంటూ కంగారుగా బయటకు దాదాపు పరుగులాంటి నడకతో వెళ్ళిపోయారు.
* * * *
లంచ్టైం కావటంతో జయంతి బాక్స్ తీసుకుని వెనుక వేపు వున్న లంచ్ రూంకు వెళ్ళబోతుంటే ఫ్యూన్ రామయ్య వచ్చి,
"అమ్మగారూ! పోస్టు అంటూ కొన్ని లెటర్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు.
జయంతి మళ్ళీ చెయిర్లో కూర్చుని వాటిని ఒక్కొక్కటే శ్రద్దగా పరిశీలిస్తోంది. అన్ని అఫీషియల్ లెటర్స్. ఒక్కటి మాత్రం పర్సనల్ లెటర్ వుంది.
అ కవర్ చింపి ఆతృతగా లోపల వున్న టైపు చేసి వున్న లెటర్స్ చదివింది. ఆమె ముఖ కవళికలు క్రమంగా మార్పుచెందాయి. ఆనందంతో మనసు ఉప్పొంగింది. క్షణం సేపు నమ్మలేకపోయింది. కళ్ళు మూసుకుని రిలాక్సింగ్ గా థాంక్ గాడ్ అనుకుని తల వెనక్కు వాల్చింది. కొన్ని క్షణాల తరువాత కళ్ళు తెరిచింది.
కలెక్టరేట్ లో సీనియర్ అసిస్టెంట్ పోస్ట్ కి సెలెక్ట్ అయినట్లు వచ్చిన అప్పాయింట్ మెంట్ ఆర్డర్ అది, దాదాపు నాలుగు నెలల క్రితం అప్లయి చేసింది. ఆ ఉద్యోగం మీద ఆశలు వదులుకుంది. హటాత్తుగా ఇప్పుడు రావటంతో ఆమె నమస్సు ఉక్కిరిబిక్కిరి అవుతుంది.
ఇప్పుడు ఈ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలి......ఇక్కడ కాలేజిలో ఆప్తులు ఎవరూ లేరు. చిన్నపిన్న, సుందరం బాబాయ్ ఇంటికి వెళ్ళి వాళ్ళతో చెప్పాలి, ముందుగా ప్రిన్సిపాల్ తో ఈ విషయం మాట్లాడినా ఆమె ఒప్పుకోదు. కావాలంటే అక్కడ మీకు ఇచ్చే శాలరీ మేము ఇస్తాం ఇక్కడే వుండమంటుంది. పోనీ వుండిపోతే.....నో....ఆరేళ్ళు చేశాను. ఈ ఉద్యోగం చాలు. బోర్ కొడుతుంది. లైఫ్ రొటీన్ అయిపోయింది. అది ఎంతయినా గవర్నమెంట్ జాబ్. ఆ డిగ్నిటి వేరు, ఆ హోదా వేరు...ముందు ముందు మంచి ప్రమోషన్లు వస్తాయి అనుకుంది.
"రామయ్యా! కాస్త టీ తెచ్చిపెడతావా!" అంది.
వాడు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి అమ్మగారు లంచ్ టైంలో టీ తెమ్మంటుంది అనుకుంటూ.....
"అలాగే అమ్మా" అని చెప్పి ప్లాస్క్ తీసుకుని వెళ్ళాడు. లంచ్ చిన్నపిన్ని ఇంట్లోనే చేయాలి.
చిన్నపిన్నికి, బాబాయ్ కి ఈవిషయం చెపితే ఎంతగా సంతోషిస్తారో అమ్మయితే ఇక చెప్పనవసరంలేదు.
త్వరగా ప్రిన్సిపల్ ను కలిసి ఆమెతో మాట్లాడి, పర్మిషన్ పెట్టి వెళ్ళాలి.....వీలయితే అనుకుంది.
ఆమె అలాగే చెయిర్లో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది. ఇక ఫర్వాలేదు. తులసి మెడిసన్ ఫీజులు కట్టడం కష్టం కాదు. గవర్నమెంట్ జాబ్ కావటం వల్ల బోల్డన్ని లోన్స్ ఫెసిలిటి కూడా వుంటుంది. మరో అయిదేళ్ళ పాటు ఇలాగే అక్కడ కొత్త ఆఫీసులో పనిచేస్తే ఈలోపు తులసి మెడిసన్ కంప్లీట్ అవుతుంది. రాము డిగ్రీ పుర్తయిపోతుంది. ఈలోగా శేఖర్ కు జాబ్ వస్తుంది. మొన్ననే బ్యాంక్ టెస్ట్ రాశాడు. తెలిసిగాలవాడు కనుక ఆ జాబ్ రావచ్చు. జాబ్ వస్తే వాడికి పెళ్ళి చేసేయాలి. ఒక బాధ్యత తీరిపోతుంది. రెండోది తులసి, దాని తరువాత రాము. అప్పుడు తన గూర్చి ఆలోచించుకోవచ్చు. నాన్నకు మాట ఇచ్చాను కనుక పెళ్ళి చేసుకోవాలి తప్పదు. ఇదేంటి చిత్రంగా పెళ్ళి చేసుకోవాలి అనుకోగానే ఇం....గ్లి...ష్....లెక్చరర్.....గుర్తొచ్చారు. ఎప్పుడూ లేదు ఇలా.....నేను ఈ జాబ్ లో జాయిన్ అయినప్పటి నుంచి అయన నన్ను పలకరిస్తూనే ఉన్నారు. నేను ముభావంగానే పలకరిస్తుంటాను.....అంతే అంతకుమించి మా మధ్య ఇంకేం లేదే!" మరెందుకు గుర్తొచ్చాడు!
ఇందాకనే కదా హలో అంటూ పలకరించాడు. అందుకు గుర్తొచ్చి వుంటాడులే. తనను తాను సమర్ధించుకుంది.
"అమ్మా టీ" అన్నాడు రామయ్య టీ కప్పు టేబుల్ మీద పెట్టి,
ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది.
టీ కప్పు అందుకుని "మంచినీళ్ళు ఇవ్వు రామయ్యా" అంది. వాడు మంచినీళ్ళు గ్లాసు టేబుల్ మీద పెట్టాడు.
గ్లాసు అందుకుని రెండు గుక్కలు తాగి.....టీ తాగి...
ప్రిన్సిపల్ ఏమంటుందో....అనుకుంటూ టెన్షన్ గా బ్యాగ్ తీసుకుని ఆమె రూం వేపు అడుగులు వేసింది.
44
సర్వోత్తమరావుగారి ఇల్లు హడావిడిగా వుంది.
ఇంట్లో పెళ్ళి కళ తండవిస్తోంది. పిల్లల ఆటలు, అరుపులు, కస్తూరి హడావుడి....దాక్షాయణి, శివపార్వతిల ముచ్చట్లు, మాధవరావు, సుందరం కబుర్లు.....అందరి ముఖాల్లో అనందం తాండవిస్తోంది.
"నువ్వు రాకపోవటం ఏం బాలేదు జయంతి....." అంది దాక్షాయణి.
"నేనెందుకు పెద్దపిన్ని! మీరంతా వున్నారు కదా! అందరికంటే ముఖ్యం పిల్ల వాడికి నచ్చాలి. పిల్లకు వీడు నచ్చాలి" అంది జయంతి నవ్వుతూ.
"అయితే మాత్రం ఇంత చేసినదానివి నువ్వు రాకపోతే ఎలా చెప్పు? వాడు చూడు శేఖర్. అక్క రాకపోతే నేనసలు వెళ్ళను అంటున్నాడు" అంది దాక్షాయణి కనకాంబరం పూలను మాలగా గుచ్చుతూ.
"ఏడీ వాడు శేఖర్.....శేఖర్" అంటూ పిలిచింది జయంతి.
"ఏంటక్కా! నువ్వు రావటంలేదా! నువ్వు రాకపోతే నేనేసలు ఈ పెళ్ళి చూపులకు వెళ్ళను" అన్నాడు శేఖర్.
"అలా అనకు నాన్నా.....నాదేముంది చెప్పు....పెద్దపిన్ని వుంది......చిన్నపిన్ని వుంది...అమ్మ వస్తుంది.....మాధవరావు బాబాయ్ వస్తున్నాడు. ఇంతమంది వస్తుంటే నేనెందుకు.....చిన్నదాన్ని" అంది జయంతి తమ్ముడికి సర్ది చెప్పే ధోరణిలో.
"వాళ్ళంతా సరే....అందరూ రావాల్సిందే.....వాళ్ళతోపాటు నువ్వు కూడా రావాలి" అన్నాడు శేఖర్ మొండిగా దాక్షాయణి పక్కనే మంచం పైన కూర్చుంటు.
"నేను వస్తే అందరికి సమస్య అయి కూర్చుంటుంది" అంది జయంతి స్థిరంగా.
అందరూ ఉలిక్కిపడ్డారు.
"ఎందుకు?!" ఆశ్చర్యంగా అన్నాడు శేఖర్.
"ఎందుకేంట్రా పిచ్చి వెధవ. మీ అక్క ఎందుకు పెళ్ళి చేసుకోలేదు ఇంతవరకు అంటే ఏం చెపుతావు? నువ్వే కాదు, ఎవరి దగ్గర జవాబు లేదు ఈ ప్రశ్నకు" అంది జయంతి.
దాక్షాయణి , శివపార్వతి, కస్తూరి అందరూ ఆశ్చర్యంగా చూశారు. నిజమే ఇంతవరకు ఆ విషయం ఆలోచించలేదు అనుకున్నారు.
"ఎందుకు చేసుకోలేదంటే......ఇష్టం లేదు అని చెపుతాను" అన్నాడు శేఖర్ మొండిగా.
"అలా చెపితే వూరుకుంటారా? ఇది పెళ్ళిరా పిచ్చి నాయనా! అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూసి చేసుకోవాలంటారు. నా విషయం పరిపరి విధాల ఆలోచిస్తారు. మంచికంటే, చెడుగానే ఆలోచిస్తారు...." అంది జయంతి నవ్వుతూ.....ఇంత సీరియస్ విషయాన్ని కూడా ఆమె నవ్వుతూ చెపుతుంటే దాక్షాయణి ఆశ్చర్యపోయి చూస్తుంది.
"అందుకే.....అసలు నా ప్రస్తావనే తీసుకురాకండి. అక్కడ అందరూ ఇబ్బందుల్లో పడిపోతారు. అమ్మాయి నీకు నచ్చటం ముఖ్యం. పెళ్ళయిన తరువాత ఎలాగు తెలుస్తుంది. అప్పుడు తెలీటంవేరు" అంది జయంతి.
అంతా నిశ్శబ్దంగా వుండిపోయారు.
"అదికాదు జయంతి....."అంటూ శివపార్వతి ఏదో చెప్పబోతుంటే.
