Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 80


                                                                   ఆత్మహత్యలు

    ప్రతిదినమూ ఏదో ఒక పత్రికలో ఎక్కడో ఒక మూల
    ఈ దిగువ రకపు వార్త గోచరిస్తూనే ఉంటుంది.
    "బుధవారం రాత్రి...వీధిలో 40-నం ఇంటి వాస్తవ్యులు
    రెండుగుండుదెబ్బలు వరుసగా ప్రేలడం విని మేల్కొన్నారు.
    ఆ ధ్వనులు శ్రీయుత...గారు వసిస్తున్న గదిలో నుండి
    వచ్చినట్లనిపించి తలుపు బద్దలుకొట్టి చూడగా ఆయన
    తన రక్తంలో తడిసి ఉండడం కనబడ్డది. దేనితో తనప్రాణం
    తీసుకున్నారో ఆ రివాల్వరు కూడా ఇంకా ఒక చేతిలో
    ఉన్నది."
    "శ్రీయుత....గారికి 57 సంవత్సరాలుంటవి. తగుపాటి
    ధనాదాయం కలవాడు. సుఖంగా కాలక్షేపం కావడానికి    
    ఉండవలసినవన్నీ ఉన్నవి. ఈ ఘోరకృత్యం చేసుకోడానికి
    తగిన కారణమేమీ అతని జీవితంలో కనబడదు."
    ఈలాగు చదివిన పిమ్మట అనుకుంటాము. ఇంతగా పైకి సుఖంగా జీవితం సాగిస్తున్న జనులు అకస్మాత్తుగా ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఎంత భయంకరశోకమో. ఏ ఎరుగరాని వేదనో, ఏ దాగుకొన్న నిర్వేదమో, ఏ రహస్యపు గాయాలో కదా. అని! ఎంతో వెదుకుతాము. ఏవో భగ్న ప్రేమలను ఊహిస్తాము. డబ్బు విషయపు దిక్కులని అనుమానిస్తాము. నిశ్చింతగా ఏదీ కనబడకపోగా 'అగాధ రహస్య' మానేస్తాము ఇట్టి మరణాలను.
    ఇటువంటి 'తెలియని కారణాల వలని ఆత్మహత్య' చేసుకొన్న ఒకాయన వ్రాతబల్లమీద దొరికినదీ, అతడు చనిపోదలచుకున్న రాత్ర్రే వ్రాయబడి మందుకూరిన రివాల్వరు ప్రక్కన పడినదీ ఒక ఉత్తరం మా చేతికి వచ్చింది. దీనిలో ఒక విశేషం ఉన్నది మా ఉద్దేశం. ఏమంటే ఇందులో తరుచు మనం ఆత్మహత్యలలో మేళవించే ఆ మహాప్రళయాలేవీ లేవు. ఇది జీవితంలో ఒకటి వెంబడి ఒకటిగా పొడగట్టే చిన్నచిన్న విసుగు బరువులను స్పష్టము చేస్తుంది. ఎట్లు మెల్లమెల్లగా విచ్చిన్నమైపోయిందో చూపిస్తుంది. ఈ విషాద సమస్తాలన్నింటికీ కారణం-వణుకుపాటు వ్యక్తులూ, తీవ్ర మనఃప్రవృత్తి కలవారూ-మాత్రమే బోధపరచుకొనగలట్టిది సమకూరుస్తుంది.
    "నడిరేయి ఇప్పుడు ఈ ఉత్తరం ముగించగానే ఆత్మహత్య చేసుకుంటాను ఎందుకూ? కారణాలు చెప్పడానికి యత్నిస్తున్నాను. ఇది చదవబోయే వారికోసమని కాదు. నాకోసమే. ఎప్పుడో ఒకప్పుడు జరుగవలసిన ఈ కార్యాన్ని చప్పున నెరవేర్చడానికి నాకు ధైర్యం ఇచ్చేందికీ, ఈ కృత్యం ఎంత అగర్వమో నాకు నచ్చజెప్పుకోడానికీ వ్రాస్తున్నాను.
    "దైవభీతిగల సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగాను. నా తల్లిదండ్రుల నమ్మకాలే నావికూడా!
    "చాలాకాలం సాగింది నా స్వప్నం. ఇప్పుడే నా కళ్లకు కప్పబడ్డ ఆఖరు తెర చింపివేయబడ్డది.
    "కడచిన కొన్ని సంవత్సరాలనుండీ ఒక వింత మార్పు నాలో జరుగుతూ వచ్చింది. ఇదివరకు ఒక సంధ్య యొక్క రమ్యరాగంతో కనబడిన జీవిత సంఘటన లిప్పుడు అస్తంగతములవుతున్నవి. వస్తువుల నిజమైన అర్థం పరుషమైన యాధార్ధ్యంతో గోచరిస్తున్నది. ప్రేమకు కూడా అసలు కారణమేమిటో తెలిసి కవులు వర్ణించే ప్రేమమీద కూడా అసహ్యం పుడుతోంది. క్షణంక్షణం తిరిగి ఆరంభమగు సొగసైన మూఢమాయకు ఎల్లప్పుడూ ఆట వస్తువులం మనం!"
    "పెద్దవుతూ ఉంటే నేర్చుకున్నాను. జీవితపు భయానక రహస్యానికి సమాధానపడడం, యత్నాల వ్యర్ధత తెలుసుకోవడం. ఇంతలో ఒక క్రొత్త వెలుగులో కనబడ్డది నాకు జీవితంలోని శూన్యత్వం ఈ సాయంకాలం, ఇందాక భోజనం చేశాక.
    "ఇదివరకు నాదే హాయి. ప్రతీదీ సంతోషపెట్టేది. నడిచిపోయే స్త్రీలు, వీధుల స్వరూపం, నేను నివశిస్తున్న స్థలం! నా బట్టల కత్తిరింపులో కుట్టు విధానములో కూడా నాకు ఔత్సుక్యం ఉండేది. కాని కనబడ్డవే మళ్ళీ కనబడుతూ, జరిగినవే మళ్ళీ జరుగుతూ నా హృదయంలో అసలు, అసహ్యమూ నిండినవి-వెళ్ళిన నాటకానికే వరుసగా వెళ్ళినప్పుడు వలె."
    "పోనీ అని దేశాటనం యత్నించాను. క్రొత్త స్థలాలలో మనుష్యుల నావరించే ఒంటరితనం దిగులుకొల్పింది. ఒకణ్నె అయిపోయినట్టనిపించేది. ఇంత ప్రపంచంలో ఎంత అల్పుణ్ణీ! అనిపించి మళ్ళీ తొందర తొందరగా ఇంటిమొగం పట్టేను."
    "కాని వచ్చేసిన తర్వాత ఇక్కడ ముప్పయ్ ఏళ్ళా ఎక్కడ వక్కడే కదలకుండా మారకుండా ఉన్న ఇట్టి సామానులు, క్రొత్తగా కొన్నప్పటినుంచీ నాకు తెలిసినవీ ప్రస్తుతం పాడైపోయినవీ వాలు కుర్చీలూ, నా గదిలో ప్రతిరాత్రీ ఒక విలక్షణమైన వాసనా (ఏమంటే కాలం గడుస్తూవుంటే ప్రతి నివాసానికీ ఒక వాసన ఏర్పడుతుంది) ఇంకా ఇతర విషయాలూ నన్ను విసిగించి నాకోవిధపు జీవనం ఒక పీడగా తోపించేవి."
    "అంతంలేకుండా ప్రతీదీ మళ్ళీ మళ్ళీ పొడచూపేది. తాళం తీసేటప్పుడు నేను చెవిదూర్చేవిధం. అగ్గిపుల్లలు నేనెప్పుడూ ఉంచే స్థలం, గదిలో ప్రవేశించగానే ఎదుట కనబడే మొట్టమొదట వస్తువూ ఇవన్నీ చూస్తే కిటికీలోంచి ఉరికి ఎన్నటికీ తప్పించుకోలేని ఈ విసుగుదలకు పరిసమాప్తి చెప్పాలనిపించేది."
    "ప్రతిదినం నేను క్షౌరం చేసుకునేటప్పుడు గొంతుక కోసివేసుకోవాలన్న తీవ్రవాంఛ పుట్టేది. నాచిన్న అద్దంలో చూచుకుంటే మొగం (ఎవ్వడూ అదే!) దవడమీద సబ్బుతో కానవస్తూ ఎన్నోమార్లు శోకంచేత ఏడిపించేది."
    "ఇదివరకు నేను సంతోషంగా కలుసుకునేవాళ్లతో ఉండడానికి కూడా ఇప్పుడసహ్యం వేస్తున్నది. ఎప్పుడూ నేను కలుసుకుంటే వాళ్లేమంటారో దానికి నేనేమంటానో, చెప్పగలిగినంత బాగా తెలుసు నాకు వాళ్లందరినీ. ప్రతి మెదడూ సర్కస్ లాంటిది. ఇక్కడ తిరిగిన గుర్రమే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. ఎంత యత్నించి తప్పించుకోవాలన్నా దగ్గరనే ఉంటున్న గోడలో అనుకోక దొరికే దారిగాని, అవతలి అజ్ఞాత ప్రపంచాలకు తలుపుగాని కనబడదు. ఎప్పుడూ ఇలా గిర్రున తిరుగుతూ ఉండాలి మనం అనే ఊహలలో. అనే ఆనందాలలో, అనే సుఖాలలో, అనే అలవాట్లలో, అనే విశ్వాసాలలో, అనే విసువు పాట్లలో." 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS