Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 80


    "మీ ఆయనగారి పేరేమన్నారూ? వెంకటపతిగారు కదూ? వారిని కూడా పిలవండి. వారితో సంప్రదించితే మంచిది. ఎందుకంటే బోనులో నిలబడి సాక్ష్యం చెప్పాల్సింది ఆయన కదా?" అన్నాడు శంకర్రావు.
    "అవసరంలేదు! చెప్తార్లెండి. అలాగే చెప్తారు" అన్నది వరూధిని.
    తను ఆ మాట ఎలా అనగలిగిందో కూడా ఊహించలేకపోయింది వరూధిని.
    "సరే అయితే సంతకాలు పెట్టండి. రేపే పడేస్తాను కోర్టులో." అన్నాడు లాయరు.
    శంకర్రావు పెట్టమన్న చోటల్లా వరూధిని సంతకాలు పెట్టింది.
    సంతకాలు పెట్టిన కాగితాలను తీసుకొని బ్యాగ్ లో పెట్టుకొంటూ, డి.యస్.పి.కేసి సాభిప్రాయంగా చూశాడు శంకర్రావు.
    "నావంకెందుకు చూస్తారూ? ఆమె ఎదురుగానే వుందిగా? ఆమెనే అడగండి." అన్నాడు మోహనరావు.
    "ఐదువేలిస్తే ప్రస్తుతానికి సరిపోతుంది!" అన్నాడు శంకరరావు వరూథిన్ని చూస్తూ.
    "మళ్ళీ ఐదువేలా? మొన్ననేగా ఇచ్చాను?"
    "లోగడ మీరిచ్చిందంతా, ఇన్ కంటాక్స్, సేల్సూటాక్సూ, ఎంటర్ టైన్ మెంటు టాక్సూ, టౌన్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్ ఆఫీసుల్లో వాళ్ళకే సరిపోయింది. ఒక్కొక్క చోట వెయ్యిరూపాయలు పడేస్తేనేగాని పనులు జరగలేదు. వాళ్ళదగ్గర నుంచి మనం కొన్ని కాగితాలు పుట్టించాల్సి వచ్చింది. ఆ కన్సర్న్ పీపుల్ వచ్చి రేపు కోర్టులో మన తరపున సాక్ష్యాలు కూడా చెప్పాలిమరి? ఈ కేసంతా సాక్ష్యాల బలంమీదే ప్రధానంగా ఆధారపడి వుంది. డాక్యుమెంటరీ ఎవిడెన్సు అవతల వాళ్ళకుంది. దాన్ని మనం కాదని రుజువు చెయ్యాలంటే మనం ఎన్నో రోజువులు పుట్టించాలి. ఎన్నో సాక్ష్యాలు చెప్పించాలి." ఇంకా శంకర్రావు చెప్తూండగానే వరూధిని లేచి లోపలకు వెళ్ళింది.
    ఐదువేలూ అందుకొని శంకర్రావు "ఇదంతా వీరి మద్దతు ఉండబట్టి." అంటూ డి.యస్.పి.కేసి చూశాడు.
    ఆరడుగుల ఆఫీసరు మూడడుగుల మనిషిలా కుంచించుకు పోయాడు.
    వరూధిని ఏమిటోగా అయిపోయింది.
    "ఇంత తక్కువలో ఇన్ని ఆఫీసుల్లో మన పనులు జరుగుతున్నాయంటే డి.యస్.పి.గారి అండ వుండబట్టే! లేకపోతే ఒక్కొక్క ముండాకొడుకూ ఎంతెంత బెట్టుచేసేవాడో? ఈ పాటికే మనకు పదివేలు అయిపోయేది. ఇంకా మూడు డిపార్ట్ మెంట్లలో కాగితాలు సేకరించాలి? పోలీసు డిపార్ట్ మెంట్ అయితే మనదేననుకోండి. పోతే ఎ.సి.టి.వో, లేబర్ ఇన్స్ పెక్టరూ, శానిటరీ ఇన్ స్పెక్టరూ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళంతా గుడీ, లింగాన్నీ మింగేవాళ్ళే! పదండి డి.యస్.పి గారూ! వరూథనమ్మా! వస్తానమ్మా కోర్టుకు టైం అయిపోయింది" లాయరు శంకరరావు లేచాడు.
    గేటు వరకూ వరూధిని వచ్చి సాగనంపింది.
    శంకర్రావు ఏదో చెప్తూనే వున్నాడు రోడ్డుమీద కారు దగ్గిరకు వచ్చేవరకు.
    
                           37
    
    ఒక సంవత్సరం గడిచిపోయింది.
    ఒక జాతి జీవనంలో ఒక సంవత్సరకాలం పెద్ద లెక్కలోనిదికాదు. దశాబ్ధాలు గడిచినా పాక్కుంటూ నడిచే జాతి విషయంలో, ఒక సంవత్సరకాలం అసలు లెక్కలోనికే రాదు.
    రెండు దశాబ్దాలు గడిచినా దేశాన్నీ రాష్ట్రాలనూ పాలించే నాయకులు, నిన్నో మొన్నో స్వరాజ్యం వచ్చినట్టూ, ఆ స్వాతంత్ర్యం ఇంకా పసిబిడ్డేననీ, పాకేస్థితిలోనే వుందనీ, దాన్ని పెంచి పెద్దచెయ్యడానికి ప్రజలు ఇంకా ఎన్నో త్యాగాలకు సిద్దమవాలనీ, సదా అప్రమత్తులుగా వుండాలనీ, వేదికలమీదా, రేడియోల్లోనూ, పత్రికల్లోనూ గగ్గోలుపెడ్తూనే ఉన్నారు. పరిపాలకులు తమకు సంక్రమించిన అధికారాలను ప్రజలు సదా కాపాడుతూ ఉందాలనీ, అలా చెయ్యనివాడు ప్రజలే నోట్లో దుమ్ముకొట్టుకొని పోతారనీ, ప్రజలను హెచ్చరిస్తున్నారు. అది విన్నవాడు చావకుండా అలా బతుకుతున్నాడు. విననివాడు నిజంగానే మట్టిలో కలిసిపోతున్నాడు.
    ఒక సంవత్సరకాలం సగటు మనిషి మనుగడలో పెద్దమార్పు లేమీ తేలేకపోయింది.
    కాని వరూధిని జీవితంలో అ అగదిచిన ఒక్క సంవత్సరమే ఎన్నో ఏళ్ల మార్పులను తెచ్చింది!
    కోర్టులో వ్యాజ్యం ఇంకా నడుస్తూనే ఉంది. అప్పటికి వరూధిని దగ్గర ఉన్న డబ్బు ఇరవై వేలకు పైగా హరించుకుపోయింది. కోర్టు ఖర్చులకూ, సాక్ష్యాలకూ, తదితర ఖర్చులకూ పోయిందిపోగా మిగిలిన డబ్బు శంకర్రావు ఇనప్పెట్టెలోకి వెళ్ళి చేతులు మారాలనే భయం లేకుండా వెచ్చగా కూర్చొంది.
    వరూధిని రెండువందల పాతిక అద్దె ఇస్తూన్న ఇల్లు ఖాళీచేసి నూటపదిరూపాయల అద్దె కొంపలోకి మారింది.
    వెంకటపతి ఖరీదైన విస్కీ, బ్రాందీ మానేసి కల్తీ నాటుశారా తాగుతున్నాడు. దానికీ ఇబ్బందిగానే ఉంది. ఆ మధ్య ఎవడో సలహా ఇచ్చాడు. ఏవో బిళ్ళలు ఉన్నాయనీ, అవి రోజుకు రెండేసుకొంటే గాలెన్ నికార్సయిన సారాకంటే నిషాగా వుంటుందనీ, ఆ చెప్పిన పెద్ద మనిషే అడపాదడపా రెండు మాత్రలు పెడుతున్నాడు. వెంకటపతికి అది బాగానే వున్నట్టనిపించింది. సారా మానేసి అవి అలవాటు చేసుకొనే ప్రయత్నంలో పడ్డాడు.
    ఈ ఏర్పాటు వరూధినికికూడా వచ్చింది. సారామానేసి భర్త బాగుపడతాడనే నమ్మకం ఎలా ఉన్నా ఖర్చయినా తగ్గుతుందనే ఉద్దేశ్యంతో వరూధిని అందుకు సమ్మతించి ఊరుకుంది.
    వరూధిని కొడుకు హైదరబాద్ జాగీర్దార్ కాలేజీలో నాలుగో క్లాసులోకి వచ్చాడు. వాడికి ఎనిమిదేళ్ళు నిండాయి. తొమ్మిదో ఏడు నడుస్తోంది. ప్రతి నెలా వాడికి రెండువందలదాకా పంపాల్సివస్తోంది. అది ఇదివరకటిలో ఉన్నంత తేలిగ్గా లేదు. ప్రతి శెలవలకూ వాడ్ని తీసుకురావడం, పంపించడం, డ్రస్సులూ ... ఫీజూ .... అంతా చేరి సంవత్సరానికి మూడువేలదాకా అవుతోంది. ఎంత ఖర్చు తగ్గించుకోవలన్నా సాధ్యపడటంలేదు. ఇంటి అద్దె అయితే తగ్గించుకోగలిగింది కాని ఇంట్లో ఖర్చులు తగ్గించుకోలేకపోయింది వరూధిని.
    ఆరు నెలల్లో కేసు తేలిపోతుందని కోర్టుకు వెళ్ళేముందు చెప్పిన శంకర్రావు ఇప్పుడు అడిగితే ఆరేళ్ళయినా పట్టొచ్చు అన్నట్టు మాట్లాడుతున్నాడు! పదేళ్ళు నడిచిన కేసులూ, పద్దానుగేళ్ళు నడిచిన కేసులూ, పాతికేళ్ళు నడిచిన కేసులూ ఉదాహరణగ ఎత్తి, వరూధినికి చెప్తున్నాడు. మళ్ళీ మాట్లాడితే ఓ మునసబుగారు ఉద్యోగంలో చేరిన కొత్తలో పెట్టిన కేసు ఆయన హైకోర్టు జడ్జీ అయి రిటైర్ అయిన తర్వాత కూడా ఆ కేసు జిల్లా కోర్టులోనే నడిచిన సంగతీ చెప్తున్నాడు శంకర్రావు.
    వరూథినికి తన వ్యాజ్యం సంగతి ఎలా వున్నా కోర్టు వ్యవహారాలు చాలా వరకు అర్ధమైనాయి.
    ఒకరోజు శంకర్రావుతో "ఎలా అయినా మనకేసు రెండు నెలల్లో అయేట్లు మీరు చూడాలి" అన్నది వరూధిని.
    "అదెలా సాధ్యం?" గాలి బిగబట్టి అన్నాడు శంకర్రావు.
    "మీరు తలచుకొంటే అదే సాధ్యం అవుతుంది."
    అది విని శంకర్రావు గర్వంగా నవ్వి, గంభీరంగా మౌనం వహించాడు.
    "నేనూ విన్నాను! ఇప్పుడున్న సబ్ జడ్జీగారూ...?" వరూధిని భావయుక్తంగా శంకర్రావుకేసి చూసింది.
    "ఆయన లంచాలు తీసుకొంటాడనేనా మీ అభిప్రాయం? అలా ప్రచారం జరిగితే మీకేసే కొట్టేసే ప్రమాదం వుంది! జాగ్రత్త! ఆయన సంగతి మీకు తెలియదు" శంకర్రావు తీవ్రంగా అన్నాడు.
    వరూధిని బెదిరిపోతుందని ఆశించిన శంకర్రావు వరూధిని ముఖం చూసి గతుక్కుమన్నాడు. భయం తాలూకు భయాలేమీ ఆమె ముఖంలో కన్పించలేదు. పైగా ఆమె పెదవులపై నవ్వు కూడా మాయలేదు.
    "ఆయనగారి సంగతి నాకు తెలుసని నేననలేదు. మీకు బాగా తెలుసని మాత్రం విన్నాను" అన్నది వరూధిని.
    "ఆయన మాకు దూరపు బంధువు"
    "బంధువుకూడానా? ఆ సంగతి నాకు తెలియదే?" అన్నది వరూధిని శంకర్రావు మాట్లాడలేదు.
    "మరి జడ్జీగారితో ఎప్పుడు మాట్లాడతారూ?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS