Previous Page Next Page 
శ్రీ శ్రీ కథలు పేజి 79


    ఇటువంటి అమూల్య సత్యాలను తార చదువుతూ ఉంటే సోఫాలో మేను వాల్చడంలో ఎంత సుఖం వుంది!
    తప్పకుండా సాధిస్తారు, అని చదువుతుంది తార.
    ఎవరంటారు - నేను    
    దరిద్రులు
    ఏమిటి సాధిస్తారు?
    ఏమిటా? చదివి చెబుతాను అంటుంది తార.
    దరిద్రులందరూ ఏకీభవించి ధనవంతులను జయించడం ద్వారా ప్రజాస్వామికం ఏర్పడుతుంది అని చదివేది తార. ధనికులలో కొందరిని సంహరించీ, మరికొందరిని అక్కడ నుంచి తరిమివేసి, మరికొందరితో అధికారం పంచుకొనీ దరిద్రులు తమ రాజ్యం సాధిస్తారు.
    అలాగా? అంటాను నేను, బాగుంది. ఇంకా చదువు. తార ఇంకా చదివేది. ఈ రకంగా ప్రజాస్వామ్యం నెలకొల్పబడుతుంది. సాయుధబలం వల్లగాని, ఎదుటిపక్షం అలసిపోయి లొంగిపోవడం వల్లగాని!
    ఇది వినగానే అదిరిపడి లేచి నేను, తారా! ఎంతకాలం నుంచి ఈ వ్యవహారం సాగుతోంది, అని అడుగుతాను.
    ఇది చాలా పురాతన గ్రంథం. ప్లేటో దీన్ని క్రీస్తుకి పూర్వం రచించాడు.
    ప్రమాణ పూర్తిగా?
    దైవసాక్షి. అబద్దమాడుతానా? అంటుంది తార.
    నామీద మాత్రం సాయుధబలం ప్రయోగిస్తే ఒప్పుకోను.
    మీమీద చెయ్యెవరు చేసుకుంటారండీ, శర్మగారూ! మీదగ్గర డబ్బు లేదు.
    ఇప్పుడు లేదు. ఇకముందు రాకూడదు? నవ్వి నన్ను కూర్చోమని చదివేది తార. వారిష్టం వచ్చినట్టు వాళ్లు చెయ్యడానికి స్వాతంత్ర్యం వున్న రాజ్యంలో అందరూ తమకు వచ్చిన పనులే చేస్తారు. అప్పుడు ఏర్పడే ప్రభుత్వం చాలా అందంగా ఉంటుంది.
    ఇలా చదువుతూ ఉంటే నాకు చిన్న కునుకు పడుతుంది. మళ్ళీ లేచేసరికి తార చదువుతూనే ఉంటుంది. అప్పుడు సమానులకూ అసమానులకూ సమానమైన సమానత్వమే వరిస్తుంది.
    ఆ దుఃఖపు రోజుల్లో తార నాకు ప్లేటో వేదాంతాన్ని వినిపించేది. తారా ఏదో పరీక్షకి వెళ్ళబోతోంది. తనకన్న తక్కువ వాళ్ళ దృష్టిలో చవగ్గా గనబడకూడదన్న పట్టుదలతో జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొనేది.
    ఒకరోజు మినర్వా హోటల్లో ఒక యువకుడు ఆమెతో లేనిపోని చనువులు చేసుకోడానికి ప్రయత్నిస్తే ప్లేటో మహాశయుని ప్రజాస్వామ్య భావాల మీద పెరిగిన తార వాడికి చెప్పు తీసుకుని కొట్టినట్టు జవాబిచ్చింది. ఆ యువకుడు క్రీస్తుపూర్వం నుంచీ సోమరి తనానికి అలవాటుపడ్డ వర్గానికి చెందినవాడు. బాధని ఓర్చుకునే శక్తిగాని, ఆనందాన్ని నిరాకరించే నిగ్రహంగాని లేనివాడు. అతడు తారకేదో రహస్య ప్రతిపాదన చేశాడు. తార శ్రద్ధగా విని, ప్రజాస్వామ్య మానవుడి స్వభావమెట్టిదో ఆలోచించి, ఆ క్షణంలో ఆర్థికంగా అతని విలువ ఏ మాత్రమో తెలుసుకొని ఆ పిమ్మట, నేనలాంటి దాన్ననుకున్నావు కాబోలు! వెళ్ళు నీ సిల్కుచీర సీతాకోక చిలుకల దగ్గరికి అని కసరి కొట్టింది. నిజంగా తార గొప్ప ప్రాణి.
    మాట్లాడుతున్నవాడు ఆగి, తార ఎంత గొప్ప ప్రాణి అయిందీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. తార చిరునామా ఏమిటో తెలుసుకోవాలని నాకు బుద్ధి పుట్టింది.
    ఆ అమ్మాయి ఇంటిపేరేమిటన్నారు?
    ఏ అమ్మాయి?
    ఇప్పుడు మీరు చెబుతున్నారే ఆ తార?
    తారా? ఎవరా తార?
    మీ స్నేహితురాలు సినిమా తార తార. మినర్వా హోటల్లో మీరిద్దరూ కలిసి దుఃఖాన్ని పంచుకొనేవారు కాదూ?
    మీరంటున్నది నాకేమీ బోధపడలేదన్నాడతను గ్లాసును పెదవుల కందిస్తూ.
    మీరంతసేపూ తార అనే సినిమా తార గురించి చెబుతున్నారన్నాడు.
    నేను ప్లేటో గురించి మాట్లాడుతున్నానన్నాడతను.
    సరే. పోనీండి. ఇకనేను పోతానన్నాడు.
    అబ్బే, మీరు సరిగ్గా ఇముడ్చుకోలేదు. ఇంకోమారు బెంగుళూరులో ఇలాగే ఒక పెద్దమనిషిని కలుసుకున్నాను. వీణ వాయించడంలో పెద్ద చెయ్యి. నాలుగేళ్ళ వయస్సుకే గొప్పగా వీణ వాయించేవాడు. అప్పుడే వాళ్ళ నాన్న రెండువందలకి ఒక వీణ కొన్నాడు. ఇక పోవాలి సాధన చేసుకోవాలనేవాడు. అతనికతనంత కొడుకున్నాడు.
    క్షమించాలి, బెంగుళూరులో వీణ విద్వాంసుల్ని గురించి మరోమారు వింటాను. ఇప్పటికే నాకు ఆలస్యమయిందన్నాడు.
    ఏమిటి సంగతి?
    మరేం లేదు. నాలుగు దాటితే నాకు కొంచెం ఒంట్లో తిరుగుతుంది, సెలవు. అన్నాడు.
    సెలవు, కానీ ఇంకా నాలుగు కాలేదన్నాడతను.
    నేను మాట్లాడేది టైము గురించి కాదు. మరి సెలవు, అని నేను బైటకి వచ్చాను.
    అతనింకా మాట్లాడుతూనే ఉన్నాడు. బహుశా భగవంతునితో కాబోలు. ఎలాగైనా నాకన్నా ఎక్కువ ఓపికగా వుండగలడు భగవంతుడు.

                                           * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS