"అవును! ఆ బిజినెస్ వ్యవహారాలన్నీ నా తరఫున ఆయనే చూసుకొనేట్లు రాసిచ్చాను. కాని అది ఆనాడు లీజుకోసం రాయించుకొన్నది కాదు. సినిమాహాలు సమ భాగస్తురాలిగా రాసిచ్చాను. మధ్య మధ్య చాలా పత్రాలమీద నా సంతకాలు తీసుకొంటూ ఉండేవాడు. అతన్ని గుడ్డిగా నమ్మాను. ఇంత మోసం చేస్తాడనుకోలేదు."
"గొర్రె కసాయి వాడ్నే నమ్ముతుంది. మరి!" గుర్రుగా అన్నాడు మోహన్ రావు.
"అదికాదు శ్యామలంబ మొగుడికే నోటీసు ఎందుకిచ్చింది? మొగుడికి నోటీసు ఇచ్చిన ఆడది ఎంత గుండెలు తీసిందయి వుండాలి? రామనాథబాబు నోటీసు అందుకొని ఏం చేశాడూ?"
"అంతా నాటకం! అతనికి తెలియకుండా ఇది జరిగి ఉండదు. అతను కావాలనే పెళ్ళాం చేత నోటీసు ఇప్పించుకొన్నాడు. భార్యకు యక్స్ పార్టీ ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చేట్టు చూసుకున్నాడు. నువ్విచ్చిన పవర్ ఆఫ్ అటర్నీని ఉపయోగించుకొని నీకు తెలియకుండా కోర్టులో ఆర్డర్ పుట్టించాడు. అఖండుడు! రామనాధబాబు!"
"రామనాధబాబుతో మీరు మాట్లాడితే బాగుంటుందేమో ఏమిటీ అన్యాయం అని? మీలాంటి వాళ్ళు నిలదీసి అడిగితే ఏం చెప్తాడో? మీరు గట్టిగా పట్టించుకొంటే రామనాథబాబు ఎక్కడికీ పోలేడు." డి.యస్.పి. మోహన్ రావు మీద తన బరువుదించి, ఆశలన్నీ తనమీదే కేంద్రీకరింపజేసి అతని కళ్ళల్లోకి చూసింది వరూధిని.
"అదీ అయింది! అతనితో మాట్లాడే నీ దగ్గర కొస్తున్నాను. ఇదంతా తన కేమీ తెలియదనీ, అంతా తన భార్యేచేసిందని అన్నాడు. థియేటరు మీద నువ్వు పెత్తనం చెయ్యడం మొదలు పెట్టిన దగ్గర్నుంఛీ తనకేమీ పట్టనట్టు ఊరుకున్నాడట! దీనికంతా నీ తొందర పాటే కారణం అంటూ మాట్లాడాడు."
"మా ఇద్దరి పేరా కట్టిన థియేటర్ వాడి పెళ్ళాంపేర ఎలా అయిందన్నాడు?" వరూధిని ఉద్రేకంతో అడిగింది. ఆమె కంఠం వణికింది.
"ఇంకా అతడ్ని అడిగేదేమిటి? తాటి చెట్టెందుకు ఎక్కావూ అంటే దూడ మేత కోసం అన్నట్టు మాట్లాడుతున్నాడు. మోసం చేసినవాడు చేశానని ఒప్పుకొంటాడా? అందులోనూ, డాబూ, అంతస్తూ, పరపతి ఉన్న రామనాథబాబు లాంటివాళ్ళు? మామూలువాడనుకొన్నావా? స్టేషన్ లో పెట్టి నాలుగుతికితే అన్నీ ఒప్పుకోటానికి? అతడ్ని పట్టే విధంలో పట్టాలిగాని?" మోహనరావు తీవ్రంగా ఆలోచిస్తూ అన్నాడు.
ఆరిపోబోతున్న ప్రమిదలో నూనెపోసి ఒత్తి పైకి నెట్టినట్టుగా వుంది వరూధిని మనస్సు. ఆ కొత్త వెలుగులో మోహనరావు అద్వితీయమైన తెలివితేటల్తో, అమోఘమైన శక్తి మంతుడిలా కన్పించాడు వరూథినికి.
మోహనరావు లేచి వెళ్ళడానికి సిద్దమయి అన్నాడు ...
"అధైర్యపడకు. నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను."
"మళ్ళీ నా ఆస్తి నాకు దక్కినా దక్కకపోయినా, ఆ రామనాధబాబునీ, వాడి పెళ్ళాన్నీ జైలుకు పంపాలి. నా బతుకేమయినా ఫర్వాలేదు!"
"మంగమ్మ శపథం చేస్తున్నావ్." అన్నాడు మోహన్ రావు నవ్వుతూ.
"మీకు నవ్వుగా వుంది. నా కడుపు రగిలిపోతూంది. రామనాథబాబు పెళ్ళాం ఎలా బాగుపడుతుందో చూస్తా."
"ఆ తెలివితేటలు ముందే ఉండాలి. ఆస్తీ అంతస్తూ ఉన్న వాళ్ళతో వైరం పెట్టుకొని గెలవాలంటే అంగబలం ఒక్కటే చాలదు. అర్ధబలం కూడా కావాలి."
వరూధిని మోహన్ రావుకేసి అయోమయంగా చూసింది.
మళ్ళీ ఇట్లా దిగిపోయి మాట్లాడుతున్నాడేమిటి? చాలా లోతు మనిషి!
"మీ ఉద్దేశ్యం నాకు అర్ధంకాలేదు. నన్నింకేం చెయ్యమంటారు?" అంది వరూధిని.
"ఇలాంటి వ్యవహారాలు పంతాలూ పట్టింపులతో తేలవు."
"అంటే వాళ్ళతో రాజీపడమంటారా? ఇది చెప్పటానికి డి.యస్.పి. గారెందుకూ? నేనే వెళ్ళి ఆ రామనాథబాబు కాళ్ళమీదా వాడిపెళ్ళాం కాళ్ళమీదా పడితే సరిపోతుందిగా?"
"అదికాదు నేనంటుంది? మోసాన్ని మోసంతోనే జయించాలి! డబ్బును డబ్బుతోనే సంపాదించాలి. రామనాథబాబును రూపుమాపాలంటే డబ్బు కావాలి. నా దగ్గిర అధికారం ఉంది. కానీ డబ్బులేదు. అది నీ దగ్గిరాలేదు. బాగా ఆలోచించుకో."
"నా దగ్గిరున్నదేదో ఇస్తాను. తాళిబొట్టుతో సహా అమ్మయినా తెస్తాను."
"ఛ! ఛ! అదేం మాట?"
"నేనేం అంత బికారిగా లేను. ముఫ్ఫైవేలకు పైగా బ్యాంకులో వుంది. ఆఖరి పైసావరకు తెచ్చి మీ చేతుల్లో పెడ్తా. ఆ "రామనాథబాబుగాడ్ని జైలుకు పంపి ఆ థియేటర్ను నాకు ఇప్పించండి!"
"ఉద్రేకపడకు వరూ?"
"ఏదీ చేతకాకపోతే రామనాధబాబు తలైనాసరే...." వరూధిని రొప్పుతూ అన్నది.
డి.యస్.పి. కి భద్రాచలం అడవుల్లో మానవ రక్తం రుచిచూసి ఊళ్ళమీద పడ్డ ఆడపులిలా కన్పించింది వరూధిని.
"పులివేట! తస్మాత్ జాగ్రత్త!!" అనుకొన్నాడు డి.యస్.పి.
తెల్లవారే శంకర్రావును తీసుకొని వచ్చి వరూధినిచేత ఐదువేలకు చెక్కు రాయించి యిచ్చాడు.
ఆ తర్వాత నలుగురోజులకు లాయరు శంకర్రావుని వెంటబెట్టుకొని వరూధిని దగ్గరకొచ్చాడు డి.యస్.పి.
"రామనాధబాబు మీద ఫోర్ ట్వంటీకేసు బనాయిస్తున్నాం. దాంతో పాటు సివిల్ సూట్ కూడా వేద్దామంటున్నారు శంకర్రావుగారు." అన్నాడు మోహన్ రావు.
"ఆ చేసేదేదో త్వరగా చెయ్యండి. చేద్దాం అనుకోవటంతోనే రోజులు గడిచిపోతున్నాయి." అన్నది వరూధిని.
"మనం కేసుపెడితే ఎంతో పకడ్ బందీగా పెట్టాలమ్మా? నాలుగు రోజులు ఆలస్యం అయితే అయింది." అన్నాడు శంకర్రావు.
హ్యాండుబ్యాగ్ లో నుంచి స్టాంపుపేపరు మీద టైపు చేసివున్న పత్రాలను తీసి వరూధిని ముందు పెట్టాడు లాయర్ శంకర్రావు.
"మొత్తం ఐదు లక్షలకు దావా వేస్తున్నాం!"
వరూధిని హృదయం ఆనందంతో పొంగింది.
"స్థలమూ అందులో కట్టిన థియేటరూ మీదేనని దావాతెస్తున్నాం." చెప్పాడు శంకర్రావు.
"రామనాధబాబుకూ వాటా వుందిగా . మనం అసలే లేదంటే చెల్లుతుందా?" అనుమానంగా అడిగింది వరూధిని.
"అలా సగం సగం కేసు పెడితే మనకేసు నిలవదు. అందుకే మొత్తానికి పెట్టాను ఎసరు! మీ పొలం అమ్మిన డబ్బుతో రామనాథబాబు థియేటర్ కట్టాడని కేసు పెట్టాను. మీకున్న సన్నిహితత్త్వాన్ని పురస్కరించుకొని....."
"ఆ మాట కోర్టులో చెప్పాలంటారా?" బిడియపడ్తూ తలవంచుకొని అన్నది వరూధిని.
"అసలు పాయంటదే! లేకపోతే కేసు నిలవదు. మీతో ఎలాంటి సంబంధం లేకుండా అంత డబ్బు రామనాథబాబుకు ఇచ్చారంటే కోర్టు నమ్మదు. చూడండి ఎలాంటి సంబంధం లేకుండానే నేను మీకు గానీ, మీరు నాకు గానీ లక్షలూ వేలూ పత్రాలూ గట్రా లేకుండా ఇచ్చుకొన్నామంటే అర్ధం ఏమిటి?" తన పాయింటును విడమర్చి చెప్పాననుకొని తెలివిగా ముఖం పెట్టాడు లాయరు శంకర్రావు.
మోహన్ రావుకు శంకరరావు ధోరణి బొత్తిగా నచ్చలేదు. ముఖం చిట్లించి "అసలు విషయానికి రండి" అన్నాడు.
"అసలు విషయమే ఇది! ఆమెగారికి ముందుగా చెప్పటం నా విధి కదా?" మళ్ళీ తిరిగి వరూథిన్ని చూసి "చూడండి వరూధిని గారూ? మీ ఆయనగారు ఈ పాయింటును బలపరుస్తూ సాక్ష్యం చెప్పాలి."
"ఏ పాయింయూ?" వరూధిని తెల్లబోయి అడిగింది.
"అదే రామనాథబాబుకూ మీకూ అక్రమ సంబంధం వుందని."
వరూధిని కళ్ళలో నీరు తిరిగింది. నిస్సహాయంగా లాయరు ముఖంలోకి చూసింది.
"ఆహా! అలా వుందని కాదు. లేకపోయినా ఉన్నట్టు చెప్తే మనకేసు బలంగా వుంటుంది." అన్నాడు శంకర్రావు.
డి.యస్.పి. వెగటుగా ముఖం పెట్టి కూర్చున్నాడు.
వీడ్నెందుకు లాయరుగా కుదిర్చినా అనుకొన్నాడు. అయితే శంకర్రావుకూ తనకూ మధ్యవున్న సంబంధాలు గుర్తొచ్చి పలక్కుండా బెల్లంకొట్టిన రాయిల కూర్చున్నాడు.

