"నాన్నగారూ!" కలవరపాటుతో పిలిచాడు ప్రసాద్.
"నీకు నాన్న, నాకు నువ్వు చచ్చాం ఎవరికెవరం లేం. వెళ్ళిపో!"
వధువు జానకి ముఖం రోషంతో ఎర్రబడింది. ప్రసాద్ చెయ్యి వెనక్కి లాగుతూ వెనుదిరిగింది.
లక్ష్మీపతితో స్నేహం ఉన్న పార్టనర్ ఒకాయన కల్పించుకొన్నాడు. "పెళ్ళిచేసుకొని గృహప్రవేశానికి వచ్చిన కొడుకుని అలా తరిమివేయడం నాకు పెద్దమనిషి తరహాగా కనిపించలేదు, లక్ష్మీపతీ! పెళ్ళి అయిపోయిందిగా? ఇంక నువ్వేం చేస్తావు?"
"ఏం చేస్తానా? వాడికి పిండాలు పెడతాను."
"పాపం! వాళ్ళు లక్షణంగా పెళ్ళిచేసుకువచ్చారు. అశుభాలు పలక్కండి!" మరొకాయన అన్నాడు.
"ఈ నిప్పు మీ గుండెల్లో రగిలితే ఈ నీతులు పలుకరు!" తిరస్కారంగా అన్నాడు లక్ష్మీపతి. "ఒక్కగానొక్కడు! తల్లిలేని పిల్లాడు అని ఈ గుండెలమీద పెట్టుకుపెంచాను. వాడు ఈ తండ్రికి ఇచ్చిన బహుమతి చూడండి! నేను ససేమిరా వద్దనిచెప్పిన పిల్లను..... కులం తక్కువ దాన్నిచేసుకువచ్చాడు. వంశం, కులం, గౌరవం, తండ్రి- ఇవేవీ వాడికి పట్టలేదు. ఇవేవీ అక్కరలేదనుకొన్న కొడుకు నాకుమాత్రం ఎందుకు?"
ఆ మాటలు శూలాల్లా వచ్చితగులుతుంటే ప్రసాద్, జానకితో కారెక్కాడు.
* * *
"ఆ ముసలాయన చాదస్తంవల్ల అంత ఆస్తికలిగీ ఈ ముష్టి ఉద్యోగం చేయాల్సివచ్చింది ఈయన!" అంటూ ముగించింది జానకి.
రుక్మిణి సానుభూతిగా, "అయ్యో పాపం!" అంది.
"తండ్రిని నొప్పించానే అని ఈయనకి చెప్పలేనంత బాధ! సగం మనసు అక్కడే! తండ్రి క్షమించడంకోసం ఈయన తపస్సు చేస్తున్నారనుకో! వీళ్ళ నాన్న కోపం పోయి ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఈ ఉద్యోగం మానేసి ఇంటికి పోవాల్సిందే! అంతవరకు ఈ అవస్థ తప్పదు ఈయనకు."
"మీరు వెళ్ళిపోతారంటే నాకు చెప్పలేనంత బాధేస్తూంది!"
"మా మామగారి కోపం పోయినప్పటిమాట! అయినా మాకీ ఊరుశాశ్వతం కాదుకదా? ఉద్యోగరీత్యా వచ్చాం - మళ్ళీ బదిలీ అయితే ఎక్కడికో!"
"నిజమే! మీరు ఎప్పటికైనా వెళ్ళిపోయేవాళ్ళే! నీమీద ఎక్కువగా మమత పెంచుకోకూడదు. "మ్లానవదనంతో అంది రుక్మిణి.
"ఎప్పుడో వెళ్ళిపోతామని ఇప్పుడే స్నేహం త్రుంచివేస్తావా? నీ తత్వం చాలా గమ్మత్తుగా ఉందే!" నవ్వుతూ అంది జానకి.
ఆ తరువాత రుక్మిణి వారం పదిరోజులదాకా జానకికి దూరం దూరంగా మసలినా మళ్ళీ మామూలుగా కలసిపోయింది. వాళ్ళ స్నేహం దినదిన ప్రవర్థమానమన్నట్టుగా పెరిగిపోయింది. ఈ మధ్య 'వదినా వదినా' అని వరుస పెట్టి పిలుచుకోవడం ప్రారంభించారుకూడా. మాటల్లో వాళ్ళాయనల ప్రసక్తి వస్తే 'మీ అన్నయ్య' అని చెబుతున్నారు. రుక్మిణి ప్రసాద్ ని పిలిచినా, జానకి మోహన్ని పిలిచినా 'అన్నయ్యగారూ' అని పిలుస్తున్నారు. మగవాళ్ల మధ్య మటుకు పెద్దగా స్నేహం ఏర్పడలేదు. ఎప్పుడైనా ముఖాముఖిపడితే పొడి పొడి పలకరింపులు తప్ప పెద్దగా కబుర్లేమీ దొర్లేవి కాదు వాళ్ళ మధ్య.
* * *
ఒకరోజు కంగారుగా వచ్చి పిలిచాడు ప్రసాద్. "ఇలా కొంచెం వస్తావా, అమ్మా?"
"ఏమిటన్నయ్యగారూ?"
"మీ వదిన బాత్ రూంలో వాంతి చేసుకొని సొమ్మసిల్లినట్టుగా పడుకొంది పక్కమీద! నాకేమో బడికి వేళయిపోతూంది!"
"అయితే మీరు బడికివెళ్ళండి, అన్నయ్యగారూ! నేను చూచుకొంటాను!" రుక్మిణి ముఖంలో గాబరా మాయమై చిరునవ్వు చోటుచేసుకొంది.
ప్రసాద్ బడికి వెళ్ళిపోయాడు.
