"నోర్ముయ్ బే! నేను చెప్పేది విను. మా అన్నను కాల్చి చంపినందుకు ప్రతీకారంగా నేను నీ ముద్దుల కూతురు దీపని కిడ్నాప్ చేసి చంపుతా! కాస్కో....ఇదే నా శపధం....!" అంటూ రిసీవర్ పెట్టేశాడు మంగులు.
అవతల కమీషనర్ లింగారావ్ చేతిలోని రిసీవర్ జారి క్రింద పడింది.
3
అప్పుడే హాల్లోకి వచ్చిన శ్రీలక్ష్మికి భర్త లింగారావ్ ని చూడగానే చిర్రెత్తుకొచ్చింది.
లింగారావ్ నేలమీద నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చున్నాడు.
"ఏంటా కూర్చోడం....నేనింకా చావలేదు!" అంది శ్రీలక్ష్మి చికాకుగా.
"కొంప మునిగిందే శ్రీలక్ష్మి!" అన్నాడు కమీషనర్ లింగారావ్.
"ఏమైందండీ?" అడిగింది శ్రీలక్ష్మి ఈసారి కాస్త ఆందోళనగా.
"ఇప్పుడే గజదొంగ మంగులు దగ్గర్నుండి ఫోనొచ్చిందే. ముందు కిడ్నాప్ చేసి ఆ తర్వాత చంపుతాడట" బాధగా చెప్పాడు లింగారావ్.
"ఆ....వాళ్ళబొంద! వాళ్ళలానే బెదిరిస్తుంటారుగానీ, మీరేం వర్రీ కాకండి" భర్త మాటల్ని తేలిగ్గా కొట్టిపారేస్తూ అంది శ్రీలక్ష్మి.
"నీ పిండం! వాళ్ళు కిడ్నాప్ చేసి చంపుతానన్నది నన్ను కాదు-మన పాప దీపని" నెత్తి కొట్టుకుంటూ అన్నాడు లింగారావ్.
అతని వాక్యం పూర్తికాగానే, శ్రీలక్ష్మి అతని పక్కనే నేలమీద కూర్చుని "ఓ...." అంటూ రాగాలాపన చేస్తూ ఏడవసాగింది.
లింగారావ్ కంగారుపడ్డాడు.
"అబ్బ ఊరుకోవే బాబూ! ఏంటి అంతచేటున ఏడుస్తున్నావు. చుట్టు పక్కలవాళ్ళు నీ ఏడుపు వింటే నేను పోయాననుకుంటారు" అన్నాడు.
కానీ శ్రీలక్ష్మి తన ఏడుపుని ఆపలేదు.
"అబ్బా! ఊ ర్కోమన్నానా? కిద్నాపా నా బొందా. వాళ్ళలానే బెదిరిస్తుంటారుగానీ నువ్వేం వర్రీకాకు" నచ్చచెప్పాడు లింగారావ్.
"ఊర్కో ఎందుకు బెదిరిస్తారూ? వాళ్ళకి మీలా పనీ పాటా ఏం వుండవా?" లింగారావ్ నెత్తిన ఠపీమని మోడుతూ అంది శ్రీలక్ష్మి.
"నువ్విలా చీటికీ మాటికీ మొడ్తె నేను ఇంట్లో కూడా నెత్తిన క్యాప్ పెట్టుకోవల్సి వస్తుంది...." మాడు రుద్దుకుంటూ చికాకుగా అన్నాడు లింగారావ్.
అంతలో అక్కడికి దీప పరుగున వచ్చింది.
"ఏంటి మమ్మీ? ఇక్కడేదో టపాకాయ పేలిన శబ్దం వచ్చింది?"అని తల్లిని అడిగింది.
"అమ్మా....దీపా!"
బావురుమని ఏడుస్తూ దీపని దగ్గిరికి లాక్కుని గట్టిగా కౌగిలించుకుంది శ్రీలక్ష్మి.
"అబ్బ ఊర్కోవే! మన పాపకేం కాదు. ఈ కమీషనర్ లింగారావ్ సంగతి నీకు తెలీదు" అన్నాడు లి లింగారావ్ శ్రీలక్ష్మి వీపు నిముర్తూ.
"తెలుసుగనకనే ఇలా ఏడుస్తున్నా" వెక్కుతూ అంది శ్రీలక్ష్మి.
కమీషనర్ లింగారావ్ నుదుటిమీద బాధగా అరచేత్తో ఠపా ఠపా కొట్టుకున్నాడు.
"అసలు నువ్వు నన్నెందుకు నమ్మవే బాబూ! దీప నీ ఒక్కదానికే కూతురా? నాక్కూడా కూతురేకదా!"
"ఏమో....నాకేం తెల్సు?!" అంది శ్రీలక్ష్మి.
"ఆ...." అంటూ నోరు తెరిచాడు కమీషనర్ లింగారావ్.
"నోరు ముయ్యండి....దోమలు నోట్లో దూర్తాయ్. దీపకేమైనా అయితే మిమ్మల్ని చంపి నేను చస్తాను."
"నువ్వేం భయపడకు. దీపకి టైట్ సెక్యూరిటీఏర్పాటు చేస్తాను.ఆ మంగులు కాదుకదా_ వాడమ్మ మొగుడు కూడా దీప వెంట్రుకని కూడా పీకలేడు!" ఆవేశంతో అన్నాడు కమీషనర్ లింగారావ్.
శ్రీలక్ష్మి నేలమీంచి గభాలున లేచి అక్కడున్న వెంకటేశ్వరస్వామి పటానికి దండం పెడుతూ "స్వామీ! ఏడుకొండలవాడా....వెంకటరమణా! మా పాపకి ఏ చెడూ జరగకుండా క్షేమంగా వుంటే, నేను మా వారి చిటికెనవేలుని నీకు సమర్పించుకుంటా స్వామీ!" అని మొక్కుకుంది.
ఆవిడ మొక్కుని విన్న లింగారావ్ లబ్బున మొత్తుకున్నాడు.
"హవ్వ....హవ్వ....ఎవరైనా తల నీలాలు సమర్పించుకుంటా అని మొక్కుకుంటారుగానీ నువ్వేంటే బాబూ చిటికెన వేళ్ళు, బొటన వేళ్ళూ సమర్పిస్తానని మొక్కుకుంటావ్?" గిలగిల్లాడిపోతూ అన్నాడు లింగారావ్.
"అందరూ తలనీలాలు సమర్పించుకుంటామని మొక్కీ మొక్కీ స్వామివారికి అది చాలా మామూలు విషయమైపోయి వుంటుందండీ....అందుకే నేనిలా వెరైటీగా మొక్కుకున్నా...." అంటూ దీపని తీసుకుని లోపలికెళ్ళిపోయింది.
కమీషనర్ లింగారావ్ తన కుడిచేయి చిటికెన వేలుని చూసుకుంటూ భోరుమన్నాడు.
* * * *
ఉదయం 8 గంటలైంది.
దీప యూనిఫాం వేసుకుని, బూట్లు కాళ్ళకి తొడుక్కుని, స్కూల్ బ్యాగ్ భుజాలకి తగిలించుకుని "డాడీ....నే రెడీ!" అంది పోలీస్ కమీషనర్ లింగారావ్ తో.
శ్రీలక్ష్మి పరుగున వచ్చి దీపని కౌగిలించుకుంది.
"అమ్మా.... దీపా....నువ్వు స్కూలుకెళ్ళోద్దమ్మా.... ఇంట్లోనే చదువుకోమ్మా...." అంది కన్నీళ్ళు పెట్టుకుంటూ.
"లేదు మమ్మీ....నేను స్కూలు కెళ్ళకపోతే టీచర్ తంతుంది" అంది దీప.
"కానీ నువ్వు స్కూలుకెళితే నిన్ను వాళ్ళు చంపేస్తారమ్మా."
"శ్రీలక్ష్మి! చిన్నపిల్లతో ఏంటా మాటలు?!" దీపకేం కాదని నేను చెప్తున్నాగా" అంటూ మందలించాడు లింగారావ్.
శ్రీలక్ష్మి గబగబా అక్కడున్న దేవుడి పటం దగ్గరికి చెంగున గెంతి వెళ్ళింది. కమీషనర్ లింగారావ్ గుండెల్లో రాయి పడింది.
