Previous Page Next Page 
వసుంధర కథలు-1 పేజి 7


    అన్నీ ప్రశ్నలే, అన్నీ అనుమానాలే! అనుక్షణం నా మనసునిండా భయం పేరుకుంటోంది. భగవంతుడి దయ వల్ల ఇంతవరకూ నా శరీరానికి ఏ విధమైన బాధాకలగలేదు. కానీ ఇకముందు కలగదన్న గ్యారంటీ ఏముంది? భగవంతుడు కరుణించి ఏ అదృశ్య దేవతలైన చెవిలో ఆ సర్పనగర నిధిగురించి చెప్పిపోతే బాగుండును.
    నేను ఆలోచనల్లో వుండగానే నాకు ఆహారం వచ్చింది. ఆ మనిషి ముఖం కనిపించకుండా ముసుగు వేసుకున్నాడు. నేను లేచి కూర్చోడానికి వీలుగా అతను సహాయ పడ్డాడు. పదార్ధాలన్నీ మంచిరుచిగా వున్నాయి.
    "నరకలోకంలో తిండి చాలా బాగుందన్నానని మీ యమధర్మరాజుకు చెప్పు...." అన్నాను. ముసుగు మనిషి నవ్వి వెళ్ళిపోయాడు.
    భోజనం చేసిన పదినిముషాల్లో నిద్ర ముంచుకువచ్చింది. అదీ ఒక అదృష్టమే. లేకపోతే ఎదురుగా ఉన్న బల్ల, దాని మీద వస్తువులు నన్ను బాధిస్తాయి. అయితే నిద్ర నన్ను మరీ ఎక్కువగా సుఖ పెట్టిందిలేదు. ఇలలో లేని బాధలన్నీ యమధర్మరాజు చేతిలో కలలో పడ్డాను. అన్నింటినీ భరించి మెలకువ వచ్చేసరికి ఎదురుగా యమధర్మరాజు వున్నాడు. మళ్ళీ పథ మామూలే!
    అతను మాట్లాడే పద్దతి, వ్యవహరించే తీరు-చూస్తూంటే నన్ను బాధ పెట్టే ఉద్దేశ్యం లేదనిపించింది. నా అభిప్రాయాన్ని నిజంచేస్తూ అ గదిలో నేనున్నా మూడు రోజుల్లోనూ యమధర్మరాజు నన్నుమాటలతో బెదిరించడం తప్పితే గుండుసూది చూడా ఉపయోగించలేదు.
    నాలుగోరోజు ఉదయం నాకు మెలకువ వచ్చేసరికి నాకు గుసగుసల్లాంటి మాటలు వినబడ్డాయి. నా చెవులు బాగా పనిచేస్తూండడం వల్లనేమో ఆ మాటలు నేను స్పష్టంగా వినగలిగాను. అలా వినడం మంచిదే అయింది.
    "చాలామొండి ప్రాణంలా గున్నాడు. మళ్ళీ స్థలం మార్చాల్సిందే...."
    "మారిస్తే మాత్రం ప్రయోజనం ముంటుందా? ఆ నిధి గురించి చెబుతాడా?"
    "ఏమో?......అన్ని రకాలుగానూ ప్రయత్నించాలి కదా అతనికి హాని కలిగించకూడదని బాస్ ఆజ్ఞ! బెదిరింపులా కేమో లొంగడం లేదు. ఈ రోజు ఆఖరి ప్రయత్నం చేసేక మళ్ళీ స్థలంమార్చి-అప్పటికీ ప్రయోజనముండక పోతే-అప్పుడు దారుణహింసలకి గురిచేసి నిజం కక్కించాలని బాస్ అంటాడు. ఆయన అహింసావాదం మనప్రాణం తీస్తోంది..."
    ఆ తర్వాత రెండు నిముషాలకు యమధర్మరాజు గదిలోకి వచ్చాడు.
    "చూస్తూ చూస్తూ నిన్ను బాధపెట్టడం లేదనేగదా-నన్ను కాల్చేస్తున్నావ్.....ఇంక మొండివాణ్ణి నా జీవితంలో చూడలేదు...." అన్నాడు యమధర్మరాజు.
    నాలోని మొండితనమేమిటో నాకే అర్ధం కావడంలేదు. నాకు నిజంగా సర్పనగర నిధి గురించి తెలియదు. తెలియని ప్రశ్నకు జవాబు ఎలా చెప్పేది? నా నుంచి జవాబురాక విసిగిపోయి ఆఖరికి వీళ్ళు నన్ను దారుణహింసలకు గురి చేస్తే ఏంచేయాలా అని బెంగెట్టుకున్న నను మొండివాడని వీళ్ళనుకుంటున్నారు. వీళ్ళచేతుల్లోంచి ఎప్పటికి ఎల్లా తప్పించుకుంటానో ఏమో!
    నేను మాట్లాడలేదు. యమధర్మరాజు ప్రశ్నలకు నేను మామూలు సమాధానాలే చెప్పాను. అతను నన్ను బెదిరించి వెళ్ళిపోయాడు. తర్వాత ఆహారం వచ్చింది. భుజించి నిద్రపోయాను. ఈసారి నన్నదొక రకమైన మత్తు ఆవహించింది.
    
                                      3

    కళ్ళు తెరిచేసరికి ఇంకో కొత్తగదిలో వున్నాను. ఈ గది చాలా అందంగా వుంది. అటూ ఇటూ చూసి ఉలిక్కిపడ్డాను. నేనిప్పుడు మంచానికి బందీనికాను.
    చటుక్కున మంచం దిగాను. గదికి ఒకేఒక్క ద్వారముంది. అక్కడకు వెళ్ళాను. తలుపులు వేసివున్నాయి. మళ్ళీ వెనక్కి వచ్చాను. గదిలో చక్కని పరిమళం!
    "నాకోసం వెతుక్కుంటున్నావా ప్రియా!"
    తీయని మాటలు వినపడి చుట్టూ చూశాను. నేను చూస్తూండగా కిలకిల నవ్వుకుంటూ ఒక యువతి మంచం కింద నుంచి వచ్చింది. ఆమె అలంకరణ పౌరాణిక సుందరి విధంగా వున్నది.
    "నేనెక్కడున్నాను?" అన్నాను అప్రయత్నంగా.
    "స్వర్గలోకంలో" అందామె.
    ఆశ్చర్యంగా "నువ్వెవరు?" అన్నాను.
    "అప్సరసను...." అందామె. తర్వాత నెమ్మదిగా స్వరం తగ్గించి....."ఇక్కడ నీవూ, నేనూ.....ఇంకెవ్వరూ లేరు...." అంది.
    "అయితే....?" అన్నాను.
    "మగాడివి. నీకే తెలుసు...." అందామె మర్మగర్భితంగా.
    నేను మగాడిననీ, ఆమె యువతి అనీ నాకు తెలుసు. మేమక్కడ ఒంటరిగా చేరామనీ గ్రహించాను. అయితే.....
    నేను బ్రహ్మచారిని. పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యం నాకులేదు. నా జీవితం పూర్తిగా ప్రజాసేవకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకు భార్య అడ్డంకి కాగలదని నా నమ్మకం. అందుకే పెళ్ళి చేసుకోలేదు.
    "నాకు నీ మాటలు అర్ధం కావడంలేదు....." అన్నాను.
    "నేను నీదాన్ని...." అందా యువతి.
    "నేను నిన్ను పెళ్ళిచేసుకోబోవడం లేదు. అలాంటప్పుడు నువ్వు నాదానినెల్లాగౌతావు?" అంటూ సూటిగా ప్రశ్నించాను.
    ఆమె పగలబడి నవ్వింది - "నువ్వు బాగా నవ్వించగలవు. ఇలాంటి చతురోక్తి విని చాలా కాలమైంది...." అంది.
    "నేను హాస్యమాడడం లేదు. నిజమే చెబుతున్నాను."
    "ఆడ, మగ ఒకచోట చేరినప్పుడు మగాడు చొరవ చేస్తాడు. అడహి పెళ్ళిగురించి అడుగుతుంది. ఆడదానికే పెళ్ళిభయం వుంటుంది. ఆడదే చొరవచేస్తే..." అని నవ్వి-"నీలా ప్రశ్నలు వేసే మగాడుమాత్రం ఈ భువిలో వుండడు...." అంది అప్సర.
    "అవుననుకో. నేనందరి మగాళ్ళలాంటి వాడినీకాను" అన్నాను.
    "అయినా నేను వదలనుగా. నేనందరి ఆడవాళ్ళలాంటి దాన్నీ కాను" అంది అప్సరస.
    "అప్సరా! నాతో ఏమిటి పని నీకు" అన్నాను. నా భయం నాకుండనే వుంది.
    నేనెప్పుడూ ఆడదానికి ఇంత సన్నిహితంగా రాలేదు. గాంధీమహాత్ముడి అడుగుజాడల్లో నడవాలనీ, నేను నమ్మిన ధర్మాన్ని పాటించాలనీ నా కోరిక. ప్రజాసేవ విషయంలో నేననుకున్నవన్నీ చేయలేకపోతున్నాను. అందుక్కారణం అంతా నా చేతుల్లో లేకపోవడమే!


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS