Previous Page Next Page 
శంఖారావం పేజి 7

 

    కానీ ఈ విషయంలో బావ తన మాట వినడు. తన మాట అతడు వినడానికి తనేదైనా ఉపాయామాలోచించాలి....
    ఉదయ చేతిలో ఉత్తరం ఇంకా అలాగే వుంది.
    ఆమె కళ్ళల్లో నీరు ఆలోచనల్లో ఇంకిపోయింది.
    బుగ్గపై కన్నీటి చారికలింకా అలాగే వున్నాయి.
    అప్పుడు కులభూషణ్ లోపల ప్రవేశించి --" ఉదయా! నీకొక శుభవార్త ! నీ విస్సీ బావ వచ్చేస్తున్నాడు ...." అన్నాడు.
    "ఎప్పుడు ?' అంది ఉదయ. ఆమె ముఖంలో ఆత్రుత కంటే కంగారెక్కువుంది. అనందం కంటే భయం ఎక్కువ కనబడుతుంది.
    "రేపేదో సమయానికి నీ ఎదుట ఉంటాడు ....'
    ఉదయ భారంగా నిట్టూర్చింది.
    ఆమె కనుల్లో వేయి దీపాల వెలుగులు లేవు.
    కులభూషణ్ నిట్టుర్చీ --"ఈ వార్త నన్ను థ్రిల్ చేసినట్టింకేవరినీ థ్రిల్ చేయలేదు. అంతా నా దురదృష్టం " అన్నాడు.
    "ఏమయింది?" అంది ఉదయ.
    సీతమ్మకు తను చెప్పాలను కుంటే ఏం జరిగిందో చెప్పడతడు.
    ఉదయ నవ్వి -- 'ఒక మంచి వార్తను చెప్పి ఇతరులను సంతోష పెట్టాలనుకునే మంచి బుద్ది నీకుంది కాబట్టి నిరుత్సాహ పడుతున్నావు" అంది.
    "మంచి బుద్ది నీది. ఏదో విషయానికి ఏదుటివారిని మెచ్చుకుంటుంటావు"
    "అది నా గొప్పతనం కాదు. విస్సీ బావ నేర్పాడు."
    "ఇండియాలో ఉండే నీకేన్నో నేర్చాడు నీ విస్సీ బావ. ఇప్పుడమెరికా వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఇంకెన్ని నేర్పుతాడో చూడాలి !"
    "భూషణ్! బావ నుంచి నేనిం'కేమీ నేర్చుకోను. అందుకనే నీసాయం కావాలి."
    'అంటే?"
    "నన్ను చూడు, నేనేలాగున్నాను?" అంది ఉదయ.
    అప్పుడు ఉదయ మంచం మీద కూర్చుని ఉంది.
    పైన ఫ్యాను తిరుగుతుంది.
    గాలి కామె ముంగురులు ఎగురుతున్నాయి.
    ఆమె కళ్ళల్లో తేజస్సు... ఆ తేజస్సులో ముఖం ప్రకాశవంతమైంది.
    ఆమె కొడిగట్టిన దీపంలా లేదు. రాలిపోయే చిగురుటాకులా లేదు. అస్తమయం భానుడిలా లేదు.
    ఆమెను చూడగానే ఏదో దివ్యానుభూతి!
    "నువ్వు దేవతవు" అన్నాడతను.
    'అవును, బ్లడ్ క్యాన్సర్ నన్ను బ్రతికుండగానే దేవతను చేసింది ...." అంటూ నిట్టుర్చిందామె.
    "నా అభిప్రాయం అది కాదు...."
    "నీ అభిప్రాయం ఏదైనా నాకు నీ సాయం కావాలి ..."
    "ఏమిటో చెప్పు ...."
    "అడిగేక కాదనకూడదు...."
    కులభూషణ్ అనుమానంగా "అది నీ ప్రాణాలు తీసేది కాకూడదు గుర్తుంచుకో " అన్నాడు.
    "నా ప్రాణాలు తీయడానికి బ్లడ్ క్యాన్సర్ వుంది" అంది ఉదయ.
    "మరైతే ఏమిటో చెప్పు ...."
    "నేను, విస్సీబావ ప్రేమించుకున్నాం, కానీ మా ప్రేమ పవిత్రమైనది. ఆ విషయం నువ్వు నమ్ముతావా?"
    "ఎందుకు నమ్మాలి ?"
    "ముందు నమ్ముతావో....నమ్మవో చెప్పు ...."
    'ఊ...." అన్నాడు కులభూషణ్.
    "అయితే నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా ?" అంది ఉదయ సూటిగా.
    తెల్లబోయాడు కులభూషణ్....."అదెలా సాధ్యం ?"
    "నర్శింగ్ హొంలో నా గురించి డాక్టర్ గా చేరావు నువ్వు. ఈ వ్యాధికి నేను బలైపోయినా నాకులా మున్ముందు మరెందరో బలి కాకూడదని పరిశోధనలు చేస్తున్నావు. నువ్వు నన్ను కంటికి రెప్పలా చూసుకున్తున్నావు. బ్రతికుండగానే నాలో మరింత జీవం నింపాలని ప్రయత్నిస్తున్నావు. నీ నిరంతర సేవ నాకు నాపై ఆరాధనా భావాన్ని కలిగించింది. ఆ ఆరాధనా భావం లోంచి ప్రేమ పుట్టుకొచ్చింది. ఇప్పుడు నేను నిన్ను తప్ప ఇంకెవరినీ పెళ్ళి చేసుకున్నా --ఆ వ్యక్తికీ అన్యాయం జరుగుతుంది " అంది ఉదయ.
    "నేనిది నమ్మను" అన్నాడు కులభూషణ్.
    "నువ్వు నమ్మొద్దు. విస్సీ బావకు చెప్పాల్సిన కధ ఇది"
    "నీ బావ ఈ కధ నమ్మడు. మన పెళ్ళి జరగనివ్వడు."
    "బావ వచ్చేసరికే మన పెళ్ళి అయిపోతే ?"
    కులభూషణ్ తెల్లబోయి "నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుసా?" అన్నాడు.
    "నీకు తెలుసు. విస్సీ బావతో పాటు వేదాంతం కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ విషయం విస్సీ బావ కూడా గ్రహించాడు. ఒకసారి బావ నాతొ ఆ విషయం చెప్పాడు. నేను కలవరపడ్డాను. కానీ నాలుగు రోజులు శ్రద్దగా గమనిస్తే విస్సీబావ మాటలు నిజమని తెలిశాయి. నేను వేదాంతాన్ని పిలిచి మాట్లాడాను. మాటల్లో ప్రేమను చూపడం మినహా అతడేమీ హద్దులు మీరలేదు. విస్సీ బావపై అసూయ పడలేదు. విస్సీ బావ నాతొ "స్వతహాగా వేదాంతం ఆవేశ పరుడు , నీమీద ప్రేమ వాడిలో ఆవేశాన్ని తగ్గించి నిదానాన్ని పెంచుతుంది. ఇదీ ఒకందుకు మంచిదే!' అన్నాడు." అంది ఉదయ.
    "ఇది నువ్వు నాకెందుకు చెబుతున్నావు ?"
    "విస్సీ బావ కానీ నేను కానీ మా ప్రేమను వేదాంతం కోసం త్యాగం చేయాలను కోలేదు. అలాంటి త్యాగబుద్ది మాలో లేదు. ఇప్పుడు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానంటే అందులో త్యాగముందని అనుకోకు."
    "నువ్వు నీ విస్సీబావ జీవితం బాగుపడాలని నీ కోసం వృధా కాకూడదని భావించి నన్ను పెళ్ళి చేసుకుంటా నంటున్నావని నేనూహించగలను. అలాంటప్పుడు నిన్నెంతగానో ప్రేమించిన వేదాంతాన్ని పెళ్ళి చేసుకోకూడదా?" అన్నాడు కులభూషణ్.
    "వీలుపడదు. ఎందుకంటె పెళ్ళి విషయంలో వారిద్దరిదీ ఒకే తరహ. నీ పద్దతి వేరు" అంది ఉదయ గంభీరంగా.
    ఆ మాటలు చెళ్ళున కొరడా దెబ్బల్లా తగిలాయి కులభూషణ్ కు.
    వేదాంతం, విశ్వనాద్ ఇద్దరు పరాయి స్త్రీని తల్లిగా భావిస్తారు. ప్రకృతి సహజమైన కోర్కెలు తీర్చుకునేందుకు పెళ్ళి ఒక్కటే మార్గమని నమ్ముతారు. ఏకపత్నీ వ్రతుడు శ్రీరామ చంద్రుడు వారి ఆదర్శం. వారిలో ఉదయ నెవరు పెళ్ళి చేసుకున్నా జీవితాంతం బ్రహ్మచారులుగా మిగిలిపోతారు.
    మరి తను ?!
    స్త్రీ అతడి బలహీనత.
    ప్రతి స్త్రీని కాంక్షిస్తాడు. కాంక్షించిన స్త్రీ కోసం ప్రయత్నిస్తాడు. ఎటొచ్చీ ఆమెను పొందడం కోసం క్రూరమైన పద్దతులు నవలంభించడు.
    "తప్పు నీది కాదు -- నీ చదువుది. నీ వృత్తిది " అనేవాడు విశ్వనాద్.
    "నా స్వభావంలో నా చదువునీ, వృత్తినీ కళంకం చేశాను. నా వృత్తి, చదువు నాకులా అందర్నీ తయారు చేయడం లేదు" అన్నాడు కులభూషణ్ విశ్వనాద్ తో.
    "నీ ప్రవర్తనలో కళంకమున్నదని నువ్వు నమ్ముతున్నావా?" అన్నడప్పుడు విశ్వనాద్.
    "లేదని నీవు నమ్ముతున్నావా?" ఎదురడిగాడు కులభూషణ్.
    "నీతికి నిర్వచనం లేదు. మనిషి వీలును బట్టి ఒకోచోట ఒకోరకం సంప్రదాయాన్ననుసరిస్తున్నాడు. అదే నీతి అవుతోంది. నేను కొన్ని ఆదర్శాలను నమ్ముకున్నాను. నమ్ముకున్న ఆదర్శాలను నదించకపొతే అది అవినీతి అవుతుంది. ఆ ఆదర్శాలను నువ్వు నమ్మాలని లేదు. ఎదుటి వారికి బాధ కలిగించనంత కాలం ఏ ఆదర్శామైనా తప్పు లేదు. మన సమాజ మేర్పరచిన సంప్రదాయాల కారణంగా నువ్వు చేస్తున్నది తప్పని నీ కనిపిస్తోంది. మనస్పూర్తిగా నువ్వు తప్పని నమ్మితే ఆ తప్పు చేయలేవు. ఏ మూలో అది తప్పుకాదన్న భావం నీలో వుంది' అన్నాడు విశ్వనాద్.
    "చాలా బాగా చెప్పావు, ఇంత వివరంగా తెలిసిన నీవు మాత్రం లేనిపోని ఆదర్శాలను పట్టుకుని వేలాడడ మెందుకు?" అన్నాడు కులభూషణ్.
    "చూశావా -- నావి లేనిపోని ఆదర్శాలన్న భావం నీ మనసులో ఉంది. అదిప్పుడు బయట పడింది " అన్నాడు విశ్వనాధం " నవ్వి.
    కులభూషణ్ తడబడి --- "అలాగే అనుకో -- కానీ నువ్వు నా ప్రశ్నకు బదులివ్వలేదు" అన్నాడు.
    "బలహీనతల వణచుకుందుకూ , మనో నిగ్రహాన్ని పెంచుకుందుకూ ఆదర్శాలుండాలి . అందువల్ల కలిగే తృప్తి అనుభవించిన వాడికే తెలుస్తుంది."
    కులభూషణ్ విశ్వనాద్ తో వాదించలేదు. తన పద్దతి మార్చుకోలేదు.
    చదువుకునే రోజుల్లో అతడికి తన క్లాస్ మేట్స్ అయిన కొందరమ్మాయిలతో దగ్గర సంబంధముండేది. ఆ తర్వాత కొందరు నర్సులతో --- ఇంకా చెప్పాలంటే గొప్పింటి పేషంట్లతో ....
    స్త్రీ విషయంలో కులభూషణ్ తన్నూ తానదుపు చేసుకోవాలను కోలేదు , ఆ విషయం సీతమ్మ కూడా చూచాయగా తెలుసు.
    ఉదయ జీవితం అశాశ్వతం, ఉదయను పెళ్ళి చేసుకుంటే కులభూషణ్ కేమీ నష్టం లేదు. ఆమె పోగానే మరో పెళ్ళి చేసుకుంటాడు.
    అతడు ఉదయ వంక మరోసారి చూశాడు.
    ఆమె కన్నుల్లో పరిహాసం లేదు. చులకనభావం లేదు.
    అతడి కామెలో అలౌకిక సౌందర్యం కనబడింది.
    "ఉదయా! నేను నీకు తగను! భార్యగా నిన్ను భరించలేను" అన్నాడతను.
    ఉదయ భక్తుడికి వరమిచ్చే దేవతలా నవ్వి ---" అర్హతల గురించి మాట్లాడకు. నాకిప్పుడు పెళ్ళి కావాలి. లేకుంటే ప్రాణం పోవాలి " అంది.
    అమెమాటల్లో కఠోర నిశ్చయముంది.
    కులభూషణ్ కంగారుగా -- "నేనేం చేయాలో చెప్పు " అన్నాడు.
    ఉదయ మంచం దిగింది. దూరంగా ఉన్న టేబులు దగ్గరకు వెళ్ళి సొరుగు లాగి అందులోంచి ఓ భరిణ తీసింది.
    "ఇలా రా !' అంది కులభూషణ్ ప వంక చూసి.
    కులభూషణ్ ఆమెను సమీపించాడు. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS