Previous Page Next Page 
ఉదాత్తచరితులు పేజి 7


    "మీ తగవులు మాని మరో ఐస్ క్రీమ్ తినండి." వాళ్ళ తగవులు ఎన్ జాయ్ చేస్తున్న సోఫియా అంది.
    రాజీవ్, మరో అతను వచ్చి పక్కబల్ల దగ్గర కూర్చున్నారు.
    "మీ వాళ్ళు పరీక్షలు బాగా వ్రాశారా? సంజయ్! ఎమ్. ఏ. ఎకనామిక్స్ ఫైనల్!" అంటూ మరో అతన్ని వారికి పరిచయం చేశాడు.
    సోఫియా సంజయ్ అందానికి ఆశ్చర్యపోయింది. మగవారిలోకూడా అంత చూడాలనిపించే అందం ఉందను కోలేదు! సంజయ్ చూపులు తల వంచుకొని ఉన్నవీణ మీదనే ఉన్నాయి.
    "వారు మిస్ వీణ! జుబేదా! సోఫియా! డాక్టరమ్మలు."
    "నమస్తే!" ఆన్నారు సోఫియా, జుబేదాలు.
    వీణకూడా "నమస్తే!" అనక తప్పలేదు.
    హోటల్ నుంచి బయటికి వస్తూ, "సోఫియా! మిమ్మల్ని లక్ష్మిగారు ఇంటికి తీసుకురమ్మన్నారు" అన్నాడు రాజీవ్.
    "ఈ రోజు షాపింగ్ చేయాలట. రేపే వీరి ప్రయాణం!" అంది సోఫియా.
    రాజీవ్ ఎటో ఆలోచిస్తూ ఉండిపోయాడు.
    "సోఫీ! వాళ్ళని పంపేయ్. మనం ఫ్రీగా ఉండలేము" అంది వీణ.
    రాజీవ్ వాళ్ళని అక్కడే వదిలి షాపింగ్ సెంటర్ కి వెళ్ళారు.
    వెళ్ళిపోతున్న జుబేదా వెనక్కి చూసింది. జగ్గు బయటికి వచ్చి నిలబడ్డాడు. అతడి కళ్ళు టాటా చెప్పుతున్నట్లుంది!
    నాన్నమ్మకి పుస్తకాలు, శాలువ; నాగలక్ష్మికి గాజులు కొంది వీణ.
    జుబేదా ఫాన్సీ వస్తువులు, సెంట్స్ కొన్నది.
    "జుబేదా! మీరు స్ట్రాంగ్ సెంట్స్ వాడుతారు, ఎందుకు?" అంది సోఫియా.
    "ముస్లిమ్ దేశాలు, అరేబియా దేశాలలో నీరు తక్కువ. రోజూ స్నానం చేయలేరు. అందుకు ఏ వాసనా రాకుండా సెంట్స్ వాడేవారు. అదే ఆచారంగా ... సెంట్ల వాడకంగా వచ్చి ఉంటుంది. కదూ, జుబేదా!" అంది వీణ.
    "ఏమైనా అనుకో!" అంది జుబేదా.
    హాస్టల్ వరకు కారులో డ్రాప్ చేశాడు రాజీవ్.
    సంజయ్ ఏవో కొన్ని మాటలు మాట్లాడాడు. అతని మనస్సంతా వీణపైనే ఉంది.    
    తమ ఊరికి వెళుతున్న ఎగ్జైట్ మెంటులో వీణ రాజీవ్ కి థాంక్స్ చెప్పింది.
    "హౌ ఈజ్ దట్ గర్ల్!" అని రాజీవ్ అంటే, 'ఐ లవ్ హర్!' అని మనస్సులో అనుకొని పైకి, "ఫైన్!" అన్నాడు సంజయ్.
    ఆ రాత్రి అంతా వీణ, జుబేదాలు ఏవో సర్దుతూనే ఉన్నారు. ఉన్నట్లుండి వీణ అంది, "సోఫీ! నీకూ హాలీడేస్ కదూ? మా ఇంటికి రావూ?" అని సోఫీ పక్కలో కూర్చుంటూ.
    సోఫియా వెంటనే వస్తానని ఒప్పుకొంది.
    "మా ఇంటికికూడా రావా?" అంది జుబేదా.
    "ముందు నేను కదా అడిగాను?" వీణ కోపంగా లేచింది.
    "నన్ను పిలవలేదుగా నీవు?" నిష్ఠూరమాడింది జుబేదా.
    "నీవు పిలిచావా?"
    " అర్ధంలేని తగవులు మాని పడుకోండి! రేపు ప్రయాణం చేయాలి." అంది సోఫియా.
    గంట గంటకి లేచి టైమ్ చూసుకుంటూనే ఉన్నారు.
    స్టేషన్ లో రాజీవ్ రెడీగా ఉన్నాడు.
    సామాను కంపార్టుమెంటులో సర్దాడు. షట్టర్స్ కున్న అద్దాలు దించాడు. వీణతోపాటు సోఫియాకూడా వెళుతున్నందుకు సంతోషించాడు.
    రమ్మంటే తనుకూడా రైలు ఎక్కేస్తానన్నాడు.
    'బాబోయ్!' అన్నట్లు చూస్తున్న వీణతో, "భయ పడకు. ఇప్పుడు రాను. వచ్చే రోజు తప్పక వస్తాను" అన్నాడు.
    దగ్గరగా వంగి ఎంతో చనువు ఉన్నట్లు మాట్లాడుతుంటే ఒళ్ళు మండుతున్నది వీణకు.
    "జుబేదాకు పొద్దున్న ట్రెయిన్ లో సీటు దొరికిందా?" అంది సోఫియా రాజీవ్ తో.
    "బెర్త్ దొరికింది. సంజయ్ కూడా వెళ్ళాడు హైదరాబాదు."
    గార్డ్ విజిల్ ఊదాడు.
    'ట్రెయిన్ కదులుతుంది. ఇంకా దిగలేదా!' అన్నట్లు చూస్తున్న వీణ కళ్ళలోకి క్షణం చూసి తల ఊపి, "విష్ యు ఎ హాపీ టైమ్!" అంటూ స్పీడు అందుకొంటున్న ట్రెయిన్ మంచి దిగాడు.
    పరుగెత్తే నడకతో స్టేషన్ బయటికి వెళ్ళాడు.
    "హమ్మయ్య!" అంటూ సర్దుకొని కూర్చుంది వీణ.
    "వీణా! నన్నంటుకు కాకి అన్నట్లు అలా ప్రవర్తించ కూడదు. నలుగురితో మాట్లాడాలి. ఎలా మెలగాలో నేర్చుకోవాలి. ఒకరి మనస్సు కష్టపెట్టకు. రాజీవ్ ఏం తప్పు చేశాడని అలా ఉంచుతావు? జుబేదా చూడు- సర్వర్ జగ్గుతో ఎంతదయగా ఉంటుందో! ఓ చిరునవ్వు అవతల వాళ్ళకి తృప్తినిస్తే అంతే చాలు. మనసున్న మగవాళ్ళు చాలా అరుదు. మంచి అవకాశాలను దూరం చేసుకోకూడదు."
    "సోఫీ! ప్రేమ - పెళ్ళిళ్ళు నాకు పట్టవు! నా కెందుకో అసహ్యం. వాటికి ఎంత దూరంగా ఉంటే ఒంటికి అంత మంచిది. మన పాటికి మనం జీవిస్తూ ఉంటే, ఆ చెట్లు, స్తంభాలు పరుగెత్తిపోతున్నట్లు అందరూ దాటుకొని పోతారు! సో .... ఫీ! .... ఆ రోడ్డు మీద కారు...."
    "మైగాడ్! రాజీవ్ ఎంత స్పీడుగా వెళ్ళిపోతున్నాడు! ఎక్కడికి?" సోఫీ కంఠంలో వణుకు స్పష్టంగా వినవచ్చింది.
    స్టేషన్ వచ్చింది. ట్రెయిన్ ఆగింది. ఫ్లాట్ ఫారమ్ మీద రాజీవ్ నవ్వుతూ నిలుచున్నాడు.
    "రాజ్!" అంటూ చెయ్యి ఊపింది సోఫీ.
    కళ్ళు పెద్దవి చేసి రాజీవ్ ని చూసింది వీణ.
    'ఆ కళ్ళను ఒకసారి చుంబిస్తే చాలు!' ఆ ఆలోచనలో క్రింది పెదవి వణికింది రాజీవ్ కి!
    "రాజ్! ఏమిటా పిచ్చిపని..." సోఫియాకి మాటలు చాలలేదు. ఎంత పిచ్చి ప్రేమికుడు! తా నెరిగిన రాజీవ్ కి, ఇతనికి ఎంత భేదం! వీణ పాతుకుపోయిన శివలింగం!...
    ఆగినట్లే లేదు. ట్రెయిన్ కదిలిపోయింది. కను మరుగై పోయేవరకు చెయ్యి ఊపుతూనే ఉన్నాడు.
    "ఇలా రిస్క్ తీసుకొనే వాళ్ళని యుద్ధంలోకి పంపి వేయవచ్చు!" తేలిగ్గా నవ్వుతూ అంది వీణ.
    'ఇంత అందం, తెలివి ఉన్న వీణకు హృదయం ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి!' అనుకొంది సోఫీ.
    "సోఫీ! మనకు కనిపిస్తున్న ఆ కొండల బారులు, పయనించే మేఘాలు జుబేదా కంటికి ఎలా కనిపిస్తాయో? ఎన్ని ఊసులు చెప్పుతాయో? మన కంటికి కొండల మీద రాళ్ళు కనిపిస్తున్నాయి. ఈసారి దాని భావాలు అడగాలి!"

                            *    *    *
        
    మరో స్టేషన్ వచ్చింది. ఆ కంపార్టుమెంటులో వారున్నట్లు తెలిసినట్లే సంజయ్ సూటుకేసు పట్టుకొని వచ్చాడు.    
    "హల్లో!" అంటూ విష్ చేశాడు హైదరాబాదు ట్రెయిన్ లో వెళ్ళినవాడు....
    ఒక పాకెట్ తీసి వారిద్దరి మధ్య ఉంచాడు-"మిస్ జుబేదా ఇచ్చింది" అని.
    వీణ గబగబ విప్పింది. స్వీట్స్ ఉన్నాయి.    
    "సోఫీ! జగ్గు ఇచ్చి ఉంటాడు." రహస్యంగా చెప్పినా సంజయ్ విన్నాడు.
    కళ్ళతో వారించి, "ఇది ఇద్దామని హైదరాబాదు ట్రెయిన్ దిగేశారా!" అంది సోఫియా.
    "ఆఁ...ఆహఁ! నాకు పని ఉండి ఈ స్టేషన్ లో దిగాను!" అబద్ధం ఆడి పట్టుబడిన పిల్లాడిలా కనిపించాడు.        చిన్నపిల్లల్లా ప్రవర్తించే ఈ మగవాళ్ళే నా ఆడవారిని అలా హింసించి, కడుపులు చేసి, నిర్భయంగా వారిని నరికేసి వెళ్ళేది అని తలచింది సోఫీ!
    సంజయ్ బిడియస్థుడు. చనువు తీసుకుని కలుపు గోలుగా మాట్లాడలేడు. అందులో ఇద్దరమ్మాయిల ముందు నోట మాటే రావటం లేదు.
    సోఫియానే వాళ్ళ యూనివర్శిటీ గురించి మాట్లాడింది. ఎమ్. ఎ. అనగానే ఐ. ఎ. ఎస్. కు కూర్చుంటాడని, ఫారిన్ ఛాన్స్ వస్తే వెళదామని ఉంటుందని అతని ఫ్యూచర్ గురించి వివరాలు అడిగింది.
    మాగజైను అడ్డంగా పెట్టుకుని జంక్షన్ వచ్చేంత వరకు వీణవైపే చూస్తూ ఉన్నాడు.
    సూటుకేసు పట్టుకొని దిగిపోతూ వారిదగ్గర వీడ్కోలు తీసుకొన్నాడు.
    "హేండ్ సమ్ ధాస్! వీణా! ఇతడైనా నీకు నచ్చాడా?"
    "అందమైన మగవాణ్ణి అసలే నమ్మకూడదు! పిచ్చి సోఫీ! గుణాభిరాముడు అందమైనవాడే. తనను నమ్మి నూలువస్త్రాలు ధరించి అతనితో అరణ్యవాసం చేసిన సీతను రాముడు ఏమి చేశాడు? ఎవడో, ఏదో అన్నాడని నిండు గర్భిణిని అరణ్యం పాలు చేయలేదా? రాజ్యాన్ని తమ్ముళ్ళ కిచ్చి తన ప్రాణపతితో అరణ్యం లోకి ఎందుకు పోకూడదు! ? చూశావా మగవాడి స్వార్ధం! మత్స్య యంత్రాన్ని పగులగొట్టు తనను గెలుచు కొన్న అర్జునుని ప్రేమించడం ద్రౌపదిది తప్పట. పండుని పంచుకున్నట్లు ఆడదాన్ని పంచుకొని ఇంత మంది మొగుళ్ళు అని హేళనకు గురి చేశారు! ఇక ఈ యుగంలో - పది మంది పిల్లల తండ్రి మరో పెళ్ళి చేసుకోవచ్చు. తప్పు లేదు. అసహ్యం కాదు. లేత వయస్సులో భర్తను పోగొట్టుకుని, తీగలా తనను పెనవేసుకున్న అమ్మను అందమైన నాన్న మానసిక హింసకు గురి చేశారు. సోఫీ! నీవు చెప్పు!"
    ఆవేశంతో ఎర్రగా కందిన ఆమె ముఖం చేతుల్లోకి తీసుకుంది సోఫియా.
    ఆవేశం తగ్గాక సిగ్గుగా నవ్వుతూ, "సోఫీ! ఐయామ్ సారీ!" అంది.
    'ఇందుకా వీణ హృదయ కుసుమం ముడుచుకు పోయింది. మరి తన హృదయం బ్రద్దలు కావలిసిందే! కాని కాలేదు....' ఆలోచనలో ఉన్న సోఫియాని పలకరిస్తూ, "సోఫీ! మీ ఇంటికి ఉత్తరం వ్రాయలేదు. ఎప్పుడూ మీ అమ్మమీ నాన్న విషయాలు చెప్పలేదు!" అంది.
    "మీ రెప్పుడూ నా స్నేహాన్ని కోరారు. నా స్వంత విషయాలు నీ వెప్పుడూ అడగలేదు. నా అంతస్తును బేరీజు వేయలేదు. అందుకే నీవు, జుబేదా నాకు నచ్చారు. అనవసరంగా ఇతరుల విషయాలలో జోక్యం కలుగజేసుకోరు. నాకు మంచి పేరు లేకున్నా, నా స్నేహాన్ని మాత్రమే కోరారు...నీవు ఎవర్ని ప్రేమించావు? నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎంతమందిని వేధించలేదు. నీ పసి హృదయం మరీ నన్ను ఆకర్షించింది. నా స్వంత విషయాలు వింటే నాకు దూరం అవుతావేమోనని భయంకూడా." వీణ వైపు చూసింది సోఫియా.
    ఆదరంగా సోఫియా ఒడిలో తల పెట్టుకొని పడుకొంది వీణ. సోఫియా తన ఇంటి గురించి చెప్ప సాగింది.
    "అమ్మ స్కూల్ టీచరు. ఆ బడిలో థర్డ్ ఫారమ్ వరకు ఉండేది. బడికి దగ్గరగా పూరింట్లో అమ్మ ఒక్కతే ఉండేది. సాయంత్రంపూట పిల్లలు చదువు కోను, కొంతమంది ప్రైవేటు చెప్పించుకోను వచ్చే వారు. సెకండ్ ఫారమ్ చదువుతున్న వెంకురెడ్డి కూడా సాయంత్రం వచ్చేవాడు. పదమూడు, పధ్నాలుగేళ్ళు ఉండే వెంకురెడ్డి అమ్మకంటే ఎత్తుగా ఉండేవాడు. పంతులమ్మకి, విద్యార్ధికి మధ్య ప్రేమ పుట్టుకు వచ్చింది, ఫలితం అమ్మ గర్భం ధరించింది!
    పెద్దదైన అమ్మను, కులంగాని అమ్మను పిల్లవాడు లోకాన్ని ఎదిరించి అమ్మను పెళ్ళి చేసుకున్నాడు. 'వెంకూ!' అంటూ నాన్న పాదాలకి నమస్కరించి ఉంటుంది. నాన్నకూడా ఏసుక్రీస్తునే పూజించేవాడు. నాన్న రంగు, అమ్మ పోలికలతో అక్క పుట్టింది. అందమైన అక్క అంటే మా కెంతో ప్రేమ! అక్క మంచిది అని అందరూ మెచ్చుకొనేవారు. మే మెంతో సుఖంగా, సంతోషంగా పెరిగాము. అక్క ఎస్. ఎస్. ఎల్. సి. ఫెయిల్ అయింది. 'మానవసేవయే మాధవసేవో అని నమ్మిన అక్క నర్సింగ్ కి వెళ్ళింది. ట్రెయినింగ్ పూర్తవుతుంది. వైజాగ్ నుంచి అక్క వస్తుందని ఎదురుచూస్తున్నాము.
    కుటుంబం ఆరాధన చేసుకొంటున్న సమయంలో అక్క వచ్చింది. చెదిరిన తల, బిత్తర చూపులు, భయంతో ముడుచుకుపోతున్న అక్కను చూస్తూ ఉంటే దుష్యంతునిచే పరిత్యజించబడిన శకుంతల శకుంతల జ్ఞాపకం వచ్చింది.
    అమ్మ గద్దించి అడుగుతున్నది. అక్క ఏడుస్తూ చెపుతున్నది. మళ్ళీ అదే చరిత్ర! డాక్టరు అక్కను ప్రేమించాడు. ప్రేమించిన అక్కకి గర్భం ప్రసాదించి తప్పుకుని పోయాడు!
    అతి మంచి నాన్న పన్నెత్తి మాటన లేదు. తల వంచుకొని వెళ్ళిపోయాడు.
    గర్భం తీయిస్తానంది అమ్మ.
    'వద్దమ్మా! నాకు మిగిలింది ఇదే! నేను బ్రతకాలంటే నాదీ అంటూ ఒక పాప కావలమ్మా!' అని ఏడ్చింది అక్క బ్రతకాలంటే మాటలా? సంఘాన్ని ఎదిరించే శక్తి, స్వంతంగా బ్రతికే అర్హత ఉండాలి.
    అక్క అబ్స్ కాండ్ అయి వచ్చేసింది. పెళ్ళి కాకుండా గర్భం వస్తే డిస్ మిస్ చేస్తారు.
    ఆలోచించి, అమ్మ తమ్ముడు-చదువు సంస్కారం లేని తాగుబోతు ఉన్నాడు- లోకానికి పెళ్ళయిందని పిలచాలని, పాస్టరుని పిలిపించి పెళ్ళయిందనిపించారు. మామకు కొంత డబ్బు ఇచ్చి పంపివేసింది అమ్మ.
    అక్క ట్రెయినింగ్ పూర్తి చేసింది. అబ్బాయి పుట్టాడు.
    ముద్దుగా ఉన్న వాడికి 'డేవిడ్' అని పేరు పెట్టింది. 'అంతా మీ బావలాగే ఉన్నాడు' అంటూ పదేపదే చెప్పేది. మనసా వాచా అతన్నే బర్తగా నమ్మింది అక్క, నేను అక్క దగ్గరే ఉండేదాన్ని చదువుకొంటూ.
    'సోఫీ! నీవు పెద్ద చదువులు చదవాలి. డాక్టరుమ్మని కావాలి. మనస్సు మంచిదైనా, చిన్న ఉద్యోగం అయితే చిన్న చూపు చూస్తారు. నాకేం తక్కువ? హృదయం లేదు. నర్సునని పెళ్ళి చేసుకోలేక ముఖం చాటేశారు' అంటూ ఏడ్చేది.
    ఈమధ్య మామ- అక్కను పెళ్ళి చేసుకున్నవాడు- వస్తూ డబ్బు తీసుకుని పోతూ ఉండేవాడు. డేవిడ్ ని ఎత్తుకోనిచ్చేది కాదు మామను. వెకిలిగా నవ్వుతుండే వాడు.
    ఒకసారి సెలవులకు ఇంటికి వచ్చాను. నాన్నను గుండెనొప్పి వచ్చింది.    
    దగ్గరున్న మిషన్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాము. ట్రీట్ మెంటుకి డబ్బు కట్టమన్నారు.    
    'మేము మతం పుచ్చుకొన్న క్రైస్తవులం' అంటూ అమ్మ ఏడ్చింది.
    'నీవు మతం పుచ్చుకున్నావు. నీ భర్త బాస్తిస్మము పుచ్చుకోలేదు' అన్నారు.
    వీళ్ళలో ముంచి భాస్తిస్మం ఇవ్వటానికి కండిషన్ బాగాలేదు. మిస్సమ్మలు వచ్చి ప్రార్ధనలు చేసి పోతూ ఉండేవారు.    
    నాన్నకి మరీ ఆయాసంగా ఉంది. పది గంటల వేళ రాత్రి సంవత్సరం బాబు డేవిడ్ ని పోలీసులు ఎత్తు కొచ్చారు. చీమకు మోసం చేయని అక్క, మోసం చేసిన అతన్ని పన్నెత్తు మాట అనని అక్క మామని (భర్తని) కత్తితో పొడిచి చంపింది. ఆ విషయం పోలీసులు చెప్పారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS