4
'మారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్!' అని పూర్వీకులన్నారట! మేరేజెస్ ఆర్ వాట్ మేడ్ వితౌట్ డౌరీస్' అని ఇప్పటి వాళ్ళంటున్నారు. మనమే స్వయంభవులము ఆనుకునే మనుష్యులకి, తన వునికిని గుర్తు చేయటానికా అన్నట్లు విధి, అప్పుడప్పుడు విజ్రుంభించి, తన ప్రతిభని చూపెట్తూ ఉంటుంది. వచ్చిన ప్రతిపెళ్ళి వారూ, కామేశ్వరిని చూసీచూడగానే 'నలుపు బాబూ!' అంటూ వెళ్ళిపోయేవారు. మరి కొంతమంది పెళ్ళివారు, 'నలుపుపిల్ల' అన్నవంక పెట్తే, నాలుగు కాసులు ఎక్కువపాట పెరగకపోతుందా! అన్న ఆశతో ఆ వంక అనేవారు. అనుకోకుండా ధన్వంతరిగారి అయిదేళ్ళ నిరంతరాన్వేషణ అనంతరం, ధన్వంతరిగారి కోరిక ఫలించింది. రామనాధం, వచ్చిన వేళా విశేషం, కామేశ్వరికి కానీ కట్నం ఇయ్యక్కర్లేకుండా రవ్వలాంటి సంబంధం కుదిరింది. వసుంధర, అన్నయ్యే పెళ్ళికొడుకు! కేశవమూర్తి కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. నలభయి ఏళ్ళు వుంటాయి! భార్య చనిపోయి మూడేళ్ళు దాటుతోవుంది. పద్దెనిమిదేళ్ళు వున్న కూతురు నళిని కాలేజీలో బి. యస్ సి. చదువుతోంది. వసుంధర, రామనాధం వాళ్ళు మూడువేలు కట్నం అయితే చేసుకుంటామని వ్రాసిన రోజున జగదాంబతో అంది.
'మీకు రెండోపెళ్ళి వాడు, అనే సందేహం లేకపోతే, మా అన్నకు చేసుకుంటాము కామేశ్వరిని.' మొదట జగదాంబ నమ్మలేదు. కేశవకి బోలెడంత ఆస్తి వుంది. చదువుకున్నవాడు! దివాణం లాంటి మేడ! అతనితో సరిసమానంగా చదూకున్న పిల్లలే అతను వూఁ అంటే అతన్ని పట్టటానికి సిద్ధమయ్యేట్లు చేసే రూపవంతమైన విగ్రహం! మొదటి భార్యకి మగసంతు లేదు'. వున్న ఒక్క ఆడపిల్ల పెళ్ళి కెదిగిపోయింది. పెళ్ళి చేస్తే దాని ఖర్మాన్ని అది అత్తవారింటికి వెళ్ళిపోతుంది. తన కూతుర్ని ఇంత అదృష్ట దేవత వరిస్తుందని తను వూహించనైనా వూహించలేకపోయింది. ఇంత అదృష్టం దానికి కనిపెట్టుకు నుండబట్టే తాము చూస్తూన్న చచ్చు పుచ్చు సంబంధాలన్ని కట్నాలు కావాలంటూ తప్పిపోయేయి' అనుకుంది జగదాంబ.
'అంతకన్నానా వసుంధర తల్లీ! ఆ సంబంధం వాళ్ళకి ఎల్లా నచ్చెచెప్పాల్నో తోచక సతమతమయి పోతున్నాం నేనూ, మీ మామయ్యానూ! నా తల్లి! అల్లా మీరు వప్పుకుంటే, బ్రతికున్న నాల్గు రోజులూ, నాకింత అన్నం వుంచిన వాళ్ళు అవుతారు. ఇప్పుడే మీ మామయ్యతో చెప్తాను. మీ ఇంటికివెళ్ళి మీ అన్ననూ; అమ్మగార్ని కామప్పని చూసుకుందుకు రమ్మని చెప్పమంటాను' అంటూ, చీర చెంగుతో ఆనంద భాష్పాలు తుడుచుకోసాగింది జగదాంబ.
'వాళ్ళు చూడక్కర్లేదండీ! నే నెంత చెబ్తే అంతే మా అన్నయ్య! మా అమ్మ నామీదే పెట్టింది, మా అన్నయ్యకి తగ్గ పెళ్ళికూతుర్ని వెతికే భారం! నాకు, మీ కామేశ్వరి నచ్చింది. నేను మావాళ్ళింటివెళ్ళి మీరు అవునంటే ముహూర పెట్టించి పంపుతాను. మీరు మామయ్య గారిని కూడా సంప్రతించండి!' అంది వసుంధర.
'చూసి చూసి రెండో పెళ్ళి వాడికా, ఈయటం! అందులో మనం తొలిసారిగా చేస్తూన్న కన్యాదానం! ఒకరు కడిగిన కాళ్ళు, మళ్ళీ ఎల్లా కడగటం!' అన్నాడు నరసయ్య జగదాంబతో.
'అల్లాంటి సందేహాలు పెట్టుకుంటే, మనలాంటి వాళ్ళం ఎల్లా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తాం? నచ్చింది, నచ్చింది. అంటూనే, మూడువేలూ, నాలుగువేలూ అంటూ వెనకనించి, ఎల్లా బేరాలు ఆడుతున్నారో చూసారా? ఏదో దీని పెళ్ళి అదృష్టంకొద్ది ఇల్లాంటి సంబంధం కలిసి వచ్చింది. కాని, చిన్నదానికి మళ్ళీ రెండు మూడువేలు లేఁ దే, శుభ్రమయిన సంబంధం కుదరదు కదా! ఇదయినా రెండోపెళ్ళి కనుక ఇంత తేలిగ్గా చేసుకుంటామంటున్నారు. అదె మొదటి పెళ్ళి అయితే వాళ్ళ సంబంధం గురించి వూహించనైనా వూహించలేనంత దూరం లో వుండాల్సిన వాళ్ళం! ఆడైనా వసుంధర చేసుకుంటాం అని దృఢంగా చెప్తోంది. కాని నాకంత నమ్మకంలేదు. ఆయనా, కాలేజీలో వుద్యోగం చేస్తున్నాడు. భార్య పోయి మూడు సంవత్సరాలు దాటుతోంది. ఈపాటికి ఏ అమ్మాయి నైనా చూడకుండా వుంటాడా! కాలేజీల్లో పాతికేసేళ్ళ ఆడపిల్లలు చదూతారుకదా! మరింత కాలం దేనికి ఆగాడో! మనకి తెలీదు. చేసుకుంటామన్నప్పుడు, ఇవ్వమనే బెట్టు కూడా ఎందుకు?' అంది జగదాంబ.
'మే' నెలలో కామేశ్వరికి, కేశవ మూర్తితో పెళ్ళియిపోయింది. పెళ్ళి పీటలమీద తొలిసారిగా కేశవ వెంపు చూసింది కామేశ్వరి. అదే సమయంలో కేశవ కూడా తన చెల్లెలు, తనకి నిర్ణయించిన నవవధువు వెంపు పరీక్షగా చూసాడు. కామేశ్వరిని చూసేసరికి కేశవకి జాలి వేసింది. 'పాపం! పేద, ఇంటిపిల్ల! కనుక, తన సరదాలన్నీ కప్పెట్టుకుని తనని చేసుకుందుకు అంగీకరించింది అనుకున్నాడు కేశవ. కేశవని చూడగానే, కామేశ్వరికి జాలి వేసింది. కళ్ళు దించుకుంది . అతని చూపులతో తన చూపులు కలవగానే ఆమెకి సిగ్గు వేసింది.
'పాపం! చదువుకున్నవాడు! గౌరవ నీయుడు! ఎటూ కాని వయసులో అందమైన సహచరిని కోల్పోయాడు! కరుణా మూర్తి అయిన అతనిని, తను ఏవిధంగా, ఆ నిర్మొహత్వాన్నించి విడగొట్టకలదు? అందమైన భార్య తనకి దక్కదన్న దురభిప్రాయంతో తన్ని చేపట్టటానికంగీకరించాడు కాబోలు! వదిన-వసుంధర కూడా అందుకే తన్ని ఏరికోరి చేసి వుంటుంది!' అనుకొంది 'కామేశ్వరి ఆహూతుల సమక్షంలో కామేశ్వరి మెడలో మూడుముళ్ళూ వేసాడు కేశవ!
కేశవ తల్లి సీతమ్మకి, జగదాంబ తత్వం ఏమీ నచ్చలేదు. రెండో పెళ్ళి వాళ్ళకి ముచ్చట్లు ఎందుకు?' అన్నట్లు అతి క్లుప్తంగా ఒక పూట భోజనాలు పెట్టి ఏదో పెళ్ళి అంటే పెళ్ళి అని అయిందనిపించారు. సీతమ్మ మనస్సు రుంజుకున్నట్లు అయ్యింది.
'బొత్తిగా ఇంత ముదనష్టపువాళ్ళేమిటే వసూ! పానకం బిందెలన్నాఇయ్యలేదు.? అంది కూతురితో సీతమ్మ.
'పోన్లెద్దూ ఏదో లేనివాళ్ళు పాపం!' అంది వసుంధర.
'వస్తే! నీ అత్తవారి వెంపువాళ్ళని వెనకేసుకురాకు! ఆమె తరహా చూస్తే, నాకు వళ్ళు మండుక వస్తోంది. ఇంత గతిలేని మూక అనుకోలేదే! ఎలాంటి వాళ్ళు వచ్చేరు వాడికి 'పిల్లనిస్తామని! రంభలాంటి పిల్లల్ని శుభ్రమయిన కుటుంబాల వాళ్ళు ఇస్తామని ఎంత మంది వచ్చేరు? పిల్ల అయినా ఇంటికి నిండుగా అందంగా వుంటుందేమో అంటే కాకిపిల్లలా వుంది. ఆవిడ! పోనీ రెండో దాన్నయినా, ఇమ్మన్నావు కాదు! అది కాస్త కంటికి నదురుగా నన్నా వుంది. ఆ జగదాంబ కి అసలు మంచీ మర్యాదా తెలీదు. ఏదో నువ్వడిగి వప్పించేవు కదా, మనమేం గతిలేని వాళ్ళమనుకుంది కాబోల్ను! అంది కోపంగా.

అల్లా విసుక్కోకు అమ్మా! పాపం ఆ పిల్ల వింటే బాధపడుతుంది. ఆ పిల్లది చాలా మంచి మనస్సు!' అంది వసుంధర.
'ఏం మంచో! గడమంచి!' అని విసుక్కుంది సీతమ్మ.
'కామేశ్వరి అత్తవారింటికి వచ్చిన పది రోజులకి కామేశ్వరి పరీక్షాఫలితాలు తెలిసాయి. కామేశ్వరి మెట్రిక్ పరీక్ష ప్యాసయింది. పెళ్ళి అయిన వేళావిశేషం. విద్యావంతుల ఇంట కాలుపెట్టింది. తాను కూడా విద్యార్దినిగా మారిపోయింది తాను కూడా కేశవతో చెప్పి కాలేజీలో జేరాలని సరదా పడింది కామేశ్వరి. ఆ సాయంకాలం 'నళిని' స్నేహితురాలితో కలిసి ఎటో షికారుకి వెళ్ళింది. సీతమ్మ వంటింట్లో ఏదో పనిచేసుకుంటూంది. కామేశ్వరికి ఏమీ తోచక తమ మేడ ముందున్న పూలతోటలో ఫౌంటెన్ ముందున్న సిమెంటు బెంచీమీద కూర్చుంది. ఫౌంటెన్ చుట్టూ వున్న పూల మొక్కలు నీటి తుంపర్లతో తడిసి కొత్త శోభనిస్తూ న్నాయి. వేసం కాలపు సాయంకాలం! ఆహ్లాద కరమైన చల్లనిగాలి పూల పరిమళంతో కామేశ్వరికి ఏదో తెలియని ఆనందం వివశం కలిగించింది. అరమోడ్పు కళ్ళతో, ఫౌంటెన్ మధ్యనున్న పాలరాతి 'క్యూసిడ్' విగ్రహం కేసి చూస్తూ కూర్చుంది. ఆ సమయంలో 'మాష్టారూ!' అంటూ లోనికి పోయే మెట్లవద్ద నిలుచుని పిలిచాడు మాధవ.
'ఇంట్లో లేరు! క్లబ్బుకి వెళ్ళారు!' అంది కామేశ్వరి. అల్లా చెప్తూనే అతని ముఖంకేసి చూసి గతుక్కుమంది. అతనెవరో ఆసనాలు కూడా పట్టింది. కామేశ్వరిని, మాధవ కూడా గుర్తుపట్టాడు. ఒక క్షణం అతనికి ఆనంద సంశయం కలిగింది. తన అన్నయ్య వధువు! ఇక్కడి కెందుకు వచ్చిందా అన్న సంశయం, అన్నయ్యకీ వార్త అంటే కామేశ్వరి మాష్టారింట్లో వున్న వార్త - ఎంత తొందరగా చెప్దామా అన్న ఆనందో ద్వేగంలో కొట్టుకపోయింది.
'నళిని వుందాండీ! లోపల!' అన్నాడు మాధవ.
'లేదండి స్నేహితురాలితో ఎటో వెళ్ళింది!' అంటూ మాధవకేసి చూసింది. ఇంక వెళ్ళిపోకూడదా!' అన్నట్లు ప్రార్ధన నిండివుంది కామేశ్వరి చూపు. తెల్లగా పొడుగ్గా వున్న మాధవ ముఖం మీదకు పడే వుంగరాలజుత్తుని చేత్తో తమాషాగా పైకి ఎగద్రోసుకుంటూ కామేశ్వరి చూపుచూసి నవ్వాడు. అతని నవ్వుచూస్తే మల్లెలు విరిసిన సన్నని పరిమళం తన శరీరం అంతా అలముకొన్నట్లు అని పించింది కామెశ్వరికి. ఎందుకో ఆమె శరీరం వివశంతో నెమ్మదిగా కంపించసాగింది.
'ఇప్పుడప్పుడే రాదాండి! నళిని!' అన్నాడు మాధవ! మాధవ వెళ్ళే ప్రయత్నం ఏమీ చేయకుండా నించోటం కామేశ్వరికి నచ్చలేదు.
'రాదు అనుకుంటా! నాతో ఏం చెప్పలేదు!' అతని వునికిని సహించలేక పోతోంది కామేశ్వరి.
'నేను జ్ఞాపకం వున్నానాండీ! ఎందుకు జ్ఞాపకం వుండను? మనం కలుసుకుని, మూడునెలలైనా దాటలేదు కదా!' అన్నాడు మాధవ.
కామేశ్వరి కళ్ళు పెద్దవిచేసి చూసింది. మాధవ వెంపు! ఇల్లా అడగటంలో ఏమిటి అతని వుద్దేశ్యం!
'వుహూఁ!' అని లోపలికి వెళ్ళబోయింది.
'అబద్ధం చెబుతున్నారు! ఎందుకని జ్ఞాపకం వుండము? ఆ రోజు నేనూ మా అన్న మిమ్మల్ని పెళ్ళి చూపులు చూసుకుందుకు వచ్చాము. నాకోసం అనుకోకండి! మా అన్నయ్యకోసం నేనూవచ్చాను. మా అన్నయ్యకి మీరు బాగా వచ్చారు కానీ, మా నాన్నగారు కట్నం విషయంలో కొంచెం తికమక పెట్టారనుకోండి. ఎల్లా అయినా మిమ్మల్నే...' గేటుదగ్గిర కారు ఆగింది. కారులోంచి కేశవ దిగాడు.
'హల్లో మాధవ్' అంటూ మాధవని పలకరించాడు.
'నేనూ నళినీ ప్యాసయ్యామండీ' అన్నాడు మాధవ.
'వెరీగుడ్! యూనివర్శిటీ ఎగ్జామ్స్ లోక్లాసు తెచ్చుకుందుకు ప్రయత్నించండి. ఇద్దరూ కూడా! కమిన్!' అంటూ లోపలికి దారి తీశాడు కేశవ! మాధవ కూడా అనుసరించాడు. కామేశ్వరికి కంగా రెత్తి పోయింది. భర్త వచ్చేసరికి ఫౌంటెన్ కి అటూ ఇటూ తనూ మాధవా, నిలబడి మాట్లాడుకుంటున్నారు. మాధవ! దుర్మార్గుడు! అక్కర్లేని ప్రశ్న లేస్తూ, తన్ని కదలనీయలేదు! అసలే తెలుగు భర్తలకి, తమ భార్యలు మగవాళ్ళతో చనువుగా మాట్లాడుతోంటే, నిప్పుల్లో నించున్నట్లే వుంటుందంటారు. అందులో తాను రెండవ భార్య! కేశవకి, తనకీ తండ్రి కూతుళ్ళంత అంతరం వుంది! మాధవ, యువకుడు! అందమైనవాడు! కాలేజీలో చదువుకొంటూన్నా, బాధ్యతల బరువులు మోయని వయసు కాడు! తాను కాపరాని కొచ్చి, పదిహేనురోజులన్నా కాలేదు. కేశవ ఆంతర్యం ఏమిటో తనకెల్లా అవగాహన అవుతుంది? ఇల్లా తనలోతానుగా మల్లగుల్లాలు పడుతూ, కామేశ్వరి, తలవొంచుకుని, నెమ్మదిగా వరండా మెట్లెక్కి హాలులోనికి వచ్చి లోపలికి పోబోయింది.
'చూడు! అమ్మనడిగి రెండు గ్లాసులతో కాఫీ తీసుకురా!' అన్నాడు కేశవ.
'వొద్దు! మాష్టారూ! నేను తీసుకునే వచ్చానండీ!' అన్నాడు మాధవ.
'తీసుకుంటే మాత్రమేం! వొట్టి కాఫీయే కదా!' అన్నాడు. ఏవేవో కాలేజీ విషయాలు వూకదంపుగా మాట్లాడటం మొదలెట్టాడు మాధవ.
కామేశ్వరి రెండు గ్లాసుల్లో కాఫీ తీసుకవచ్చి ఇద్దరికీ ఇచ్చింది.
'ఇతను మన నళిని క్లాస్ మేట్! ఇద్దరూ పరీక్షలు ప్యాసయ్యారుట!' అన్నాడు కేశవ. అతని ముఖంలోకి చూసింది కామేశ్వరి. కేశవ మామూలుగానే ఉన్నాడు. పైవాళ్ళ ఎదుట మామూలు గానే వుంటాడేమో! రాత్రి తన్ని పట్టు కుని నిలదీసి నాలుగు మాటలూ దులపకుండా వుంటాడా!' అనుకుంది కామేశ్వరి.
