Previous Page Next Page 
మల్లెలు ఎర్రగులాబీలు పేజి 7


    'చినబాబూ....! మీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలనివచ్చాను. అనుమతిస్తారా...?' భయపడుతూ ప్రశ్నించాను.  పుస్తకం ప్రక్కనపెట్టి నావైపు అసహ్యంగా చూస్తూ నాతో నీకేం మాటలు? వెళ్ళు....హద్దు మీరుతున్నావు.'
    'నేనేమీ హద్దుమీరి ప్రవర్తించడం లేదు. మీరు మీ తల్లిదండ్రులకు ఒక్కగా నొక్క కుమారులు. వారి ఆశలన్నీ మీమీదే ఉన్నాయి....మీరిలా చదువుపై శ్రద్ధ చూపించకుండా యిష్టం వచ్చినట్లు స్నేహితులతో...'
    'ఆపు.....ఎవరిచ్చారు నీకీ అధికారం...? నన్ను హెచ్చరించేంతవరకు వచ్చిందే వ్యవహారం! నా విషయంలో నాన్నగారుకూడా యిలా జోక్యం కలిగించుకోలేదు. నీవెంతటి దానివి....నాతో మాట్లాడడానికి నా యిష్టం వచ్చినట్లు నడుచుకుంటాను.....ఇదంతా నా డబ్బు.......నా యిష్టం....... అవును! పేనుకు పెత్తనమిస్తే తలంతా చెడకొరికిందట! నాన్నగారు నిన్ను చేరదీసి బుద్ధి తక్కువ పని చేశారు.' కోపంతో ముఖం కందగడ్డలా చేసుకొని అన్నాడు ప్రభాకరం. నేను ఊరుకోలేకపోయాను. శ్రీపతి గారిని అంతమాత అనడం నాకెంతో బాధ కలిగించింది.
    'బాబుగారూ! ఏమిటిది? పెద్ద... చిన్న తారతమ్యం ఉండక్కర్లా? పెద్ద వారిని ఎంత మాటపడితే అంతమాట అనవచ్చా...? నన్ను ఎన్నైనా అనండి ... తిట్టండి....బాధపడను 'దయచేసి మీరు మాత్రం నడవడిని మార్చుకోండి.' దీనంగా అతని కళ్ళల్లోకి చూస్తూ ప్రాధేయపడుతూ అన్నాను.
    కోపంతో రెచ్చిపోయాడు. 'యూ సిల్లీ గర్ల్! నా ముందు యింత ధైర్యంగా ఎవ్వరూ మాట్లాడి ఎరుగరు.... ఎన్ని గుండెలు నీకు ...?' అని కోపంతో గర్జిస్తూ, ఎర్రబడిన ముఖంతో నా దగ్గరకు వచ్చి చాచి లెంపకాయ కొట్టాడు. అలా జరుగుతుందని మొదటే ఊహించిన నేను చలించలేదు. రెండవ చెంప చూపిస్తూ 'చినబాబూ! మీకు కోపం తీరకపోతే ఈ చెంపపై కూడా కొట్టండి' అని అతని కళ్ళల్లోకి సూటిగా చూశాను. తడబడి తల దించుకున్నాడు.
    'మీరు కొట్టినందుకు నేను బాధ పడను...నిజం నిష్ఠూరంగా ఉంటుంది. ముఖప్రీతి మాటలు తీయగా ఉంటాయి. వివేకంగలవారు ఆ రెండింటి తార తమ్యాన్ని గ్రహిస్తారు. అంతకన్న ఎక్కువ నేను ఏమీ చెప్పలేను' అని అక్కడినుండి వెళ్ళిపోయాను. వెళ్ళే ముందు ఒక్కసారి అతని ముఖంలోకి చూశాను. మనిషిలో ఏ మార్పూ రాలేదు. ఏమీ జరగనట్లు పుస్తకం చదవడంలో లీనమయ్యాడు. అంత అందమైన ఆ యువకునికి, అటువంటి కఠినమైన హృదయాన్ని అమర్చిన ఆ బ్రహ్మపై విసుగు కలిగింది నాకు. అతనే మంచి ప్రవర్తనగలవాడై ఉన్నట్లయితే పూవుకు తావి అబ్బినట్లు ఉండేది. కాని దురదృష్ట వశాత్తు అలా జరగలేదు' అని శారద ఒక్కసారి బరువుగా ఊపిరి పీల్చి మళ్ళీ ప్రారంభించింది.

                     
    'నాకూ ప్రభాకరానికి మధ్య జరిగిన సంభాషణ తర్వాత ప్రభాకరం నాపై త్రాచుపాములా పగపట్టాడు. ఎన్నిసార్లో నాపై నేరాలను మోపుతూ నన్ను దోషిగా నిరూపించాలని ప్రయత్నించాడు. నేను జాగ్రత్త పడడంవల్ల అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. దాంతో మరీ రెచ్చి పోయాడు. అతను ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడన్న విషయం నేను మరిచిపోలేదు. నన్ను దోషిగా నిరూపించి యింటినుండి తరమాలనే ప్రయత్నం అతను మానలేదు. ఆ విధంగా సంవత్సరం గడచిపోయింది.
    'శ్రీపతిగారు సహృదయులు ఆదర్శ మూర్తులు కావడంవల్ల చదువుపై నాకు గల శ్రద్దను గ్రహించి పి. యు. సి. లో చేర్పించారు. ఆ సంవత్సరం ఎంతో కష్టపడి చదివాను. శ్రీపతిగారు అన్నపూర్ణమ్మ గారు నన్ను ఎంత ఆదరించినా ప్రభాకరం ధాటికి తట్టుకోవడం కష్టమని గ్రహించాను. శ్రీపతిగారింట్లో యిక ఎక్కువ కాలం ఉండలేమోనని ఊహించుకున్నాను. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయపడుతూండేదాన్ని. రిజల్స్టు వచ్చాయి. ఆ రిజల్ట్సు నాకు కొండంత ధైర్యాన్ని చ్చాయి. ఫస్ట్ యిన్ స్టేటుగా ప్యాసయ్యాను. శ్రీపతిగారు అన్నపూర్ణమ్మగారు ఆ రోజు వారింట్లో పండుగ చేశారు. కాని ఒక్కటే విచారం. మా అందరి సంతోషంలో ప్రభాకరం కూడా పాల్గొని ఉన్నట్లయితే ఆనందంతో పొంగిపోయేదాన్ని. కాని అలా జరగలేదు. మా అందరికీ సంతోషకర మైన ఈ విషయం అతనిలో అసూయను పెంపొందించింది. అతనికి పి. యు. సి లో అన్ని సబ్జక్ట్సూ పోయాయి. నేను డిస్టిన్ క్షన్ లో ప్యాసవడం.... అతను ఫేలవడంతో నాపట్ల అతనికిగల క్రోధావేశాలు యినుమడించాయి.
    'శ్రీపతిగారు నన్ను బి. ఎ. లో చేర్పించటంతో ప్రభాకరం మరీ రెచ్చిపోయాడు. ఒక రోజు తండ్రి కొడుకులు మాట్లాడుకుంటూ ఉండగా వారి సంభాషణ విన్నాను.
    'నాన్నగారూ! ఆ దరిద్రపుగొట్టు మొహం చదువుకోసం వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. ఇది మీకు న్యాయమేనా...?'
    'ఏమిట్రా నీవంటున్నది? ఆ అమ్మాయి దరిద్రపుగొట్టు ముఖమా? వేలకువేలు ఆ అమ్మాయికోసం నేను ఖర్చుచేస్తున్నానా? ఒరేయ్! తనకు లేదని ఏడుస్తే ఒకకన్ను పోయిందట! ఎదుటివానికి ఉన్నాయని ఏడుస్తే మరొక కన్ను పోయిందట! అలా ఉంది నీ వరుస. నీవు కష్టపడి చదివి ప్యాసు కాలేవు. సరిగద ఒకరిని చూసి వోర్వలేకపోతున్నావు. ప్రేమ కొద్దీ గారాబంగా పెంచి నిన్ను మేమే చేతులారా చెడగొట్టాం. అందుకు అనుభవిస్తున్నాం...నీలో ఎప్పటికైనా మార్పు రాకపోతుందా అని ఎదురు చూస్తున్నాం. అది ఈ జన్మలో జరిగేలా తోచడంలేదు. ఇక శారద విషయమంటావా...? ఆమె ప్రతి సంవత్సరం మంచి మార్కులతో ప్యాసౌతూ స్కాలర్ షిప్ లు పొందుతూ ఉంది. ఈ మూడు నాలుగు సంవత్సరాలలో మనము ఆమెకు చేసిన ఆర్ధిక సహాయం చాలా కొద్ది....! ఈ నాలుగు సంవత్సరాలకు కలిపి ఆ అమ్మాయి చదువుకు ఖర్చైన మొత్తం వందలలో ఉంటుంది. మంచిబట్టలకు పైకం నేనిస్తానన్నా తీసుకోవడం లేదు. నిరాడంబరంగా గడుపుతూ, అమ్మకు అన్ని విధాలా సాయంచేస్తూ ఉంది. ఈ కాలపు అమ్మాయిలలా వేషాలు వేయడంలేదు. సినిమాలు చూడడంలేదు. షికార్లకు వెళ్ళడం లేదు. అటువంటి ఆ అమ్మాయిమీద జాలిపడక కత్తిగట్టా లని చూస్తావా? ఒరేయ్ ప్రభాకరం! ఆ అమ్మాయి దిక్కు లేని పిల్ల. శ్రద్దగా చదువుకుంటూ ఉంది. ఎలాగూ నాలుగు సంవత్సరాలు ఆమెకు ఆ శయమిచ్చాము. ఇంకా చదువుతే 2, 3 సంవత్సరాలు చదువుతుంది. ఈ సంవత్సరం రాష్ట్రాని కంతటికీ ప్రధమురాలుగా ప్యాసైంది. స్కాలర్ షిప్ లు యింకా అధికంగా రావచ్చు.'
    'మీరు మొదటినుంచీ యింతే! ఆమెనే వెనకేసుకు వస్తున్నారు' అని చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు.
    'మూడుమాసాలు గడిచిపోయాయి. ప్రభాకరం నన్ను సాధించే ప్రయత్నాలు ఏమీ చేయకపోవడంవల్ల తండ్రిగారి మాటలు పనిచేశాయేమోనని ఊహించాను. మనసు కాస్త కుదుట పడింది. శ్రీపతి గారి గదికి ఎదుట ఉన్న గదే నాకు యిచ్చారు. ఒకరోజు కూర్చుని చదువు కుంటున్నాను. గడియారం కొట్టిన పన్నెండు గంటలు లెక్కపెట్టాను. క్వార్టర్లీ ఎగ్జామినేషన్సు సమీపించడంతో ప్రతిరోజూ నేను అంత రాత్రివరకూ కూర్చుని చదువుకుంటున్నాను. పన్నెండు కావడంతో అప్పుడే పడుకుందామనే ఉద్దేశంతో లేస్తున్నాను. మెట్లమీద చప్పుడు వినిపించింది. అంతరాత్రపుడు ఆ చప్పుడు ఎందుకౌతుందో నా కర్ధంకాలేదు. అనుమానంతో గది బయటికి వచ్చి తొంగి చూశాను. ప్రభాకరం మేడపై నుండి క్రిందికి వస్తున్నాడు. ఇంత రాత్రపుడు ఏం చేస్తాడో తెలుసుకుందామని ఒక ప్రక్కగా నక్కి గమనించసాగాను. మెల్లిగా తన తండ్రి గదిలోపలికి వెళ్ళాడు ప్రభాకరం. నాకు కాళ్ళు, చేతులు వణకడం ప్రారంభించాయి. ధైర్యం కూడదీసుకొని చప్పుడు కాకుండా నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ శ్రీపతి గారి గదిముందు నిలబడి మెల్లిగా డోర్ కర్టెన్ తొలగించి చూశాను. ఆశ్చర్యం కలిగింది. అతను శ్రీపతిగారి తలగడక్రింది నుండి తాళం చేతులు తీశాడు. ప్రభాకరం చేయబోతున్న పని నాకు అర్ధమైంది. అతని తండ్రి కొంతకాలంగా అతనికి కోరినంత డబ్బు యివ్వడం లేదు. అందువల్ల దొంగతనం చేయడానికి కూడా అతను వెనుకాడడంలేదు. ఇనప్పెట్టె తాళం తీసి వేయిరూపాయలకట్ట ఒకటి తీసి పట్టుకున్నాడు. ఇక ఊరుకోలేక పోయాను. గదిలో లైటువేసి ప్రభాకరం వైపు నడిచాను. శ్రీపతిగారు గాఢనిద్రలో ఉన్నారు. హఠాత్తుగా నన్నుచూసిన ప్రభాకరం తెల్లబోయాడు.
    'చినబాబూ...! చివరకు ఈ పనికూడా చేస్తున్నారా? రేపు ఈ సంగతి బైట పడితే మీకు నలుగురిలో ఎంత అప్రతిష్ట...? అదేమన్నా ఆలోచిస్తున్నారా....? దయచేసి ఆ డబ్బు మళ్ళీ ఆ త్రిజోరిలో ఉంచి తాళం వేయండి. ఈ విషయం మనిద్దరి మధ్యనే గుప్తంగా ఉండిపోతుంది.' పెదబాబుగారు లేస్తారేమోనన్న భయంతో మెల్లిగా అన్నాను.
    'ఛ ...... పో...... నా డబ్బు నేను తీసుకోవడం దొంగతన మెలా ఔతుంది...?'
    'అది మీడబ్బే కావచ్చు.....! కాని తీసుకుంటున్న పద్ధతి మాత్రం సక్రమ మైనది కాదు.'
    'పోతావా....పోవా...?'
    'నా బొందిలో ప్రాణముండగా పోను. మీరు నా ప్రాణంతీసినా బాధపడను గాని నా కళ్ళముందు మీరిలా పతనమై పోతూ ఉండడం నేను చూసి సహించలేను.'
    'సరే! అంత బుద్దిమంతురాలవైతే నీవే ఈ డబ్బు లోపలపెట్టి తాళం వెయ్యి.' అని ఆ డబ్బు నా చేతికిచ్చాడు. అంతవరకు జరిగిన సంభాషణంతా తగ్గు స్థాయిలోనే జరిగింది. అనాలోచితంగా ఆ డబ్బు నాచేతికి తీసుకున్నాను. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. డబ్బు చేత పట్టుకొని త్రిజోరీ వైపు రెండడుగులు వేశాను. అంతే...!
    'నాన్నా దొంగ...దొంగ....శారద దొంగ తనం చేస్తూఉంది.' అని బిగ్గరగా అరుస్తూ నా చేతిని పట్టుకున్నాడు. శ్రీపతిగారు ప్రభాకరం కేకలకు ఉలికిపడి లేచారు. మా యిద్దరివైపు చూశారు. పరిస్థితి అర్ధం చేసుకొని నన్ను ఆపాద మస్తకం ఏహ్యభావంతో చూడసాగారు. ఆ చూపులలోని భావం గ్రహించిన నేను నిలువునా కృంగిపోయాను. నాకాళ్ళ క్రింది భూమి గిర్రున తిరుగుతూన్నట్లు తోచింది. ప్రభాకరం చేసిన మోసానికీ నా మనసు చలించిపోయింది. తల ఒంచుకున్నాను.
    శ్రీపతిగారు కఠినస్వరంతో 'ఏమమ్మా! నీ విలా చేస్తావని కలలోకూడా తలచలేదు. పాముకు పాలుపోసి పెంచినట్లైంది మా పని, నీవెంత అడిగితే అంత కాదనకుండా యిచ్చేవాణ్ణి కద! ఇలా ఎందుకు చేశావ్...?'
    వారి నోటినుండి వెలువడిన ప్రతి మాట నా హృదయానికి శూలాల్లాగా తగిలింది. నే నెందుకు జీవించి ఉన్నానా అని అనిపించింది ఆ క్షణంలో నాకు. నిజం చెబుదా మనుకున్నాను. కాని వెంటనే మనసు మార్చుకున్నాను. ఆ యింటి గౌరవప్రతిష్టలు కాపాడడానికి ఆ చేయని నరాన్ని మౌనంగా నానెత్తిన వేసుకున్నాను. ఆ నోట్లకట్ట శ్రీపతి గారి చేతికిచ్చి మాట్లాడకుండా నిల్చున్నాను. మెలుకువ వచ్చి అన్నపూర్ణమ్మ గారుకూడా అక్కడికి వచ్చారు. మొదట్లో వారు నమ్మలేదు. కాని శ్రీపతిగారు వివరించి చెప్పిన తర్వాత నమ్మాడు.
    'పిల్లవాడు నీ గురించి చెబుతూనే ఉన్నాడు. నేను వాడి మాటలు లెక్కచేయలేదు. తగినట్లు బుద్ధి చెప్పావమ్మా!' అని బాధ పడుతూ అన్నారు శ్రీపతిగారు. ఇక అక్కడ నిల్చోలేకపోయాను. ఏడుస్తూ నా గదికి వెళ్లాను. నా గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. నేను ఊహించుకున్న ఆ ప్రళయం రానే వచ్చింది. ఇక లాభం లేదు. ఇక ఈ యింట్లో ఉండడానికి నేను తగను. అని అనుకుంటూ ఉండగా ప్రభాకరం మాటలు వినిపించసాగాయి.
    'మర్యాదగా వెళ్ళిపొమ్మని రేపు ప్రొద్దున్నే చెబుతాను. మీరు అడ్డుపడకూడదు. ఈ యింట్లో ఆ అమ్మాయి ఉంటే నేను ఉండను. ఆ తర్వాత మీ యిష్టం!'
    'అంత మాటెందుకురా బాబూ! కులగోత్రాలు, పరువు మర్యాదలు లేని ఆ అమ్మాయికోసం కన్నకొడుకునైన నిన్ను దూరం చేసుకొనే మూర్కులంకాము. నీ యిష్టం వచ్చినట్లు చేయి. నేనేమీ మాట్లాడను' అన్నారు శ్రీపతిగారు.
    'అవును!' అని సమర్ధించారు అన్నపూర్ణమ్మగారు.
    'నాకు ఆ యింటితో ఋణం తీరిపోయిందని ఊహించాను. ఆ తెల్లవారు జాముననే ఆ యింటినుండి బయటపడ్డాను. శ్రీపతిగారిపేర ఒక ఉత్తరం వ్రాసి వారి ఆఫీసు గదిలో టేబులు పై ఉంచాను ఒక నెలరోజులు మాత్రం వేరే ఒక గది కిరాయికి తీసుకొని అందులో ఉన్నాను. వయసులో ఉన్న యువతి ఒంటరిగా గడపడం ఎంత కష్టమో ఆ నెల రోజులలో నాకు అర్ధమైంది. ఆరోజు నీవు ఫీజు చెల్లిస్తూ ఉంటే పదిరూపాయల నోటు క్రిందపడింది. తీసి నీకిచ్చాను. ఆ సంఘటనతో మన యిద్దరికీ పరిచయం కలిగి, క్రమంగా పెంపొందింది. ఆ కష్ట సమయంలో నీవు నన్ను ఆదుకున్నావు.
    'నాకు ఒక్కటే అనుమానం. రెండవ సారి అంటున్నానని బాధపడకు. మీ పెద్ద వారికి ఈ విషయం తెలియజేయడం మన యిద్దరికీ క్షేమం, ఎవరి మనసు కష్టపడినా నేను సహించలేను.' తన వివరాలన్నీ చెప్పి అలసటగా కళ్ళు మూసుకుంది శారద.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS