"ఈ కత్తి నా చేతిలో ఉండగా ఎలా తీస్తారో చూస్తాను."
చంఫాజీ అమాంతంగా గుర్రంఎక్కి , శ్యామాని సునాయాసంగా ఎత్తి తన వెనుక కూర్చో పెట్టుకున్నాడు. "ఇక రండి మీ సంగతి చూస్తాను!"
"శీలే దార్! మళ్ళీ చెప్తున్నాను! కేవలం ఒక బానిస పిల్ల కోసం ప్రాణాలు వదులుకోకు -- " మోస్టిన్ మరొకసారి బెదిరించి చూశాడు.
"నా బొంది లో ప్రాణం ఉండగా ఏ మరాఠా దేశపు ఆడపడుచు మాన మర్యాదలకి భంగం రాదు! పవిత్రమయిన మా మతాన్ని వదులు కోదు!"
చంఫాజీ సాహసం చూపరులలో చాలామందిని ఆకర్షించింది. మొదట అతను దోపిడీ దారుడే అనుకున్నారు కూడా అతని ధుర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయారు. "శభాష్ ' అని అతన్ని ప్రోత్సహించారు. ఇది యుద్దానికి పిలుపేమో అన్నట్లుగా మోస్టిన్ గుర్రాన్ని ముందుకి తోలి చంఫాజీ మీదకి కత్తి ఎత్తాడు.
చంఫాజీ కన్నా మోస్టిన్ చాలా పొడుగు. కండబలం కూడా ఎక్కువగానే కనిపిస్తున్నది. అతనిది మంచి అరబ్బు జాతి అశ్వం. జీను, కళ్ళెం వెండితో నగిషి చేసి ఉన్నాయి చంపాజీ ది చిన్న గుర్రం. జీను, రికాబులు సయితం లేవు. అయినా ఆ గుర్రం జాతి మంచిది. దేహ నిర్మాణం లక్షణంగా ఉన్నది. "భీమ్ తాడే' గుర్రాలు అన్నీ అంటే.
"శ్యామా నువ్వు భయపడక! నీ తండ్రి పెద్ద వీరుదని జ్ఞాపకం వుంచుకో! నీ ప్రియుడు కూడా మరాఠా దేశ భక్తులలో ఒకడు! పాని ఫట్ లో రక్తం ధారపోసిన వారిలో ఒకడు --" ఆమెకి ధైర్యం చెప్పి చంపాజీ కత్తి యుద్దానికి ఉద్యుక్తుడయ్యాడు. శ్యామా, 'అంతా దేవుడి దయ౧క్" అని అతన్ని గట్టిగా కవుగిలించుకుంది.
మోస్టిన్ కి తన విగ్రహ పుష్టి మీద చాలా నమ్మకం ఉంది. ఒక్క వేటులో చంఫాజీ ని హతమార్చాలని అతని మీదకి ఉరికాడు. చంఫాజీ మోస్టిన్ ధాటికి తేలికగా తట్టుకున్నాడు. అతి చాకచక్యంతో అతని మొరటు దెబ్బలని తప్పించుకుని చికాకు పరిచాడు. చంఫాజీ ఎదురు చూసినట్లే మోస్టిన్ కి కోపంతో వళ్ళు తెలియలేదు. మీద కలయ బడ్డాడు. చంఫాజీ తన గుర్రం చెవిలో ఏదో వూదాడు. అ "భీమ్ తాడీ" అశ్వం వెంటనే ముందు కాళ్ళు పైకి ఎత్తి డెక్కలతో మోదింది! ఆ దెబ్బకి తట్టుకోలేక ఆ పెద్ద గుర్రం బాధతో సకిలుస్తూ నేల కూలింది. అదే సమయంలో చంపాజీ కత్తి వేటుకి ,మోస్టిన్ చేతిలోని ఖడ్గం తునాతునకలయి పోయింది. ఆ వేటుకి మోస్టిన్ దేహం కూడా దిమ్మెత్తి పోయింది. నేలమీద పడినవాడు లేవలేక అలాగే ఉండిపోయాడు.
"శభాష్ శీలేదార్! శభాష్ భీమ్ తాడీ!' అనే అరుపులు అక్కడ ధ్వనించాయి.
పరిస్థితిని అర్ధం చేసుకున్న మోస్టిన్ మాట్లాడకుండా లేచి, బట్టలు దులుపుకుని ఈ దృశ్యాన్ని ఆశ్చర్యంతో చూస్తున్న ప్రయిస్ వద్దకి వెళ్ళిపోయాడు.
"రా, మోస్టిన్ మనం వాళ్లతో తగువు పెట్టుకోవటం మంచిది కాదు! జరిగింది మర్చిపో....." అని అతన్ని వోదార్చాడు. ప్రయిస్.
"నిజంగా ఈ మరాఠా సైనికులలో మంచి వీరులే ఉన్నారు! చూడు నీతో పోట్లాడిన వాడు తన ప్రియురాలిని గుర్రం మీద కూర్చో బెట్టుకుని ఎలా వెళ్లి పోతున్నాడో! మన "నైట్ ఎర్రంట్' లు జ్ఞాపకం రావటం లేదూ! అదిగో ఆ పావురం చూడి వాళ్ళ వెంటనే ఎలా ఎగిరి వేడ్తుందో ...." అన్నాడు. విశాల ద్రుక్పదము సానుభూతీ అధికంగా గల ఆ ఇంగ్లీషు అధికారి ఆ దృశ్యాన్ని అలా చిరునవ్వుతో చూస్తూండి పోయాడు.
7
ఆ ఉదయం రాజధాని కిటకిట లాడి పోతున్నది. పూనా నగరం నలువైపులా నుంచీ జనం న్యాయ సభ వైపు తండోప తండాలుగా వెళ్లి పోతున్నారు. న్యాయస్థానం లోపల కిక్కిరి పోగా, బయట మూగి వున్న వారు కుతూహలం తో , ఆత్రంగా ప్రధాన న్యాయమూర్తి రాక కోసం ఎదురు చూస్తున్నారు.
ప్రధాన న్యాయమూర్తి గా పనిచేసిన పది సంవత్సరాలలోనూ రామ్ శాస్త్రి మంచి ప్రజాదరణ పొందాడు. పీష్వా మాధవరావు తర్వాత, మరాఠా సామ్రాజ్య మూల స్థంభం రామ్ శాస్త్రి తప్ప వేరొకరు కారని అందరూ అనుకునేవారు. కాని ఇంత పేరు గల అయన పట్ల ఇప్పుడు పూనాలో ఎందరో ఆగ్రహం కాకపోయినా , అసంతృప్తి ప్రకటిస్తున్నారు. డానికి కారణం లేకపోలేదు. అయన ఒక సందర్భంలో మరీ కటువుగా ప్రవర్తిస్తున్నాడని వారి అభిప్రాయం. న్యాయం పాటించినా ఇంత కాఠిన్యం పనికి రాదని అనుకున్నారు. "లేకపోతె జస్పెయిన్ సుబేదార్ అయిన విస్సాజీ అంతటి వాడిని బహిరంగ సభలో నుంచొ పెట్టి న్యాయాన్యాయ విచారం చేస్తాడా!' అని కొందరు బయటికి కూడా అనేశారు.
"ఈ విషయంలో రాజమాత గోపికా భాయి గారు కూడా కలిపించు కున్నారు. ఆమె మాటనే వినిపించుకోడే ఈ రామ్ శాస్త్రి! విస్సాజీ ఆమె దగ్గిర బంధువని ప్రధాన న్యాయమూర్తికి తెలీదా? ఈ బహిరంగ సభ చెయ్యకపోతే మాత్రం మించి పొయిందేమిటి? రాజమాత సాధారణంగా ఉటువంటి విషయాలలో కలిపించు కోరే?" అన్నారు మరికొందరు.
పురజనులలో , అందులో ప్రముఖులలో, ఈ అసంతృప్తి ని గమనించిన పూనా జనం కొట్వాల్ ఉదయమే రామ్ శాస్త్రి ఇంటికి వెళ్ళాడు. అప్పటికే ప్రధాన న్యాయమూర్తి సభకి వెళ్ళటానికి సిద్దం అవుతున్నాడు. అయన కనిపించగానే కొట్వాల్ సంభ్రమంగా గుర్రం దిగి "ప్రధాన న్యాయమూర్తి గారి ఉత్తరువు శిరసా వహించటానికి ఈ భ్రుత్యుడు సిద్దంగా ఉన్నాడు! సెలవివ్వ ప్రార్ధన --" అన్నాడు.
"సెలవిచ్చెందు కేముంటుంది కొట్వాల్ గారూ!" అన్నాడు రామ్ శాస్త్రి సగౌరవంగా.
పురజనులలో కొందరి భావావేశాన్ని గుర్తించిన కొట్వాల్ ప్రధాన న్యాయమూర్తి కి అనాడయినా సాయుధ పరివారం ఏర్పాటు చెయ్యటం శ్రేయస్కరం అనుకున్నాడు. రామ్ శాస్త్రి తన సూచన ని ఆమోదించడనే అనుమానం కలిగి అంతకు ముందే న్యాయస్థానం చుట్టూ నిర్ణీత స్థలాల్లో అశ్వ దళ సైనికులని ఏర్పాటు చేశాడు. అందువల్లనే ప్రధాన న్యాయమూర్తి సమాధానానికి అతను అంతగా చిన్న పుచ్చుకోలేదు. నడిచి వెళ్లి పోతున్న రామ్ శాస్త్రి కి వెనుక కొంచెం దూరంలో తన అనుచరులతో బాటే ముందుకి సాగిపోయాడు.
* * * *
ఇక న్యాయ స్థానం వద్ద ఎంతో గగ్గోలంగా వుంది. న్యాయస్థానం 'అమీనా' కనిపించగానే జనం అతని చుట్టూ మూగి ప్రశ్నల వర్షంతో అతన్ని ముంచి వేశారు.
"విస్సజీ మీద మోపిన నేరం ఏమిటి?"--
"పెద్ద నేరమేనా?"--
"నిన్న విచారణ జరిగిందిట కదా?"--
అమీనా ఉక్కిరిబిక్కిరి అయిపోయినప్పటికి, "అవును బాబూ అవును! విస్సాజీ ది పెద్ద నేరమే. "వేథ్ బిగార్' శాసనాన్నే అతిక్రమించారు అయన! ఈ మధ్యనే కొన్ని గ్రామాల ద్వారా వెడుతూ బీద రయితులని కొందరని బానిసలుగా తీసుకున్నాడుట!" అన్నాడు.
"అది సరే గాని, విస్సాజీ అంత గర్విష్టి కదా విచారణ కి ఎలా వప్పుకున్నడబ్బా!"--
అమీనా కి ఈ ప్రశ్న సంతోషం కలిగించింది. తన ప్రాముఖ్యం ప్రదర్శించటానికి ఇదొక గొప్ప నిదర్శనం అనుకున్నాడు. "చెప్తానుండండి బాబూ తొందర పడకండి! ప్రధాన న్యాయమూర్తి గారు విస్సాజీ కి తాకీదు పంపించారు, నేను స్వయంగా వెళ్లి దానిని జారీ చేశాను! అంత గొప్ప సుబేదార్ గారి మీదా జారీ చేసేశానంటే నమ్మండి!" ఇంతవరకూ చెప్పిన అమీనా ఆగిపోయాడు. ఆ తర్వాత ఏమయిందని అతని శ్రోతలు ఉత్కంటతో అడిగారు. అమీనా సావధానంగా సమాధానం ఇచ్చాడు. "ఎమయిందీ, నిస్సాజీ తాకీదు ని లెక్క చెయ్యలేదు! న్యాయ స్థానం లో హాజరు కాలేదు! కాని ప్రధాన న్యాయమూర్తి గారు సామాన్యులా? ఈ ప్రపంచం లో ఆయనేవ్వరినీ లెక్క చెయ్యరు! సుబేదార్లు కానివ్వండి, సేనా నాయకులు కానివ్వండి-- మరో తాకీదు తో నన్ను మళ్ళీ పంపించారు! అందులో ఏమయిందో తెలుసునా? చెప్తా వినండి. "మరాఠా సామ్రాజ్య న్యాయస్థానం బస్సేయిన్ సుబేదార్ విస్సాజీ కి చెప్పేదేమనగా , వేత్ బిగార్ శాసనాన్ని అతిక్రమించిన నేరారోపణ నిమిత్తమయి అయన వెంటనే న్యాయస్థానం లో హాజరు కాకపోయినట్లయితే "దాళాయిత్" లని పంపించి బేడీలు తగిలించి బలవంతంగా తీసుకు రావలసి వస్తుంది!"
"నిజంగానా!"--
"అంత గొప్ప మనిషినీ అలా జడిపించారా?"--
"నిజంగానే బాబూ, నేను చెప్పినదంతా నిజమే -- ప్రధాన న్యాయమూర్తి రామ్ శాస్త్రి గారికి కింద అమీనా గా పనిచేసే గౌరవం నాకు దక్కింది! ఇంకా చెప్తా వినండి! రెండవ తాకీదు పుచ్చుకున్న సుబేదార్ గారికి జ్ఞానోదయం అయింది. న్యాయ స్థానానికి చల్లగా వచ్చి చేరుతున్నారు! పాపం! జన సామాన్యులలో ఒకరి లాగ విచారణ కి నుంచున్నారు. కానీ, ఎంత కాదన్నా పెద్ద అధికారి కదా, అయన గురించిన నిర్ణయం పీష్వా సాహెబ్ వారికి ముందు తెలియజేసి తర్వాత ప్రకటిస్తారు!" ఈ కధ చెప్పటం అమీనా కి ఎంతో సంతృప్తి కలిగించింది. దానిని విన్నవారందరి దృష్టి లోనూ తన హోదా పెరిగిందని భావించాడు. ఇక లోపలికి వెళ్ళవచ్చునని అక్కడ నుంచి కదిలి వెళ్లి పోబోయాడు కాని జనం అతని వద్ద మరొక విషయం తెలుసుకోననిదే వదల తలుచు కోలేదు.
"అమీనా గారూ, రాజమాత గోపికా భాయి వారికి తమ కుమారుడు పీష్వా సాహెబ్ తమ మాట వినకుండా కేవలం రామ్ శాస్త్రి మాటనే పాటించటం కోపం కలిగించిందిట! నిజమేనా?" గుక్క తిప్పుకొనకుండా అడిగాడు ఒక వ్యక్తీ.
ఈ ప్రశ్నకి ఎలా సమాధానం ఇవ్వాళో అమీనా కి వెంటనే తెలియలేదు. కొన్ని క్షణాలు మవునంగా వుండిపోయి చివరికి ఇలా అన్నాడు : "నిజమే బాబూ , మీరు విన్నదీ నిజమే! విస్సాజీ రాజమాత కి దగ్గిర బంధువు. ఆయనకి ఈ అవమానం తప్పించాలని ఆమె కోరుకొనడం లో ఆశ్చర్యం లేదు. కాని మన పీష్వా సాహెబ్ వారికి తల్లి అంటే ఎంత గౌరవం ఉన్నప్పటికీ న్యాయ పరిపాలన కి సంబంధించినంత వరకు రామ్ శాస్త్రి గారి అజ్ఞ జవదాటరు కదా! అందుకనే గోపికా బాయి వారు కోపగించుకుని రాజభవనం వదిలి నాజక్ వద్ద గంగాపూర్ లో ఉంటున్నారు .....జీవితాంతం అక్కడే స్థిర పడిపోతా నంటున్నారు!"
"సభా సధులారా వినండి! మరాఠా సామ్రాజ్య ప్రధాన న్మ్యాయమూర్తి శ్రీ రామ్ శాస్త్రి ప్రభూ న్యాయస్థానానికి అరుదేంచారు! సభాసదులారా వినండి! మరాఠా సామ్రాజ్య ప్రధాన న్మ్యాయమూర్తి.........."
పై ప్రకటనలు ఆ ప్రదేశంలో ప్రతిధ్వనించటం తో సాలోచన గా మాట్లాడుతున్న అమీనా గాభరాగా న్యాయస్థానం లోపలికి వెళ్ళిపోయాడు. అతను ప్రవేశించే సమయానికి రామ్ శాస్త్రి కోసం సభలోని వారంతా లేచి నుంచుని ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి అసీనుడయ్యే దాకా ఎవరూ కూర్చోన లేదు.
ప్రధాన న్యాయమూర్తి కాలం వృధా చెయ్యకుండా వెంటనే కార్యక్రమం ప్రారంభించాడు. న్యాయస్థానం నాజర్ వేదిక ముందు నుంచుని నిస్సాజీ మీద ప్రధాన న్యాయమూర్తి రామ్ శాస్త్రి తీర్పు చదవటం మొదలు పెట్టాడు. దాని సారాంశం ఇది : బస్పెయిన్ సుబేదార్ విస్సాజీ వేత్ బిగార్ పద్దతిని చట్ట విరుద్దంగా అవలంభించినట్లు రుజువు అయినందు వల్ల ఆయనకి పది వేల రూపాయలు జర్మానా విధించటం జరుగుతుంది. దీనిలో కొంత భాగం విస్సాజీ బలవంతంగా బానిసత్వం విధించిన రయితు కుటుంబాలకి ఇవ్వటం జరుగుతుంది.
న్యాయస్థానం లో ప్రేక్షకుల ఆశ్చర్యానికి అంతు లేదు. నిస్సాజీ అంతవాడికి అందరూ ఒకప్పుడు చేసిన నేరం చేసినందుకు ఇంత పెద్ద శిక్ష విధించటమా! ఇక దీనిని గురించి చర్చించి కూడా ప్రయోజనం లేదన్నట్లు కొందరు నిశ్శబ్దంగా లేచి సభని వదిలి వెళ్ళటానికి ఉద్యుక్తులయ్యారు. ఇంతలో నాజర్ ఇలా అరిచాడు:
"శీలేదార్ చంపాజీ౧ బానిస యువతి శ్యామా! ముందుకు రావాలి!" ఈసారి నేరస్థులు సాధారణ వ్యక్తులు కాబట్టి నాజర్ కంఠస్వరం దృడంగా వుంది. న్యాయస్థాన మందిరం లో అతని మాటలు మారు మ్రోగి పోయాయి.
న్యాయస్థానం ఉత్తరువు ప్రకారం ఒక యువకుడు, ఒక యువతీ వేదిక ముందు వచ్చి నుంచున్నారు. న్యాయస్థానం లోని ప్రేక్షకులు కొందరికి వీరు అపరుచితులు కారు. చంఫాజీ శ్యామాని గుర్రం మీద ఎక్కించుకుని వెళ్ళిపోవటం వారు కళ్ళారా చూసిన వారే. ఉండబట్ట లేక తమకి తెలిసినదంతా పక్కనే ఉన్నవారికి ఆ ఉదంతం గుసగుసలతో చెప్పటం ప్రారంభించారు. ఈ అలజడి వెళ్ళిపోతున్న వారి కుతూహలాన్ని రేకెత్తించింది. ఇదేదో రసవత్తరమయిన సంఘటన కి సంబంధించిన తీర్పు అయి ఉంటుందని ఆగిపోయి ఆసక్తి తో వినటానికి సిద్దం అయ్యారు.

