` 6
రాఘవరావు ఎందుకు వచ్చాడో నాగభూషణానికి అర్ధం కాలేదు. సామాన్యంగా రాఘవరావు వాళ్ళింటికి రాడు. అంత అవసరమైన పని తనతో ఏమిటో నాగభూషణానికి అర్ధం కాలేదు.
"ఏం , రాఘవరావ్, యిట్లా వచ్చావ్? ఎంత సేపయింది వచ్చి?' అన్నాడు నాగభూషణం తనూ అరుగు మీద కూర్చుంటూ.
"ఏం లేదు, కాస్త పిచ్చాపాటి మాట్లాడదామని."
"ఏమిటది?"
"మన ఊరు పంచాయితీ ఎన్నికలు దగ్గిర కొస్తున్నాయి గా? గుర్తిందిగా?"
"అదేమిటయ్యా, గుర్తు లేకపోవట మేం? ఏం గిరాకి? నువ్వూ నిలబడుదామనా?" అన్నాడు నవ్వుతూ.
"అవును, మామా. క్రితం సారి ప్రెసిడెంట్ గిరికి నిలబడుతుంటే అప్పటి పరిస్థితులు నీకూ తెలుసుగా? పెద్దవాడు మా నాన్న మాట ప్రకారం, అప్పట్లో ఆ ప్రయత్నం విరమించా. పోనీ అంతా నెత్తిన పెట్టుకుని ఎన్నుకున్న ఆ వీరాస్వామి ప్రెసిడెంట్ గిరీ హయం లో మన గ్రామం ఏమాత్రం బాగుపడింది చెప్పు? అన్నీ వదిలెయ్యి. మన వూరు మురుగు కాలవ కన్నా వంతెన లేకపోవటం నుంచి మనం పడేపాట్లు అందరం అనుభవిస్తున్నదేగా? వీరస్వామి అ వంతెన సంగతి ఏమన్నా పూనుకున్నాడా? మురుక్కాలవ మరీ పొంగినప్పుడు ఆసంగళ్ళ మీద దాటలేక, చస్తున్న సంగతి నీకూ తెలిసిందేగా మామా? అలాంటి వాటికి మీరు పట్టం, కట్టారే! ఏం చేశాడు చెప్పు నిరవాకం?" అన్నాడు రాఘవరావు.
నాగభూషణం నవ్వుతూ చుట్ట పొగ వదిలాడు.
"నిజమేనయ్యా , మురుక్కాలవ మీద వంతెన కావాల్సిందే. కనీసం పాతిక వేలన్నా అవుతుంది. అంత డబ్బు ఈ చిన్న పంచాయితీ భరించ గలదా? ఎవరున్నా ఆ మురుక్కాలవ వంతెన సంగతి అంతే. పోనీ ఏ మంత్రి గారినయినా తీసుకువచ్చి మన కష్ట సుఖాలు చెప్పి ప్రభుత్వం సాయం తో నైనా వేద్దామంటే ఎవ్వరూ పట్టించు కోరు. అందుకనే మన ఊరు ఇంతవరకూ ఏ మంత్రి గారయినా వచ్చారా? ఈ వూళ్ళో ఎవరికి వారే యమునా తీరే. అందుకనే మనకు ఈ మురుక్కాలవ బాధలు తప్పటం లేదు" అన్నాడు నాగభూషణం.
"అదీ, అట్లా చెప్పు. అందుకనే గవర్నమెంటు వారి చేతనే ఆ పని చేయించే టట్లుగా అధికార్ల తో మాట్లాడి వార్నే ఒప్పించి, మన కష్ట సుఖాలు చెప్పి వారి మనస్సులోకి మన వూరు విషయం ఎక్కేటట్లు చెయ్యాలి. మన పంచాయితీ కి సాలుకు రెండు వేలు కూడా రావు. ఆ సంగతి నాకు మాత్రం తెలీదూ?"
"అధికార్లను మెప్పించి అంతటి మహత్కార్యం నువ్వు తలపెడతా నంటే మేం మాత్రం కాదంటామా చెప్పు? ఇంతకీ ఈసారి ప్రెసిడెంట్ నువ్వు కావాలంటావ్ , అంతేనా?" నవ్వుతూ అన్నాడు నాగభూషణం.
"మీరంతా యిష్ట పడితేనే. లేకపోతె ఈ ఉన్న వ్యవహారాలూ చాలక, ఈ కొత్త వ్యవహారాలూ కూడా మెడకు తగిలించుకోటం ఎందుకు?" అన్నాడు రాఘవరావు.
"కానీ చూద్దాం. అందరితో నూ ఆలోచించే చేద్దాం. ఇవ్వాళ రేపట్లో మునిగి పోయేదేం లేదుగా?' అన్నాడు నాగభూషణం.
"అట్లాగే. మరి నే వెళ్ళొస్తా మామా" అంటూ వెళ్ళిపోయాడు రాఘవరావు. ప్రెసిడెంట్ గిరికి రాఘవరావు పడే తాపత్రయం చూసి తనలో తను నవ్వుకున్నాడు నాగభూషణం.
* * * *
డిసెంబరు లో సెలవులకు ఇంటికి ప్రసాదపురం వెళ్ళాడు రమేష్. ఒకసారి తమ్ముడిని పిలిపించి ఆ ప్రేమ వ్యవహార మేదో తెలుసుకోవాలని , తెలుసుకుని పెడదారిని బడితే హితబోధ చేద్దామని అనిపించి ఉత్తరం వ్రాసింది కామాక్షి. అక్కయ్యంటే ఉండే గౌరవం కొద్ది తండ్రితో రానని చెప్పినా సెలవులకు ఇంటికి వెళ్ళాడు రమేష్.
కొడుకును చూడగానే నాగభూషణం తల తిప్పుకున్నాడు. మనస్సులో మళ్ళీ ఆందోళన చెలరేగింది. "వీడేదో చదువుకుని నన్ను ఉద్దరిస్తా డనుకుంటే ప్రేమ వ్యవహారాలూ మొదలు పెట్టాడు. నా కడుపున చెడబుట్టాడు' అనుకున్నాడు మనస్సులో. కాని మళ్ళా కొడుకును పలకరించకుండా ఉండలేక పోయాడు.
తన జీవితంలో కొడుకులు హద్దులు మీరి ప్రవర్తించినా అంతరాత్మ ను చంపుకుని హాలాహాలాన్ని మింగినట్లుగా వాళ్ళ తప్పులన్నీ దిగమింగి జీవించ గలిగిన నాగభూషణం , రమేష్ జీవితంలో కలిగే ప్రతి మార్పునూ ఎంతో జాగ్రత్తగా గమనిస్తూ కనిపెట్టి ఉంటున్నాడు. అందుకనే కన్న పేమ కట్టలు తెంచుకుని పరవళ్ళు తొక్కగా కన్నీళ్లు తడుచుకుని కుశల ప్రశ్నలు వేశాడు.
"కులసాగానే ఉన్నా, నాన్నా. బాగానే చదువుకుంటున్నాను. నీతో సెలవులకు రానని చెప్పినా, అక్కయ్య వుత్తరం చూసి రావాలని పించింది." అన్నాడు రమేష్ కామాక్షి వైపు చూస్తూ.
"పోనీలే రా. ఈ అక్కయ్య మీద ఆమాత్రం గౌరవమైనా ఉంచావ్. చాలా మంచి వాడివి. వెళ్లి స్నానం చేసిరా. వేడి వేడి అన్నం తిందువు గాని.' అన్నది కామాక్షి. తమ్ముడు వచ్చినందుకు మనస్సులో ఎంతో ఉప్పొంగి పోయింది. రమేష్ బట్టలు మార్చుకుని స్నానానికి వెళ్ళాడు. రమేష్ వెళ్ళిన తరువాత కామాక్షి తండ్రితో అన్నది:
"నాన్నా?"
"ఎమ్మా?"
"వాడేదో ప్రేమ వ్యవహారం లో పడ్డాడన్నావు కదూ? వాడి నేమీ అనకు. అసలా ప్రస్తావనే వాడితో నువ్వు తీసుకు రావద్దు. అన్నీ నే కనుక్కుంటా. నువ్వేమీ తొందర పడకు."
'అట్లాగే తల్లీ. పాడయి పోతున్నాడనే భయంతో అన్నాను గాని వాడి మీద నాకు కోపం లేదు తల్లీ. కోపతాపాలతో నన్ను కొట్టబోయి ఆస్తి పాస్తులు అమ్ముకుని, అన్నీ వదులుకు పోయిన ఆ యిద్దరూ వెళ్ళనే వెళ్ళారు. ఇంక నాకు మిగిలింది వాడూ, నువ్వేనమ్మా. ఎవ్వరి మీద నాకు కోపం లేదు. వీడూ అట్లాగే అవుతాడేమో నని నా బాధ. అంతే. వాడిని నేనేమీ అనను తల్లీ" అంటూ కళ్ళు ఒత్తుకున్నాడు నాగభూషణం.
కామాక్షి గుడ్ల నీరు గుడ్ల గుక్కుకుని వంటింట్లో కి వెళ్ళిపోయింది.
రమేష్ ఉన్న వారం రోజులూ అంతా ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పుతున్నారు గాని తతిమ్మా విషయాలేం మాట్లాడుకోలేదు. రమేష్ కూడా ఊళ్ళో స్నేహితులను, సహాధ్యాయులను అందర్నీ కలిసి సరదాగానే కబుర్లు చెప్పుకుంటూనే కాలక్షేపం చేశాడు. రాఘవరావు కూడా రమేష్ తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.
సెలవులు ఇట్లే గడిచినాయి. మర్నాడు ప్రయాణం పెట్టుకున్నాడు రమేష్. ఆరోజు మధ్యాహ్నం తండ్రి పొలం వెళ్ళిం తరవాత కామాక్షి రమేష్ తో అన్నది.
"తమ్ముడూ?"
"ఏం అక్కయ్యా?"
"రేపేగా నీ ప్రయాణం?"
"అవును. ఎల్లుండే కాలేజీ. అందుకని రేపే వెళ్ళాలి. నాన్నని డబ్బడిగి తీసుకోలేదు. నాన్న నా మీద కోపంగా ఉన్నాడా అక్కయ్యా? ఎక్కువగా మాట్లాట్టం లేదు."
"నువ్వు కోప మొచ్చే పనులు చేస్తుంటే కోపం రాదా మరి?"
తమ్ముడి మనస్సులోని భావాలు అతడే చెప్పగా వినాలనుకుంది కామాక్షి.
"కోప మొచ్చే పన్లు గాని, చెడిపోయే పన్లు గాని నేనేమీ చేయటం లేదే?"
రమేష్ మనస్సులోని ఆరాటాన్ని అతని ముఖంలో కనిపెట్టింది కామాక్షి. మనస్సు కు మనస్సే సాక్షి. అన్ని విషయాలు దాయకుండా చెపుతాడనుకున్నది. తన విషయంలో తమ్ముడూ ఏమీ దాచడాని తెలుసు.
'అక్కయ్యా?"
"ఏం రా?"
"మొన్న గుంటూరు వచ్చినప్పుడు నేనెవరి నో ప్రేమిస్తున్నట్లుగా నాన్న విన్నాడు. అదే నామీద ఆయనకు కోపం. అక్కా! నీతో నేనేమీ అబద్దం చెప్పను. ప్రేమ వేరు, చెడి పోవటం వేరు. సుఖలాలసత్వం లో మునిగి తేలే పన్లు నేనేం చేయ్యాటం లేదు. నేను చెడిపోలేదు , చెడిపోను. కాని నాన్నకు నా మీద అంత కోపం ఎందుకో అర్ధం కావటం లేదు."
అతని మనస్సులో వసుంధర తళుక్కున మెరిసింది. ఆమె రూప లావణ్యాలూ , తనతో మాట్లాడిన మాటలూ నెమరు వేసుకుంటున్నాడు. హృదయంలో స్థానం సంపాదించుకున్న వారి మాటలు, మనస్సులో మారు మ్రోగుతూనే ఉంటాయి. ఆ మాటలు చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా చెప్పినట్లుగా చిత్రించుకుని రూప కల్పన చేసుకుంటే అంతకు మించిన ఆనందం మాటల విషయం లో ఇంకొకటి ఉండదు.
