Previous Page Next Page 
అయిదు రెళ్ళు పేజి 7

 

    "గిండికి వెళ్ళాలంటే ఎక్కడ దిగాలి?"
    "గంగలో దిగండి." అన్నాడు మోహన్ కసిగా. ముసలాయన ముఖంలో రంగులు మారాయి. చరచరా కోపం ఎక్కటం లో చురాచురా చూస్తూ "నన్ను గంగలో దిగామంటావయ్యా? ఎంత పొగరు? అని అరిచాడు.
    "ఇందాకలా కసురు కున్నరుగా? ఇప్పుడు మళ్ళా నన్నెందుకు అడగటం? గంగలో దిగాలని లేకపోతె గోదావరిలో దిగండి."
    "ఎంత తల బిరుసు?"
    "ఎంత నోటి దురుసు!"
    ముసలాయన మండి పడ్డాడు.
    "కుక్కకు మాటలు నేర్పితే ఇస్కో అంటే ఇస్కో అన్నదట!"
    మోహన్ అంతకన్నా వూరుకోలేదు.
    "నేను కుక్కనయితే మీరు నక్కా!"
    ముసలాయన దుర్వసుడిలా హుంకరించాడు.
    "తాటాకు చప్పుళ్ళకు కుందేళ్ళు బెదరవు!" అన్నాడు మోహన్.
    ముసలాయన మండిపడుతూ సీట్లో నుంచో దబీలుమని లేచి నించున్నాడు. తను నక్క కూడా కాదట ప్రాణం లేని తాటాకు ముక్కట! వళ్ళు మండదూ మరి? మోహన్ పరాయి వాడు కాబట్టి ప్రాణాలు దక్కాయి కాని.....
    బస్సులో వాళ్ళంతా ఎంతో కుతూహలంగా చూస్తున్నారు సంభాషణ అర్ధం కాకపోయినా.
    "నేను తాటాకు ముక్కనా? నీ నోటికి హద్దు, పద్దూ లేదూ? నీ నాలిక చీలికలవా!"
    "మీ తల పగులా!"

                                            
    ఒక అరవ తెలుగాయన పోట్లాట లో తల దూర్చాను.
    "విషయమేమిటి?' అని ఆదుర్దాగా దర్యాప్తు చేశాడు. అయన నిజానికి తెలుగువాడే కాని తరతరాలుగా అరవంతో ఏర్పడిన పరిచయం అయన తెలుగు భాషా స్వరూపాన్ని అపహరించేసింది.
    సానుభూతి చూపుతున్నట్టు పలకరించేసరికి ముసలాయనకు కొండందుకున్నట్టయింది.
    "చూడవయ్యా! ఈ కుర్రాడు నన్ను గంగలో దిగమంటున్నాడు!" అన్నాడు.
    ముసలాయన ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్ధం కాలేదు. మద్రాసు లో గంగేమిటి అని కంగారు పడ్డాడు ఒక క్షణం!
    "కాశీ యాత్రకు పోతుండారా? గంగలో దిగితే నిండా పుణ్యం! అబ్బాయి నిండా మంచి సలహా చెప్తే అట్టా ఎగుర్తావేమయ్యా? నిండా మోసంగా ఉందే!" అన్నాడు చివరికి.
    'చాల్చాల్లెవయ్యా! నీ సాక్ష్యం నువ్వూనూ? ఆ పోగరమోటు వెధవను వెనకేసుకుని వస్తున్నావ్?"
    "మాటలు తిన్నగా రానియ్యండి. ఇక్కడ పొగరు మోతులెవరూ లేరు...." అన్నాడు మోహన్.
    కండక్టర్ సీటు దగ్గర కొచ్చి "ఇద్దరూ మాట్లాడకుండా కూర్చుంటారా? లేకపోతె దిగి పోతారా?' అన్నాడు.
    ముసలాయన గొణుక్కుంటూ కూర్చున్నాడు. లజ్ లో అయన దిగి వెళ్ళి పోయాడు.
    "అమ్మయ్య!' అని ఊపిరి వదిలాడు మోహన్.
    ఇంతకీ బయల్దేరిన వేళా మంచిది కాదు... పుణ్యానికి పొతే పాపం ఎదురయింది! ఎక్కడికి వెళ్తారూ అని పలకరిస్తే ఎంత చేశాడు ముసలాయనకి వేపకాయంత వెర్రి వున్నట్టుంది.... నాలిక చీలికలవా అని తిదతాడా? నాలిక చీలికలైతే డైలాగు లేలా చెప్పటం? పాటకు ప్లేబాకు పెట్టుకున్నా మాటలు కూడా ఎరువు తెచ్చు కుంటానంటే ఎవరూరుకుంటారు? నటుడు కావాలని తన పాట్లు!     ఏం గ్రహపాటో ముసలాయనచేత ఉత్త పుణ్యానికి చీవాట్లు తిన్నాడు!

                                4
    
    "మోహన్! నన్ను గట్టేలా ఎక్కిస్తావ్?"అన్నాడు సుధాకర్ మోహన్ తో కలిసి నడుస్తూ.
    "మరేం బెంగ పెట్టుకోకురా! అంతా నేను చక్కబెడతానుగా?" అన్నాడు మోహన్ రామయ్య గారింటి మెట్లు ఎక్కుతూ.
    సుధాకర్ మోహాన్ని తన గదిలోకి తీసుకెళ్ళాడు. "ఆడదాని వొర చూపులో" అంటూ రేడియో పాడుతుంది గీత గదిలో నుంచి. అది రామయ్య గారు ఇంట్లో లేరనటానికి గుర్తు!
    'ఆవిడ తెలుగు సినిమా పాటలంటే చెవులు కోసుకుంటుంది!" అని వివరించాడు సుధాకర్.
    "అయితే ఆవిడకి ఇంతకీ ఇప్పుడు చెవులున్నాయా , లేవా?"
    "వూరుకోరా నీ పెలాపన కట్టి పెట్టి! గోడకు చెవులుంటాయి....నీ మాటలు వింటే లేనిపోని తంటా!"
    "సరే మాట్లాడకుండా కూర్చుంటాను కాని ఇక్కడికి పిలుచుకుని వస్తావా?"
    "రమ్మంటే వస్తుందో, రాదో?" అని అనుమానిస్తూనే సుధాకర్ గీత గదిలోకి వెళ్ళాడు. గీత శ్రద్దగా సినిమా పాటలు వింటున్నది. సుధాకర్ దగ్గాడు. గీత కళ్ళతో పలకరించి నవ్వింది.
    "నా ఫ్రెండ్ వచ్చాడు.... నా గదికో మాటు వస్తారా...?"
    "మీ ఫ్రెండ్ సంగతేమిటో మీరు చూసుకోలేరేమిటి, నేను తోడు రావాలా?.... ఆయన్ని ఒక్కడినే గదిలో పెట్టేసి వచ్చారా? ఏం మర్యాదండి!" అని నవ్వింది గీత.
    ఇలా లాభం లేదనుకుని ఇంకో ఎత్తు వేశాడు సుధాకర్.
    "మా మోహన్ కు గొంతుక తడి అరిపోతున్నది."
    "ప్లీజ్! నన్ను డిస్టర్బ్ చేయకండి! తెలుగు పాటలు వస్తున్నాయి! మంచినీళ్ళు కావాలంటే ఇంకెవరి నైనా అడగండి.... లేదా సోడా తెప్పించి యివ్వండి...." అంది గీత.
    మరింక లాభం లేదనుకుని సుధాకర్ ముఖం వ్రేలాడేసుకుని మోహన్ దగ్గర కెళ్ళాడు. మోహన్ సంగతంతా విని ఏం చేయటానికి తోచక తల చేత్తో పట్టుకుని కూర్చున్నాడు....
    కాస్సేపయ్యాక "మీ ఫ్రెండ్ ఉన్నారా, వెళ్ళి పోయారా?" అంటూ అల్లంత దూరం నుంచే ప్రశ్నిస్తూ వచ్చింది గీత.
    మోహన్ యెగిరి గంతేశాడు.
    "మీరా?"
    గీత ఉలిక్కిపడి "మీరా?" అంది ఆశ్చర్యంగా.
    సుధాకర్ ఇదరి ముఖాల కేసి విస్తుపోతూ చూశాడు.
    "ఇదేమిటి? మీ యిద్దరికీ ఇదివరకే పరిచయం ముందా?' అని అడిగాడు.
    "నేను సంగీతం పోటీ గురించి చెప్పాను చూడండి? న్యాయం చెప్పిన పెద్ద మనుషుల్లో ఈయనొకరు. తెలియకపోవడమేమిటి?" అంది గీత కోపంగా చూస్తూ.
    ఆ వాతావరణం లో నిలబడటానికి ధైర్యం చాలక సుధాకర్ రూమ్ లోంచి ఇవతల కొచ్చాడు.
    "మీకు గుర్తుంటాననుకోలేదు సుమండీ?" అన్నాడు మోహన్ నమ్రతగా.
    "మిమ్మల్ని జన్మలో మర్చిపోను....! ఆ వసంతెం పాడిందని దానికి ఫస్టు ప్రైజు? దానికి ఎలా గోలా మొదటి బహుమతి ముట్టజేప్పాలని నన్ను అన్యాయం చేస్తే నా ఉసురు తగలకుండా ఉంటుందా?"
    "మీ ఉసురు తగిలితే మరో ఆయనకు తగులుతుంది కాని నాక్కాదు సుమండీ...."
    "ఏమిటి....?"
    "నిజం చెప్పమంటారా?"
    'అబద్దాలు అలవాటా?"
    "మీరలా కోపంగా చూస్తుంటే నాకు నోట మాటే పెగిలి రావటం లేదు...."
    "మీరెందుకు మాటరాక అవస్థ పడటం? నేను వెళ్తాను -- మీరు, మీ ఫ్రెండ్ కలిసి ధారాళంగా మాట్లాడుకోవచ్చును..." అంటూ గీత కదిలింది.
    మోహన్ కంగారు పడ్డాడు.
    "ప్లీజ్....! చెప్పేది వినిపించుకోండి..... అసలు విషయం తెలుసుకోకపోతే మీరు నన్ను జన్మంతా అడిపోసుకుంటూనే ఉంటారు.... ఆరెండో జడ్జి లేకపోతె మీకు మొదటి బహుమటేమిటి, అఖిల భారత బహుమతే ఇప్పించి ఉండేవాడిని!"
    గీత గుమ్మం దాటబోతున్నదల్లా ఆగిపోయి మోహన్ కేసి తిరిగింది.
    "నామాట నమ్మండి! ఆ పోటీ జరిపిన సొసైటీ కార్యదర్శి నా స్నేహితుడు.... జడ్జీలుగా ముగ్గురుండాలట. అందుకని ముగ్గురు సంగీత విద్యాంసుల ఇళ్ళ చుట్తో తిరిగి వాళ్ళ కాళ్ళు పట్టుకుని జడ్జీలు గా ఉండటానికి వాళ్ళని ఒప్పించాడట. తీరా పోటీ రోజున వాళ్ళలో ఇద్దరూ అర్జెంటు పనులంటూ దర్జాగా రావటం మానేశారు.... దాంతో వాడు కంగారుగా పరుగులు తీస్తున్న సమయంలో నేను వాడిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాను. నేను కంటబడటం తోనే వాడు అమాంతం కౌగలించుకుని కంట తడి బెడుతూ -- అవి ఆనందాశ్రవులట--"దేవుడిలా వచ్చి రక్షించావురా!' అంటూ నన్ను బలవంతంగా మరో జడ్జి పక్కన కూలేసి "మూడో ఆయనేవరూ లేరు మీ యిద్దరే ఎలాగోలా పని జరిపించాలి' అంటూ బ్రతిమాలుకున్నాడు. వాడి ముఖం చూస్తె జాలేసింది. జాలేసి నేనేం చెయ్యను? వాడిని చాటుగా తీసుకెళ్ళి "నాకు సరిగమలు కూడా రావురా!" అని విన్నవించుకున్నాను. వాడు వినిపించుకోలేదు సరి కదా ' నోరు మూసుకు నడు-- మార్కు లెయ్యమంటే ఏమిటో ఈ పేద అరుపులు! నీకేం , నిక్షేపం లా బి.ఎ చదివావు..... నీకన్నా మంచి జడ్జి ఎవడు దొరుకుతాడు? సంగీతం రాదంటావా మరీ మంచిది. వచ్చిన వాళ్ళు కొసరి కొసరి మార్కులు వేస్తారు. నువ్వయితే కాస్త మార్కులైనా కనబడతాయి....' అని చీవాట్లేసి 'సీట్లో నుంచి కదిలావంటే చూడు!' అంటూ నన్ను సీటు దగ్గరికి రెక్క బట్టుకుని ఈడ్చు కెళ్ళాడు.
    తర్వాత పోటీ జరిగింది. ఆడపిల్లల్లో మీరిద్దరేగా వచ్చారు? నేను వసంత కన్నా మీకే ఎక్కువ మార్కు లిచ్చాను. నేను ఎనభై వేస్తె అయన ఇరవై వేశాడు. వేస్తె వేశాడు కాని నన్ను పట్టుకుని "ఏమయ్యా ! నీకు సరిగమలైనా తెలిసినట్టు లేవే.....? ఆ అమ్మాయి పాటలో ఒకటా, రెండా తొంబై అపస్వరా లున్నాయి...' అన్నాడు చిరాకు కోపం మిళితం చేసి. నాకు అంతకన్నా చిరాకేసింది. 'అపస్వరాల సంగతేమో కాని ఆవిడ కంఠస్వరమే నాకు ఖంగు మని వినిపించింది.' అన్నాను. నిజానికి మొదట పాడినవిడ గొంతుక నాకు చెవులు రిక్కించుకున్నా ఒక్క ముక్క కూడా వినపడలేదు సుమండీ. మీదే ధాటిగా వినపడింది.... దాంతో అయన 'సరే! ఏదో ఒకటి కానియ్యవయ్యా....ఇప్పుడు నేను చెప్పినట్టు మార్కులు దిద్దు. వసంత కు మొదటి బహుమతి యిద్దాం.... రెండవ బహుమతి రద్దు చేయమందాం. బొత్తిగా స్టాండర్డ్ లేదు....' అన్నాడు. ఆ ముసలాయన ధోరణి చూస్తె నాకు కోపం ముంచుకొచ్చింది. జన్మలో మొదటిసారిగా జడ్జీ పని చేయట మేమిటి, ఈయన నా అధికారాన్ని ఊడ లాక్కోవాలని ఎత్తు వేయుట మేమిటి? నేను మొండి కేశాను. మొదటి బహుమతి వంసత కిస్తే నా కభ్యంతరం లేదు కాని రెండో బహుమతి రద్దు చేస్తే మాత్రం నేను వూరుకొను అని ఖచ్చితంగా చెప్పాను. అయన నామీద కారాలు, మిరియాలు నూరితే నేను కత్తులు నూరాను. మా కొట్లాట విని నా స్నేహితుడు పరిగెత్తుకుని వచ్చాడు. ఆ ముసలాయన వాడి మీద విరుచుకు పడ్డాడు. "చాల్చాల్లేవయ్యా! మంచి వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టావు.... ఆ రెండో పిల్ల  వరసా వాడీ లేకుండా పాడితే ఆ పిల్లకు బహుమతిలివ్వాలంటాడు ...!" అని మండిపడ్డాడు. అయినా నేను మాత్రం బెదిరి పోలేదు. బహుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాను. దాంతో నా స్నేహితుడు 'ఎలా పాడినా సరే సొసైటీ బహుమతి యివ్వాల్సిందేనండి.... రద్దు చేయటం ఉండదు....' అని సర్ది చెప్పాడు. ఇదీ అసలు విషయం. నేను అసలు జడ్జి ని కాను. సత్రకాయ జడ్జిని ...."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS