"ముందు బావగార్ని ఒకసారి చూసిపో. ఒక్క పది నిమిషాలు అగావంటే పెసర పచ్చడి నూరి పెడతాను" అని అతని ప్రశ్నను మధ్యలోనే ఎగర గొట్టి లోపలికి నడిచింది విజయ. జగన్నాధం కూడా ఆమె వెనకాలే లోపలికి వెళ్ళాడు.
జయప్రదరావు మంచానికి అంటి పెట్టుకు బల్లిలా పడుకున్నాడు. జ్వరం తగ్గింది కానీ పధ్యం పెట్టలేదు. రెండు రోజు లాగితే పెట్టవచ్చు నన్నాడు డాక్టరు. ఇవ్వాళే తొంభయి తొమ్మిది నుంచి నార్మలు కు జారింది జ్వరం. జగన్నాధం లోపలికి వెళ్ళగానే ఓపిక లేని నవ్వు నవ్వాడు అతను. వ్యాధి అనేది మనిషి లోని శక్తిని మాత్రమే కాదు ఉదాత్తతను , గంబీర్యాన్ని కూడా చెదర గొట్టి వేస్తుంది. ఇప్పటి జయప్రదరావు ను చూస్తుంటే జగన్నాధానికి విపరీతమైన జాలి వేసింది.
తను పది నిమిషాలు కూర్చుని వెళ్ళిన తరువాత పెసర పచ్చడి తో సహా విజయ వచ్చింది. పొద్దుట వండుకున్న అన్నానికి చీమలు దులుపు తున్నాడు జగన్నాధం. ఆమెను చూడగానే ఖంగారుపడి--
"అక్కడికీ నీళ్ళ ల్లోనే పెట్టాను అక్కగారు. పాడు చీమలు" అన్నాడు. విజయ కళ్ళలో నీరు తిరిగింది. ఆ పచ్చడి అక్కడ పెట్టి తిరిగి వస్తూ కొన్ని క్షణాలాగి--
"తమ్ముడూ " అన్నది . జగన్నాధం తలయెత్తి చూశాడు.
"మూడు నాలుగు రోజుల్లో బావగారికి పధ్యం పెట్టచ్చు నన్నాడు కదూ డాక్టరు....మరి."
ఆమె ఆవేదన ఏమిటో అతను అర్ధం చేసుకున్నాడు. రెండు మూడు రోజుల్లో భర్తకు పధ్యం పెట్టాలి. బహుశా ఇంట్లో ఏమీ ఉండి ఉండదు. ఆ సంగతి చెప్పలేకనే సంకోచిస్తున్నది ఆమె. జగన్నాధం హృదయం వేదనతో నిండి పోయింది. ఎలాటి కష్టాలు తల్లీ నీకు అనుకున్నాడు అతను.
విజయ సమాధానం కోసం రెండు నిమిషాలాగి మెదలకుండా వెళ్ళిపోయింది.
ఆ మరునాడు ఉదయం తను ప్రాణ ప్రదంగా దాచుకున్న షా నాటకాలూ, తెలుగు ప్రబంధాలు పాత పుస్తకాల షాపులో అమ్మి అయిదు రూపాయలు, విజయ కూ, అయిదు రూపాయలు చిట్టి కి ఇచ్చాడు జగన్నాధం.
అయిదు రూపాయల నోటు పీట మీద పెట్టి మెదలకుండా తిరిగి వెడుతున్న జగన్నాధాన్ని వెనక్కు పిలిచింది విజయ.
"తమ్ముడూ?"
"నీ ఋణం...."
"ఉండనియ్యండి" అని అక్కడి నుంచి పారిపోయాడు అతను.
"చిన్నవాడివి అయినా నిన్ను ఆశీర్వదించే శక్తి ఇప్పుడు నాకు లేదు" అనుకుంది విజయ అయిదు రూపాయల నోటు కొంగున కట్టుకుంటూ. క్రితం సాయంత్రమే ధనం ఆవకాయ కొంటుందేమో నని వెళ్లి, రెండు రూపాయల ఆవకాయ కొంటా ననిపించుకొని వచ్చింది తను. మళ్ళీ ఈవేళ పనిమనిషి 'ఆవకాయ అయ్యగారు తినరట , వద్దన్నారు అమ్మ గా"రని వార్త పట్టుకోచ్చేసరికి విజయ నవనాళ్ళూ క్రుంగి పోయినాయ్. ఎలాగా అన్నది పెద్ద సమస్య కింద మారి ఆమెను వేధిస్తున్నది.
ఈ సమయంలో ఆపద్భందవుడు లాగా జగన్నాధం ఆదుకునే సరికి కృతజ్ఞత తో నిండి పోయింది ఆమె అంతర్యం. వెనువెంటనే ధనమ్మాళ్ మీద కోపమూ వచ్చింది. తన స్థితి బాగుండగా వీళ్ళందరూ తనను ఆకాశానికి ఎత్తేసిన వాళ్ళే. ఈ రోజున పరిస్థితులు కాస్త అస్తవ్యస్తం అయేసరికి ఇంతగా మారిపోతారన్న మాట మనుషులు. ఛీ...ఛీ....ఏం లోకం అనుకుంది విజయ.
5
విజయవాడ నగరంలోని ఒక ఖరీదైన హోటల్లో, విజయ కూ జయప్రదరావు కూ సంబంధించిన సంభాషణ జరుగుతున్నదని భర్తకు ఉసిరికాయ పచ్చడితో ముద్ద కలుపుతున్నప్పుడు విజయకు తెలియదు. ఇన్నాళ్ళ తరువాత భర్తకు తన చేతులతో తనే అన్నం పెడుతూ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నది ఆమె.
ఆ సంభాషణ డాక్టరు కూ, జగన్నాధం చూసిన అందమైన వ్యక్తీ కీ-- అంటే జయప్రదరావు సోదరుడని డాక్టరు అన్న అతనికీ మధ్య. ఇంకా వివరంగా చెప్పాలంటే ఎవరి చూపులకైతే విజయ మైల పడ్డానని స్నానం చేసిందో ఆ వ్యక్తీ -- జయప్రదరావు సర్వనశానానికీ కారకుడైన అతని దాయాదినాగేశ్వరరావు కూ మధ్య.

నూజీవీడు నుంచి నాగేశ్వరరావే కారు నడుపుకోచ్చాడు. కొన్ని లక్షలకు అతను అధికారి. ఎక్కువ భాగం మద్రాసులోనే ఉంటాడు. నిజానికి జయప్రదరావు అంటే అతనికి ద్వేషం ఏమీ లేదు. కాని ఇదంతా ఎలా జరిగిందంటే, ఏమో జరిగి పోయిందంతే. ఇప్పటి వాళ్ళ పరిస్థితి చూసి నిజంగా తను చాలా బాధ పడుతున్నాడు. ఎంత బ్రతిమాలినా తన నుంచీ కానీ కూడా తీసుకోరు వాళ్ళు. తన పాపానికి నిష్కృతి లేదు.
వైన్ గ్లాసు చేతిలోకి తీసుకుని----
"ఈ ఊరంటే నాకందుకే చాల ఇష్టం. నిషిద్దమైన ప్రతిదీ బలే తేలిగ్గా దొరుకుతుంది ఇక్కడ" అన్నాడు నాగేశ్వరరావు.
'ఆంధ్రదేశపు దేశపు నడి బొడ్డు మీద ఇదా మీ అభిప్రాయం?" అని నవ్వాడు డాక్టరు. అయన పరిమితంగా బీరు మాత్రమె పుచ్చుకుంటూన్నాడు.
"సరే గాని, డాక్టర్ , మావాడికి పత్యం పెట్టించి నట్లున్నారే?' అని కుతూహలంగా డాక్టరు వంక చూశాడు నాగేశ్వరరావు.
"ఇవ్వాళ పెడుతుంది. ఆవిడను చూస్తె చెయ్యెత్తి మొక్క బుద్ది వేస్తుంది" అని గ్లాసులో మిగిలిన ఆఖరి గుక్క గొంతులో పోసుకున్నాడు డాక్టర్.
నాగేశ్వరరావు మనసులోనే కంగారు పడ్డాడు ఆ మాటకు. డాక్టర్ అలా అనటం అతనికి నచ్చలేదు. అంతరాంతరాలలో ఏదో ఒక మృదు భావం కదలాడుతున్నది. అది ఇదామిత్తం అని చెప్ప రానిది. అంతేకాదు . అతనిని నిషా కూడా ఆవరించింది.
"మా వదిన గార్ని గురించేనా? ఆవిడంటే నాకు అమితమైన గౌరవం. అయినా కొంచెం తలబిరుసు మనిషి అనుకుంటాను. ఈ మధ్య చెరువు దగ్గర కనిపిస్తే పలకరిద్దామను కున్నాను. విదిలించుకుంటూ పోయింది."
"గింజలు చల్లటానికి ప్రయత్నించి ఉంటారు బహుశా" అన్నాడు నాగేశ్వర్రావు స్వభావం తెలిసిన డాక్టరు. త్రాగిన వాళ్ళెవరూ అబద్దం అదరు. ఏదీ దాచుకోలేరు. అందుకే సంభాషణ అంత స్పష్టంగా సాగిపోతున్నది.
"ఛ...ఛ...."
"నిజంగా చెప్పండి. ఆమె మీద మీకు గౌరవం ఉందా?"
"తప్పకుండా ఉంది."
"అయితే మీరామెను ప్రేమించటం లేదూ?"
సంస్కారం ఉన్న ఇద్దరు త్రాగుబోతుల మధ్య సంభాషణ చాలా చక్కగా సాగుతున్నది. డాక్టరు ప్రశ్నకు నాగేశ్వరరావు కోపం అభినయిస్తూ---
"డాక్టర్ .....నేనూ.........." అన్నాడు.
"తెలుసులెండి."
"ఎందుకో తెలియదు. ఇవ్వాళ భలే హాయిగా ఉంది నాకు. ఇంకో సీసా తెప్పించండి."
"నాకు అవసరం లేదు."
"అలా వల్ల కాదు డాక్టర్. నాతొ పాటు మీరూ అనుభవించాలి. ఏ ఆనందాన్నీ ఒంటరిగా అనుభవించ లేను నేను. సంతోష సౌఖ్యాల్లో ఇతరులు భాగం పంచుకోవాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను ఆశించినది పొందాక పొవటం అంటూ ఇంతవరకూ లేదు."
"అదృష్ట వంతులు."
"నాలో ఉన్న దుర్గుణాలు కూడా నాకు తెలుసు. పైకి అందంగా దర్జాగా కనిపించే నాయీ స్వరూపం చాటున జీవన లాలసుడూ, స్త్రీ లోలుడూ అయిన మరో నాగేశ్వరరావు ఉన్నాడు. డాక్టర్ , పదేళ్ళ కిందట , అంటే మామిడి తోట కొని అన్నయ్యకు అజమాయిషీ ఇచ్చినప్పుడు నా వయసు ఇరవై సంవత్సరాలు. అప్పటికీ నాలో రాక్షసత్వం లేదు. ఆ రోజుల్లో ఒక సాయంత్రం ఒక విచిత్ర సంఘటన జరిగింది. మంచినీళ్ళు ఇస్తున్నప్పుడు మా వదిన చేతికి నా చెయ్యి తగిలింది. మరునాడు ఆమె చెయ్యి కాలిపోయి ఉంది. అన్నం వారుస్తుంటే గంజి పడిందని ఆమె జవాబు. కాని, డాక్టర్ , నాకు నిజం తెలుసు. కావాలనే ఆవిడ చెయ్యి కాల్చుకుంది. నా స్పర్శ వలన కలిగిన అపవిత్రత కు తనకు తాను అగ్నిపరీక్ష విధించుకుంది. అప్పటి నుంచే నాకు స్త్రీ పవిత్రత అంటే అసహ్యం ప్రారంభమయింది. పవిత్రత ఇంత మూర్కంగా ఉంటుందని కూడా అప్పుడే అర్ధం అయింది. మీకు బోర్ గా ఉంది కదూ?"
"లేదు, చెప్పండి."
"ఆ రోజుల్లో నేను కూడా మీలాగా డాక్టర్ ను కావాలనీ, సోమర్సెట్ మాఘమ్ లా రచయిత ను కూడా కావాలనీ కలలు కనేవాడిని. ఆ సమయంలో నూజివీడు లో ఈ సంఘటన జరిగింది. అదివరకు ఆదర్శాలలో నిండిన నా హృదయం లాలనతో నిండిపోయింది. దాంతో స్త్రీ పవిత్రతను పాడు చేయటమే పనిగా పెట్టుకుని అందమైన ఆడపిల్లలతో స్నేహం ప్రారంభించాను. కాని చిత్రం ఏమిటంటే నా స్పర్శ తగిలిన ప్రతి స్త్రీ కూడా మా వదిన లాగా తన శరీరాన్ని కాల్చుకుంటే చూడాలని అనిపిస్తూ ఉండేది. కాని ఎవరూ అలా చెయ్యలేదు. పైగా నన్ను మరింత ప్రేమించే వాళ్ళు. ఆరోజుల్లో జరిగిన సంగతి ఇంకా మర్చిపోలేదు నేను.
"చాలా ప్రేమగా ఉండే దంపతులు మా ఇంటి పక్కన ఉండేవారు. ఆ అమ్మాయిని ముట్టుకుంటే మా వదిన లా కాల్చు కుంటుందేమోననే ఆశ కలిగింది. చాలా పవిత్రంగా కనిపించింది ఆ పిల్ల. సరే. ఒకనాడు అతను లేకుండా చూసి ఇంట్లో జోరబడ్డాను. ఆ పిల్ల ఎదిరించింది, ఏడ్చింది. అయినా నేను వదలలేదు. మరునాడు ఆమె ఆత్మహత్య చేసుకుంటే చూద్దామని నా ఆశ. అంతర్గతంగా భారత స్త్రీ పవిత్రత అంటే కుతూహలం నాకు. కాని మరునాడు ఆ అమ్మాయే అలంకరించు కుని నా గదికి వచ్చేసరికి నాకు మతి పోయింది."
"మాఘమ్ నవల్లా ఉంది." సిగరెట్ అందించాడు డాక్టర్.
"ఇంకో రసవత్తర అధ్యాయం వినండి. క్లుప్తంగా చెప్పేస్తాను. ఒకసారి ఒక సంసార స్త్రీతో పరిచయం అయింది. ఆవిడది పెద్ద కుటుంబం. భర్తా పిల్లలూ ఉన్నారు. ముప్పయి ఏళ్ళకు పైనే ఉంటాయి. నన్ను తన తమ్ముడిని చూసినట్టు చూసేది. మూడేళ్ళ పరిచయానంతరం కూడా ఆమె పవిత్రత లో ఏ విధమైన లోటూ నాకు కనిపించలేదు. సమాజంలో అమెకు చాలా మంచి పేరు. ఏ స్త్రీ లో అయినా పొరపాటు కనిపిస్తే నిర్మొహమాటంగా విమర్శించేది. ఆమె ఎవర్నీ గురించయినా మంచి చెడ్డలు అంటే వాటికి బోలెడంత విలువ ఉండేది. ఈవిడ పవిత్రతను పరీక్షించాలని బుద్ది పుట్టింది. ప్రతి మగవాడికి ఆమె అంటే నిప్పు అని అభిప్రాయం. నా అభిప్రాయం అదే?" ఆవిడ కూడా పరపురుష స్పర్శ తగిలితే మా వదిన లాగా కాల్చు కుంటుందని ఒక గట్టి నమ్మకం ఏర్పడి పోయింది నాకు. కాని అలా జరగలేదు. కొన్ని రోజుల్లోనే ఆమెకు అంతరంగికుడిని అయినాను. దాసీ దానికి తప్ప ఇంకెవరికీ తెలియదు మా గోల. దానితో స్త్రీ పవిత్రత అంటే విలువ పోయింది నాకు."
