ఇలాంటి అమాయకురాలిని నీ నిర్ణయమూ లేకుండా ఎవరో దిగారు కదాని ఏ అయ్య చేతిలోనో పెట్టేయడమేనా?
జానకిరామయ్యగారు కళ్ళు తుడుచుకున్నారు. తనెదురుగావున్న కూల్ డ్రింక్ షాపులో సోడా తాగి కాసేపు అక్కడే కూర్చుని, లేచి నెమ్మదిగా పార్కు వైపు నడిచారు. ఆయనలా రెండడుగులు వేశారో లేదో ఎవరో తనని పిలిచారు. వెనుక చప్పట్లూ వినిపించాయి. ఆగిపోయారు. ఆ వ్యక్త్హి తనని చేరుకున్న తర్వాత మందహాసం చేస్తో 'నువ్వట్రా బంధూ! ఇంకా ఎవరో అనుకున్నాను' అన్నారు.
దీనబంధు అసలు పేరు దీక్షితులు. ఆయన గూడా జానకిరామయ్యగారితో పాటు మాస్టరు పని చేసి రిటైరయ్యాడు. ఆయన సోషల్ స్టడీస్ అసిస్టెంట్ గా మంచిపేరు సంపాయించుకున్నాడు. ఆయన క్లాసంటే గడుగ్గాయి విద్యార్దులైనా చెవొగ్గి శ్రద్దగా వినేవారు. విధ్యార్దులను మంత్రించడం ఆయనకున్న చాక చక్యాల్లో ముఖ్యమైనదీ మొదటిదీను. ఏ విషయమైనా వినేవారికి ఇంపుగా చెప్పడం ఆయన సొత్తు.
తోటి మాస్టర్లు దీక్షితులుగార్ని దీనబంధూ అని పిలిచేవారు. ఆ రోజుల్లో దీక్షితులు చాలా మందికి అప్పు లిస్తుండేవారు. అడగని వాడిది పాపమన్నట్టు ఎంత అడిగినా లేదనకుండా ఇచ్చే స్తూండేవారు. మళ్ళా ఆ పైకాన్ని తనకై తాను వసూలూ చేసుకునేవారు కాదు- అవతలివాడు గుర్తు పెట్టుకుని ఇస్తేనే తప్ప.
ఇలా ఆర్ధిక ఇబ్బందుల్లో ఇరుక్కున్న మాస్టర్ల బృందానికి తన చాతనైన సాయంచేసి వాళ్ళ పాలిటి దేవుడై కూర్చున్న దీక్షితులుగారిని 'దీనబంధూ' అని పిలవడంలో తప్పేముంటుంది? ఆయన పేరు దీనబంధుగానే నిలచిపోయింది.
అంత మంచి మాస్టారికి గూడా విద్యార్ధులు ముద్దు పేరు పెట్టకుండా వూరుకోలేరు. 'గొడుగు' అని నామకరణం చేశారు.
ఆయన చేతిలో గొడుగు లేనిదే ఒక్క అడుగు కూడా బయట పెట్టేవారు కాదు. ఎండా, వాన, చలీ, చీకటి-ఇలాటివి పట్టించుకోకుండానే గొడుగు వెంట బెట్టుకొచ్చేవారు.
క్లాసులోకి వచ్చిన తర్వాత, వెంట తెచ్చిన గొడుగు గోడ వారగా ఉంచి పాఠం చెప్పేవారు. మధ్య మధ్య గొడుగు వంక చూస్తో ఇంపుగా పాఠం చెప్పడం ఆయన సర్దా.
ఇది గమనించిన ఓ కొంటే కుర్రాడు ఆ గొడుగుని దొంగిలించి ప్లేగ్రౌండులో తుమ్మచెట్ల మధ్య ఉంచి ఏమీ తెలీనట్టు వచ్చి క్లాసులో కూర్చున్నాడు.
దీక్షితులుగార్కి ఆ రోజు పాఠం సాగలేదు. నోరు పెగల్లేదు. తనెదుటనున్న ప్రతి కుర్రాడినీ నఖ శిఖ పర్యంతం అనుమానంగా పరీక్షించడం, అడగలేక నోరు మూసుకోడం మాష్టారి అవస్థ కుర్రాళ్ళకి సరదాగా ఉంది.
* * *
4
ఆ సాయింత్రం మల్లా ఆయన గొడుగుతెచ్చి ఆయనకి ఇచ్చేశాడు. గొడుగుని చూడగానే ఉదయం అనుభవించిన నీరసమంతా మాయమైపోయింది. తెచ్చిన వాడి భుజం చరుస్తూ, ఎలా దొరికిందో చెప్పమన్నాడు. వాడు చక్కటి కథ చెప్పి, మాస్టారి అభిమానానికి పాత్రుడయ్యాడు.
గమ్మత్తేమిటంటే - దీక్షితులుగారి చేతిలో ఈనాడు కూడా గొడుగు నిక్షేపంలాగుంది.
"ఎప్పుడొచ్చావ్ ఊళ్ళోకి" అడిగాడు జానకి రామయ్య.
"నిన్న"
"యాత్ర సుఖంగా జరిగిందా?"
"ఆహ.......ఆనందంగా జరిగింది"
"వూ.....ఏమిటి విశేషాలు"
"ముందు పార్కులోకి పద చాలా ఖబుర్లు చెప్పాలి."
ఇద్దరూ పార్కులోకి వెళ్ళేరు. మూలగా కూర్చున్నారు. దీక్షితులుగారు వక్కపొడి పొట్లం చించి, కొంత జానకిరామయ్యగార్కి ఇచ్చి, మిగిలింది తను వేసుకుని, సిగరెట్టు ముట్టించి గట్టిగా దమ్ములాగి పొగ వదిలారు అందంగా.
ఇంత కార్యక్రమం శ్రద్దగా గమనించిన జానకిరామయ్యగారు ఫక్కున నవ్వేసి,
"ఓరి నీ బడాయి మండిపోనూ-ఇంకా కుర్రతనం పోలేదన్నమాట" అన్నారు.
"అప్పుడే మనం పెద్దవాళ్ళమై పోయినట్టు దిగులు పడతా వేమిటోయ్! ఇంకా జవసత్వాలుడిగి పోలేదుగదా- వయస్సంటావ్ రోజులు గడుస్తూంటే రాక ఏమవుతుంది? అంతమాత్రాన కుర్రాళ్ళకి మనం ఏమీ తీసిపోము. అంతెందుకూ ఇప్పటికీ మా పెద్ద కుర్రాడు నాతో సమంగా నడువలేడు తెలుసా? నాతోపాటు మైలు గట్టిగా నడుస్తే రెస్ట్ కావాలి బాబోయ్ అంటాడు. జానకిరామయ్యా! ఒకమాట చెప్తాను........మన కాలంనాటి తిండి వేరు, ఈనాడు వచ్చే తిండి వేరు. అసలా మనుషులే వేరనుకో" అన్నారాయన.
"కాగడాపెట్టి వెదికినా నీలో బెదురుతనం కనిపించదోయ్ బంధూ!"
"బెదరడమెందుకోయ్! మనిషై పుట్టిన తర్వాత అనేకమైన పాట్లు పడాలి. ఈ ధర్మ సూత్రం మన కందరికీ తెలిసి గూడా బ్రతుకంటే బెదిరిపోతే ఎలా జానీ? ఏమంటావ్" అన్నారు దీక్షితులు సిగరెట్టు నుసి అందంగా రాల్చుతూ.
"ఈ ఆర్గ్యుమెంట్లు నాకు కొత్తకాదులే గానీ, నీ యాత్రానుభవాలు చెపుదూ వినాలనిపిస్తుంది"
"అవి చెప్పేముందు ఒక చక్కటి ఇన్ సి డెంట్ చెప్తాను. ఇలాంటి జన్మకో శివరాత్రి అన్నట్టు ఎప్పుడోగాని జీవితంలో చోటు చేసుకోవు. విను. మనం చేసిన వృత్తేమిటోయ్?"
"ఉపాధ్యాయులం"
"కొన్ని వేలమందికి విద్యాదానం చేశాం. ఎంతో మంది ప్రయోజకులయ్యారు. చాలామంది చెడిపోయాడు గూడాను. అయ్యిందా.......పోతే........ప్రయోజకులైన వాళ్ళల్లో చాలామందికి కళ్ళు నెత్తిమీద కొచ్చిన మాటా, చెడిపోయిన వాళ్ళల్లో ఇంకా భయ భక్తులున్నమాటా రెండూ నిజమే. అయ్యిందా........"
"ఇదిగో బంధూ! నువ్వు చెప్పదలుచుకున్న దేదో ముక్కుసూటిగా చెప్పు......ఈ ఉపన్యాస మంతా ఎందు కసలు?"
"తొందరపడకు. నే చెప్పేది ఒకానొక యోగ్యుడైన నా శిష్యుడి గురించి. కాబట్టి ఈ ముందు మాట చాలా అవసరం. మోహనారావని ఓ కుర్రాడు నా దగ్గర చదువుకున్నాడు. వాడికి ముఖ్యంగా సోషల్ స్టడీసంటే మంటగా ఉండేది అనేవాడూ 'మాస్టారూ జరిగిన చరిత్ర చదివి మనం సాధించే ఘనకార్యం ఏమిటండీ' అని. నయానో, భయానో ఎలా గైతేనేం వాడినో దారి కంటూ తీసుకొచ్చి సోషల్ స్టడీస్ మీద వాడికి శ్రద్ధ కలిగించాను. తర్వాత-బి.ఎ.లో హిస్టరీస్ మెయిన్ తీసుకున్నాట్ట. ఇంతకీ నే చెప్పొచ్చేదేమిటంటే - ఆ కుర్రాడు భువనేశ్వర్ లో పని చేస్తున్నాడు. ఉద్యోగం చిన్నదే అయినా నాలుగు రాళ్ళు వెనకేసుకొడం గూడా నేర్చుకుంటున్నాడుట. పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు గూడాను. ఆ కుర్రాడు నన్ను చూచి గుర్తుపట్టి గబగబా నా దగ్గరకొచ్చి ముచ్చటగా నమస్కారంచేసి, 'నే నెవర్నో చెప్పుకోండి చూద్దాం' అని నా జ్ఞాపకశక్తిని పరీక్షించేడు. చెప్పద్దూ.......మొదట్లో కాస్త గందరగోళమైంది గాని, తర్వాత వాడిచ్చిన రెండు క్లూల ఆధారంతో నువ్వు ఫలానా గదూ అన్నాను. తర్వాత అతను చూపించిన ఆదరణా, అతను మా కిచ్చిన ఆతిథ్యమూ జన్మలో మరిచిపోలేను జానీ! అలాంటి శిష్యులు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదురై మనమీద వాళ్ళకున్న గౌరవాన్నీ, భక్తినీ ప్రకటించుకుంటేనే గదా మన ప్రాణానికి తృప్తీ మన వృత్తికి ప్రతిఫలమూను. అతను బలవంతం చెయ్యడంవల్ల ఒక రోజు పూర్తిగా వాళ్ళింట్లో ఉండిపోవలసి వచ్చింది. ఆ మర్నాడు అతనూ మాతోపాటు స్టేషను వరకూ వచ్చి రైలెక్కించాడు. రైలు కదులుతూండగా కళ్ళ నిండా నీళ్ళు నింపుకుని భక్తిభావాన్ని ప్రదర్శిస్తూ అంటాడు 'చాలా థాంక్స్ మాస్టారూ! ఎన్నాళ్టికో కాని ఊళ్ళో కనిపించి, పాత విషయాలని కదిలించి వెడుతున్నారు. మాస్టారోయ్! మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు ఎక్కడ ఎవరెవరికి జలిగిందో నా కింకా జ్ఞాపకాని కుందండోయ్!' అని పిచ్చి తండ్రి! అతని ఆదరణా, ఆత్మీయతా నన్ను మురిపించాయోయ్ జానకి రామయ్యా! అలాంటి శిష్యుల్ని చూచే గదా మనం గర్వపడుతూంటాం. అంతస్థు తెచ్చిన దర్పంతో కళ్ళు నెత్తిమీద కొచ్చిన భ్రష్టుల వల్ల మన మనసు ఒక పక్క బాధ పడినా, పెద్ద వల్లయి సుఖాల్ని అనుభవిస్తున్నందుకు మాత్రం సంతోషిస్తూంటాం. అంతేగదూ!"
జానకిరామయ్యగారి మనసులో మోహనరావ్ మెదిలాడు. అతని మంచితనం ఆయన్ను కదిలించి వేసింది. అంతటి మధురానుభూతిని స్వంతం చేసుకున్న దీక్షితులుగారిని అభినందించారు జానకి రామయ్య.
"నే చేసిన యాత్రలూ, దానివల్ల కలిగిన మనశ్శాంథీ ఒక ఎత్త్జూ, మోహన రావ్ నా పట్ల చూపించిన కృతజ్ఞత ఒక ఎత్తూను. కాబట్టి మోహనరావ్ గురించి చెప్పిన తర్వాత నా యాత్రానుభవాలు నీకూ చెప్పకున్నా ఏమంత వెలితి ఫీలవ్వను" అన్నారు దీక్షితులు. మళ్ళా అంతలో మారిపోయారు. తాను చెప్పదలుచుకున్న మరో ముఖ్య విషయం గుర్తుకు రాగానే ఉలిక్కిపడి, కొత్త సిగరెట్టు ముట్టించి అన్నారు.
"అన్నట్టు మీవాడు బరంపురం రైల్వే ప్లాటు ఫారంమీది కనిపించాడోయ్ భగవాన్లూ!

జానకిరామయ్యగార్కి ఆ'మీవాడె'వడో అర్ధం గాలేదు.
"అదేనోయ్ మీ రాజారావ్"
ఈ పేరు వినగానే జానకి రామయ్య పూర్తిగా మారిపోయారు. కాస్త ముందుకు జరిగి -
"మా రాజారావా? కనిపించాడా?"
"ఏదో వ్యాపారం చేస్తూన్నట్టూ చెప్పేడు. నాలుగు చివాట్లు పెట్టాననుకో. బాగా చిక్కిపోయాడు. గడ్డం పెరిగి, మాసిన బట్టల్తో ఉన్నాడు."
మూడేళ్ళ క్రితంనాటి రాజారావు జానకిరామయ్యగారి కళ్ళముందు మెదిలాడు.
"మరిన్నేళ్ళూ........."
"అదే అడిగేను. నీ మొహం చూపించకపోతే మానె, ఒక్క ఉత్తరం ముక్కైనా రాయకుండా ఎలా ఉండగలిగేవయ్యా. అవతల మీ మావయ్య మనసెంత బాధ పడిపోతుందో అని రెండు వడ్డించాను. చెప్పద్దూ.......పాపం..... ఆ కుర్రాడు కళ్ళ నీరెట్టుకున్నాడు."
"బాధ.......నాకు బాధేమిటి బంధూ........అయిపోయింది. వాడికీ మాకూ ఋణం ఆనాటి తోనే తీరిపోయింది. అలాంటి నీచుడూ, భ్రష్టుడూ ఉండీ ఒకటే......చచ్చీ ఒకటే" అన్నా రాయన బాధగా.
ఆయన్నా స్థితిలో చూచిన దీక్షితులుగారు మరో మాట గూడా మాటాడలేకపోయారు. అంతే అలా అయిదు నిమిషాలపాటు మవునంగా కూర్చున్నారిద్దరూ. చెప్దామనుకున్న చాలా విషయాలు చెప్పకుండానే జానకిరామయ్యగారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు దీక్షితులు.
ఇంటి కొస్తూ రాజారావుని తలుచుకుని అసహ్యించుకున్నారు జానకిరామయ్య. అక్కయ్యమీద ప్రేమకొద్దీ, తల్లీ, తండ్రీలేని వాడు గదా అని చేరదీసి పెంచితే వాడు చేసిన నిర్వాకం.......
వాడెంత ద్రోహి కాపోతే ఒక రాత్రికి రాత్రి ఇంటావిడ పోతూ మిగిల్చిన నగలు, పవిత్రంగా భావించుకుంటూన్న ఆవిడ సొమ్ముల్ని దొంగిలించి పారిపోతాడు! వాడూ ఒక మనిషేనా? ధూ!
వాడు జూదరి, మోసగాడు. అయినా సహించి మంచిదారికి తీసుకొద్దామనే ఆశతో ఎంతో ప్రయత్నించే రాయన. ప్రతి మెట్టులోనూ ఓడిపోతూనే వచ్చారు. కాలేజీలో చదువుతూన్న రోజుల్లో వాడిమీద అనేకమైన ఫిర్యాదు లొచ్చేవి. వాడి మూలంగా తన పరువూ కొంత పోవడం గూడా జరిగింది.
పెద్దవారు కాబట్టి వాడిని పెంచుతున్నవారు కాబట్టి, వాడ్ని కోప్పడితే కోప్పడి ఉండచ్చు. నీ స్థితేమిటో తెలుసుకుని తిరుగూ అని హెచ్చరించవచ్చు. ఆ చిన్న మాటకే వళ్ళు తూట్లు పడేవాడికి ఈ విపరీత బుద్దు లెందు కసలు? అభిమానస్థుడు అభిమానంతోనే బ్రతకాలి మరి. తన నేదో మాట అన్నారని ఇంట్లో చెప్పా చెయ్యకుండా చేతి కందిన నగలు తీసుకుని పారిపోతాడు? పైగా ఊరునిండా విపరీతమైన అప్పులు గూడాను.
వాడు ఇల్లు విడిచిన తర్వాత నాలుగైదు నెలలుపాటు వాడి జాడ గురించి వెతికించారు. తర్వాత విసుగుపుట్టి ఊరుకున్నారు.
వాడు దుర్మార్గుడు, పాము, వాడి నరనరాల్లో విషం, కల్తీలేని కాలకూట విషం ప్రవహిస్తోంది. జీవితంలో వాడిని క్షమించరాదు. స్వర్గంలోవున్న అక్క మనస్సు క్షోభించుగాక, తనని శపించుగాక వాడిని తిరిగి ఆదరించరాదు.
హఠాత్తుగా జానకిరామయ్యగారి గుండెలో పోటు వచ్చింది. ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేకపోయారు. పక్కనే ఉన్న రామాలయం తాలూకు అరుగుమీద కూర్చుండిపోయారు. పది నిమిషాలపాటు కూర్చున్న తర్వాత పోటు తగ్గింది, కానీ విపరీతమైన నీరసం పట్టుకుంది.
ఇంత హఠాత్తుగా శరీర తత్త్వం మారిపోవడంతో కలవరపాటు చెందారు. ఆయన నెమ్మదిగా లేచారు. రిక్షాని పిలిచి ఇంటికి వెళ్ళేరు.
