Previous Page Next Page 
అసుర సంధ్య పేజి 8


    "చిన్నతనం నుంచి ఈ పల్లెలో ఉండిపోయావు . అసలు బస్తీలో వాళ్ళు వేసుకునే బట్టలు, అలంకరణ ఉంటె నువ్వింకా ఎంత అందంగా ఉంటావో తెలుసా వరం! నాన్న నీకు సంస్కారం, చదువు చెప్పాడు. నేను నిన్ను అందాల రాణిని చేస్తాను" అన్నాడు నవ్వుతూ.
    "ఎందుకట?' అనడిగింది గోముగా.
    "ఎందు కేమిటోయ్ రాణిగారూ --స్వార్ధం ."
    ఫక్కున నవ్వి అతని చేతుల్లోంచి పారిపోయింది వరలక్ష్మీ.
    రాజారావు బట్టలు వేసుకుని బయటికి నడిచాడు ---
    వరలక్ష్మీ కి ఎటువంటి అభ్యంతరం లేదు కాబట్టి అతనికి అత్తయ్య కూడా చివరికి ఒప్పుకుంటున్న నమ్మకం కలిగింది-- "అయినా చెప్పలేం, ఈ పెద్ద వాళ్ళకి  ఏదయినా తట్టిందంటే ఇంకేవరెన్ని చెప్పినా ఒప్పుకోరు. అదృష్టవశాత్తు ఆమె ఒప్పుకుంటే తనంత అదృష్టవశాత్తుడుండడు. అయిన వాళ్ళని చేరదీసి బాధ్యత స్వీకరించిన తృప్తి ఉంటుంది. ఇంకా అదృష్టం బావుంటే వరలక్ష్మీ తనదవుతుంది. తన జీవితం "ఓహ్!" ఆనందంలో తేలి గుడి దగ్గర తాత ముందు దిగాడు రాజారావు.
    "ఏమోయ్ రాజా, ఏమిటి కధ -- మంచి హుషారుగా ఉన్నావు?' అనడిగాడు. చదువుతున్న పుస్తకాన్ని అవతల పెట్టి రామదాసు తాత.
    "నీతో చాలా చెప్పాలని వచ్చాను తాతా!" అంటూ అతని పక్కనే గోడ కానుకుని కూర్చున్నాడు రాజారావు.
    చెప్పమన్నట్లు చూశాడు రామదాసు.
    "మీరూ చూస్తున్నారుగా. ఇక్కడి పరిస్థితులు మావయ్య చచ్చిపోయింది. ఈ మధ్యనే ఎందుకు, ఎవరు చంపారన్నది తెలియదు మనకి ఇంకా ప్రయత్నాలలోనే ఉంది. ఇక్కడి కొందరి ప్రవర్తన , నవ్వులూ నాకు వింతగా అగుపడుతున్నాయి. ఇటువంటి వాతావరణం లో ఉంటున్నాం మనమంతా.
    మా వాళ్ళకి నేను తప్ప వేరే మగ దక్షత లేదు. నాకు వాళ్ళు తప్ప వేరే 'నా' అనేవారు లేరు. అయితే వీళ్ళని అంటి పెట్టుకుని కూర్చోలేను కదా -- ఒకయ్య చేతిలో తల పెట్టిన వాడిని. కూర్చుని తింటే కొండలే కరిగి పోతాయంటారు. పైగా ఉద్యోగం మానలేదు. వీళ్ళ కోసం కాబట్టి నేను వెళ్ళక తప్పదు."
    'అవును మరి -- మనకి ఉద్యోగం ముఖ్యం కాదూ?"
    "అవునా అండి! వీళ్ళని దిక్కూ దివాణం లేకుండా ఇక్కడ వదిలి వెళ్ళలేక పోతున్నాను. ఎంతగా మీవంటి పెద్ద వాళ్ళున్నా---"
    "కదూ నాయనా-- అయిన వాడివి! ఇంతకీ ఏం చేద్దామని?"
    "ఇందాక మా అత్తయ్య కి చెప్పాను. ఈ పరిస్థితి అంతా, చెప్పి అడిగాను నా వెంట రమ్మనమని. బ్రతిమాలుకున్నాను. "నా వెంట వచ్చి నాకీ అవకాశం ఇస్తే మనశ్శాంతి కలుగ్గుతుంది నీకు" అని చెప్పాను"
    "ఏమన్నారు అత్తయ్యగారు?"
    "ఏమంటుంది పాపం, ఉన్న వూరు మన్న ప్రజలని -- ఈ రెంటికి ఎలా వదిలి రావడం అని బెంబేలు పడిపోతోంది."
    "అవును పాపం ఈనాటి సంబంధమా ఈ "వూరితో " సానుభూతిగా అన్నాడు తాత.
    "అవుననుకోండి-- అంతగా కావాలంటే నెల కొకసారో ఎప్పుడో వచ్చి అందరినీ చూసుకు వెళ్ళవచ్చు గా. వీళ్ళిక్కడ ఉండిపోతే నాకు వీళ్ళని గురించి ఎంత దిగులుగా ఉంటుందో ఆలోచించండి!" బాధగా అన్నాడు రాజారావు.
    "నువ్వు చెప్పినది చాలా బావుంది నాయనా. కొన్నాళ్ళ పాటు వాతావరణం మార్చినట్లు అవుతుంది. వాళ్లకి ఈ దిగులు లోంచి అట విడుపుగా ఉంటుంది. అయన మెసిలిన ప్రాంతాలు మార్చాలి....చాలా తెలివి తేటలతో చెప్పావు!"
    రాజారావు ముఖం విప్పారింది.
    "మా వరం -- అనే మా వరలక్ష్మీ కూడా ఒప్పుగుందండి. మా అత్తయ్య కి తనూ చెబుతానంది. ఆవిడా ఒప్పుకుంటుందనే నా నమ్మకం ఒప్పుకోకపోతే మీలాంటి పెద్దలు కూడా ఒకసారి చెబితే..........."
    "తప్పకుండా ! అందరికీ ఇప్పుడు ముఖ్యం వీళ్ళకి కొంత ఊరట కలిగించడం . ఆ పని నువ్వు చేస్తానంటే అంతకన్నానా?.......చాలా బావుంది నీ ఆలోచన"
    "తప్పకుండా ! అందరికీ ఇప్పుడు ముఖ్యం వీళ్ళకి కొంత ఊరట కలిగించడం .. ఆ పని నువ్వు చేస్తానంటే అంతకన్నానా?....చాలా బావుంది నీ ఆలోచన"
    రాజారావు తృప్తిగా నిట్టుర్చాడు. పనంతా సానుకూల పడినంత ఆనందం కలిగిందతనికి. అంతలో ఒక విషయం గుర్తుకొచ్చి--
    "అవును గానీ తాతా, మునసబు గారబ్బాయి గురించి కొంచెం చెబుతారూ?" అనడిగాడు.
    "ఏం కావాలి?"
    "అదే మా మావయ్య అతన్ని వద్దంటానికి కారణాలు మీరు సరిగ్గా చెప్పలేదు."
    "దాందేముంది-- ఆ అబ్బాయికి ఆస్తి ఉంది. అందం ఉంది. ఒక్కడే సుపుత్రుడు. చదువు అబ్బింది -- డాక్టరీ చదువుతున్నాడు. ఇన్ని హంగులుంటే కావాల్సిందేముంది. కొన్ని అలవాట్లు అయాయని ఆ నోటా ఆ నోటా వినబడి గుప్పుమంది. అబ్బాయి గారు పట్నంలో కృష్ణ లీలలు మొదలెట్టారుట-- సార్ధక నాయుడయాడట. నర్సులు, క్లాసు మేట్సు కాకుండా ...సరే-- ఆ మాటలు మునసబు గారి చెవిన పడ్డాయి. శలవల కి వచ్చినప్పుడు కొడుకుని అడిగాడు. నేను ఏ పాపం ఎరగనన్నాడు వాడు.
    "కాని ఈయనికి కొన్ని రుజువులున్నాయి. కొడుకు ప్రవర్తనని సరిచేయాలంటే పెళ్లి చేయడమే మార్గమనిపించింది ఆయనకి. చిన్నప్పుడు మీ వరలక్ష్మీ , కృష్ణమూర్తి కలిసి చదువుకున్నారు ఇక్కడ. అంతకు మించి మునసబుగారు మీ మావయ్య స్నేహితులు కావడాన మొదటి నుంచి ఈ సంబంధం అవుతుందనుకున్నారు వూరి వారంతా.
    "అయితే ఈ పరిస్థితుల్లో మునసబు అడిగేప్పటికీ మీ మావయ్య హేళనగా మాట్లాడాడుట! -- "నీ కొడుకు కీర్తి లోకం కోడై కూస్తోంది . చూస్తూ ఎలా అడిగావు? నీకిది సబబేనా? నీ కొడుకుని బాగు చేయటానికి నా కూతుర్ని బలివ్వాలా?" అనడిగాడుట.
    "దాంతో భంగపడి తిరిగి పోయాడు మునసబు."
    "అయితే ఆ కృష్ణ మూర్తి వెంటనే వెళ్ళిపోయాడా?"
    "లేదు. రెండు మూడు సార్లు మీ మావయ్య ని కలుసుకుని మాట్లాడేందుకు ప్రయత్నించాడుట. కాని కుదరలేదు. మీ వరలక్ష్మీ తో మాట్లాడ బోయాడుట కాని "మా నాన్న ఇష్టం లేనిదే మిమ్మల్ని చూడను కూడా అందిట" ఆ అమ్మాయి."
    "ఎప్పుడు వెళ్ళాడు అతను?"
    "అలాగా!' సాలోచనగా అని లేచి నిలబడ్డాడు రాజారావు.
    తాత అతని వంకే చూస్తుండిపోయాడు.
    ఇంటికి రాగానే వరలక్ష్మీ ని పిలిచి అడిగాడు రాజారావు. "మునసబు గారబ్బాయిని నీ కిడ్డామను కుంటున్నారట కదా!" అని.
    వరలక్ష్మీ 'అవును ఆ అబ్బాయిని నాకిద్దామను కున్నారు" అని 'అదేం ప్రశ్న బావా! తలక్రిందులుగా అడిగావు" అంటూ నవ్వేసింది.
    "అదేలే, నిన్ను అతనికి -- సరా!....మరెందుకు కాలేదు? డబ్బు, అందం, చదువు అన్నీ ఉన్నాయిగా?"
    "కాని బుద్ది లేదని మా వూరి వారందరి అభిప్రాయం. అందుకనే నాన్నగారు కూడా చివాట్లు పెట్టి తిరకోట్టారుట"
    "నీ అభిప్రాయం ఏమిటి?"
    "చిన్నప్పుడు మంచివాడే! నాన్నగారు వద్దన్నాక నన్ను చెరువు దగ్గర అడిగాడు "నన్ను గురించి చాలా అపవాదులు ప్రచారం లోకి వచ్చాయి వరలక్ష్మీ, నువ్వయినా నిజం అర్ధం చేసుకోవూ?' అని. నేను మాత్రం చెప్పాను "నువ్వు మంచి వాడవని నాకు నమ్మకం కలిగినా మా నాన్న గారి నిర్ణయానికి ఎప్పుడూ తల ఒగ్గుతాను. కాబట్టి ఆయన్ని ఒప్పించే ప్రయత్నం చేసుకోమని."
    కాస్సేపు నిశ్శబ్దం ఆవరించింది.
    "సాయంత్రం అలా దేవాలయం కేసి వెడదాం వస్తావా వరం ?' అడిగాడు రాజారావు.
    "అమ్మనడుగు-- వెళ్ళమంటే వెడదాం!"
    నవ్వాడు రాజారావు వరలక్ష్మీ కూడా పకాలున నవ్వేసింది.
    ఆలయానికి వెనకగా ఉన్న చిన్న కాలవ గట్టున కూర్చుని చుట్టూ పరికించి చూశాడు రాజారావు . సూర్యాస్తమయం అవుతూ మరొక వైపు నుంచి చంద్రుడు కాంతిని పుంజు కుంటున్నాడు.
    'చూడు వరం సూర్య చంద్రుల సాక్షిగా అంటే ఇటువంటి సమయమేట! ఇటూ అటూ కాపలా కాస్తున్నారు....కన్యాకుమారి పోతెనుట ఒకవైపు సముద్రంలో సూర్యుడు అదృశ్యమవడం మరొక వైపు సముద్రంలోంచి చంద్రుడు వస్తుండడం అగుపడుతుందట. అటువంటి దృశ్యం అపూర్వం కదూ వరం!" అన్నాడు ఆవేశంగా.
    "ప్రకృతి లో అంతగా ఉద్రేక పడేందుకు నాకేమీ కనబడదు బావా! ప్రకృతి సౌందర్యాన్ని చూసి నేను మూర్చలు పోలేను. నాకు ఆవేశం చాలా తక్కువ!" అంది నవ్వుతూ వరలక్ష్మీ------
    "నీకు తక్కువయితే అయింది కాని నేను చెప్పింది విను వరలక్ష్మీ కొన్ని మాటలు చెప్పి తీరాలని నేను తీసుకు వచ్చాను నిన్నక్కడికి!
    "మాకు ఒక స్నేహితుండేవాడు. అతను డిల్లీ లో యువజనోత్సవాలకి మా కాలేజీ నుంచి ఒకడుగా వెళ్ళాడు. అప్పుడతని అనుభవాలు విని నేను చాలా ఈర్ష్య పడేవాడిని. అతని పేరు శర్మ. మనిషి సుమారుగా ఉన్నా అతని నవ్వు అతనికి ప్రత్యేకత. చాలా చిత్రంగా నవ్వేవాడు -- అతని నవ్వు చూసి అవతలి వాళ్ళు నవ్వగుండా ఉండలేరు.
    "ఇతను వెళ్ళిన బాచ్ లో ముగ్గురు అమ్మాయిలున్నారుట. అందులో రమణి అనే అమ్మాయి ఇతన్ని పట్టుకుని "శర్మగారూ , ఒక్కసారి నవ్వరూ -- ప్లీజ్! ' అని అడిగేదిట. ఇతను నవ్వితే గొల్లున నవ్వేసిందట.
    "మరోకమ్మాయి -- పేరు ఇందిర -- ఇతను సిగరెట్టు దులుపుకుంటుంటే అరిచేయి పట్టేదిట!
    "మొదట కోశాడనుకున్నాను. తరువాత ఈర్ష్య పడేవాడిని-- అటువంటి అదృష్టం పట్టనందుకు!
    అయితే వరం, నేను అంతకన్న అదృష్టవంతుడ్ని!"
    "ఎందుకో?" చిత్రంగా కళ్ళు పెద్దవి చేసి ఆడిగింది వరలక్ష్మీ.
    "అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటే తెలుస్తుంది ఎందుకో!"
    సిగ్గుపడిపోయింది వరలక్ష్మీ. పో బావా!" అంది బుగ్గలు ఎరుపు చేసుకుంటూ!
    "కలిసే!" అని కాసేపాగి "అమ్మని అడిగేలే!" అన్నాడు.
    ఇద్దరూ గలగల నవ్వేశారు.
    "ఫ్రాయిడ్ అని గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్త ఉన్నాడు వరం! అతని సిద్దాంతం ఏమిటో తెలుసా-- చిన్నతనం నుంచి చూస్తుండడం వలన ఆడపిల్లకి తండ్రి లాంటి భర్త కావాలని, మగపిల్లాడికి తల్లి లాంటి భార్య కావాలని కోరిక ఉంటుందిట!..." అని ఆమె వంక చూస్తూ "నువ్వు అచ్చం మా అమ్మ పోలిక!" అన్నాడు.
    వరలక్ష్మీ కొద్దిగా తలెత్తి, కళ్ళు ఇంకొంచెం పైకెత్తి చూస్తూ "అత్తయ్య ఎలా ఉంటుంది?' అనడిగింది.
    "అచ్చం నీలాగా!"
    "మరి మే ఇద్దరం?' అడిగి మునిపంటి తో కింది పెదిమ అదిమి పట్టి సమాధానం కోసం అతని వంక చూడసాగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS