Previous Page Next Page 
అసుర సంధ్య పేజి 9

   
    "అందానికి నిర్వచనాలు" అన్నాడు ముగ్డుడయిపోతూ.
    
    "ఫో బావా!" అంది బుంగమూతి పెట్టి వరలక్ష్మీ.
    "మరీ బిగించావంటే ఆ కాస్త మూతీ మాయమయి పోతుంది జాగ్రత్త. అప్పుడు "ఒకమ్మాయి కి మూతి ఉందని నేనూ, లేదని ణా మిత్రుడూ వాదించు కొనుచున్నాము-- ఎడిటర్ మహాశయా మీరెవరితో నేకీభవించేదరు? అనడగాలసి వస్తుంది."
    ఫకాలున నవ్వింది వరలక్ష్మీ.
    "ఎన్ని ముత్యాలో!"
    "సంతోషించాం గానీ "నోరు లేకపోతె ఆ అమ్మడు అలా ముత్యాలు రాల్చక పోగా చిన్నప్పుడే తాపున చచ్చిపోయేది '' అని ఎడిటర్ గారు ....'
    "అవెం మాటలు వరం. శుభమా అనమంటే చావు కబుర్లు ఎందుకు మధ్య?"
    "సర్లే, పాపం పరిహారంగా ఆలయంలోకి వెడదాం రా" అని నడిచింది వరలక్ష్మీ.
    ఇద్దరూ కలిసి ప్రాంగడం లోకి ప్రవేశించి అక్కడున్న బంతిపూలు కాసిని కోసుకుని ఆకులో  పొట్లం కట్టుకుని గుడిలోకి ప్రవేశించారు.
    గంట కొట్టి భగవంతుడికి నమస్కరించబోతున్న రాజారావు కి పైకి గంట వంక చూసి తల వంచుకున్న వరలక్ష్మీ ని చూసి నవ్వు వచ్చింది.
    "పొట్టి పిల్లవి -- నేను సాయపదతాను అగు" అంటూ ఆమె నడుము పుచ్చుకుని పై కేత్తాడు.
    నమస్కరించడం అయాక ఇద్దరూ స్తంభానికి అనుకుని కూర్చున్నారు. రాజారావు సిగరెట్టు వెలిగించాడు. వరలక్ష్మీ "తప్పు బావా-- దేవాలయం కదూ" అంది.
    అతను అర్పేస్తూ "దేముడి మీదా, దెయ్యాల మీదా నమ్మకం ఉంచుకోవడం మంచిదని గ్రహించాను వరలక్ష్మీ-- ఎందుకంటె వాళ్ళు ఉంటె మనం బాగుపదతాం. లేకపోతె నష్టపోయేది ఉండదు" అన్నాడు.
    "అయితే నువ్వు నాస్తికుడివా బావా ఇదివరలో?"
    "ఇదివరలో నాకు కావలసినది , నా ప్రేమకి ఏకైక వారసురాలు మా అమ్మ. ఆమెని ఎవరేమన్నా సహించే వాడిని కాను....అప్పట్లో నిన్ను గురించి అమ్మ చెబుతున్నా నీ రూపం అస్పష్టంగా  ణా మనస్సులో మెదులుతున్నా -- నువ్వు నన్ను ఆదరిస్తావో లేదో అన్న భయం ఉండేది. కాని ఇప్పుడు ఆ భయం లేదు. నా అదృష్టం బావుంది. భగవంతుడి దయ వలన నువ్వు నాదాని వయ్యావు."
    "అవెం మాటలు బావోయ్, అమ్మ....అమ్మ!"
    "అవును సుమీ, మాతృవాక్య పరిపాలకురాలివి కదూ-- మర్చిపోయాను, ఆవిడ్ని లైసెన్సు అడిగాకే!"    
    ఇద్దరూ నవ్వేశారు.
    "సరేగాని బావా, నీ వెంట రంమంతున్నావు, ఏ లోపం రానియ్య నంటున్నావు గాని అసలు నీ ఉద్యోగమూ ఏమిటో చెప్పావు కావు!"
    రాజారావు మాట్లాడలేదు.
    "చెప్పవా?"
    "చెప్పకూడదు వరం!"
    "నా క్కూడా!' కళ్ళలోకి చూస్తూ అడిగింది వరలక్ష్మీ.
    "నువ్వు మాత్రం ఎవరికి చెప్పకూడదు మరి."
    "అలాగే."
    "ప్రామిస్ చేయి."
    "ప్రామిస్."
    "నేను సి.ఐ.డి. ని వరం."
    ఉలిక్కిపడింది వరలక్ష్మీ. "నిజంగానా?' అడిగింది ఆశ్చర్యంగా-- అతనికి కొంచెం దూరంగా జరుగుతూ.
    అతను నవ్వి ఆమెని దగ్గరకు లాక్కున్నాడు "నిజంగా వరం, మావయ్య హత్య కేసు విని నాకే ఇది వేయించుకుని వచ్చి పని చేస్తున్నాను. ఇక్కడి వాతావరణం గ్రహించాను కాబట్టే మీరిక్కడ ఉండటం నాకిష్టం లేదు. మిమ్మల్ని బస్తీలో దింపి నేను మళ్ళీ వచ్చి ఈ కేసు అంతు తేల్చాలి. నాకున్న అనుమానాలు నాకు ఉన్నాయనుకో-- ఋజువులు కావాలి-- ఏమిటలా ఎడంగా జరుగుతావు మళ్ళీ? నేను సి.ఐ.డి ని అయినా, పోలీసు ఆఫీసరు అయినా నీకు మాత్రం బావనే -- కాబోయే వాడినే!" అని ఆమెని ఇంకా దగ్గరకు లాక్కుని చూపుడు వేలు గడ్డం కింద పెట్టి ముఖం పైకెత్తాడు.
    ఆమె కండ్లు మూసుకుంది. పెదవులు అదురుతున్నాయి.
    వెనకగా దగ్గు విని గబుక్కున వెనక్కి చూశాడు రాజారావు. రామదాసు తాత!
    "ఘటికుడివే మనవడా! మేనరికం పోనిచ్చావు కావు. శుభం!' అని నవ్వాడు.
    వరలక్ష్మీ సిగ్గుపడి లేచి పారిపోయింది.
    "ముసలాడిని నన్ను చూడగానే సిగ్గొచ్చింది పిల్లకి. ఆ....ఇంతకీ నీవెంట వచ్చేందుకు అత్తయ్య ఒప్పుకుందా నాయనా?"
    "ఒప్పుకుంటుంది తాతా, తప్పకుండా ఒప్పిస్తుంది వరలక్ష్మీ!"
    "అదృష్ట వంతుడివి రాజు, శుభస్య శీఘ్రం-- అని అది గూడా జరిపించేయి."
    "మీవంటి వాళ్ళ చలవ!"
    "దానికేం అదెప్పుడూ ఉన్నదే!" నవ్వాడు రామదాసు.
    రాజారావు కూడా నవ్వుతూ మెట్లు దిగి గబగబ నడవసాగాడు.
    ఇంటిదాకా పోయాక గుర్తుకొచ్చింది -- తను వరలక్ష్మీ కోసం ప్రేమగా కోసిన బంతిపూలు మర్చిపోయాడని! గిరుక్కున తిరిగి దేవాలయం కేసి నడిచాడు. కాని, తీరా చూస్తె ఆలయం అంతా వెతికినా కనబడలేదు. మనస్సు చివుక్కుమంది అతనికి. అవి లేనిదే వెళ్ళ కూడదనుకున్నాడు. రామదాసు తాత తీశాడేమోనని అతని పాక దగ్గరికి వెళ్లి పిలుద్దామని కిటికీ గుండా లోపలికి చూశాడు.
    లోపలి దృశ్యం చూసి కొయ్యబారి పోయాడు.
    రామదాసు తాత తలమీదున్న విగ్గు, గడ్డం ఒక్కొక్కటి వూడదీసి పక్కన పెట్టుకుంటున్నాడు. అన్నీ తీశాక అతన్ని సరిగ్గా చూశాడు రాజారావు.
    అతను ముసిలాడు కాదు, యువకుడు . సుమారు ముప్పై ఏళ్ళ వాడు.

                    
    రాజారావు కి ముచ్చెమటలు పోశాయి.
    శరీరం అంతా స్వాధీనం తప్పిపోయినట్లు , కళ్ళకి బైర్లు కమ్మినట్లు, నెత్తి మీద ఎవరో బలంగా కొట్టినట్లు అనుభూతి చెందాడు. అతి కష్టం మీద మనసుని అదుపులోకి తెచ్చుకున్నాడతను. భూమికి బిగించినట్టుగా ఐపోయిన అడుగుల్ని స్వాధీనం చేసుకుంటూ, తడబడుతున్న అడుగులతో , సాధ్యమైనంత వేగంగా అతను ఆలయ ప్రాంగణం దాటాడు.
    ఎంత మోసం?
    రాజారావు రుమాలుతో నుదురు తుడుచుకుంటూ నడవసాగాడు. ఈ రామదాసు, మునసబు షరీకన్న మాట! ఆ సంగతి కొంత తను ముందుగానే పసిగట్టాడు గాని, అందులో ఇంతటి గూడు పుఠాణి ఉన్నదనుకోలేదు. బంతి పూల కోసం తను తిరిగి రాకపోతే ఇది ఇప్పటి కైనా బైట పడేదా?    
    ఇక తను తొందర పడాలి. కనీసం అత్తయ్య నూ, వరలక్ష్మీ నీ అన్నా దక్కించు కోవాలి.
    ఇంటి గుమ్మం లో పాలేరుతో ఏదో చెబుతూ నిలబడి ఉన్న సుభద్రమ్మ గారూ మేనల్లుడి వాలకం అతను చెరచెరా తనను నెట్టుకుంటూ లోపలికి వెళ్లటం, చూసి తెల్లబోయింది. పాలేరుతో చెప్పవలసింది చెప్పి పంపెశాక ఇంట్లోకి వచ్చింది. వంట ఇంట్లో, కుంపటి మీంచి కూర గిన్నె దింపుతూ, వీధి వైపు చూస్తోంది వరలక్ష్మీ. బావ వాలకం ఆమెకి ఆశ్చర్యాన్నే కలిగించింది. ఏం జరిగిందో?    
    సుభద్రమ్మ గారు అల్లుడి గది గుమ్మం దగ్గిరికి వచ్చింది. కళ్ళు మూసుకుని, మంచం మీద పడుకుని ఉన్నాడు రాజారావు. మనిషి కొంచెం రొప్పుతున్నాడు.
    "నాయనా" అన్నది సుభద్రమ్మ గారు.
    రాజారావు లో చలనం కలగలేదు.
    సుభద్రమ్మ గారు ఒక క్షణం వూరుకుని "రాజా" అన్నది.
    రాజారావు కళ్ళు తెరిచి అత్తయ్య ని చూసి లేచి కూర్చున్నాడు. నుదురు రాసుకుంటూ అలాగ కొంచెం సేపు కూచుండి పోయాడు.
    "ఏం జరిగింది నాయనా? ఎవరితో నన్నా పోట్లాడావా?' అన్నదామె.
    రాజారావు ఆమె వంక అయోమయంగా చూసి "వూ?" అన్నాడు.
    సుభద్రమ్మ గారి సారి కాస్త కంగారు పడింది. దగ్గిరగా వెళ్లి నుదుటి మీద చెయ్యి వేసి 'ఒంట్లో బాగోలేదా?' అన్నది.
    రాజారావు తల విదిలించాడు. జేబులోనుంచి సిగరెట్ పెట్టె తియ్యబోయి ఆగి గుమ్మం దగ్గిరకి వచ్చి నిలబడిన వరలక్ష్మీ ని చూసి "కాసిని మంచినీళ్ళు తెచ్చిపెట్టు వరలక్ష్మీ " అన్నాడు.
    వరలక్ష్మీ మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చింది.
    రాజారావు అవి తాగి, గ్లాసు కింద పెట్టి "వీధి తలుపు వేసే ఉందా?' అన్నాడు.
    వరలక్ష్మీ వెనుదిరిగి చూసి "ఆ" అన్నది. ఆ పిల్లకి ఇదంతా చూస్తుంటే ఏదో గుబులు రేగాసాగింది మనసులో.
    రాజారావు మంచం మీద ఓ పక్కన జరిగి "మీతో ఓ సంగతి మాట్లాడాలి కూచో అత్తయ్యా" అన్నాడు.
    సుభద్రమ్మ గారు గుమ్మం వారగా కూలబడింది. వరలక్ష్మీ గదికి లోపలగా గుమ్మం మీద కూచుంది.
    "రామదాసు మీకు ఎన్నాళ్ళ నుంచి తెలుసు?" అన్నాడతను.
    సుభద్రమ్మ గారికి అతనెవరో తలపుకి రాలేదు. "రామదాసేవరు?" అన్నదామె.
    "గుళ్ళో ఉంటున్న తాత కాబోలు ఏం?' అన్నది వరలక్ష్మీ.
    "అతనే ! అతనిదేవూరు?"
    "మాకేం తెలుసయ్యా? ఒకటి రెండు సార్లు మునసబు గారితో కలిసి మన ఇంటికి వచ్చాడు. దేవాలయం , తోట , కాపలా లేక పాడై పోతున్నాయని అతన్ని అక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేసినట్లు ఆయనే చెప్పాడు. ముసలి వాడుట. నా అన్నవాళ్ళే వరూ లేదుట. ఏం? అతను నిన్నేమన్నా అన్నాడా?"
    "నన్నెందుకంటాడు?"
    సుభద్రమ్మ గారు నవ్వి "పల్లెటూళ్ళ సంగతి నీకు తెలీదు నాయనా? లోకంలో ఎక్కడా ఉండనంత విచ్చలవిడి తనమూ ఇక్కడే ఉంది. ఘోషా ఇక్కడే ఉంది. అయన ముసిలాడు గదా? వరలక్ష్మీ , నువ్వు గుడికి వెళ్ళటం నచ్చక ఏదన్నా అన్నాడేమోనని" అన్నది.
    "అతను ముసలి వాడు కాదత్తయ్యా!" అన్నాడు రాజారావు.
    తల్లి కూతుళ్ళు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. సుభద్రమ్మ కి రామదాసు ఒక్కసారి మనస్సులో మెదిలాడు. నేరిసీ నేరియని గడ్డమూ, ముగ్గు బుట్ట లాంటి తలా, నెమ్మదిగా మాట్లాడే అతని గొంతూ గుర్తు కొచ్చాయి. అతను ముసిలాడు కాదా?
    "అదేమిటి బావా?" అన్నది వరలక్ష్మీ తెల్లమొహం వేసి.
    "ఇందాక నువ్వు బంతి పూలు మర్చిపోయి వచ్చావు కదూ? అవి తెద్దామని మళ్ళీ ఆలయంలోకి వెళ్లాను. మడపం లో కనిపించలేదు. అతడేమన్నా తీశాడేమోనని పాక దగ్గరికి వెళ్లాను. అతను నెత్తి మీద పెట్టుకున్న విగ్గూ, అతికించుకున్న గడ్డము తీసేస్తున్నాడు.....అతనికి ముప్పై సంవత్సరాలుంటాయేమో?"
    కొంచెం సేపటికి దాకా ఎవరూ మాట్లాడలేదు. సుభద్రమ్మ కి మతి పోయినంత పనైంది. నిన్న రాజారావు చెప్పిన మాటలు గుర్తొచ్చాయామెకి. మునసబు , రామదాసు ని ఎందుకు తీసుకొచ్చాడో ఆమెకు ఆ క్షణాన అర్ధమైందనిపించింది. కోపం, దుఃఖం పెల్లుబికి వచ్చాయి. ఆ సమయాన మునసాబు కనిపించి ఉంటె ఆమె ఏం చేసినా చేసి ఉండేది.
    వరలక్ష్మీ మాత్రం నిబ్బరం తెచ్చుకుంటూ "ఎందుకు వేసుకున్నాడా వేషం?" అన్నది.
    "ఆ సంగతి వేరే చెప్పాలా?' అన్నాడు రాజా రావు.
    "మరి....వెంటనే అరెస్టు చెయ్యక పోయావా?"
    సుభద్రమ్మ కి ఆ మాటలేమీ వినిపించలేదు ఆపుకోలేని దుఃఖం ముంచుకు వస్తున్నది. మరణించిన భర్త కనుల ముందు నిలిచినట్లవసాగింది. ఆ డుఖమే ఆమెలో కోపాన్నీ వృద్ది చెయ్యసాగింది.
    'అంతేనంటావా రాజూ?' అన్నదామె.
    "ఇలాంటిదేదో వస్తుందనే నేను చెవినిల్లు కట్టుకుని వాగాను మీతోటి. వినిపించుకున్నారు కాదు. లోకంలో అంతా మనలాంటి వాళ్ళే ఉండరత్తయ్యా " అన్నాడతను సగం నిష్టూరంగా సగం మందలింపు గా.
    వరలక్ష్మీ కి ఇందులో తిరకాసమేమిటో అర్ధం కాలేదు. "అంత కంగారెందుకు బావా? పాలేరు మళ్ళీ వస్తాడు. వెళ్లి కట్టి పడెయ్యి" అన్నది.
    సుభద్రమ్మ దడదడ కొట్టుకుంటున్న గుండె లతో "వద్దు నాయనా! ఆ పని మాత్రం చెయ్యకు. వాళ్ళు కిరాతకులు . నీకు తెలీదు' అన్నది.
    "చూస్తూ వూరు కొమంటావా?' అన్నది వరలక్ష్మీ ఉద్రేకంగా.
    "వెర్రి మాటాలాడకు వరలక్ష్మీ! వూరుకోవటానికా నేనున్నది? ఈ సంగతి బైట పడకుండా ఒక్కరోజు చూస్తె ఆ తర్వాత వాడి పాట్లు కుక్కలు కూడా పడవు" అన్నాడు రాజారావు.
    "అంటే?' అన్నది వరలక్ష్మీ.
    "పోలీసులు రారూ?"
    వరలక్ష్మీ బావ వంక ఎగాదిగా చూసి వూరుకుంది.
    సుభద్రమ్మ గారికి ఏం చెయ్యాలో పాలు పోలేదు. మనసులోని భయాన్నీ, ఆందోళనని బైట పెట్టుకునే స్థితి దాటి పోయిందామె. ఒక రకమైన నిర్లిప్తతా , స్తబ్ధతా అవరించాయామెను. కాని అంతకు మించి ఆమె కర్తవ్యం కూడా ఆమెను వెన్నుతట్టి పిలుస్తున్నది. ఇక ముందు జరగవలసింది చాలా ఉంది. తనకోసం కాదు. తన జీవితం ఆయనతోటే సమాప్తి ఐపోయింది. ఆభమా, శుభమా ఎరగని ఈ పసివాళ్ళ కోసం తను ఏదైనా చెయ్యాలి.
    "ఏం చేద్దామయ్యా?" అన్నది చివరికి.
    రాజారావు సంతోషంగా పాలిగాడ్ని పిలిచి బండి కట్టించత్తయ్యా! తెల్లారేలోపల ఈ వూరు విడిచి పోదాం" అన్నాడు.
    సుభద్రమ్మ గారు కూతురి వంక చూసి "ఏమే?' అన్నది "నీ సలహా ఏమిటన్న"ట్లు.
    వరలక్ష్మీ "నీ ఇష్టం, బావ ఇష్టం" అన్నది. ఒక క్షణం పోయాక "అంత పారిపోవలసిన అగత్యం ఏవిటో?" అన్నది నెమ్మదిగా.
    రాజారావు తెల్లబోయాడు. మరదల్ని గురించి తాను అంతవరకూ తప్పుగా అంచనా వేశానా అనుకున్నాడతను. వరలక్ష్మీ లో ఇది వరకు కనిపించని దుర్మార్గం ఇప్పుడు కనిపించిందని కాదు. ఆ అమ్మాయికి తననుకున్న దాని కన్నా ఎక్కువ తెలుసునేమోనని!
    "ఐతే ఏవిటంటావు?' అన్నాడు రాజారావు.
    "నేనవేదేవిటి బావా?' మునసబు గారూ, ఆ రామదాసూ ఎంతటి దేవాంతకులైనా మనుషులే కదా? వూళ్ళో ఇంతమంది జనం ఉన్నారు. నాన్న పేరు చెబితే గోతిలో దూకమన్నా దూకేవారున్నారు. వాళ్ళతో ఈ సంగతి మాట మాత్రం అంటే ఆ ఇద్దర్నీ కట్టి పడేయ్యరూ?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS