Previous Page Next Page 
అసుర సంధ్య పేజి 7


    మత్తుగా నవ్వి పడుకున్నాడు రాజారావు.
    తెల్లవార్లు అతనికి తుమ్మెదలూ, పాలరాళ్ళు  కొలను లో ఈదే చేప పిల్లలూ, సంపెంగ పూవులూ శంఖాలు అగపడ్డాయి. వాటి మీదుగా అతను హాల్లో చూసిన ఫోటో మీదికి పోయిందతాని మనస్సు తల్లి కనబడింది. ఆమె వంక చూసేందుకు ప్రయత్నించాడు......
    తలుపు కొట్టిన చప్పుడు కి ఉలిక్కిపడి లేచాడు రాజారావు. గభాలున తలుపు తీసి అవతల నిలబడిన తల్లీ కూతుళ్ళ ని చూశాడు.
    "అమ్మా' అని అరిచావు నాయనా, నీకు కలలు ఎక్కువగా వస్తాయి లా వుంది" అంది సుభద్రమ్మ గారు.
    కళ్ళు నులుముకుని చూశాడు. అప్పుడే వాళ్ళ స్నానాలు కూడా అయినట్లున్నాయి.
    "కాఫీ తయారయింది ముఖం కడుక్కో" అని వెళ్ళిపోయింది సుభద్రమ్మ గారు.
    వరలక్ష్మీ నవ్వుతూ "రాత్రి గట్టిగా నిద్ర పట్టేసింది బావా-- కలలోకి రాలేక పోయాను సారీ" అంది.
    కాఫీ తాగుతూ ఆలోచనలో పడిన రాజారావు చూసి "అలా ఉన్నావెం నాయనా?' అనడిగింది. సుభద్రమ్మ గారు.
    "ఏం లేదత్తయ్యా" అన్నాడు.
    అన్నాడే గాని ఆమెకి చెబుదామను కున్న మాటల్ని ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూనే ఉన్నాడు.
    "బావకి మన వూరు ఏమీ నచ్చలేదటమ్మా" అంది వరలక్ష్మీ నవ్వుతూ.
    "అవునత్తయ్యా , ఆ విషయం చెబుదామనే నా ప్రయత్నం ....నాకీ లోకంలో నా అనేవారేవరయినా ఉన్నారూ అంటే మీరే! మావయ్య వున్నన్నాళ్ళూ ఈ వూళ్ళో ఆయన ఉండవలసిన అవసరం ఉంది-- సంపాదన ఉంది కాబట్టి. వూళ్ళో వాళ్ళు అయన సాయం అపేక్షించే వారు కాబట్టి , వైద్యుడయిన వాడికి వాళ్లకి సేవ చెయ్యడం విద్యుక్తధర్మం కాబట్టి!
    "ఇప్పుడు ఆ బంధం పోయింది. మీకీ వూళ్ళో ఇల్లు పొలం ఉన్నాయి. ఆ పొలం మీది ఆదాయం తోటే కుటుంబం నడవాలి. మీరు ఇద్దరూ ఆడవాళ్ళు. పొలంలో ఆడవాళ్ళు పనిచేసే కుటుంబం కాదు మనది. కాబట్టి అది ఎవరికయినా కట్టుబడికిచ్చి వాడిచ్చే దాంతో కాలం వెళ్ళబుచ్చడం తప్ప మీరూ చేయగలిగింది లేదు.
    "నేనూ ఏదో గౌరవంగా ఉండే ఉద్యోగం చేసుకుంటూ సుఖంగానే కాలం గడుపుతున్నాను. మీరెవరో తెలియని రోజుల్లో, మీతోటి పరిచయం ఆత్మీయంగా మారని రోజుల్లో అయితే నా ఉద్యోగం, నా జీవితమే నాకు పరమావధిగా కనిపించాయి. కాని ఇప్పుడు పరిస్థితి వేరు. నేను ఇంటికి ఆలస్యంగా వస్తే బాధపడే వాళ్ళు నాకున్నారు. అయినా వాళ్ళని అడవి లాంటి వూళ్ళో వదిలి వచ్చానే అన్న బాధ నాకూ ఉండిపోతుంది.
    "కాబట్టి అత్తయ్య! నాదొక్క కోరిక -- లేదు ప్రార్ధన . మీరు కూడా నాతొ పాటు వచ్చేయండి. మీకు ణా ప్రాణం ఉన్నంత వరకు ఏ లోపం రానీయను. మీకు మగదక్షత లేదు. నాకూ మీకన్న అయిన వాళ్ళు లేరు. మనం అంతా వేరే వేరే ఉండి ఒకరి కోసరం ఒకరం దిగుళ్ళు పడేకన్నా కలో గంజో కలిసి తింటూ ఒకే చూరు కింద ఉంటె మనశ్శాంతి ఉంటుంది. ఏమంటావత్తయ్యా?" అని సుభద్రమ్మ గారి వంక చూశాడు ఏమంటుందా అన్నట్లు. ఆవిడ కాసేపు ఏమీ మాట్లాడలేదు చివరికి.
    "నువన్న మాట బాగానే ఉంది నాయనా, ఆడది ఎప్పుడూ మగవాడి నీడన సుఖంగా కాలం వెళ్ళబుచ్చవలసిందే! కాని వున్న వూరు, మన క్షేమాన్ని కోరే వాళ్ళ మధ్య నుంచి బయటికి పోవడం ఎలా?"    
    "అక్కడే నువ్వు పోరాబడ్డావత్తయ్యా -- ఇక్కడి వాళ్ళు నువ్వను కుంటున్నంత మంచివాళ్ళు కారు. అందులో కొందరు 'మంచి' అన్న మాటకే అర్హులు కారు. నేను వచ్చినప్పటి నుంచీ చూస్తున్నాను ఇక్కడి వాతావరణం -- మనుష్యుల తీరూ. నోటితో మాట్లాడి, నొసటి తో వెక్కిరించే వాళ్ళు ఎక్కువగా అగుపడుతున్నారు నాకు. అది మరి ణా దృష్టి లోపమేమోనని వారి మీద సదభిప్రాయం కలిగించుకుందామని తీవ్రంగా ప్రయత్నించాను. కాని అది సాధ్యం కాలేదు... కాదు సాధ్య పడవలసిన అవసరం కూడా లేదని తరువాత తెలుసుకున్నాను.
    రోజూ చూసే ముఖాలే కాబట్టి కొందరిని గురించి మీరేమీ పట్టించుకోవడం లేదు. వారిని గురించి చెడుగా చెపితే నమ్మరు. మీకు వాళ్ళు మంచి వాళ్ళు కారేమోనన్న ఆలోచన వస్తే అలా వచ్చినందుకు భయపడి పోతారు....ఒక్కమాట అడుగుతానత్తయ్యా -- ఇతరులకి ఏ అపకారం తలపెట్టని మావయ్య ఈ వూళ్ళో అమానుషంగా చంప బడ్డాడు. ఎందుకంటావు?"
    సుభద్రమ్మ సమాధానం చెప్పలేదు.
    "నాకు తెలుసత్తయ్యా నువ్వు చాలా అమాయకురాలివి. నాలుగు ఊళ్ళు చూసిన నాకు వయస్సు లో చిన్న వాడయినా నీకన్న ఈ విషయాల్లో అనుభవం ఎక్కువ ఉంటుందత్తయ్యా. మిమ్మల్ని ఇటువంటి మనుష్యుల మధ్య వదిలి పెడితే నాకు మనశ్శాంతి ఉండదు. నేనా వెళ్ళక తప్పదు కాబట్టి ప్రార్ధిస్తున్నాను నిన్ను-- నా వెంట రండి పువ్వుల్లో పెట్టి పూజిస్తానని అనను గాని నాలో శక్తి ఉన్నంత వరకు మీకు ఏ లోపం రానీయను."
    సుభద్రమ్మ గారు ఏమీ మాట్లాడలేదు.
    "ఎమత్తయ్యా?"
    "నన్ను ఆలోచించు కొనియ్యి నాయనా!" అంది ఆవిడ.
    రాజారావు లేచి గదిలోకి వచ్చేశాడు. అతని తలలో ఆలోచనలు తేనే టీగల్లా ముసురుకుంటూన్నాయి. తను వాళ్ళనలా అర్ధంతరంగా వదిలి పోలేడు. వాళ్ళకి ఉన్న ఆశ్రయం ఒక్కటీ పోయింది....వాళ్ళని పోషించడం తన కర్తవ్యం. తన ధర్మం. తన కానందం కలిగించేది కూడా!.... ఎలాగయినా అత్తయ్య ని ఒప్పించాలి . వరలక్ష్మీ ద్వారానయినా ప్రయత్నించాలి. తను మాత్రం ఈ బాధ్యత స్వీకరించాలి. అప్పుడే తనకి తృప్తి....
    చప్పుడయితే వెనక్కి తిరిగాడు. వరలక్ష్మీ నిలబడి ఉంది.
    ఆమె వంక చూశాడు. ఏవేవో ఆలోచనలతో మబ్బులను జయించేందుకు ప్రయత్నిస్తూ చంద్రుడిలా ఉంది ఆమె ముఖము.
    "కూర్చ్పో వరం!" అన్నాడు రాజారావు తను కూర్చుని.
    వరలక్ష్మీ మాట్లాడకుండా కూర్చుంది.
    "నువ్వయినా చెప్పు వరలక్ష్మీ. ఈ పాడు వూరితో మీకింక సంబంధం ఏమిటి? ఈ ఇంట్లో తిరుగుతుంటే మావయ్య గుర్తుకు రావడం లేదూ? మీకు? ప్రొద్దు క్రుంకితే చీకటి పడితే ఈ చీకటి మామయ్య ని పొట్ట నేట్టుకుందని అనిపించడం లేదూ? అలా దారి వెంట తుమ్మ చెట్ల కేసి చూస్తె మావయ్య ని కబళించినా ఇంకా అసంతృప్తి తో వికటాట్టహాసం చేస్తున్న మృత్యువు కనిపించడం లేడూ? వీధిలో కొందరు మనుష్యులని చూసి నప్పుడు మావయ్య ని నిర్దాక్షిణ్యంగా చంపిన వ్యక్తీ వాడేమోనని అనిపించడం లేదూ?...."
    "బావా!" ఆశ్చర్యంగా అతని కేసి చూసింది వరలక్ష్మీ.
    "అవును వరలక్ష్మీ , నాకలా అనిపిస్తోంది. అలా కనిపిస్తోంది . ప్రతిదీ మావయ్య నే గుర్తు చేస్తోంది. ఈ స్మృతులు మిమ్మల్ని వెంటాడటం లేడూ?"
    ".........."
    "మాట్లాడవేం వరం . నేనేం పరాయి వాడినా? మీరు నా వెంట ఎందుకు రారూ? ఆ మాత్రం అవకాశం నాకెందుకీయరు?" అతని కంఠం రుద్దమయి పోయింది. ముఖాన్ని చేతుల్తో కప్పేసుకున్నాడు.
    వరలక్ష్మీ అతనికి దగ్గరగా వచ్చి "ఎందుకు బావా అంత బాధపడతావు? నువ్వు "స్మృతులు వెన్నాడటం లేదూ?" అన్నావు . కాని అందులోనే అమ్మకి మధురమయినవీ ఉండచ్చుగా! అమ్మ ఈ ఇంటికి కొన్ని ఏళ్ళ క్రితం కొత్త పెళ్లి కూతురిలా వచ్చిందన్న మాట మర్చి పోతున్నావు బావా నువ్వు. సంసార మాధుర్యాన్ని, నాన్నగారి మంచి మనసుని ఆవిడ తెలుసుకున్నది ఈ ఇంట్లోనే! మరి అవిడకవి మధురమయినవి కావూ?"
    ఒక్కసారి తలెత్తాడు రాజారావు.
    "క్షమించు వరం. నేను చాలా ఆవేశ పరుడ్ని ఏమేమిటో మాట్లాడాను. ఎంతసేపూ నా దృక్పధం లోంచే చూశాను కాని ఈ విషయాలు నా మనసులోకి రాలేదు....ఒక హత్య జరిగింది. మన కుటుంబం మీద ఎవరికయినా క్రోధం ఉండి ఇవి అ=ఇంతటితో ఆగకపోతే ఏమయి పోతారు అనే నేను ఉద్రేకంతో మాట్లాడింది. కాని ఒకటి మాత్రం చెబుతున్నాను.  మిమ్మల్నిక్కడ వదిలి వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి ఉండదు."
    "పిచ్చి బావా, మాకు మాత్రం నీకన్న కావలసినవారెవరున్నారు చెప్పు? అమ్మ తప్పకుండా ఒప్పుకుంటుంది. నేనూ సమయం చూసి నచ్చ చెబుతాను. నాకూ ఈ ఇంట్లో ఉండడం భయంగా ఉంటోంది. నాన్నగారు గుర్తుకోస్తారు ఎంత సేపూను. అలా కుర్చీ కేసి చూస్తె అయన కుర్చున్నట్లే ఉంటుంది" పమిట చెరుగు ముఖాన కప్పుకుంది వరలక్ష్మీ.
    రాజారావు ఆమె రెండు భుజాలూ పొదివి పట్టుకుని "ధైర్యంగా ఉండాలి వరం. మా అమ్మ పోయినప్పుడు నాకు సానుభూతి చెప్పేవారు కూడా కరువయి పోయారు తెలుసా ?.....


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS