తను మ్రింగుకోలేనట్లు ఉంది దృశ్యం. శాంత కళ్ళల్లోకి చూచి, "నువ్వు నమ్మగలవా?' అన్నా, ఆ ముఖంలో తనకు తెలియని కళ, తేజస్సు, హుందాకూడా నోరు తెరిచేటట్లు చేసేయి.
'ఏమిటో, ఈ బాపనాళ్ళు తెగ చదువుతారు మంత్రాలు!' అనుకుంది.
కళ్ళల్లో తేనె పెట్టుకున్నట్లే కూర్చున్నారు భళ్ళున తెల్లారే వరకూ. అయినా వెంకటమ్మ తేరుకోలేదు. ఓ సందిగ్ధ సంగ్రామం. సృష్టి పునరావృత్తి. చరిత్ర ఎక్కాలు వల్లెవేస్తూందా?
కొంజా కిరణాలతో కప్పుకున్నప్పుడే కళ్ళు తెరిచి చుట్టూరా కలయచూచేడు. ఎక్కడో, అంతా క్రొత్తగా ఉంది. ఈ ప్రక్కగా ఉన్న ముదుసలి ఎవ్వరు? ఈ ఇంట్లోకి ఎల్లా వచ్చేడు? అర్ధం కాలేదు. జ్ఞాపకంలో తను....
"ఎల్లా ఉంది?" లక్ష్మయ్య ప్రశ్న.
చిన్నగా నవ్వేడు. "ఎక్కడ వున్నా?"
"అవధానులు గారింట్లో."
ఉలిక్కిపడి లేచేడు. బలం కోలుకుంది. తను ఆ ఊరునుండి బయలుదేరడం, అడ్డదారి దగ్గరనే అనుకుని చేలగట్లమ్మట రావడం తర్వాత.........
"ఏఊరు?"
"రావినూతలపాడు."
"ఇక నే వెళతా." లేవబోయాడు.
శాంత గుండెలు కొట్టుకున్నాయి.
"శోషవచ్చి పడివుంటే తీసుకువచ్చే. ఇదీ బాపనోళ్ళ ఇల్లే. రెండురోజులుండి, కాస్త ఉసులు చిక్కింతర్వాతనే వెళ్ళు." లక్ష్మయ్య.
"అవును." అతి ముక్తసరిగా వెంకటమ్మ.
ఇరుకున పడ్డాడు. అవధానులెవరో తనకు తెలియదు. ఈ ఊరుకూడా క్రొత్త. అల్లాంటి స్థితిలో తను ఉండడం హాస్యాస్పదంగా ఉంది. మనస్సు ఒప్పలేదు.
పాలేరు కుర్రాడు "అయ్యగోరూ! ఏన్నీళ్ళు పెట్టినా" అంటూనే గావంచా పట్టుకువచ్చేడు. లక్ష్మయ్య కళ్ళతో వెళ్ళని బయటకు వెళ్ళడం, వెంకటమ్మ లోపలికి వెళ్ళడంతో ఇరుకున పడ్డాడు. సందిగ్ధం ఆవరించింది.
నెమ్మదిగా అందుకునే, వెనకాల బయలుదేరేడు, శరీరం కోరుకున్నట్లే.
"మీ అయ్యగారు లేరా?"
"పెండ్లికి ఎల్లేరు. ఇంట్లో శాంతమ్మ గారొక్కరే ఉన్నారు. పెద్దమ్మగారూ వెళ్ళేరు."
బహుశః శాంతమ్మ కూతురై ఉంటుంది; లేకపోతే ఏ అక్కగారో అయి ఉండవచ్చన్న ఊహ కలిగింది. ఎవరైనా, నిన్న రాత్రి ఇచ్చిన ఆతిధ్యానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆవిడను ఇంతవరకూ చూడలేదు. వెంకటమ్మ, లక్ష్మయ్యలను చూస్తేనే వాళ్ళు తోడుకు వచ్చేరన్నది తేటతెల్లంగా ఉంది.
"మీరు జపం చేసుకుంటే పంచపాళీలో అన్నీ పెట్టేరుట. అమ్మాయిగారు చెప్పమన్నారు."
ఉలిక్కిపడ్డాడు. ఎవరో వీపుమీద చరిచి నట్లయ్యింది. దానితో కుతూహలం రేకెత్తింది. ఎవరూ దారి చూపించనక్కర్లేదన్నట్లే, పడమటింట్లోంచి ఎడమవైపుకు మళ్లేడు.
కృష్ణా జివం పరిచిన పీట, ఉద్దరిణి, పంచపాత్ర, ప్రక్కగా గంగ చెంబులో నీళ్ళు. విభూది తాటాకుపెట్టె, కుచ్చెళ్లు పెట్టి లుంగచుట్టిన గావంచా.
రువ్వుమన్నట్లే 'ఇవన్నీ మరిచిపోయేవు!' అని తనలోంచి ఎవరో నవ్వేరు. సూదుల్లా గ్రుచ్చుకుంది. ఏదో అణుమాత్రంగా జ్ఞాపకం ఉండీ లేనట్లున్న అవ్యక్తం. ఓ విజ్రుంభించలేని గాలివాన.
భయంగానే కూర్చున్నాడు. నీళ్ళు పంచపాత్రలో పోసుకున్నాడు. విభూది లేపవంచేసేడు. మూగపోయిన కంఠం. ఇంట్లో ఉన్న పీఠం శక్తి అన్నా, పరిసరాల పవిత్రత అన్నా, యుగాలధర్మం అన్నా, ఏదో అతీతశక్తి ప్రకోపించి, రూపొందించిందన్నవతులోనే, ఆ మహేశ్వరీ స్థానంలోంచి ప్రణవమే లేచింది. ఒళ్ళే తెలియని పునశ్చరణే అయ్యింది. తనను తాను మరిచి పోయేడు. విధి బలీయం.
"రాజూ!" ఎవరో పిల్చేరు. కంగారుగానే చుట్టూరా చూచేడు. ఇంతసేపూ తనవైపు ఎవరో చూస్తూనే ఉన్నారు. ఎవరు? ఎవరిప్పుడు తన్ను పిల్చింది? అర్ధం కాలేదు. లేచి జాలకర్రలోంచే దూరంగా ఉన్న మేఘాల్ని, నీలపు ఆకాశాన్ని, దొడ్లకొట్టాం ముందుగా ఆడుతున్న కోడెదూడను చూస్తూనే ఉండిపోయేడు.
గుమ్మపాలు, నురగలు కక్కుతున్నవి, వెండి గ్లాసులోనే తెచ్చి పీఠం దగ్గర పెట్టి, అరివేణం పంచపాత్ర తీసి, క్రింద వలికిన నీళ్ళు వ్రాసి, ఆవిడ వెళ్ళబోతున్నప్పుడే "తీసుకోండి" అంది. క్షణికం గడపవద్దే ఆగింది.
వెనక్కు తిరిగేడు. తనకు ఒక్క రాత్రి ఆశ్రయం ఇచ్చి, ప్రాణం నిలబెట్టిన గృహిణి. కృతజ్ఞత తెల్సుకోవాలి. ఎత్తిన కళ్ళు అల్లాగే ఉండిపోయేయి. తను కట్రాటే అయ్యేడు. ఎవరిని చూస్తున్నాడు? ఎక్కడో చూచిన గుర్తు. మైమరపు. జ్ఞాపకం. తను చెప్పలేడు. కాని గుర్తుకు రావటంలేదు. నల్లగా మబ్బుగా ఉన్న తెర. ఛాయ తర్వాత......
శాంతా కళ్ళు దింపనేలేదు. కట్టుకున్న పసుపుకొమ్ము తాడు; పెట్టుకున్న పూజా కుంకం కూడా తేరిపారినట్లే నిల్చుండిపోయింది.
అదో క్షణం అయినా హృదయాలు వెల్లువలే అయి చెలియలి కట్టలే అయ్యింది.
గుండె గొంతుకలోని కొట్లాటన్నట్లే "నువ్వా!" అన్నాడు. తను అనలేదు.
"ఇన్నాళ్ళకు జ్ఞాపకం వచ్చేనా?" అంటూనే పాదాలకు నమస్కరించింది. కన్నీళ్ళతోనే పూజ చేసింది. శరీరం పుంజుకున్నట్లే "మీరు నాకన్న పెద్దలు. ఏమిటిది?" అన్నాడు.
షోడషంగా నవ్వుతూనే "నా భర్తకి నేను నమస్కరించడం తప్పుకాదు" అంది. రాజు కట్రాటే అయ్యేడు.
* * *
6

"ఏం జరిగిందమ్మా?" బుజ్జగించినట్లుగానే దశరథం, సత్యను అడిగేడు. సుభద్రమ్మ గుమ్మం దాటించినపుడే మరీ మరీ చెప్పింది. 'మీకు చాలామంది తెలుసు. అందరికీ చెప్పి రండి. వీలైతే కాలేజి ప్రిన్సిపాల్ ను కూడా కలుసుకోండి. వాడి సత్తా తెలుసుకురావాలి' అని నొక్కించింది. అందుకే బయలుదేరేడు.
తన స్నేహితులను కలుసుకున్నాడు. అది ఏమాత్రం తనకు సహకారి కాలేదు. అల్లాగే కాలేజీలోనూ. చాలా నిరుత్సాహంగా గేటు దాటినప్పుడే ఆ అబ్బాయి చక చకా వస్తూనే "రాజు చదువు మానేస్తాడా?" అని తన్నే అడిగేడు. ఎగాదిగా చూచేడు. సిల్కు షర్టు, లినెన్ పాంటు. ఒంటికి వ్రాసుకున్న సెంటు.
"మానెయ్యవలసిన అవసరం లేదు."
"ఇరవై రోజులుపైగా అయ్యిందే కాలేజీ మానేసి? అందుచేత...."
"పది రోజుల క్రితమే ఇల్లు వదిలి పెట్టేడు.
"ఆ!"
"ఎక్కడ తిరుగుతున్నాడో కన్పించలేదు. అందుకే..." ఆగేడు.
"నిజంగా? మా మధుకే మైనా తెలుసేమో అడిగివస్తా. ఉండండి" అంటూనే అతను వెళ్ళడం, తిరిగి నిరుత్సాహంగా రావడం-"అయితే నాతో వస్తారా?" అనే రిక్షా మాట్లాడేడు.
గుమ్మం మెట్లు ఎక్కుతున్నప్పుడే ఆశ్చర్యం పులుముకుంది. రాజు ఈ కాలేజీ జీవితం ఏమిటి? ఏయే మధుర సంభావింపులు దాచుకున్నాడు? ఈ ఇల్లెవరిది? ఎన్నో రేకెత్తేయి.
నల్లగా ఉన్న, పిల్లికళ్ళతో చూచి నమస్కరించిన అమ్మాయిని చూచేసరికి బిగువుగా గుటక మ్రింగేడు. పరిచయమూ అయ్యింది. కుర్చీలో కూర్చున్నప్పుడే రాజు వచ్చినట్లు, ఆ రాత్రే వెళ్ళిపోయినట్లు తెలిసింది.
కుతూహలంతోనే ఎదురుచూచేడు. "ఏం జరిగింది?" మళ్ళీ అడిగేడు. సత్య మౌనంగానే తల వంచుకుంది.
"ఈ సమయంలో, సత్యా, అతని ఉద్దేశ్యం ఏమైనా వ్యక్తీకరించి ఉంటే చాలా ఉపయోగ పడుతుంది. ఆనాటినుండి ఇంటికి రాలేదుట. వాళ్ళ నాన్నగారు బెంగ పెట్టుకున్నారు."
పొడిగా సత్య, రావువైపు చూచింది.
ఏదో నిగూఢంగానే ఉండిపోయింది అన్న సంభావింపు తట్టింది దశరధానికి. సత్యను చూస్తుంటే, విచిత్రమైన అనుభూతి తనకే కలుగుతూంది. ఆ కళ్ళల్లో ఆకర్షణ; మనిషిలో చిగిర్చినట్లుగా ఉన్న మెరుగు సూదంటురాయిలా ఉన్నాయి. ఇటువంటి స్త్రీకి రాజు దాసోహం అన్నా తప్పు లేదు. వ్యక్తిగతంగా తనలో తనకే చైతన్యం కలుగుతూంది.
"నా వయస్సు నన్ను ముందుకి తోస్తోంది. సహజంగా ఆ వయస్సు పరిణామం రాజులో వలపు పండించవచ్చు. అది నాకు అనవసరం ప్రస్తుతంలో. వడి ఉనికే తెలుసుకోవాలన్న తచ్చాటన నాకు...." లాయరుగిరీ ప్రదర్శించేడు.
చిరాగ్గా చూసి "అతను ఆ యింట్లో ఉండలేకుండా ఉన్నానని, ఏదో ఎవరో త్రోస్తున్నారని, ఒక్క రాత్రిలో కొన్ని ఘంటలు ఉండి వెళ్ళిపోయేడు. ఎక్కడికి అన్నది చెప్పలేదు" అంది.
"పోనీ, మాటల ధోరణిలో గ్రహించలేదా, తల్లీ?"
"ఎవర్నో ఎక్కడో వదిలిపెట్టినట్లు, వాళ్ళు జ్ఞాపకం రానట్లు, వారికోసం తను అన్వేషిస్తున్నట్లు మాట్లాడేడు."
"ఎవర్నేనా ప్రేమిస్తున్నాడా?"
ముఖం చేతుల్లో దాచుకునే వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంది. రావు తెల్లబోయేడు. తన సాహచర్యంలో, తనది కాకుండా పోయిన సత్య, రాజుదే అనుకున్నాడు. దాన్నిగూర్చి ఈర్ష్య చెందలేదు. పైగా రాజు అనరు ఓ విధమైన ఆపేక్ష. అది ఇదమిత్ధంగా నిర్వచించలేడు.
"తప్పుగా అర్ధం తీసుకోకమ్మా. మేనరికం చెయ్యాలని కోడల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుంది వాళ్ళమ్మ. రుక్మిణికి వాడంటే పంచప్రాణాలున్నూ. దాన్ని ఇప్పుడు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. అన్నం తినడం కూడా మానేసింది...." నటన.
"నాకు తెలుసు." అతి ముక్తసరిగా త్రుంచేసింది.
ఈసారి మంచినీళ్ళు అడగవలసింది దశరథం అయ్యేడు. ఇక మాట్లాడేది లేనట్లే సత్య పుస్తకం మూసేసింది.
"ఎప్పుడేనా వస్తే...." అంటూనే తన కార్డు బల్లమీద పెడుతూనే, "తెలియ చేస్తే సంతోషిస్తా. రుణపడే ఉంటాం" అంటూనే లేచేడు దశరథం.
రావుకు మాత్రం చీకటికొట్లో పెట్టేసి నట్లయ్యింది. సత్య జరిగినదాంట్లో వీసం కూడా చెప్పకుండా దాచింది అన్న నిరుకు. ఏం జరిగింది? తన ఊహకు అందటంలేదు.
"మళ్ళీ కలుస్తా, సత్యా!" అంటూనే రోడ్డు ఎక్కేరు.
ఉండి ఉండి "పోస్టాఫీసులో నీకెవరయినా స్నేహితులున్నారా?" అని దశరథం అన్నాడు.
తల ఊపుతూనే, కళ్ళతో "ఇప్పుడు ఇదెందుకు?" అనే అడిగేడు.
"ఎంత రొక్కం తనతో తీసుకువెళ్ళేడో?" ఎవరితోనో అన్నట్లు ఉన్నా అర్ధం అయ్యింది. పోస్టాఫీసుకు వెళ్ళి శాస్త్రిని కలుసుకుని ఆరాలు తీసేడు.
"ఐదు వందలు. ఇక్కడకు వచ్చిన మర్నాడే విత్ డ్రా చేసేట్ట."
"ఉహు... అయితే నేను వెళ్ళవచ్చు నాయనా. ఒక్కటి అడుగుతా. ఆ సత్య జరిగింది దాచింది. ఈషణ్మాత్రంకూడా వ్యక్తీకరించలేదు. ఏదో వాళ్ళిద్దరి మధ్యా చరిత్ర ఉంది. అది నువ్వే ఆరా తియ్యాలి. ఓవేళ అనుకున్నట్లుగా ఏమీలేకపోవచ్చు. అదీ సంభవమే. పైగా అంత పెద్ద మొత్తం బాంకు లోంచి తీసుకున్నాడన్నది, కొన్నాళ్ళు ఎక్కడి కైనా తిరిగిరావడానికి అన్న ఉద్దేశ్యాన్ని వెళ్ళబుచ్చుతుంది. ఇదీ సత్యమే. వీట్లన్నిటికి కాలం జవాబు చెప్పాలి. అయినా మానవ ప్రయత్నం ఉండాలి కదా? ఈ బరువు నీమీధకాస్త పెట్టక తప్పటంలేదు."
"దానికేమండి. అంతగా చెప్పాలా?"
"మరిచిపోయే! రుక్మిణి విషయం నీతో ఎప్పుడైనా మాట్లాడేడా?"
డిల్లబోయేడు. ఎవరా రుక్మిణి? ఏమా కథ అన్న చూపే. తలూపేడు, లేదు అన్నట్లు.
"మరి సెలవా?" అంటూనే రిక్షాలో కూర్చున్నాడు దశరథం.
రాజు ఆ వృత్తిలో మునిగి, తనొక్కడే రోడ్డు కంతా అయినట్లే రావు రూపొందేడు. ఉదయం మధును తొందరలోనే ప్రశ్నించేడు. వాడికి, రాజుకు ఉన్నంత సన్నిహితం తనకు లేదు. కొంత కాకపోతే కొంతైనా తనకు తెలియనిది వాడికి తెలిసి ఉండవచ్చు అనుకునే వాడి గదికి బయలుదేరేడు.
"తోట మలుపు తిరిగి, చేనుకాడకు వచ్చే సరికి ఎవరో పడి ఉన్నట్లయ్యింది. లగెత్తుకు వెళ్ళే. ముక్కుసాస ఆడుతో ఉంది. భుజాన్నేసుకునే అవధాన్లుగారింటికి తెచ్చే. అత్తమ్మ, శాంత ఉన్నారు." ఎవరో చెపుతున్నారు.
గొంతుమాత్రం తను ఇదివరలో వినలేదు.పల్లెటూరివాని మాట.
"ఆ రాత్రి ఉన్నాడు. మర్నాడు రెండు మెతుకులు కడికేడో లేదోకూడా తెలియదు. అంతే, పరారైపోయేడు. అత్తమ్మ ఒళ్ళో శాంతమ్మ ఒక్కటే గోలెట్టేస్తోంది."
లోపలికే వెళ్ళేడు. చెప్పేది ఆపి లక్ష్మయ్య ఎవరా అన్నట్లు చూచేడు. బొద్దుగా మీసాలు, కండలు తిరిగిన జబ్బలు-వ్యవసాయదారుడు ముమ్మూర్తులా గదిప్రక్కగా చెరుకుగడలు, సత్తుబుడ్డితో పానకం ఉన్నాయి.
"నువ్వురా! రా!" చెరుకుగడ పిప్పితీస్తూనే మధు అన్నాడు.
"మారైతు. రావినూతలపాడు."
"అల్లాగా" అంటూనే తక్కినది అడగకుండానే కూర్చున్నాడు. మాంచి చెరుకుగడ ఒకటి తెచ్చి ఇస్తూనే చేతికిచ్చేడు.
