ఆ మాట వింటూనే మంజు క్షణంలో చెల్లికి చెప్పి భాస్కర్ వైపు జాగ్రత్త సుమా - మా చెల్లి అన్నలా చూచి భర్త ప్రక్కకు వచ్చింది. "వస్తా మమ్మా కళ్యాణి.....భాస్కర్ మీరిద్దరు తరచు రావాలి సుమా?"
రాత్రి సమయం, రద్దీ ఎక్కువగాలేని ఆరోడ్డు మీద "వాన్" వేగంగా వెడుతోంది. కుమార్ మంజువైపు చూచాడు. ఆమెలో ఏదో నూతన తేజస్సు ప్రవరిస్తోంది. ఆ ప్రపుల్ల వదనంలో లీలగా అగుపిస్తున్న ఆమె భావాలు అతని కానందం కలిగించాయి. చెల్లెల్ని చూసిన వేళా విశేషం మరి. అతను తృప్తిగా నవ్వుకున్నాడు.
"మీరు భోంచెయ్య లేదు," మంజు అంది" హాస్పిటల్ చేరగానే ఇక ఏది చెయ్యటానికి వీలు పడదని వారికి తెలుసు. కుమార్ కారియర్ తెరిచాడు ఫై అరలో లడ్లు. గారెలు, బజ్జీలు వున్నాయి మంజుకు అందిస్తూ తను తిన్నాడు. ఆ ఫలహారానికే కడుపు నిండినట్లుగా వుంది. వాన్ ఆగడం - ఆగడం సరాసరి థియేటర్ దగ్గర ఆగింది.
అప్పుడే స్ట్రెచర్ లోంచి గాయపడిన మనిషిని దింపుతున్నారు ఆపరేషన్ టేబుల్ మీదికి. మామూలు ఆపరేషన్ లు జరిగేటప్పుడు చేసే శుద్ధి చేయటానికి వ్యవధిలేదు డ్యూటీ డాక్టర్ ఖాన్ వచ్చి వున్నాడు. థియేటర్ నర్స్ త్వరితగతిని అన్నీ అమరుస్తోంది. అత్యవసర పరిస్థితిలో జరిగే ఆపరేషన్ కాబట్టి ఆలస్యం చేయకుండా అక్కడ వుండే డాక్టర్లతో ఆపరేషన్ జరిగించాలి థియేటర్ స్టాఫ్ ఎప్పుడూ సిద్ధంగానే వుంటారు.
ఖాన్ ఆతురతతో చేతులను కడుగుకుంటున్నాడు. మాదప్ప పౌడర్ వేసిన తనచేతులకు గ్లౌజ్ తొడుగుతున్నా.... "సరిగ్గా సమయాని కొచ్చాను డాక్టర్ - నాకు ఫోన్ రాగానే మీకోసం వాన్ పంపాను. చాలా సీరియస్ కేస్ ....- నువ్వు తప్పక ఉండాలని పిలిపించాను" చివరి మాటలు చాలా నెమ్మదిగా కుమార్ కు మాత్రం వినిపించేలా అన్నాడు. ఖాన్ విన్నట్లు లేదు.
కుమార్ కృతజ్ఞతగా చూచి గబగబ తనపని కానిచ్చాడు. నర్సు ఇచ్చిన వస్త్రధారణ ముగించి గ్లౌస్ వేసుకుని సిద్ధంగా నుంచున్నాడు. మాదప్ప ప్రధమంగా థియేటర్ లోకి వెళ్ళాడు. అతడిని మిగతావారు మౌనంగా అనుసరించారు. తల దగ్గరవున్న అనెస్తటిస్ట్ పేషెంట్ ను పరీక్షిస్తున్నాడు.
డాక్టర్లు - సర్జన్ వచ్చి తమ స్థానాల్లో నుంచోగానే అతడన్నాడు "నాడి చాలా చిన్నగా కొడ్తోంది....శ్వాస తక్కువగా వుంది....బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువ....కానీ ఇంతకన్నా మంచి స్థితిలోకి వస్తాడని నమ్మకం లేదు. "ఈ పరిస్థితుల్లో "పేషెంట్ యీజ్ రెడీ" అన్నాడు తెరవ తలవేపు నించి.
గుడ్డ తొలగించారు ...... హృదయభాగం రక్తపుమడుగు తెగిన రక్త నాళాలను కనుక్కొని కుట్లు వేయాలి. రక్తం అద్దివేసి చూస్తున్నారు. గుండెకు దెబ్బ తగల్లేదు.....ఫరవాలేదు అనుకుంటుండేలోగా.... 'ఆగాలి.....గుండె ఆగిపోయింది" అనెస్తటిస్ట్ అన్నాడు. సర్జన్ మాదప్ప పొడుగాటి సూదితీసికొని సరిగ్గా గుండెకే హుషారెక్కించటానికి మందు ఇంజక్ట్ చేశాడు. కానీ....లాభంలేదు.....అతని గుండె మరి కొట్టుకోలేదు.
మాదప్ప బైటికొచ్చాడు. వెయిటింగ్ రూంలో కూచున్న బంధుజనం అతని రాకను గమనించి భయాందోళనలతో లేచి నుంచున్నారు. కొన్ని గంటలు పడ్తుందని - అరగంటైనా దాటలేదు- అప్పుడే వచ్చేశారే?
మాదప్ప ప్లాస్టిక్ ఏప్రెన్ మీద సన్నటి రక్తపు మరకలున్నాయి ఆయన గంభీర వదన డై అన్నాడు! మీకుముందే చెప్పాము. చాలా గాయాలు తగిలి అపాయకరమైన స్థితిలో ఉన్నాడని, ప్రయత్నం చేశాము.....లాభంలేక పోయింది...అయామ్ వెరి సారీ... శవాన్ని తెస్తారిప్పుడు"
ఆమాటలు విని అక్కడవున్న రెండో భార్య-ఆమెకూతురు, మొదటిభార్య సంతానం గొల్లు మన్నారు.
తెల్లటిగుడ్డ నిండుగ కప్పబడిన దేహాన్ని త్రోపుడు మంచంలో పండబెట్టీ బైటికి త్రోసుకొస్తున్నారు వార్డ్ బాయ్ లు.
ఆ తల్లీకూతుళ్ళ దుఃఖం వర్ణనాతీతం. కొడుకులిద్దరు ఆతృతతో తండ్రి శవంకు దగ్గరగా వచ్చారు....ఆ పిల్ల కన్నడంలో ఏదో అంటూ ఏడుస్తోంది. అన్నలవైపు భయంగా చూస్తోంది. మాదప్ప ఆ పిల్ల నింత ప్రవర్తనను కుతూహలంతో గమనిస్తూ-ఆ పిల్ల కన్నడంలో దొర్లిస్తున్న మాటల నర్దం చేసికొన్నాడు.
"ఇక్కడ ఏడవకండమ్మా..." అక్కడికి పదండి, వేరేవాళ్ళు వింటే అధైర్య పడ్తారమ్మా..." ఒక నర్సు వచ్చి నెమ్మదిగా చెప్పింది. "పదండయ్యా" అంటూ వారు శవాన్ని మార్చురీకి-శవాలను పెట్టే గదిలోకి తీసికొని వెళ్ళారు.
శవంవెంట అందరు వెళ్ళిపోయారు.
మరణ పత్రం రాయటానికి మాదప్ప గదిలో కెళ్ళాడు. ఖాన్ యిచ్చిన రిపోర్ట్ చదువుతున్నాడు. "....తేదీ సాయంత్రం 7 గంటల 50 ని || లకు శ్రీ గురురామ్ నాయుడు కారు ప్రమాదంలో చిక్కి అధికమైన గాయాలతో ఆసుపత్రికి తీసి కొని రాబడినాడు..... అతనిలో స్పృహ లేదు....నాడి ఎక్కడో కొద్దిగా కొట్టుకుంటోంది...శ్వాస లీలామాత్రంగా వున్నది..." క్రింద డ్యూటీ డాక్టర్ - ఖాన్ సంతకం వుంది.
మాదప్ప మిగిలినది పూర్తిచేశాడు. తలెత్తి చూచేవేళకు ఖాన్ నుంచుని వున్నాడు. అతని ముఖంలో హాస రేఖను చూచి పశ్నార్ధకంగా కనుబొమలెగుర వేశాడు.
"ఈతని చావు అందరికీ అత్యంతానందాన్ని కల్గించింది. భార్య -కూతురికి మాత్రం అలా లేదనుకోండి. ఆ అమ్మాయికి ఈ నెలాఖరుకు పెళ్ళిట...సరే....ఆ కొడుకులు లాయర్ తో సహా వచ్చారు. మీకీ విషయాలు తెలిస్తే మంచి దనుకున్నాము"
ఆయన తల పంకించి దీర్ఘాలోచనలో మునిగిపోయారు. ఆ పిల్ల అన్న మాటలు అతని చెవుల్లో గింగురు మంటున్నాయి. గంటల తరబడి ఆపరేషన్ చేసినాకలుగని విసుగు, అలసట అతని కీనాడు కల్గినై, బహుశః ప్రయత్నం విఫలమైనందు కేమో!
కుమార్ ఇల్లు చేరేసరికి పదిగంటలు దాటింది'
తలుపు తెరిచి ఎప్పుడు డాక్టర్లు అడిగే ప్రశ్న అడిగింది మంజుల.
"విజయవంతమేనా?"
"లేదు మంజూ, ఆపరేషన్ టేబుల్ మీదే ప్రాణం పోయింది. అసలు ఆపరేషన్ పూర్తిగా మొదలు పెట్టనేలేదు. గుండెలకు హుషారెక్కించ టానికి సూటిగా గుండెల్లోకే మందెక్కించాము. లాభంలేక పోయింది. అసలు సర్జన్ మాదప్ప గారికే నమ్మకం లేదు.
స్నానంచేసి ఇవతలకి రాగానే తలుపు చప్పుడైంది.
తలుపు తీశారు. గురురామ్ గారి కొడుకులు నుంచున్నారు.
లోపలికి ఆహ్వానించి కూర్చుండ జేశాడు.
"మీరు చాలా శ్రమపడ్డారు ....." అంటూ ప్రారంభించారు. కుమార్ అడ్డు తగిలి "అసలు శ్రమ పడటానికి మీ తండ్రిగారు అవకాశం ఇవ్వలేదు. అంతా సిద్ధంచేసి చర్మం మాత్రం కోశారు డాక్టరు గారు ఒక యెముకను తొలగించే ప్రయత్నంలో వుండగానే గుండె ఆగిపోయింది. నోటికి నోరుపెట్టి ఊపిరి పోశాము ఎన్నో మందులు వాడాము - లాభం లేకపోయింది.
"ఏదో అదైనా చేశారు. మీ అందరికీ చాలా కృతజ్ఞులం,"
"నాకెందుకండీ-అంతా సర్జన్ గారే చేశారు. మంచి అనుభవజ్ఞులు. వారికే మీ కృతజ్ఞతలు తెల్పాలి."
"అక్కడినించే వస్తున్నాము." ఒకతను అన్నాడు.
తర్వాత మాటలే కరువయ్యాయి.
కుమార్ కు అంతా వింతగా వుంది. చటుక్కున వీరిద్దరిలో లాయర్ ను చూచినట్లు గుర్తోచ్చింది. ఖాన్ చెప్పాడు. ఈ కథ ఖాన్ కు ఎలా తెలుసు.
"ఎందుకొచ్చారు" అన్న భావన స్పష్టమైన చూపుల్తో వారిని చూచాడు.
"చిన్న పనుండి వచ్చాము".
"నాకు చేతనైన సాయం చేస్తాను."
"ఆ మాట అనండి.... చాలా సంతోషం" మాటలు నాన్నాడొకతను. రెండో అతను జేబులోంచి ఒక కాగితాన్ని దీసి దూరం నుంచి చూపుతూ అన్నాడు. "దీనిపై మా నాన్నగారి సంతకం కావాలి....మీరు దయతో శ్రమ అనుకోకుండా వస్తే....మీ మేలు ఎన్నటికీ మర్చిపోము. కుమార్ చటుక్కున అన్నాడు.
"మీ తండ్రి చనిపోయాడు కదా..."
అందుకే డాక్టరుగారూ...మీరు వచ్చి దీనిపై వ్రేలిముద్రవేసే సమయానికి వారు జీవించి స్పృహలో ఉన్నట్లు రాస్తే..."
కుమార్ ఉలిక్కిపడ్డాడు. వారివైపు వెర్రిగా చూచాడు.
వాళ్ళు ఒకరినొకరు చూచుకుంటూ తన దృష్టిని తప్పుకుంటున్నారు. వీరేమీ మంతనాలాడుతున్నారు? కుమార్ కు వెంటనే అర్ధమైంది కాదు.
"ఒకసారి ఆ కాగితం యివ్వండి" అంటూ చేయి చాపాడు. వాళ్ళు ఇచ్చారు.
ఆ వ్రతం చదివి భ్రుకుటీకరించాడు. ముఖం కారు మేఘావృతమైనట్లుంది.
"అంటే....ఈ విల్లు మీకు లాభకరంగాను మీ సవతి తల్లి - బిడ్డకు ఏమీ లేకుండా చేస్తుందన్నమాట.... ఇలా ఎందుకు చేయవలసి వచ్చింది?..."
"మా సవతి తల్లి మంచిదికాదు....ఆమె సంతానం విషయంలో మా కనుమానం... ఆ అమ్మాయి మాకు స్వంత చెల్లికాదు, అంటే మా తండ్రి ఆమె తండ్రికాడు.
ఏది నమ్మాలి? ఎంతవరకు నిజం... ఏమొ డబ్బు ఎన్నిదుష పనుల్నైనా చేయిస్తుంది. ఎన్ని అవినీతి మాటల్నైనా అనిపిస్తుంది - ఎంత పతనానికైనా నడిపిస్తుంది.
అదంతా తన కనవసరం. ఎవరే విధంగా పోయినా తన ధర్మం తనకు తెలుసు భూమి తలక్రిందులైనా తను ఈ పని చేయలేడు.
"నేను అలా వ్రాసివ్వలేను" తన నిశ్చయాన్ని స్పష్టంగా తెల్పాడు.
"మీ మేలును ఎన్నటికీ మర్చిపోము...చూస్తూ చూస్తూ లక్షల ఆస్టి పరాయి వాళ్ళకు పోతుంటే ఎలా మడిగట్టుకుని కూచోగలం డాక్టరు బాబూ! మా తండ్రిగార్కి మా సవతి తల్లి వలన కల్గిన అశాంతి వల్లనే ప్రాణం పోయింది ఆయనకు స్మృతి వుంటే ఇంతగా మిమ్మల్ని ప్రాధేయపడవలసి వచ్చేదికాదు" వాళ్ళు అర్ధించారు. ఇలా లాభం లేదు, కయ్యానికి దిగితే కత్తి దీస్తారనుకున్నాడు.
"ఒక్కటి చెబుతా వినండి. మీ తండ్రిగార్ని తెచ్చే సరికి నేను డ్యూటీలో లేను. ఇంకొక డాక్టరుగారి తమ్ముడి పెళ్ళి కెళ్ళాను. మీ నాన్నను ప్రప్రధమంగా ఆపరేషన్ బల్లమీద చూచాను. డాక్టరు ఖాన్ గారు రాసిన రిపోర్ట్ ను బట్టి మీ తండ్రి చాల అపాయస్థితిలో వచ్చినట్లు, స్మారకం లేనట్లు, నాడి చాల బలహీనంగా ఉన్నట్లు, ఒళ్ళంతా చల్లబడినట్లు, అసలు మనిషిలో సంచలనమే లేనట్లు రాసి ఉంది. ఈ రోజు నా డ్యూటీ కాదు. నేను మీరు చెప్పినట్టు రాస్తే ఇంతమందికి నేను ఏమి సంజాయిషీ ఇవ్వగలను? సహ డాక్టర్లకు నాపై నమ్మకం ఏముంటుంది. అసలు పెద్ద డాక్టరుగారు నా కోసం కబురుపంపితే వచ్చాను. వారికీ విషయం తెలిస్తే నా పరువు పోతుంది."
"పోనీ ఇంతకు క్రితమే సంతకం జేసి నట్లు..."
"అంటే మీ అభిప్రాయం...? మీ తండ్రి గారి సంతకం మీరు జేస్తారా? "వారు మౌనం దాల్చారు కాసేపాగి మళ్ళీ అన్నారు వారిలో ఒకరు "పోనీ వ్రేలిముద్ర వేసినప్పుడు - తేదీ మొన్నటిది వేస్తే" కుమార్ తల అడ్డంగా ఆడించాడు. అది ఎంత తెలివి తక్కువ సలహానో బోధపర్చుకుని వాళ్ళలో వాళ్ళే సిగ్గుపడ్డారు. ఇలాంటి ఆస్థి విషయాలు కోర్టు కెక్కుతాయి అందరూ చెప్పటం- అతను ఆ రోజు 7 గం|| 15 ని|| వరకు మామూలుగా తిరుగుతున్నట్లు- అప్పుడే భోజనం కూడాజేసి చిన్న కూతురు పెళ్ళి విషయం మాట్లాడటానికి భార్యను పిల్చినట్టు తెలిసింది. మరి రెండు రోజులక్రితం వ్రేలిముద్ర వేయ వలసిన ఆగత్యం ఏముంది. లక్షణంగా సంతకం చేయొచ్చు. డాక్టర్ అవసరం లేదు ఒక లాయరు. కొందరు సాక్షులుంటే చాలు.
వాళ్ళు డబ్బు ఆశ చూపారు. ఎలాగైనా సరే సాయం చేయమన్నారు. కానీ కుమార్ లొంగలేదు" సరే ... చేస్తానే అనుకోండి కోర్టులో బోనెక్కితే అంతా బైటికి లాగగలడు ప్రతివాది. ఇది నా వృత్తికే అపాయం..."
వాళ్ళు వెళ్ళిపోయారు. మంజుకీ విషయాలు చెప్పరాదు. ఎంతో నిర్మలంగా నిశ్చింతగా నిద్రిస్తోంది. శీతకిరణ లేబ్రాయపు కాంతి ఆమెను పుత్తడి బొమ్మగా జేసింది. ఆమె స్వల్పంగా కదిలింది.
తపోఃభంగమైనట్లు భావించి నిద్రకుపక్రమించాడు. కానీ ఆ రాత్రి చాలాసేపటి వరకు నిద్రాదేవి అతనిపై కన్నెర్ర జేసింది.
మరుసటిరోజు తెల్లవారిలేచి ఖాన్ క్వార్టర్స్ కు వెళ్ళాడు. క్రితంరాత్రి తన దగ్గర జరిగిన సంగతి చెప్పి ఖాన్ వాళ్ళెలా పీడించింది చెప్పమన్నాడు. ఖాన్ పగలబడి నవ్వాడు.
"నాదగ్గరకు వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయారు"
"ఏం....నీవు లొంగవని తెలిసి కొన్నారా?"
