Previous Page Next Page 
మనిషి పేజి 7


                                    6
    ఊరు ఊరంతా కదిలింది. బందిల దొడ్లో కి స్వామి వారిని ఈడ్చుకు వెళ్ళారు . దొడ్డంతా జనంతో నిండిపోయింది. స్వామీజీ మీద ఆ అయిదుగురు కన్యలు మినహాయించి, జాలి తలిచిన మనిషి లేడు. రంగదాసుని వెంకటేశ్వర స్వామికి మొక్కుకుని, పటకారు స్వామి నోట్లోకి పోనిచ్చి ఒకటొకటే పళ్లన్నీ పీకి ఆవల పారేశాడు. స్వామి గిలగిల తన్నుకున్నాడు. అయిదుగురు కన్యలు అడ్డం రావటానికి యత్నించగా, పెద్దలు వాళ్ళని పట్టుకొని అపుచేశారు.
    అయిపొయింది. బందీల దొడ్డి రక్త మలిన మైంది. జుగుప్సాకరమైన ఆ దృశ్యాన్ని చూడలేక క్రమంగా జనమంతా తప్పుకుంటున్నారు. ఇక తప్పుకోలేని పెద్దలు మిగిలిపోయారు. ముకుందరావు కొడుకుని రెక్క పుచ్చుకుని ఇంటికి లాక్కుపోయి, మస్తాను తో చెప్పి తాయెత్తు కట్టించాడు. అనంతమ్మ గారు సారధికి దిష్టి తీసి, ఎర్ర నీళ్ళు తిప్పి వీధి లో పోసింది.
    బోసి నోటి స్వామి వారిని ఏం చేయాలో పెద్దలకి ఓ పట్టాన తోచలేదు. వాతం కమ్మకుండా బ్రాందీ తాగించారు. మునసబు గారు పోలీసు ఇన్ స్పెక్టరు తో మాట్లాడి వచ్చాడు. రాత్రి వాతం కమ్మింది స్వామికి. అయన ఆ బందీల దొడ్లోనే  పడున్నాడు. అయిదుగురు కన్యల్లో నలుగుర్ని వాళ్ళ తల్లితండ్రులు ఇంటికి ఈడ్చుకు పోయారు.
    ఇహ స్వామికి సపర్యలు చేయటానికి మిగిలింది ఒక మోహిని. సారధి ఇంట్లో పడుకున్నాడు కానీ పీడ కలలు వస్తున్నాయి. ఊళ్ళో ఎవరూ బందీల దొడ్డి చాయలకు పోవటానికి సాహసించటం లేదు.
    స్వామి వారికీ తిండి ఎవరూ పంపలేదు. మోహిని కూడా నిద్రాహరాల్ని విసర్జించి స్వామిని కనిపెట్టుకుని కూర్చుంది.
    సారధి కి స్వామి మీద మళ్ళీ కోపం హెచ్చింది. అయన తల బద్దలు కొట్టి అక్కను రక్షించుకు వస్తా అన్నాడు. రాత్రి అంతా పడుకున్నాక , ఇంట్లో ఎవరికీ తెలియకుండా బయలుదేరి, వీధిలో ఎవరూ చూడకుండా నడిచి బందీల దొడ్డి చేరుకున్నాడు.
    మనోమోహిని "తమ్ముడూ" అంటూ సారధిని కౌగలించుకొని ఏడ్చింది. స్వామి వారిని వదిలి రమ్మని సారధి బ్రతిమిలాడాడు. కాళ్ళు పట్టుకున్నాడు. మోహిని ఒప్పుకోలేదు.
    "ఈ రాత్రి స్వామిని చంపుతాను" అని బెదిరించాడు.
    "ఆ పని చేస్రే నన్ను మళ్లీ ప్రాణాలతో చూడవు, తమ్ముడూ. నీ అక్కయ్య ను నువ్వు చేతులారా చంపు కొదలు చుకుంటే ఆ పని చెయ్యి. ఇంత చేసిన వాడిని , ఎంతకైనా సమర్దుడివి" అంది కోపంగా మోహిని.
    "ఆ మాటలు పార్ధసారధి కి సంకెళ్ళు వేశాయి. "అక్కా, ప్రమాణం చేస్తున్నాను. నీకు కష్టం కలిగించే పని ఎన్నడూ చెయ్యను. నా మాట నమ్ము" అంటూ వాగ్దానం చేశాడు.
    అలా వారం రోజులు గడిచింది. రోజూ సారధి బందీల దొడ్డికి వెళ్లి మోహినిని చూసి వస్తుండే వాడు. చౌదరి గారు జావ కాయించి స్వామికి పంపుతున్నారు. మోహిని కి ఎవరూ ఏమీ పంపటం లేదు. ఇంచుమించు ఈ వారం రోజులూ మోహిని ఉపవాసాలే చేసింది. సారధి తరచుగా సుబ్బి పెట్టి హోటల్లో తినుబండారాలు కొని, తీసుకెళ్ళి మోహిని కిస్తూండేవాడు.
    ఈ సంఘటన జరిగిన పదో రోజున మళ్ళీ ఊరి పెద్దలంతా సమావేశమై స్వామీజీ భవిష్యత్తు ను గురించి చర్చలు జరిపారు. ఆ సాయంత్రం చౌదరయ్య ఓ పాతిక రూపాయలు, కొన్ని ఫల పుష్పాలు తీసుకు వెళ్లి స్వామి వారి కిచ్చి, "సాయంత్రం లోగా ఈ ఊరు వదిలి మీరు వెళ్లిపోవాలి" అన్నాడు.
    ఎందుకని అడిగాడు స్వామి.
    "ఊరి వారంతా తీర్మానించారు కనక. మీ అంతట మీరు వెళ్ళకపోతే , రెక్కలు విరిచి కట్టి, బైటకు గెంట వలిసి వస్తుంది."
    స్వామీజీ పళ్ళు ఊడటం వల్ల చౌదరయ్యకు  అంతులేని ధైర్యం వచ్చింది.
    స్వామీజీ చివరికి "సరే, రేపు ఉదయం లోగా వెళ్ళిపోతాము" అన్నాడు.
    ఈ సంగతి పార్ధసారధి కి తెలిసింది. నా దగ్గిరికి పరిగెత్తుకు వచ్చి చెప్పాడు.
    "స్వామీజీ వెళ్ళిపోతే నీ కెందుకురా  బాధ?' అన్నాను.
    "కాదురా! ఆ దయ్యం మన అక్కయ్య ను కూడా తనతో తీసుకు పోతాడుట."
    "తీసుకెళ్ల నీ!"
    "సరేలే. వాడు నరమాంసం భక్షించే దుర్మార్గుడు. ఎప్పుడో అక్కయ్య ను కోసుకు తింటాడు.
    ఏం చేయ్యాలో పార్ధసారధి కి తోచలేదు. ఆ రాత్రే స్వామికీ మనో మోహిని ని వెంట బెట్టుకుని మా ఊరు వదిలి పెట్టి వెళ్ళిపోయాడు . కాని, ఎంతో దూరం పోలేదు. మా ఊరి పక్క నుంచే బుడమేరు పోతుంది. ఊరికి మూడు మైళ్ళ ఉత్తరాన చిలకల సరస్సు అని ఓ జలాశయం ఉంది. అది నాలుగు మైళ్ళ వైశాల్యం గలది. బుడమేరు వర్షాకాలం లో పొంగినప్పుడు చిలకల సరస్సు లోకి నీరు వస్తుంటుంది.
    చిలకల సరస్సు చుట్టూ దట్టమైన అరణ్యం. మా ఊరి బయట ఇదివరకు స్మశానాలున్న చోట స్కూలు భవనాలు కట్టాలని, స్మశానాలని చిలకల సరస్సు ప్రాంతానికి మార్చారు. ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు. చిలకల సరస్సు గట్టు మీద విపరీతమైన పాముల పుట్టలున్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేని త్రాచులు అక్కడ ఉండేవి. నల్ల త్రాచులు, తెల్ల త్రాచులు, గోధుమ త్రాచులు , జెర్రి గొడ్లు, కట్ల పురుగులు , పసిరిగ పాములు, సరస్సు లో నీటి త్రాచులు -- వందలాది రకాలుండేవి.
    పాముల నాగయ్య ని ఒక పాముల వాడు ఆ సరస్సు గట్టునే గుడిసె వేసుకుని ఉంటున్నాడు. అతగాడికి ఒకరే కూతురుంటే, అల్లుణ్ణి ఇల్లరికం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాడు. దాంతో సరస్సు గట్టున రెండు గుడిసెలు వెలిశాయి.
    పాముల నాగయ్య జీవిత వ్యాసంగం పాముల్ని పట్టడం, అతని యాభై అయిదు సంవత్సరాల జీవితంలో కొన్ని వేల నాగుల్ని పట్టుకున్నాడు. అతనికి మంత్రం రాదు, కనికట్టు రాదు. కేవలం హస్త కౌశలం. ఎంతటి పొగరు మోతు పామునైనా సరే, చేత్తో పడగను పుచ్చుకొని పుట్ట లోంచి బైటకు లాగి విషం పిండగలడు.
    ఆరడుగుల మనిషి. చొక్కా తొడుక్కొనే వాడు కాదు. తలగుడ్డ చుట్టుకునే వాడు. శరీరం నల్లగా నిగనిగ లాడుతుండేది. పాముల్ని పట్టి, విషాన్ని పిండి మందుల కంపెనీ లకు అమ్ముతుండే వాడు. పెద్ద పెద్ద త్రాచుల చర్మాన్ని తీసి ఎండబెట్టి, సదును చేసి, చెప్పుల కంపెనీ లకు అమ్ముతుండే వాడు. ఒక్కొక్క పాము మీద అయిదారు రూపాయలు సంపాదించేవాడు. నెలకు కనీసం పాతిక ముప్పై నాగుల్ని పట్టేవాడు. అతను కావాలనుకుంటే రోజుకు పాతిక పాముల్ని పట్టగలడు. కానీ రోజుకీ ఒక్కటి కంటే ఎక్కువ పట్టడు. మరీ పెద్ద పాము ఒకసారి దొరికింది. తోమ్మిదడుగుల పొడుగున్న కోడె త్రాచు. దాన్ని తీసుకు వచ్చి మా ఊళ్ళో అందరికీ చూపించాడు. భయంకరమైన సౌందర్య మది.
    స్వామి వారు మోహినితో పోయి చిలకల సరస్సు పక్కనే నాగయ్య గుడిసెల చెంతనే మరో గుడిసె వేసుకున్నాడు. అయిదారు రోజుల్లోనే పాముల నాగయ్య కూ స్వామీజీ కి గాడ స్నేహం ఏర్పడింది.
    ఇద్దరూ గంజాయి పీల్చేవారు. ఇద్దరూ మద్యం త్రాగేవారు. మోహిని ఆ మనుష్యులతో ఎలా ఉండగల్గు తుందో ఊళ్ళో ఎవరికీ అంతు చిక్కటం లేదు.
    ఊళ్ళో ఒక పుకారు బయలుదేరింది. స్వామీజీ మా ఊరి మీద పగ తీర్చుకుంటానికని పాముల నాగయ్య ను దగ్గిరికి చేర్చుకున్నాడని, అందరూ భయపడుతున్నారు. తనకి పళ్ళు లేవు కనక, తనకి మంత్రాలు పనిచేయవు గనక, పాముల నాగయ్యకు మంత్రోపదేశం చేసి, ఊరి మీద చేటపడి చేయించి, సర్వనాశనం చేయటానికి సన్నాహాలు చేస్తున్నాడని అవధాని గారు కనిపించిన ప్రతి మనిషికీ చెప్పి హడలు గొడుతున్నాడు.
    పార్ధ సారధి తరచుగా ఒక్కడే స్మశానాలు దాటి, చిట్టడవి దాటి మనో మోహిని ని చూడటానికి వెళుతుండేవాడు. స్వామి వారి దగ్గిర డబ్బు లేదు. మోహిని దగ్గిరా డబ్బు లేదు. ప్రపంచానికి ఎంత దూరంగా ఉన్నా, డబ్బు లేకుండా మనిషి బ్రతక లేడేమో! సారధి నాతొ అన్నాడు, "ఎలాగైనా డబ్బు సంపాదించి అక్కయ్య కి ఇవ్వాలిరా!" అని.
    దొంగిలించకుండా ఆ వయస్సు లో డబ్బు సంపాదించటానికి మా వయసు పిల్లలకి మూడే మార్గాలున్నాయి.
    ఒకటి: పరిగ ఏరటం, అంటే పంట చేలల్లో పైరు కోసి, పనలు వేసి, ఆ తరవాత పనలన్నీ కుప్ప వేశాక , తడితడిగా ఉండే పొలంలో అక్కడక్కడ కింద పడి వుండే కంకేల్ని ఏరటం. ఒక పూటల్లా అలా ఎరితే ఏ కుర్రాడైనా అయిదరాణాలు సంపాయించ వచ్చు. కాని సారధి పూటకి పది పన్నెండణాలు సంపాయించే వాడు. సాధారణంగా అలాగా జనం , పాలేరు కుర్రాళ్ళు పరికే ఏరుకుంటారు. అది బీదవాళ్ళు చేయవలసిన పని కనక, కాస్త ఉన్నవాళ్లు పిల్లల్ని పరికి ఏరుకో నిచ్చేవారు కాదు.
    సారధి బడికని బయలుదేరి పొలాల మీద పడేవాడు. ఒకటి రెండు రోజులూ నేనూ అతనితో వెళ్లాను. ఆ తరవాత మా నాన్నకి తెలిసి చచ్చేట్లు రూళ్ళ కర్ర పెట్టి కొట్టాడు. ఆయనకి కోపం వస్తే ప్రాణం పోతుందో ఉంటుందో , తెలియకుండా కొట్టేవాడు. సారధి ఉదయం నించి సాయంత్రం దాకా పరికి ఏరి, ఓ రూపాయి సంపాయించే వాడు.
    ముకుందరావు, భార్యా ఇద్దరూ కూడా సారధి విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండేవారు. కుమారుడి యోగ క్షేమాలను గురించి వాళ్ళు తగినంత శ్రద్ధ తీసుకునేవారు కాదు. ఎక్కడ తిరిగినా, ఏం చేసినా, అతనికి తల్లి తండ్రుల భయం మాత్రం ఉండేది కాదు. అంతమాత్రాన ఆ దంపతులు తమ బిడ్డని ద్వేషిస్తున్నారని అర్ధం కాదు. ఏ తల్లి తండ్రులైనా తమ బిడ్డల్ని ఎంత ప్రేమించ గలరో, అంత అనురాగం వారికి పార్ధ సారధి మీద ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS