Previous Page Next Page 
కరుణా మయి అరుణ పేజి 7


                                      10


    బ్రతికి చెడిన వారు శంకరనారాయణ. ఆ చెడడం తాను చేసిన తప్పిదాల వల్ల కాదు, నడిచిన చెడు నడతల వల్ల కాదు, విధి లిఖించిన ఒక్క గీటు వక్రించేసరికి అంతా తారుమార యింది.
    అందుకనే -- శంకర నారాయణ గారంటే ఆ ఊరిలో ఎందరి కో ఎంతో సానుభూతి ఉంది. ఆ మధ్యన 'శంకర నారాయణ రిలీఫ్ ఫండ్' పేరిట కొన్ని వేలు వసూలు చేసి పెడతామన్నారు, మిత్రులందరూ కలిసి. శంకర నారాయణ గారే చేతులు జోడించి వద్దన్నారు. తనకు ప్రాప్తించిన ఈ దుస్తితిని తానెదుర్కో గలనన్నారు. కల మహారాజుగా వెలిగిన రోజుల్లో కూడా అయన ఒకరిని పల్లెత్తు మాట అని ఎరుగరు, ఒకరి మనస్సు నొప్పించి ఎరగరు.
    అన్నీ తెలిసినవారూ, ఆదరించదలుచుకున్నవారూ అయిన మిత్రులు , అయన వద్దన్నంత మాత్రాన ఊరుకుంటారా? పైగా శంకర నారాయణ గారు ట్యూషన్లు చెప్పి, సంపాదించు కునేదెంత? అందుకని, వారి ఇంటిలో ఎవరిదో పుట్టిన రోజనీ, అరుణా, సీతా , సరస్వతు ళ పుట్టిన రోజులనీ ఏదో ఒక సాకుతో అందరూ వచ్చి, అవసరమైన వాటిన్నన్నింటి నీ కానుకలుగా ఇచ్చి వెళుతుండేవారు. అసలు సంగతి శంకర నారాయణ గారికి, తెలియదు కనకనా? అందరికీ అన్ని వేళలా మనసులోనే కృతజ్ఞత తెలుపుకుంటూ ఉండేవారాయన.
    దాసరి రంగయ్య చౌదరి బి.ఎ బి.ఎల్ ఒకప్పుడు శంకర నారాయణ గారి జూనియర్. ఇప్పుడు పేరూ, పేరుకు తగ్గ ప్రాక్టీసూ ఉన్నాయి అతనికి. శంకర నారాయణ గారికి సహాయ పడడం లో అతడైతే మరీను! ఏదో కేసు విషయం లో మాట్లాడడానికీ  వచ్చేవాడు, లా పాయింట్లు తనకేమీ పాలుపోవడం లేదని, గురువు గారి సలహా అడిగేవారు. మరో వారం పది రోజుల్లో మళ్ళీ వచ్చి, అయిదారు వందలు ఒక్కసారిగా ఇచ్చుకునే వాడు.
    "ఎందుకండీ, చౌదరి గారూ, ఇదంతా?"
    శంకర నారాయణ గారు , తనను "చౌదరి గారూ" అని పిలవడ మేమిటి? రంగయ్య విపరీతంగా బాధపడి పోయేవాడు. "సార్ సార్ ! నన్ను ఖూనీ చెయ్యాలనుకుంటే ఏ కత్తితో నో నన్ను పోడిచేయ్యండి! కత్తి కూడా నేనే తెచ్చి ఇస్తాను. లేకపోతె , నన్ను మీరు "చౌదరి గారూ' అనడమేమిటి సార్?"
    "రంగయ్యా, నీవు నా అంతటి వాదివయ్యావు! మహదానందం గా ఉంది. సాటి వారికి తగ్గ మర్యాద ఇవ్వడం లో తప్పు లేదు, బాబూ!" అనేవారు శంకరనారాయణ.
    "నేనా? మీకు సాటా? చాల్లెండి, సార్ , ఎవరైనా వింటే నవ్విపోతారు! మొన్న మీ దగ్గిర ఆ సలహా తీసుకోకపోతే అన్ని హంగులూ ఉన్న ఆ కేసు నిమిషం లో ప్రతిపక్షుల పరంగా మారిపోయేది! మీరు మీరే! మాలాంటి వాళ్ళం మేమే, సార్! నేను స్వార్ధ రహితంగా మీకేమీ ఇచ్చుకోవడం లేదు. అయిదు వేలు పుచ్చుకున్నాను. అందులో పదవవంతు మీకిస్తున్నాను. కేసు గెలిచింది మీరు! డబ్బు దోచుకుంది నేను! నేను నిజంగా దొంగను సార్! మీరను కుంటూన్నంత మంచి వాడ్నేమీ కాను! సెలవు, సార్ . వస్తా' అని, నమస్కరించి, ఇక అక్కడ ఆగలేక వెళ్ళిపోయేవాడు రంగయ్య చౌదరి.
    "దీర్ఘాయుష్మాన్ భవ!" అనేవారు శంకర నారాయణ.
    కులమూ, మతమూ పాడూను! ఎవరి కులం వారిది! ఎవరి మాత్రం వారిది! ఎవరి ఆచార వ్యవహారాలూ వారివి! మంచితనం ఒక్కటే మన మందరమూ అలవరచు కోవలసిన కొత్త మతం! మన బుద్దులు ఆ పద్దతుల్లో ఆలోచించ గలిగిన వాడు, అసలు సమస్యలే ఉండవు మనకు! కానీ, సమాజంలో కుత్సితుల సంఖ్యే ఎక్కువయింది! వారిదే పై చేయిగా ఉంది! అదే మన ఇప్పటి దౌర్భాగ్యం!

                                       11
    ఆ రంగయ్య చౌదరి గారి ఇంటికే వెళ్ళారు శంకర నారాయణ గారు రిక్షా ఇంటి ముందు ఆగిందో లేదో.... "ఏం సార్, ఇలా వచ్చారు?!" అంటూ, హాల్లో కూర్చున్న రంగయ్య వసారా లోకీ, వసారాలో నుంచి కాంపౌండ్ లోకి అక్కణ్ణించి ఇంటి ముంగిటి కి పరుగు లేత్తుకుంటూ వచ్చాడు. శంకరనారాయణ గారికి చేయూత ఇచ్చి దించాడు.
    "ఇక్కడే ఉండు, నాయనా. ఓ అయిదు నిమిషాలాగు వెళ్ళిపోదాం." అన్నారు శంకరనారాయణ రిక్షా వాడితో.
    "ఇక్కడే ఉండు, నాయనా. ఓ అయిదు నిమిషాలాగు, వెళ్ళిపోదాం " అన్నారు శంకరనారాయణ రిక్షా వాడితో.
    "ఎందుకు , సార్? మన కారులో నేను దిగబెడతాలెండి! అయినా మీరింత శ్రమ తీసుకుని రావడమెందుకు, సార్? మన అరుణతో కబురు చేసి ఉంటె నేనే వచ్చే వాణ్ణి గా?' పాపం, రంగయ్య ఆదుర్దా రంగయ్య ది! ఆదరాబాదరాగా జేబులో నుంచి ఒక రూపాయ కాగితాన్ని తీసి రిక్షా వాడికి ఇచ్చాడు. అరుణ పేరు వినగానే అల్లాలాడిపోయిన శంకర నారాయణ గారిని "రండి , సార్!" అంటూ లోపలికి తీసుకు వెళ్ళాడు.
    అర్ధం చేసుకోవాలన్న ఆదుర్దా మనలో ఉండాలే కానీ, ఎదట ఉన్న మనిషి మనసును గ్రహించడం ఎంత సేపు? ఒక్క క్షణం శంకర నారాయణ గారిని గమనించి చూచిన రంగయ్య కు, అయన కేదో కష్టమే సంభావించినదని అర్ధమై పోయింది.
    "ఏం సార్....అమ్మగారూ, పిల్లలూ అంతా కులాసా యేనా?"
    "అరుణ లేదు, రంగయ్యా!" అన్నారు శంకరనారాయణ , అపరిమితంగా బాధపడుతూ.
    "సార్!"
    "నిన్న దుర్గ ఏదో కోప్పడిందని , రాత్రికి రాత్రి ఎక్కడికో వెళ్ళిపోయింది. నలుమూలలూ గాలించి, అరుణ ను కనుక్కునే శక్తి నాలో లేదు."
    "నాలో ఉంది ,సార్! మీరేమీ బాధ పడకండి. చిన్నపిల్ల, అలిగి మాత్రం ఎంత దూరం వెళ్ళగలుగుతుంది? పైగా మిమ్మల్ని చూడందే అరుణ అసలు ఉండలేదు. మీకోసమయినా అమ్మాయి మళ్ళీ వస్తుంది. మీరేమీ మనసు పాడు చేసుకోవద్దండీ సార్!"
    'అరుణ నాకోసమయినా తిరిగి వస్తుందన్న ఆశ నాకూ లేకపోలేదు, రంగయ్యా! కానీ... అరుణ అందరి లాటిది కాదు! భూదేవి కున్నంత సహన శక్తి ఉంది అరుణ కు. ఒక్కొక్కప్పుడు భూదేవి కూడా కంపించి పోతుందిగా! అలానే.......నిన్న జరిగిన సంఘటనతో ణా అరుణ మనసు విరిగి పోయిందనే నా నమ్మకం! అమ్మాయి మళ్ళీ నా కళ్ళ కగుపడదేమోననే నా భయం!" అని అంటూనే కంట తడి పెట్టుకున్నారు శంకర నారాయణ.
    "సార్! సార్! మీకిదేం పిచ్చి? పదండి! మిమ్మల్ని ఇంటి వద్ద దింపి, నేను చేసే ప్రయత్నాలు నేను చేసుకుంటాను."
    "చాలా శ్రమ ఇస్తున్నాను. బాబూ , నీకు!"
    "నేను పడగలిగినంత శ్రమ మీరు నాకు కలగచెయ్యడం లేదనే ణా బాధ. పదండి!" అంటుండగానే ఓ అయిదేళ్ళ పిల్ల వెండి గ్లాసు లో ఏదో తెచ్చింది.
    "ఏమిటి, బుజ్జీ?"
    "తాతయ్య గాలికి, లసం!"
    "వెరీ గుడ్!" అంటూ ఆ గ్లాసు తీసుకుని, "మరి, తాతయ్య గారికి నమస్తే చెప్పవూ?' అన్నాడు రంగయ్య.
    "నమస్తే!" అంది బుజ్జి, ముద్దుగా చేతులు జోడించి.
    "నాతల్లే! నా బంగారు తల్లే! నీవు కూడా మా అరుణ అంతటి బుద్ది మంతురాలివి కా అమ్మా! అంతకు మించిన ఆశీర్వాదం , ఏ ఆడబిడ్డ కూ అనవసరం" అన్నారు శంకరనారాయణ ,భావోద్వేగంతో.
    "తీసుకోండి, సార్!"
    పుచ్చుకుంటూ , "బుజ్జి తరవాత నీకు ఇంకొక డున్నాడు కదూ, రంగయ్యా?' అన్నారు శంకరనారాయణ.
    "అడుగొండి, సార్! రారా, బాబూ రా! వీరెవరో తెలుసా? తాతయ్య గారు  . నమస్తే చెప్పు."
    ఆ మూడేళ్ళ కుర్రాడూ ముద్దుముద్దుగా చేతులు జోడించాడు.
    "దీర్ఘాయుష్మాన్ భవ!"
    "వీడికి మీ పేరే పెట్టుకున్నాం , సార్! వీడి తరవాత ఇంకొకడు ఉన్నాడు. చంటి వాడంటారు కానీ, అరుణ కుమార్ అన్న పేరు వాడికి స్థిరం చేసేశాం. అంతే సార్! ఇక అక్కడితో అపెయ్య దలుచు కున్నాం."
    "మంచిది, నాయనా! వెళదామా?"
    "పదండి, సార్." ఇద్దరూ బయలుదేరారు . పిల్లలిద్దరూ మళ్ళీ చేతులు జోడించారు.
    పెమ్పకమంటే అది! మంచితన మంటే అది! నిదర్శనం రంగయ్య చౌదరి, అంతే! అంతకంటే ఎక్కువగా ఏమీ చెప్పక్కర్లేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS