5
'ఇవ్వాళ నువ్వు మా ఇంట్లో వుండి తీరాలి!' అన్నది కుముదిని, సుమిత్ర చెయ్యి పట్టుకుని కారులో కి నెట్టి.
మధ్యాహ్నపు ఎండ ఎర్రగా వుంది.
పరీక్షలు పూర్తీ చేసిసిన అమ్మాయిలు తాపీగా మాట్లాడుకుంటూ మెల్లిగా వెళ్ళిపోతున్నారు.
'తప్పకుండా వుంటాను" అన్నది సుమిత్ర నవ్వుతూ.
'పరీక్షలన్నీ బాగా వ్రాసినట్లేనా?' అన్నది కుముదిని స్టీరింగ్ తీసుకుని, ద్రయివర్ని వెనక్కి పంపించి.
'నాకింకా బ్రతకాలని వుంది డియర్! అందుకే పరీక్షలు బాగా వ్రాశాను. దయ వుంచి తిన్నగా ఇంటికి చేర్చు--'
'బావుంది , నీకేం భయం అక్కర్లేదు -- నేను చాలా రోజుల నుంచీ డ్రయివింగ్ నేర్చుకుంటున్నాను....అయితే ఫస్ట్ క్లాస్ తప్పదా?' అన్నది కుముదిని.
'నేనేం ప్రొఫెషనల్ కోర్సెస్ లో చేరబోవడం లేదు గానీ, ఇందులో క్లాసు వస్తే బి.ఏ. లో స్కాలర్ షిప్ సంపాదించుకో వచ్చునని ఆశ!' అన్నది సుమిత్ర కిటికీ లో నుంచీ బయటికి చూస్తూ....
'నాకూ అలాంటి కోర్సులు చదవాలనే ఉత్సాహం లేదు సుమిత్రా. జాలీగా బి.ఏ. చదివేసి యూనివర్శిటీ కి పోదామని ఉంది.'
'ఈ లోపున మీ బావగారు స్టేట్స్ నుంచి వస్తే పుల్ స్టాప్--'
';లేదు సుమిత్రా! నేను చదువు పూర్తీ చేసుకుని కానీ పెళ్లి చేసుకోను. అంత వరకూ ఆగే ఓపిక ఆయనకి లేకపోతె ఇంకెవర్నైనా చేసుకుంటాడు. మేమేం తాంబూలాలు పుచ్చుకోలేదుగా! ' అన్నది కుముదిని! అలా అన్నప్పుడు ఆ అమ్మాయి ముఖంలో గంబీర్యం చూసింది సుమిత్ర.
'ఎవరి కుండే కష్ట సుఖాలు, సమస్యలు వాళ్ళ కుంటాయి!' అనుకుంది.
'వేసవి లో ఇక్కడ వుంటావా? ఎక్కడి కైనా పోతావా?' అన్నది మళ్ళీ --
'అక్క బెంగుళూర్లో వుంటోంది కదా! వేసవిలో రమ్మని వ్రాసింది. అమ్మా, నేనూ వెళ్ళాలను కుంటున్నాం. అన్నయ్యా, నాన్నగారూ చెల్లెళ్ళూ ఇక్కడే వుంటారు. నెక్ట్స్ యియర్ వాళ్ళు వెడతారు. అందరం ఒక్కసారే వెడితేవాళ్ళకి యిబ్బంది కదా!'
'అవును -- ' అన్నప్పుడు సుమిత్రకి విమల జ్ఞాపకం వచ్చింది. అమ్మ పోయాక విమల ఒకసారి ఉత్తరం వ్రాసింది కానీ అందులో తనని రమ్మని వ్రాయలేదు. అక్క పెళ్ళయ్యాక తను ఏ నాలుగైదు సార్లో వెళ్లి వుంటుంది అక్కడికి. తను రావడమే కానీ, ఎవర్ని పిలవదు విమల.
కొత్తగా పెళ్ళైన తమ్ముడినీ, మరదల్నీ కూడా పిలవనే లేదు.
'ఏమిటి ఆలోచిస్తున్నావు! నువ్వు విశాఖపట్నం వెడతావా! చిన్నన్నయ్య దగ్గరికి!' అనడిగింది కుముదిని.
'నేను వెడితే పిల్లలు కూడా బయలు దేరతారు నావెంట. వాళ్ళందర్నీ పంపడానికి వదిన వొప్పుకుంటుందో లేదో!' అన్నది సుమిత్ర.
"నీకంతా ఎటాచ్ మెంట్ ఎక్కువ! అందుకే అందరికీ నువ్వంటే మక్కువ!' అంటూ కారు ఆపేసింది కుముదిని. ఉద్యోగమే కాకుండా ఆస్తి పాస్తులు కూడా వుండడం వలన ధనవంతుల కుండే హంగు లన్నీ వున్నాయి వాళ్ళకి. అద్దె కుంటున్నా చాలా పెద్ద ఇల్లు-- గదులూ పెద్దవే. అన్ని వసతులూ వున్నాయి. కుముదిని నాన్నగారి గదిలో గోడలకి అమర్చిన పెయింటింగ్స్, బీరువాల్లో సర్దిన పుస్తకాలు, అయన సంస్కారాన్ని చాటుతున్నాయి. మొత్తం మీద ఇల్లంతా అధునాతనంగా , అందంగా వుంది. మనుష్యులు కూడా స్నేహంగా చనువుగా మాట్లాడారు. త్వరగా వేల్లిపోవాలన్న సుమిత్ర సాయంత్రం దాకా వుండి పోయింది.
'మీరు వుండండి -- సినీమాకి పోదాం. అని మారాం చేశారు కుముదిని చెల్లెళ్ళు.
'మా వదిన భయపడుతుంది-- చెప్పకుండా ఎలా రావడం!' అంది సుమిత్ర.
'ఆవిడతో చెప్పే వెడదాం. మళ్ళీ మిమ్మల్ని మా కారులో దిగ పెడతాం -- ' అని పట్టు పట్టారు వాళ్ళు.
సినీమాలంటే పెద్ద యిష్టమూ, అయిష్తమూ లేవు సుమిత్ర కి. చూస్తె తలనొప్పి రాదు. చూడకపోయినా బాధ లేదనే తత్వం.
'ఈ సాయంత్రం నీతో ఎన్నో చెప్పాలను కున్నాను. వీళ్ళు సినీమా అంటూ మొదలెట్టారు.' అన్నది కుముదిని జడ అల్లుకుంటూ.
'నీకూ సమస్య లున్నాయా!' అన్నది సుమిత్ర ఆశ్చర్యంగా.
'మనుష్యులందరికీ వుంటాయి-----'
'మరి సినిమా ఎందుకూ! చక్కగా మా వాకిలి ముందు వున్న అశోక చెట్లని చూస్తూ జాజి పందిరి క్రింద కుర్చీలు వేసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకుందాం-- అన్నది--
'మా చెల్లెళ్ళు డిప్ ప్లీజ్ అవుతారు-- వెడదాం-- ' అన్నది కుముదిని.
'మీ వదిన పర్మిషన్ తీసుకుని ఈ రాత్రి మా యింట్లో వుండి పోకూడదూ?'
'అలాగే కుముదినీ! తప్పకుండా!' అని అంగీకారం తెలిపింది సుమిత్ర.
డాబా మీద జాజి పందిరి క్రింద మంచాలు వేశారు వరసగా. వెన్నెలతో పోటీపడి మెరుస్తున్నాయి జాజిపూలు. ఎన్నో సంవత్సరాలుగా దాచుకున్న పరిమళమంతా ఆరోజే వెదజల్లు తున్నట్లున్నాయి.
సినీమా చూసి అలసిపోయిన చెల్లెళ్ళు నిద్ర పోయారు. తోడుగా పడుకున్న తల్లీ వంటావిడ నౌఖరూ ఎప్పుడో నిద్ర పోయారు --
'మా బావ అదో తరహ మనిషి -- అన్నది కుముదిని నాంది ప్రస్తావనగా --
"అంటే!'
'నా అభిప్రాయానికీ అతని భావాలకీ బోలెడు తేడా వుంది -- నాకన్న వయస్సులో ఏడేళ్ళు పెద్ద కాబోలు. నిరుడే వెళ్ళాడు స్టేట్స్ కి.
'అసలే పీలగా వుంటావు చదువు -- చదువు అంటూ హెల్త్ పాడు చేసుకోకు-- నువ్వు చదువుకుని ఏం చేయ్యాలి కనుక ! ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడ గలిగితే చాలు-- నువ్వు కాన్వెంటు లో చదివిన పిల్లవాయే! నేనోచ్చేసరికి ఎలా వుండాలో తెలుసా! ముద్దబంతి పువ్వులా వుండాలి!' అన్నాడు వెళ్ళేటప్పుడు.
అతనా మాటలు అంటూ వుంటే నాకెందుకో భయం వేసింది సుమిత్రా. అప్పుడే ఒక విధమైన పట్టుదల కూడా కలిగింది. ఏమైనా సరే నేను చదవదలచి నంత వరకూ పూర్తయితే గానీ పెళ్లి చేసుకో కూడదని-- చిన్నప్పట్నించి మేం పెళ్లి చేసుకోవాలని పెద్దల సంకల్పం. అందుకే అతను చదువుకోడానికి నాన్న చాలా హెల్ప్ చేశారు! రెండేళ్ళ లో అతను తిరిగి వస్తాడు. రాగానే పెళ్ళంటూ పట్టుబడతాడు. అప్పుడేమిటి చెయ్యడం?' అన్నది కుముదిని -- 'కొంతకాలం ఆగమని చెప్పు-'
'అతను వ్రాసే ఉత్తరాలేలా వుంటాయో తెలుసా ? ఎప్పుడూ అమ్మాయిలను గురించే . మగవాళ్ళతో సమానంగా త్రాగి క్లబ్బులో డాన్స్ చేసే అమ్మాయిల గురించి-- వాళ్ళ అవయవ సౌందర్యాన్ని గురించీ -- ఒక్కొక్కసారి అని చదువు తుంటే నాకు అసహ్యం వేస్తుంది -- నేను చాలా పొడిగా వ్రాస్తాను జవాబులు---'
'చదువు మీద ఎక్కువ ఆసక్తి లేదు కాబోలు !' అన్నదిసుమిత్ర.
.jpg)
'ఎందుకు లేదూ! అతను చాలా శ్రమ పడతాడు. బాగా చదువుతాడు. కానీ అతని అభిరుచులే నాకు గిట్టవు -- తీరా అతనోచ్చాక నేను కాదంటే నాన్న బాధపడతారు!'
"ఎప్పటి కైనా అతన్ని పెళ్లి చేసుకో వలసిందే కదా! ఎంతకాలం తప్పించు కుంటావ్ !'
'నాకు తప్పించుకోవాలని లేదు సుమిత్రా! చదువు పూర్టి చేసుకుని ఏదైనా వ్యాపకం పెట్టుకుని పూర్తిగా అతని ప్రపంచంలో కాకుండా కొంత స్వేచ్చగా బ్రతకాలని వుంది!'
'అమాయకంగా పెద్ద పెద్ద కళ్ళతో ఏమీ ఎరగనట్లు నవ్వుతూ వుండే కుముదిని ఎంత లాజికల్ గా మాట్లాడగలదు?' అని ఆశ్చర్య పడింది సుమిత్ర.
పైకి కనిపించే వ్యక్తీకీ, లోపల వుండే వ్యక్తీకీ చాలా తేడా వుంటుంది . ఈ ద్వంద్వాలు చాలా మందిలో వుంటాయి--
'నాకు సంవత్సరం క్రిందట ఇలా ఆలోచించే శక్తి లేదు సుమిత్రా! ఈ మధ్యనే కలిగింది కొంత నీ స్నేహం వలనా, కొంత నాన్నగారి పుస్తకాల ప్రభావం వలనా.' అని నవ్వింది కుముదిని.
'మీ నాన్నగారు చాలా విశాల హృదయం కలవారు కుముదినీ-- అయన నిన్ను తప్పకుండా అర్ధం చేసుకుంటారు -- నువ్వేమీ బాధపడకు -- బెంగుళూరు వెళ్లి వేసవి చల్లగా గడిపిరా!' అన్నది సుమిత్ర, రెప్పలు మూతపడుతూ ఉండగా!
'అవును-- నాకూ అదే విశ్వాసం!' అన్నది కుముదిని ఆకాశం వంక చూస్తూ.
'మీ నాన్నగారి నడిగి ఈ వేసవి లో చదువుకోడానికి మంచి పుస్తకాలు యిప్పించు-- మళ్ళీ జాగ్రత్తగా యిచ్చేస్తాను' అన్నది సుమిత్ర.
'ఓ! దానికేం తప్పకుండా!' కుముదిని నవ్వింది.
* * * *
సాయంత్రం వరకూ ఫెళ్ళున కాసిన ఎండ వున్నట్టుండి మాయమై పోయి ఆకాశం నల్లబడి పోయింది. ప్రపంచం చీకటై పోయింది. ఆఫీసులో దీపాలు వేసుకున్నారు గుమాస్తాలు గాలికి కిటికీ రెక్కలు టపటప మని తలలు బాదుకుంటున్నాయి.
'వర్షం వస్తే కిటికీల్లో నుంచి జల్లు పడుతుంది-- పైగా మనం కొంప చేరడం చాలా కష్టం-- ఫైళ్ళు మూసేయండి బ్రదర్స్ -- అని హుకుం జరీ చేసేసాడు హెడ్ గుమస్తా-- మాధవరావు ఉసూరుమని నిట్టూర్చి , వొళ్ళు విరుచుకుని లేచి నిలబడ్డాడు.
'మీ ఇల్లు మరీ దూరం కాబోలు-- వేగం వెళ్ళు మాధవరావు!' అన్నాడాయన మళ్ళీ-- ఇంకొక ఏడాది లో విశ్రాంతి పుచ్చుకోబోతున్న అయన సీటు తనకి కావాలని నాలుగేళ్ల నించీ కలలు కంటున్నాడు మాధవరావు-- అందుకే ఆయనంటే అభిమానం మాధవరావు కి.
పెళ్లి జరిగిన క్రొత్తలో ఆషాడ పట్టీ క్రింద అత్తగారు యిచ్చిన పాత హంబర్ సైకిల్ నధిరోహించి పది బారలు సాగిందో లేదో టపటప మంటూ పెద్ద పెద్ద చినుకులు నెత్తిన పడ్డాయి. మరో నిమిషం పోయాక కుండపోత గా వర్షం పడటం మొదలైంది. ఒక పెంకుటింటి ముందు సైకిల్ ఆపుకుని చూరు క్రింద నిలబడ్డాడు. ఇల్లు పాతది. చూరులో నుంచీ నీళ్ళు కారుతున్నాయి. ఇంట్లో విద్యుత్తు లేదు కాబోలు ; సన్నని వెలుగు కనపడుతోంది కిటికీ లో నుంచి - అప్పుడు సాయంత్రం అరుగంటలే అయినా రాత్రి పది గంటలకి మల్లె వుంది వాతావరణం.
మాధవరావు కి కాళ్ళు నెప్పి పుడుతున్నాయ్ గాని వర్షం ఉదృతం తగ్గనే లేదు. వుండీ వుండీ ఆకాశం చీలి పోతున్నట్లు మెరుపులు; మిన్ను విరిగి ముక్కలై నేల కొరిగి నట్లు ఉరుములు, తలుపు తట్టి లోపలికి వెడదా మనిపించింది , కానీ ధైర్యం చాలలేదు. గంటన్నర నిలబడిన తరువాత ఎవరో స్త్రీ తలుపు తెరుచుకుని బయటికి వచ్చింది.
'ఎవరది?' అన్నది కంగారుగా.
'నేను ఆఫీసు నుంచీ ఇంటికి బయల్దేరాను-- త్రోవలో వర్షం తగులుకుంది !' అందుకని చూరు క్రింద నిలబడ్డాను--' అన్నాడు మాధవరావు.
చీకట్లో అవిడ ముఖం కనపడలేదు మాధవరావు కి.
"వొరేయ్ బాచీ! బ్యాటరీ లైటు ఇలా తీసుకురా!' అని కేకేసింది ఆవిడ. వెంటనే పదహారేళ్ళ కుర్రాడోకడు లైటు తీసుకు వచ్చి మాధవరావు మీద పోకస్ చేశాడు. అతని వాలకాన్నీ, వానలో తడుస్తున్న సైకిల్ నీ పరీక్ష చేసిన తరువాత, 'వొచ్చి లోపల కూర్చోండి -- వర్షం తగ్గాక వెళ్ళచ్చు' అన్నది ఆవిడ. దీపం వెలుగులో ఆ ముఖం పరిచితమైనది లాగే కనిపించింది అతనికి. సందేహిస్తూ ఆగిపోయాడు.
"పరవాలేదు రండి" అని మళ్ళీ పిలిచింది.
