Previous Page Next Page 
ఋతుపవనాలు పేజి 7


    హేమంతం వెళ్ళిపోయింది. శిశిరం ప్రవేశించింది. శిశిరడుశ్మాసన నిరస్త చెలమైన పాంచాలిలా ప్రకృతి మాన సంరక్షణ కోసం వసంతుని మనసులో ధ్యానిస్తున్నట్టుంది. విశ్రాంతి కోసం తను నాశ్రయిచిన వారికి చల్లని నీడ  నివ్వలేని తమ దుస్థితికి కన్నీరు విడుస్తున్నట్లు 'టపటప' మనిటాకుల్ని రాలుస్తున్నాయి మహావృక్షాలు!
    'అమ్మయ్య! చలి పోయింది. హాయిగా బయట పడుకోవచ్చు!' అంటూ పడుకున్న వాళ్ళు, అర్ధరాత్రి వీచే దుష్ట వాయువుకు భయపడి పక్క లేత్తుకుని ఇళ్ళలోకి పరుగేడతారు! ఎక్కడ చూసినా -- వీధుల్లో దొడ్లలో, పొలాల్లో ఎండు టాకుల గుట్టలు, కోతలు వచ్చేసినాయి. పెద్ద వాళ్ళంతా పొలాని కెళితే , చంటి పాపలకు ఎడపిల్లల కాపలా. వాళ్ళు చీకటి పడిన తరవాత వస్తారు. అప్పుడు వంట సన్నాహం! ఉడకని అన్నం, గొడ్డు కారం. నిద్రబోతున్న పాపను ఎత్తుకుంటుంది తల్లి. ఒళ్లో ఉంచుకుని ఆన్నం తినిపించాలని. వాడు రెండు ముద్దలు తింటూ అలాగే పడి నిద్రబోతాడు. తల్లి కరిగిపోయే గుండెతో ముద్దు పెట్టుకుంటుంది. 'స్నానం చేయించడానికి, తలకు చమురు రాసి దువ్వడానికి తీరుబడి లేదు. నా తండ్రి పిచ్చివాడయ్యాడు!' - ఇట్లా ఆ తల్లి గుండె తల్లడిల్లి పోతుంది. ముద్ద తినలేదు. కోడి కూసింది మొదలు మళ్ళీ పరుగులాట! ఆ ఋతువు లో అదొక విచిత్రమైన శీతోష్ణస్థితి. మునుములో వంగి కోత మొదలు పెట్టె వరకూ, కొడవలి చంక లో ఇరికించుకుని వణుకుతూన్న వాడు, మరో రెండు గంటలు గడిచేప్పటికి చెమట తో మునిగిపోతూ . ఎంత తాగినా ఆరని దప్పితో ఆ ఎండకు ఉడికిపోతాడు. ఉదయం తన దీనతకు, మధ్యాహ్నం అయ్యేసరికి పౌరుషంతో మందిపోతాడు సూర్యుడు.
    అది హరిజన వాడ! అక్కడ చిన్న రాములవారి గుడి ఉంది. అ గుడి ముందు రెండు చిన్న అరుగులు ఉన్నాయి. అక్కడ పేడతో అలికి, చుట్టూ శుభ్రత కోసం కొంచెం శ్రద్ధ కనపరిచినట్లుంది. అక్కడ ఎముకలు, పశు కళేబరాలు, పాత చెప్పులు, మురిగిన వాసన లేవు. ఒక్క రాముడి మీది భక్తితో వాళ్ళు ఆమాత్రం చైత్యన్యం కనపరచలేదు. అది ఊళ్ళో పెద్ద రైతులు కూలీల కోసమో, లేదా చెప్పుకో , సెలగోలుకో వచ్చినప్పుడు కొంచెం సేపు నిలుచోవడానికి అనువైన స్థలం.
    ఆ గుడికి తూర్పు వైపున వాళ్ళ కొట్టాలు. ఆ కొట్టాలు వాసనకు తడిసి రెక్కలు ముడుచుకున్న గద్దల్లా ఉన్నాయి. ఆ కొట్టాల ముందు దుమ్ముతో వాళ్ళ పిల్లలాడుకుంటున్నారు. వాళ్ళలో కొందరు మాత్రం బట్టల్లాంటి వాటితో ఒళ్ళు కప్పుకున్నారు. వాళ్ళను అభయ ముద్రతో దీవిస్తూ సీతా సమేతంగా చిరునవ్వులు చిందిస్తున్న శ్రీరాములవారు.
    ఆ రోజు వాసవి కూలీల కోసం వచ్చాడు. మిద్దె సోమిగాడు కూలీల నొక జట్టు ఎర్పరుస్తున్నాడు. నన్నయ్య భుజం మీద కొడవంట్ల కట్టతో నిలుచున్నాడు. మిద్దె సోమీగాడు వాళ్లకు పెద్ద మనిషి. తన పెద్దమనిషితనాన్ని వాళ్ళోప్పుకోకపోయినా , రైతుల ముందలా కనబడాలని అతని కోర్కె! వాడేన్నడూ పని కెళ్లడు. 'నేను పని చేసేప్పుడు ఇట్లా సేసేవాడ్నా? చచ్చునాయాళ్ళు...' అంటాడు. 'ఏదీ చూద్దాం రా....' అని ఎవడేనా అంటే-- 'పోరా , నువ్వేం చూత్తావురా నా సంగతి? ఒరేయ్! నా సంగతి సచ్చిన నీ యబ్బ నడుగురా....సెప్తాడు. మిద్దె సోమీగాని సంగతి, పిల్లనా కొడకా!' అని తిడతాడు.
    'ఏమే , పడుసు పిల్లా! ఎండ సూడే ఎంతెక్కిందో! నీ మొగుడింకా రాలా? కాత్త పెందరాలే పడుకోనీగూడదంటే వాణ్ణి! వాడసలే ఒంటి పేగు నాయాలు' అని హాస్య మాడతాడు.
    'అయ్యగారెప్పుడు కూలోళ్లు గావాల్నో సెప్తే సాలు-- నేనిక్కడ 'లడీ' సేత్తాను . నిన్ను కాదని పోయే మొగోడుండడా?' వెనక్కి తిరిగిన సోమిగాడు కట్టేలా బిగుసుకున్నాడు. ఎదురుగా ఉన్న మూర్తిని చూసి తల తిప్పుకుని తప్పుకోబోయాడు. సాధ్యం కాలేదు. తల రోట్లోకి దూరి పోయిందని అర్ధమైంది సోమీగాడికి.
    ఆ ఎదురుగా ఉన్న మూర్తి భుజం మీద ఉన్న సెలగోలు తో రోద్రంగా ఉన్నాడు . అయినా, శాంతంగా అడిగాడు: 'సోమిగా, పదిమందిని కూలోళ్ళను జూడు!'
    సోమిగాడి ప్రాణం ఎగిరిపోయింది. కళ్ళు గిరగిరా చుట్టూ చూసినాయి. అంతా వెళ్ళిపోయారు పనుల్లోకి. ఉన్నవాళ్ళ కి నన్నయ్య తలో కొడవలీ ఇచ్చేశాడు.

                                 
    'ఒరే, సోమిగా! ఉన్నపళంగా నెత్తురు కక్కుకుని చావు!' అంతెం ఇంతకంటే సులభంగా కనిపించేది . 'పలకవెంరా! దొంగ గాడిదా!'
    దొంగ గాడిద నాలుక తెగినట్లు పలకలేదు.
    'ఎవరికన్నా అయితే మాట సెప్తే 'లడీ ' చేస్తావు. నా కయితే ఇష్టం లేదు కదూ?'
    'అది గాదు, సోమీ! నిన్నగానీ సెప్పింటే ఇయ్యాలకు....'
    'నిన్న పుల్లిగాడు నీతో చెప్పలేదూ?'
    'పుల్లి గాడా? వానికీ  నాకూ మాటల్లేవు. వాడు కావాలనే సేప్పలేదు. నీకు దండం పెడతా! నా పెండ్లాం తాళి బొట్టు తోడు, వాడు సెప్పలేదు, సోమీ!'
    'ఆహా! నీ పెండ్లాం సేంద్రమతీ, నువ్వు అరిచ్చెంద్రునివీ. శేరు గింజ లిస్తామంటే , నీ పెళ్ళాం తాళి బొట్టు కింద పడేసి మట్టిలో తోక్కమన్నా తొక్కుతుందిరా....' అద్భుత హాస్యం సృష్టించినట్లు నవ్వాడు తనే.
    సోమిగాడి తల వాలిపోయింది. ఆ పెద్ద మనిషి అన్న మాట నిజంగా జరిగేదే అయితే, అది నవ్వవలసింది గాదు. అది హాస్య సంఘటన కానేకాదు. ఆ నిజానికి సిగ్గుతో, దుఃఖంతో ఎవడైనా మానవుడైన వాడు చితికి పోవలసిందే. ఇది ఆ పెద్ద మనిషికి అర్ధం కాలేదు.
    'ఆ పోయే వాళ్ళను రమ్మనిట్లా!' అజ్ఞ జారీ అయింది.
    'వాళ్ళు అనంతయ్య గారికి........'
    'నాకు తెలుసులేరా.....లంజకొడకా? పోతావా ,తన్న మంటావా?'
    సోమిగాడికి తానింత దాకా బతికి ఉన్నందుకు దిగులేసింది. రాత్రి పడుకున్నప్పుడు నిద్దట్లో పాణం పొతే గాని ఎంత బాగుంటుంది! అదురుట్టమంతులకు బతుక్కంతా కలిపి ఒక్క చావు. తనలాటోళ్ళకు రోజు కెన్నో!
    వాసవి సోమిగాడి కేసి చూశాడు. వాని యాతన అర్ధమైంది. దూరంగా తనకేసే చూస్తూ ఉండి, అప్పుడే అటు తిరిగి నిలుచున్నాడు సుబ్బరామయ్య. ఏమిటీ నియంతృత్వం? వస్తున్నా కూలీలను అతని కప్పగించి, తనింటి కెళ్లి కూర్చోవాలా? వీల్లేదంటే ఈ మొండి మనిషి ఎంతవరకు వెళ్లడాని కైనా సంకోచించడు.    
    వాసవి ఆలోచిస్తుండగానే , అవతల నన్నయ్య వల్ల గాదని చెప్పాడు.
    చేసేది లేక సోమిగాడు వెనుదిరిగాడు.
    'ఈయలకి పోనీ, సోమీ....'
    'నువ్వు నోరెత్తితే తోలూడుతుంది. వాళ్ళను నా బాకీ కట్టేసి అవతల పనిలో కెళ్ళమను.'
    సోమిగాడు మళ్ళీ వడ పీనుగులా కదిలాడు. వాసవి కాశ్చర్య మేసింది. కూలీల్ని సుబ్బరామయ్య కే పంపడం మంచిది. తన పని ఒక్క రోజు ఆగితే ప్రళయం రాదు. కానీ , అతనెందుకిలా చేస్తున్నాడు? విరోదానికి నెపం వెదుకుతున్నాడనే అనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఇది కాకపోతే ఇంకొకటి దొరకదా ఆ మేధావికి? లేక ఇప్పటికి పరిష్కారం చేసుకోవడమే మంచిదా!
    వాసవి ఏదో అనబోయే లోగా నన్నయ్య కేక వినిపించింది.
    'బాకీ కట్టాలంట! ఎప్పుడు కావాలంటే అప్పుడు బాకీ కట్టడాని కీళ్ళెం మూటలు దాసుకున్నారా! ఆ మాత్తరం బాకీలు మాకు లేవూ? ఆ మాట కొత్తే ఈళ్ళు ఊళ్ళో అందరికీ బాకీలే! అందరూ ఒకే రోజు రమ్మంటే ఎట్టా/ ఈళ్ల ని నరికి తలో ఇంత పంచుకొవాల. పదండ్రా ఎండేక్కుతోంది.'
    వెనక్కి చూస్తూ, తడబడుతూ ముందుకు కదిలారు. కదిలిన గుంపు మరో నిమిషం లో 'అమ్మో!' అన్న కేకతో వెనక్కి తిరిగింది. దగ్గరగా రావడానికి కూడా ధైర్యం లేనట్లు దూరం నించీ చూస్తున్నారు.
    సోమిగాడి ముక్కు పగిలి రక్తం నోట్లోకి కారుతుంది. సుబ్బరామయ్య చేతిలో సెలగోలు నాగాస్త్రం లా సోమిగాణ్ణి చుట్టుకుంటుంది. వాడు కేక లేస్తున్నాడు. ఆ దెబ్బల జడి వానలోనే సుబ్బరామయ్య కాళ్ళు పట్టుకునే అవకాశం కోసం చూస్తున్నాడు. ఇంతలోనే సోమిగాడి కూతురు ఆరేళ్ళది -- 'నాయనో' అంటూ వాడి కడ్డం పడింది. ఉత్సాహం ఆపుకోలేని సెలగోలు దాని మీద వాలింది. చొక్కా లేని దాని లేత శరీరం నించీ రక్తం ఉబికింది. అది హృదయ విదారకంగా దుమ్ములో పడి దొర్లుతూ ఏడుస్తుంది. కూతుర్నందుకోవడానికి కూడా వానికి వ్యవధి లేదు. అప్పుడాశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అంతా కళ్ళు పెద్దవి చేసి చూశారు. తన మీద పడుతున్న దెబ్బలు ఆగిపోయేటప్పటికి సోమిగాడికి సోధ్యమయింది.
    'సోబ్బరామయ్యకు సేతులు సచ్చుబడినాయా! లేక కిష్ట పరమాత్ముడు శక్కర మడ్డ మేసి తన పాణం కాపాడినాడా?' సోమిగాడి కళ్ళు చూపందుకునెప్పటికి కిష్ట పరమాత్ముడు నన్నయ్య రూపంలో. కనిపించాడు! అల్లవాని చేతిలో ఇందాకా తన చర్మాన్ని చీల్చిన సెలగోలు తనకేమీ తెలీనట్లు ముడుచుకునుంది.
    సుబ్బరామయ్య కోరలు తీసిన పాములా బుస కొడుతున్నాడు. నన్నయ్య సెలగోలు లాక్కున్న ఊపుకి క్రింద పడబోయి నిలదోక్కున్నాడు. అవమానంతో ఒళ్ళు భగభగ మండింది. గుండె కుతకుత ఉడికింది. చూశాడు, నన్నయ్య కేసి, నఖశిఖ పర్యంతమూ. ఆ చూపులకు పక్క నున్న వాళ్ళు భయపడ్డారు. నన్నయ్య 'దూ' అంటూ సెలగోలు విసిరి పారేశాడు. సుబ్బరామయ్య ముఖాన ఉమ్మేసినట్లయి, అమ్మేసినట్లు దూసుకెళ్ళాడు.
    సోమిగాడు నన్నయ్య కేసి చూశాడు. వాని లోతు కన్నుల్లో జల ఉబికింది. భూమాత పొరల్ని చీల్చుకుని, పై కెగసిన పవిత్రమైన పాతాళ గంగ అది! యుగాల నించీ అరని ఆర్ద్రత అది! ఆ మహత్తర అనుభూతికి సోమిగాడు తన నంకితం చేసుకున్నాడు. అది భూమిని, ఆకాశాన్నీ లొంగదీసు కున్న చిక్కని చీకటిని చేదించుకొని తళుక్కు మన్న మెరుపు తీగె! దారి సరిహద్దులు కాలంలో అత్యల్పం!
    'నువ్వెందు కొచ్చినావురా, నన్నయ్యా! ఇంకో రెండు దేబ్బలేసి ఆయనే పోయే వాడు!'
    'అయన పోయేలోగా నువ్వు సచ్చి పోదురా ముసలోడా!'
    'సచ్చిపోతే పీడే పొయ్యేది.
    'అయన చేతిలో సచ్చిపోతే పున్నేమా ఏం?'
    'పున్నెం మన కెక్కడిదీరా నాయనా! ఎంతో పాపం చేసి మన మీ జనమ మెత్తినాం.'
    'మాదిగోడూ వాళ్ళమ్మ కే పుట్టినాడు.'
    'పిల్లకాకి కేం తెలుసు ఉండేలు దెబ్బ! మన బ్రతుకు బాగు సేయడానికి గాంది మహాత్ముడంతటోడు కట్టపడినా కాలేదు. అయినా, నువ్వీయాల కూలోళ్ళను ఆయనకే పంపుంటే నాకీ దెబ్బలు తప్పేటియి.'
    'గాంధీ మహాత్ముడు కట్టపడ్డాడు. అయితేనేం! నిన్న మీ నాయనా, ఇయ్యాల నువ్వు, రేపు నీ కొడుకు కుక్కల్లా బతుకుతా మంటున్నారు. తాట వలిచే వానికే దండం బెడతారు. ఆయనకే పంపుంటే దెబ్బలు తప్పెటని ఏడుతున్నావు. మిమ్మల్ని దేవుడు గూడా బాగుసేయ్య లేడు. నిన్ను సంపినా పాపం లేదు. అడ్డం రావడం నాదే తప్పు....ధూ!' నన్నయ్య చరచరా నడిచాడు. ఒక్క నిమిషం లో అంతా నిశ్శబ్దమయింది.
    'అసలు కోతి! ఆ పైన కల్లు తాగింది, అదీగాక నిప్పు తొక్కింది' అన్నది సుబ్బరామయ్య కు సరీగా సరిపోయింది. నన్నయ్యలో ఎంత ఆవేశం దాగి ఉంది! ఎప్పుడూ ఏదో పనిలో మునిగి సంతోషంగా కనిపించే నన్నయ్య లో , తన కులాన్ని గూర్చిన ఆలోచన, దాని కున్న అడ్డుగోడలు ఆ మనిషి నప్పుదప్పుడూ బాధించాయా? మహాత్ముడు తన గృహలక్ష్మీ తో హరిజనుల ఉచ్చిష్టాల్ని ఎత్తించాడు? ఆ మహా కృషికి ఫలితం ఇప్పుడెం మిగిలింది? హరిజనోద్దరణ అంటూ ఉపన్యసించే వ్యక్తీ, ఆచరణ లో సరీగా అందుకు వ్యతిరేకం! 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS